28, ఫిబ్రవరి 2011, సోమవారం

జగన్ పై ప్రత్యర్థి కావలెను

కడప లోక సభ స్థానం నుంచి  జగన్ పై పోటీ చేసేందుకు కాంగ్రెస్  పార్టీ  అభ్యర్ధుల కోసం గాలిస్తోంది .జగన్ ను ఎలాగైనా ఓడించాలని తపన పడుతున్న కాంగ్రెస్ కి సరైన అభ్యర్దులే దొరకడం లేదు .వేరే పార్టీ నుంచి ఎవరైనా ముందుకొస్తే వారికీ టికెట్ ఇచ్చే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పై పదేపదే విమర్శలు చేస్తోన్న డీఎల్  లాంటి నేతలను బరిలోకి దింపాలనుకున్నా వారు ముందుగానే చేతులు ఎత్తేసారు .టీడీపీ పరిస్తితి కూడా దాదాపుగా అంతే. కాగా   నిన్నటి వరకు వైఎస్ జగన్‌ పై  పోటీగా వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి బరిలోకి దిగుతున్నట్లు  ప్రచారం సాగింది.  మంత్రి వివేకానందరెడ్డి కూడా అల్లుడిని వెంట బెట్టుకుని  ఢిల్లీకి వెళ్లి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలసివచ్చారు. అయితే అధిష్టానం నర్రెడ్డి కి టికెట్  ఇచ్చేందుకు అంత సుముఖంగా లేదు .ఉప ఎన్నికల్లో మంత్రి వివేకానందరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి మధ్య చివరి నిముషంలో లోపాయికారి ఒప్పందాలు కుదురుతాయేమోనన్న అనుమానం అధికార పార్టీలో కలిగిందని ప్రచారం సాగుతోంది .దగ్గర బంధువులు పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టమే ఉంటుందని జిల్లా నేతలు పలువురు అధిష్ఠానం దృష్టికి సూచించినట్టు  తెలుస్తోంది. వివేకానందరెడ్డి అల్లుడిని బరిలోకి దించడంపై స్థానిక నేతలు అభ్యంతరం  వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  తన అన్నను విమర్శిస్తే సహించేది లేదని, జగన్‌కు పరిటాల రవి హత్య కేసుతో ఎలాంటి సంబంధాలు లేవని మంత్రి వివేకానందరెడ్డి స్పష్టం చేసిన దరిమిలా కాంగ్రెస్ శిబిరం లో వివేకపై సందేహాలు కలిగాయి అని అంటున్నారు . దీంతో ఉప ఎన్నికల సమరం నాటికి అబ్బాయ్, బాబాయ్‌లు కలిసిపోయే అవకాశాలున్నాయని, అందువల్ల వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడైన నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని పోటీలో దించకుండా ఉండేందుకు వీలుగా జిల్లా నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన మంత్రి వివేకానందరెడ్డి ఇటీవల తన అల్లుడు కడప పార్లమెంట్‌కు పోటీ చేయడం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం..నిన్నమొన్నటి వరకు మంత్రి వివేకానందరెడ్డి అల్లునికే మద్దతు ప్రకటించిన పలువురు నేతలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా వుంటే  టిడిపిలో ఉన్న కందుల శివానందరెడ్డి, ఆయన సోదరుడు రాజమోహన్‌రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి వారిలో ఒకరిని కడప పార్లమెంట్‌కు పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అటు అధిష్ఠానం, ఇటు జిల్లా నేతలు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా  మంత్రి వివేక ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగియనుంది .ఈ క్రమం లోనే జగన్ వర్గం ఆయనకు సీట్ ఆఫర్ చేసింది. పులివెందుల అసెంబ్లీ బరి లో నిలబడకుండా ఆయనను అడ్డుకోవాలని యోచిస్తూ ఈ ఆఫర్  చేసినట్టు సమాచారం .వైఎస్ కుటుంబ సబ్యులు వివేకతో మంతనాలు జరుపుతున్నారు . అయితే వివేకా ఇంకా తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం .చివరికి ఎవరూ దొరకక పోతే వివేక నే జగన్ పై పోటీ కి దింపే అవకాశాలు కూడా లేకపోలేదు .ఎన్నిలలోపు  కడప జిల్లాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చు .. రాజకీయ సమీకరణాలు  మారవచ్చు.
- (జైజై నాయకా సౌజన్యంతో)

ఆ ఐదు నిమిషాలు!

బెంగళూరులో ఫిబ్రవరి 27 ఆదివారం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన డే/నైట్ మ్యాచ్ `టై' కావడం ఓ ఉత్కంఠ భరిత సన్నివేశం. చివరి రెండు ఓవర్ల ఆట చూస్తుంటే, వరల్డ్ కప్ మ్యాచ్ లంటే ఇంత థ్రిల్ గా ఉంటాయా ? అనిపించకమానదు. మ్యాచ్ చేజారిపోతున్న తరుణంలో భారత్ ఆటగాళ్లు మలుపుతిప్పి టై అయ్యేలా చూశారు. సచిన్ , స్ట్రాస్ ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగానే, ఒకదానితో మరొకటి తీసిపోనట్టుగా రెండు జట్లు తలపడ్డాయి. ఫలితంగా మ్యాచ్ టై అయింది. చివరి ఐదు నిమిషాల ఆట ఎలా సాగిందో మీరే చూడండి....

24, ఫిబ్రవరి 2011, గురువారం

కేంద్ర బడ్జెట్ పై ఆశలు- వాస్తవాలు

  ఫిబ్రవరి నెలాఖరులో దేశ ప్రజలంతా ఒక దృశ్యాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. కేంద్రంలో ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి,  బడ్జెట్ పత్రాలున్న బ్రీప్ కేస్ ను పట్టుకుని ఎంతో హుందాగా పార్లమెంట్ లోకి అడుగుపెడతారు. ఆయన రాకకోసమే గౌరవసభ్యులంతా ఎదురుచూస్తుంటారు. బడ్జెట్ పత్రాలను తీసి చదవడం ప్రారంభించగానే అంతటా నిశ్శబ్దం. ఒక్క పార్లమెంట్ లోనే కాదు. యావత్ జాతి బడ్జెట్ ఎలా ఉన్నదో తెలుసుకోవాలని ఎంతో శ్రద్ధగా వింటుంది. అందరిలో ఎందుకింత ఆసక్తి? బడ్జెట్ ఎటు పోతే మనకేమిటని ఊరుకోవచ్చుకదా... కానీ, అలా ఉండిపోలేం. ఎందుకంటే, కేంద్రం ప్రతిఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ - దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై ప్రభావితం చూపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బడ్జెట్ దేశ ప్రజల బతుకుబండిని నడిపిస్తోంది. అందుకే, బడ్జెట్ కు అంత క్రేజ్. మరి, ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతున్నది? 
 బడ్జెట్లో కేటాయింపులు ఎన్ని చేసినా, అసంతృప్తి వీడటంలేదు. మంత్రులు కూడా తమ శాఖకు చేసిన కేటాయింపులు చాలవనీ, మరింత కేటాయిస్తేనే, `అభివృద్ధి' పట్టాలు తొక్కుతుందని- మైకు పుచ్చుకుని చెప్పడం మనందరం వింటూనే ఉన్నాం. అయితే, వాస్తవాలేమిటో కూడా ఓసారి చూడాలి. కేంద్ర మంత్రుల్లో చాలామంది తమ శాఖలకు కేటాయించిన  మొత్తాలను ఖర్చు పెట్టలేక వెనక్కి పంపించేస్తున్నారు. ఉదాహరణకు టిబీ, క్యాన్సర్ నిరోధక చర్యల కోసం కేటాయిస్తున్న సొమ్ము మళ్ళీ వెనక్కి పోతున్నది. అంతేకాదు, పోలీస్ శాఖ సంస్కరణల కోసం కేటాయించే మొత్తాలు కూడా పూర్తిగా ఖర్చు కావడంలేదు. ఇవన్నీ ఎవరో చెబితే మనం అంతగా పట్టించుకోం. కానీ కాగ్ తన నివేదికలో ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పింది.
  ప్రత్యేక నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆశయంతో కేంద్ర బడ్జెట్ లో ఇంతకుముందు, 247 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేకపోయారు. అంతేకాదు, `జాతీయ మెరిట్ స్కాలర్ షిప్ పథకం' క్రింద106 కోట్లు కేటాయించినా ఇదే తంతు. అక్కడిదాకా ఎందుకు, మధ్యహ్న భోజన పథకం కింద కేటాయించిన నిధుల్లో సగం మాత్రమే కేంద్రం ఖర్చు చేయగలిగింది.
శాఖలు - తిరిగి ఇచ్చేసే మొత్తాలు
 1. -పాఠశాల విద్య - రూ. 2,668 కోట్లు
 2. - ఆరోగ్యశాఖ - రూ. 1,467.46 కోట్లు
 3. -హోంశాఖ - రూ. 285.07 కోట్లు
 4. - ఆహారం, ప్రజాపంపిణీ - రూ. 500 కోట్లు
  కేంద్ర బడ్జెట్ లో మహిళల వాటా చాలా తక్కువగానే ఉంటోంది. వారికోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పథకాలు వాటి అమలు కోసం కేటాయిస్తున్న నిధులు అరకొరగానే  ఉంటున్నాయి.
  బడ్జెట్ లో మహిళల వాటా
 1. - మొత్తం బడ్జెట్ లో 6.1 శాతం
 2. - మహిళకు అందే నెల వాటా: రూ.100
    కేంద్ర బడ్జెట్ ను Gender based గా చూసినప్పుడు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గడచిన బడ్జెట్స్ తో పోలిస్తే, మహిళల వాటా ఎంతోకొంత పెరిగినట్టు కనబడుతున్నా, అదేమీ వారి అవసరాలను తీర్చడానికి సరిపోయేదిగా లేదన్నది సుస్పష్టం. ఇదే విషయాన్ని Centre for Governance Accountability - CBGA- లెక్కాపత్రాలతో సహా బయటపెట్టింది.
  బడ్జెట్ - మహిళల తలసరి వాటా
...........................................
 • - 2007-08లో - రూ.410
 • - 2009-2010లో - రూ.1000
 • - 2010-11లో - రూ. 1200
- కొత్త బడ్జెట్ లో ఈ వాటా ఎంతన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.
  మహిళ తలసరి బడ్జెట్ విలువ 1200 రూపాయలకు పైనే ఉంటుందని అనుకున్నా, ఏడాదికి ఈ మొత్తం వల్ల మహిళ ఏమేరకు సాధికారత సాధిన్నదో, మరి ఏమేరకు మహిళలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
  మహిళాభ్యుదయానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. మహిళా సాధికారిత పథకాలకూ, బాలికల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పథకాలకు నామమాత్రంగానే నిధులు మంజూరు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.....
పథకం - నిధులు
................
 • మహిళ ఉపాధి - రూ. 40 కోట్లు
 • బాలికల అభ్యున్నతికి - రూ.15 కోట్లు
`గృహహింస'చట్టం అమలు అసలే నిధులు లేకపోవడం గమనార్హం.
    ఫిబ్రవరి వచ్చిందంటేచాలు గృహిణి తల్లడిల్లిపోతుంటుంది. కేంద్ర బడ్జెట్ భారం తమ ఇంటిపై ఏమేరకు పడుతుందోనని ఆందోళన చెందుతుంటుంది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సతీమణి `సువ్ర ముఖర్జీ'కి కూడా మినహాయింపులేదు. బడ్జెట్ ను, ఘాటుగా మోతెక్కించి ఇంటికి చేరితే, ఆర్థిక మంత్రికి సైతం ఇంట్లో నిరసన `ఘాటు 'తప్పదు. ఇంతకీ గృహిణులు బడ్జెట్ పరంగా ఏమి ఆలోచిస్తారో కూడా గమనించాల్సిందే...
గృహిణులు గమనించేవి...
.........................
 • - నిత్యావసరాల ధరలు
 • - ఉల్లి, కూరగాయల ధరలు
 • - గృహోపకరణాలు
   ఒక పక్క ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. నిత్యావసర వస్తువుల ధరలు నేలకు దిగిరావడంలేదు. ఏ వస్తువు మీద చేయివేసినా ధర చూసి షాక్ కి గురికావాల్సి వస్తోంది. దీనికి తోడు ఆదాయపు పన్ను భారం ఒకటి. మెడలు వంచి వసూలు చేసే ఆదాయపు పన్ను విషయంలో నెల జీతగాళ్లు కలవరపడుతుంటారు. ప్రతిసారీ బడ్జెట్ వచ్చేముందు, ఆదాయపు పన్ను పరిమితి పెరిగితే బాగుంటుందని ఆశపడుతూనే ఉన్నారు.
టాక్స్ పేయర్స్ కోరుకునేవి...
.........
 • - ఆదాయపు పన్నుపరిమితి పెంపు
 • - పన్ను రాయితీలు
 • - పన్ను మినాహాయింపులు
 ...
ఆదాయపు పన్ను పరిమితిని లక్షా 60వేల నుంచి 2లక్షలకు పెంచాలన్న డిమాండ్ చాలాకాలం నుంచి ఉంది. అలాగే, బీమా పాలసీల ప్రిమియమ్ లకు ఇచ్చే పన్ను మినహాయింపులను 60వేలకు పెంచాలన్న డిమాండ్ ఉంది. ఇవి అ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా పాపులరైంది. 2005 సంవత్సరంలో చట్టబద్దత కల్పిస్తూ తీసుకువచ్చిన ఈ పథకం ఏడాదికి కనీసం వంద రోజులు పని దొరికే వెసులుబాటు కల్పించారు. ఇది ఒకరకంగా మేలు చేస్తున్నా, మరో రకంగా రైతులకు - వ్యవసాయ కూలీల కొరత సృష్టిస్తోంది. సకాలంలో వర్షాలు పడుతున్నా, దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా, వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటప్పుడు రైతులు ఏం కోరుకుంటున్నారో కూడా ఆలోచించాల్సిందే...
రైతులు ఆశపడేవి
.................
 • - కూలీలు వలసపోకుండా ఉండాలి
 • - పనికి ఆహార పథకం దెబ్బతీయకూడదు
 • - వ్యవసాయ రుణాల మాఫీ
 • - ఆధునిక సాగు పద్ధతులు
...
వారూ, వీరు అని కాదు, అన్ని రంగాల వారు కేంద్ర బడ్జెట్ లో తమకు కనీస న్యాయం జరగాలనే కోరుకుంటున్నారు.

  ఇది 20 ఏళ్ల కిందటి సంగతి. 1991 ఫిబ్రవరి... కేంద్ర బడ్జెట్ ను సమర్పించే తరుణం వచ్చేసింది. యశ్వంత్ సిన్హ (Yashwant Sinha) ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1991-92 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ తయారుచేసే పనిలో పడ్డారు ఆయన. సరిగా, అదేసమయంలో చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కూల్చాలని  కాంగ్రెస్ కుట్రపన్నింది. బడ్జెట్ కు ముందు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వ్యూహం పన్నింది. దేశ ఆర్థిక పరిస్థితి అధ్వన్నంగా ఉన్నప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంది. అందుకే, ప్రజల ఆశలకు ఆలంభనమైన బడ్జెట్ ను సైతం నాయకులు పట్టించుకోలేదు.
 1997లో సీతారాం కేసరి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పటి దేవె గౌడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది. దీంతో యునైటెడ్ ఫ్రంట్ కొత్త ప్రధానిగా గుజ్రాల్ ను నియమించాల్సి వచ్చింది. ఇదంతా కూడా బడ్జెట్ టైమ్ లోనే జరిగింది.
  1999లో మరోసారి సంక్లిష్ట పరిస్థితి తలెత్తింది. 1999-2000 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత వాజి్ పేయ్ ప్రభుత్వం కూలిపోయింది. అయితే, బడ్జెట్ ఆమోదం పొందేలా మాత్రం అన్ని రాజకీయ పార్టీలు చూడగలిగాయి. ఆ తరువాతనే లోక్ సభను రద్దు చేశారు.
బడ్జెట్ - రాజకీయాలు
.......................
 • - రాజకీయ పార్టీల స్వార్ధం
 • - స్వరాష్ట్రాలపై ప్రేమ
 • - ప్రభుత్వాన్ని కూలదోసే యత్నాలు
 • - ప్రజల ప్రయోజనాలతో ఆటలు
  మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతున్నది?
అధికారంలో ఉన్న యుపీఏ బలంగానే ఉండటం వల్ల 1991నాటి సంఘటనలు చోటుచేసుకోకపోవచ్చు. పైగా, ప్రధాన ప్రతిపక్షం బిజేపీకి ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదు. అయితే, అంత మాత్రాన బడ్జెట్ ప్రసంగం సజావుగా సాగుతుందని అనుకోవడానికి వీల్లేదు. అనేక లుకలుకలు ఉండనే ఉన్నాయి. విపక్షాలు బడ్జెట్ కాగితాలు చింపేయవచ్చు. బడ్జెట్ నచ్చకపోతే, ఆగ్రహావేశాలు వ్యక్తం చేయనూవచ్చు. గౌరవ సభ్యులు వాకౌట్ చేయవచ్చు. బడ్జెట్ నీ, రాజకీయాలను వేరుగా చూడనంతవరకూ పార్లమెంట్ లో ఏమైనా జరగవచ్చు. మరి, ఈసారి ఎలాంటి దృశ్యాలను మనం చూడబోతున్నాం? బడ్జెట్ ప్రభావం రాజకీయాలపై ఎలా పడబోతున్నది. బడ్జెట్ లో ఊదారవాద వైఖరి కనబడితే దాన్ని   మధ్యంతర ఎన్నికలకు సంకేతాలుగా భావించుకోవాలా...? ఏమో...అనేక ప్రశ్నలు, సందిగ్ధాల మధ్య కేంద్ర బడ్జెట్ రాబోతున్నది. అది ఎలా ఉండబోతున్నదో చూద్దాం....
- తుర్లపాటి నాగభూషణరావు
98852 92208
nrturlapati@gmail.com

సెల్ రేడియేషన్ - పక్షులకు యమగండం

కాకితో కబురుపెడితే చాలు వచ్చి ఇంట్లో వాలిపోతాడు - అంటూ దురపు బంధువులపై చురకలేయడం మనకు తెలిసిందే. పావురాలతో ప్రేమికులు తియ్యటి సందేశాలను పంపుకోవడం కథల్లో కనబడుతూనే ఉంటుంది.
హంసరాయబారాలు, చిలుక రాయబారాలు ప్రబంధాల్లో ఉండనే ఉన్నాయి. కొత్త దంపతుల సంసారాన్ని పోల్చాలన్నప్పుడు చిలకా గోరింకలనో, లేదా పిచ్చుకలతోనూ పోలుస్తుంటారు. మానవ జీవితాలతో ఇంతగా మమేకమైన పక్షులకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చేసింది.
 ప్రకృతి శాపాలను, కోపాలను తట్టుకుంటూ బతుకు లాగిస్తున్న పక్షులకు మానవ తప్పిదాలు కూడా తోడయ్యాయి.  వేటాడే హంతకులను నుండి పక్షులు తప్పించుకోవచ్చేమోకానీ, అంతకంటే సైలెంట్ కిల్లర్స్ గా తిరగాడుతున్న హంతకుల నుంచి మాత్రం అవి తప్పించుకోలేకపోతున్నాయి.
 ఇంచుమించుగా ప్రతి ఒక్కరి వద్ద సెల్ ఫోన్లు ఉంటున్నాయి. అవన్నీ రేడియేషన్ విడుదల చేస్తూనే ఉంటాయి. రేడియేషన్ తరంగాలు మన కంటికి కనిపించకపోవచ్చు. కానీ అవి చేసే హానీ అంతాఇంతాకాదు.
సెల్ టవర్స్ నుంచి నిరంతరాయంగా రేడియేషన్ తరంగాలు విడుదలవుతూనే ఉంటాయి. ఆమాటకొస్తే, కనిపించని ఈ తరంగ పౌనఃపున్యాలు రేడియో టవర్స్ నుంచీ అలాగే టివీ టవర్స్ నుంచి కూడా వెలువడుతూనే ఉంటాయి.
   .హైఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం అనాలసిస్ ఇది. రేడియేషన్ ప్రభావం రేడియో స్టేషన్, టివీ టవర్స్ నుంచి కంటే, సెల్ టవర్స్ నుంచి వెలువడుతున్నదే చాలా ఎక్కవగా ఉంది. సెల్ టవర్ కు సమీపంలో ఉన్న ప్రాంతాలు ఎంతగా రేడియేషన్ కు ప్రభావితమవుతున్నాయో చాలా స్ఫష్టంగా చూడవచ్చు. సెల్ టవర్ ఉన్న చోటునుంచి మొదటి ఆరు నుంచి పది మీటర్ల దూరాన్ని డేంజరస్ జోన్ గా చెప్పుకోవచ్చు.
 సెల్ టవర్ నుంచి మొదటి వందమీటర్ల దూరందాకా రేడియేషన్ ప్రభావం ఎక్కువగానే ఉంటున్నది. యాంటినా ఉన్న వైపు మరింత శక్తివంతమైన రేడియేషన్ ఉన్నట్టు తేలింది. యాంటినాలకు వ్యతిరేక దిశలో కొంతలో కొంత ఈ రేడియేషన్ ప్రభావం తక్కువగానే ఉన్నదని విశ్లేషకులు చెబ్తున్నారు.
   అంతటి భయంకరమైన రేడియేషన్ ప్రభావం మనపైనేకాదు, పశుపక్షాదులపైన కూడా పడుతూనే ఉంది. మౌనంగా అవి రోదిస్తున్నాయి. విహంగాల విలాపానికి ప్రత్యక్షంగా మనమే కారణం అవుతున్నాం. సెల్ టవర్స్ వచ్చాక వందలాది పక్షులు నేలరాలిపోతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు అందిపుచ్చుకున్నామంటూ మనం తెగ సంబరపడిపోతున్నాం. కానీ, అవే పక్షులపాలిట యమపాశాలయ్యాయి. ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ వల్ల కనిపించని విషం సర్వత్రా కమ్ముకుంటోంది.
   తేనెటీగలు చాలా తెలివిగలవి. సంతోషాన్నీ, విషాదాన్ని చాలా చక్కగా వ్యక్తీకరించగలవు. బోలెడంత తేనే దొరికితే, ఆ తేనెను పట్టులో దాచగలిగితే అవి ఎంతగానో సంతోషిస్తాయి. పూలనుంచి సేకరించిన మకరందాన్ని తెట్టులోని గదుల్లో ఓ క్రమపద్ధతిలో నిల్వచేయగల సత్తా వాటికి ఉంది. ఎక్కువ తేనె సేకరిస్తే వాటికి పండగ వచ్చినట్టే, అప్పుడే అవి డాన్స్ చేస్తాయి.  ఎప్పుడు తెల్లవారుతుందో, ఏ దిశలో విరబూసిన పూలు ఉంటాయో కూడా తేనెటీగలు తేలిగ్గా గుర్తించగలవు. మిగతా వాటికి దిశానిర్దేశం కూడా చేయగలవు. అలా, అలా... తేనెటీగలు పూలమీద చేరతాయి.
మకరందాన్ని సేకరించిన తరువాత తిరిగి తెట్టుకు చేరుకునే సమయంలోనే వాటికి కష్టాలువచ్చిపడ్డాయి. ఈ కష్టం అక్షరాలా మానవుని తప్పిదాల వల్ల మొలకెత్తిందే....
  పక్షులేకాదు...తేనెటీగలు కూడా రేడియేషన్ ప్రభావానికి గురై దారితప్పిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
రేడియేషన్ పెరిగిపోవడంతో తేనెటీగలు దారిమరచిపోతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
  సెల్ టవర్స్ నుంచీ, ఇంకా ఇతరత్రా వచ్చే మైక్రోవేవ్స్ వల్ల తేనెటీగల మెదడు మొద్దుబారిపోతుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంగానే అవి దారిమరచిపోతున్నాయట. అందుకే క్షేమంగా ఇళ్లకు చేరలేకపోతున్నాయి. ఫలితంగా తేనె తెట్టులో తేనె నిండుకోవడంలేదు. ఫలితంగా తేనె దిగుబడి తగ్గిపోతోంది.
కంటిముందు కనిపించేవాటిని అతిగా పట్టించుకుంటూ, కంటికి ఆనని వాటిని నిర్లక్ష్యంగావదిలేయడం ఏమాత్రం మంచిదికాదు. అలాంటిదే ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా. రేడియోధార్మిక తరంగాలు, అయస్కాంత తరంగాలు వంటి మైక్రోవేవ్స్ కూడా ఒక్కోసారి మేలుకంటే కీడే ఎక్కువ చేస్తుంటాయి. సెల్ టవర్స్ , శాటిలైట్స్ ఇంకా అనేక వాటి నుంచి నిరంతరాయంగా రేడియోధార్మికత ప్రసరితమవుతోంది.
 ఇలాంటి తరంగాల ప్రభావం మానవులమీదనేకాదు, జంతుజాలంమీద కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవసరాల కోసం మనం ఏర్పాటుచేసుకునే సౌకర్యాలు జీవుల పాలిట శాపంగా మారిపోతున్నాయి.మరి ఈ పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలో ఓసారి ఆలోచించండి...ప్లీజ్...
- తుర్లపాటి నాగభూషణరావు
98852 92208
nrturlapati@gmail.com

23, ఫిబ్రవరి 2011, బుధవారం

రైల్వే బడ్జెట్ - ఎవరికి మేలు?

  నెలంతా ఇల్లు గడవాలన్నా, బతుకుబండి సాఫీగా సాగాలన్నా, బడ్జెట్ చూసుకోవాల్సిందే. లెక్కాపత్రం లేకుండా ఎడాపెడా ఖర్చుపెట్టేస్తే, చివరకు అప్పుల తిప్పలు తప్పవు. ఇంటి పరిస్థితి అయినా, దేశం పరిస్థితి అయినా ఒకటే. అందుకే బడ్జెట్ల సీజన్ రాగానే అందరి చూపు అటే పడుతుంది.
కేంద్ర బడ్జెట్ కు ముందు దూసుకురాబోతున్న రైల్వే బడ్జెట్ పై సగటు ప్రయాణీకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసారి రైల్వే బడ్జెట్ ఎలా ఉండబోతున్నది. పొగ బండి, సెగలు కక్కుతుందా, లేక సామాన్యుడి కంటనీరు తుడుస్తుందా?
`బతుకు బండిని నడిపేది రైలు బండి...' అంటూ పాటలు కూడా ఉన్నాయి. ఇది నిజమే. మనదేశ పౌరుల జీవనస్థితిగతులు తెలుసుకోవాలంటే ఒక్కసారి రైలెక్కితేచాలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టే, పొగలు, సెగలు కక్కుతున్న రైల్వే బడ్జెట్ పై మరోసారి అందరి చూపు పడుతోంది. ఈసారి రైల్వే బడ్జెట్ లో మనరాష్ట్రానికి ఒరిగేదేమిటి? కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా, మన రాష్ట్రానికి నామమాత్రపు కేటాయింపులే ఎందుకు దక్కుతున్నాయి?
`కేంద్రంలో మంత్రిపదవి ఆఫర్ వస్తే ఏ శాఖ కావాలంటారు' అని మీరు ఎవరైనా ఎంపీని అడగండి.... రైల్వే శాఖ అని ఠక్కున చెబుతారు. అంతేమరి.. అదైతే కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. నచ్చినన్ని ప్రాజెక్ట్‌లు సొంత రాష్ట్రానికి కేటాయించుకోవచ్చు. అక్కడ పలుకుబడి పెంచుకోవచ్చు. ఇప్పటివరకూ రైల్వే మంత్రులుగా పనిచేసినవారి తీరుతెన్నులు గమనిస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. నెహ్రూ హయాంలో రైల్వేశాఖ చూసిన లాల్‌బహదూర్ శాస్త్రి.. తన హయాంలో జరిగిన ఓ ప్రమాదానికి బాధ్యత వహించి ఏకంగా రాజీనామా చేశారు. ఆయనంత ధైర్యం ఇప్పటి రైల్వే మంత్రులకు ఉందా?
హంగూ, ఆర్భాటం, ఆదాయం అన్నీ ఉన్నాయి. కానీ.. అసలైంది... అభివృద్ధే కరవైంది. విజయవాడ రైల్వే డివిజన్ గురించి ఇంతకన్నా ఎక్కువగా చెప్పక్కరలేదు. మన రాష్ట్రంలో ముఖ్యమైన జంక్షన్... ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే జంక్షన్ కూడా ఇదే. దీనికి ఇంత ప్రాముఖ్యత ఉన్నా ఏం ప్రయోజనం? రైల్వేశాఖకు మాత్రం కేవలం దీని నుంచి వచ్చే డబ్బుమాత్రమే కావాలి. అందుకే కొత్త ప్రాజెక్టులు, లైన్లు, సదుపాయాల సంగతే మరిచిపోయింది.
రాష్ట్రానికి ఉక్కునగరం. రాజధానితో పోటీపడేలా వైభవం. ఎంతో ఘన చరితం. కానీ ఏం లాభం? రైల్వే సదుపాయాల విషయంలో మాత్రం దీని పరిస్థితి దుర్లభం. ఐటీ, పర్యాటక రంగాల్లో దూసుకుపోతున్నా.. స్టేట్‌లోనే ఫేమస్ సిటీగా ఉన్నా... ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతున్నా... దీనిని ప్రత్యేక జోన్‌గా రైల్వే ఎందుకు గుర్తించడం లేదు? ఇది ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యమా? విధానపరమైన లోపమా? మన పాలకుల అసమర్థతా? ఏంటి దీనికి కారణం?
కాజీపేట జంక్షన్.. ప్రత్యేక డివిజన్‌గా మారేదెప్పుడు? ప్రారంభించిన పనిని పూర్తిగా చేసే పద్దతి రైల్వేశాఖకు ఎప్పుడు అలవాటు అవుతుంది? వివిధ ప్రాంతాల్లో కొత్త లైన్లకు ఎప్పటికి మోక్షం లభిస్తుంది? ఖమ్మం జిల్లాలో రైల్వే పనుల పరిస్థితి చూస్తే గుండె రగిలిపోతుంది. గుంతకల్లు రైల్వే డివిజన్ పై అధికారులకు కనికరం లేకుండా పోతోంది. రైల్వే మంత్రికి బెంగాల్‌పై అమ్మప్రేమ.. మనపై సవతి ప్రేమ ఎందుకు? మనం ఏం అన్యాయం చేశాం? ఇంతకీ రైల్వే ఛార్జీలు పెరగబోతున్నాయా?
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది కాజీపేట జంక్షన్ పరిస్థితి. వరంగల్ జిల్లాలో కాజీపేటను... ప్రత్యేక డివిజన్‌గా మార్చాలని ఎప్పటినుంచో నోరెండిపోయేలా అడుగుతున్నా.. కాళ్లరిగేలా తిరుగుతున్నా... బస్తాల కొద్దీ వినతులు సమర్పించినా ప్రయోజనం శూన్యం. దీన్ని డివిజన్ చేస్తే కోట్లకొద్దీ ఆదాయం వస్తుంది అని నెత్తీనోరు కొట్టుకుని మరీ చెబుతున్నా.. వినే నాధుడేడి? వీటికే దిక్కులేదు. డోర్నకల్-కొవ్వూరు, మణుగూరు-రామగుండ లైన్ల పరిస్థితి గురించే ఇంకేం చెబుతాం! అయినా ప్రత్యేక లైన్లు, ప్రాజెక్టుల గురించి రైల్వేశాఖ పట్టించుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి?
మీరైతే ఒక పని ప్రారంభించాక దానిని మధ్యలో వదిలేస్తారా? పూర్తి చేస్తారా? మీ సంగతేమో కాని.. రైల్వే శాఖకు మాత్రం ఇది అలవాటే. ప్రాజెక్టుకు ఓకే అనడం, పనులు ప్రారంభించడం, నిధులు లేవని మధ్యలో వదిలేయడం... దానికి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులే సాక్ష్యం. కరీంనగర్-నిజామాబాద్, హైదరాబాద్‌-జగిత్యాల లైన్ల గతి ఇప్పటికే అధోగతే! ప్రస్తుతానికి వీటికే గతిలేదు. ఇక కొత్తవాటి గురించి ఏమని అడగగలం. ఏమని చెప్పగలం?
అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. కాని అడిగినా కూడా పెట్టకపోతే? అది సవతిప్రేమ. పోనీ పెట్టినా... అంతా అరకొర.. అది అప్పుడు కొంత, ఇప్పుడు కొంత. రైల్వే శాఖకు ఇది అక్షరాలా సరిపోతుంది. అన్నివిధాలా కరెక్ట్ అనిపిస్తుంది.  ఖమ్మం జిల్లాలో రైల్వే లైన్ల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వందల కోట్లలో అంచనాలు ఉంటే.. కేవలం ఐదు, పది కోట్లు ఇస్తే ఆ పనులు ఎలా అవుతాయనుకుంది? లాలూకు ఎలాగూ దయలేదు. కనీసం మమతకైనా మమతానురాగాలు లేవా? మన రాష్ట్రంపై ఆమాత్రం ప్రేమ కూడా కరవైపోయిందా?

పేరు గొప్ప- ఊరు దిబ్బలా తయారైంది గుంతకల్లు రైల్వే డివిజన్ పరిస్థితి. మన రాష్ట్రంలో కీలకమైన రైల్వే డివిజన్లలో ఇది ఒకటి. రద్దీగా ఉన్న మార్గాల్లో కొత్త రైళ్లను వేయండి మహాప్రభో! అని వేడుకున్నా... రైల్వే అధికారులకు కనికారం లేకుండా పోయింది. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు రైళ్లను రద్దు చేస్తున్నారు. మళ్లీ వాటిని పునరుద్దరించండి అంటే... చూద్దాం.. చేద్దాం అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? అని ఆవేదనతో కళ్లనీళ్లు పెడుతున్నారు గుంతకల్లు వాసులు.
  వచ్చే రైల్వే బడ్జెట్‌లో రైలు ఛార్జీలు పెరగనున్నాయా? టిక్కెట్ రేట్లు పెంచి ఖజానా నింపుకునే ధైర్యం మమతకు ఉందా? త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. అలాంటప్పుడు.. ఇలాంటి పెంపు విషయాలను రైల్వే శాఖ ఎంతవరకూ అనుమతిస్తుంది? అందులోనూ ఆరోవేతన సంఘం సిపార్సులతో ఇప్పటికే సతమతమవుతోంది. ఇలాంటప్పుడు మమత స్ట్రాటజీ ఏంటి? ఈ సమస్యను ఎలాంటి పరిష్కారం చూపనున్నారు? రైల్వేలకు ఎలా లాభాలను తీసుకురాబోతున్నారు? ఏం మంత్రం వేయబోతున్నారు? ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు?
డీజిల్ మోత....పెట్రోల్ వాత... అయినా రైల్వే ఛార్జీలు మాత్రం పెద్దగా పెంచడంలేదు. ఇది నిజానికి ఊరట కలిగించే విషయమే. అయితే, కొత్త ప్రాజెక్టుల కేటాయింపులు మాత్రం రైల్వే మంత్రిగారి మ్యాజిక్కే. సొంత ఊరికి, సొంత రాష్ట్రానికి ప్రాజెక్టులను పరుగులుపెట్టిస్తుంటే, మిగతా రాష్ట్రాల వాళ్లు నోరువెళ్లబెట్టాల్సిందే. అందరికి సమన్యాయం అన్న రాజ్యాంగ స్పూర్తిని తుంగలోకి తొక్కేస్తున్న వారిని నిలదీయాలి...కడగేయాలి.

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

సౌర తుపాను వచ్చేస్తోంది

 సూర్యుడు భయంకంగా నిప్పులు చిమ్ముతున్నాడు. వచ్చే రెండేళ్లలో
సౌరతుపాను తాకిడికి భూమిచుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు దెబ్బతినవచ్చు. అంతేకాదు, మరికొన్ని ప్రమాదాలు కూడా పొంచిఉన్నాయి.
1. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చు. (కొన్నినెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు)
2. ఫోన్లు పనిచేయవు.
3. విమానాలు కూలిపోతాయి. (సమాచార వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల)

Jagan's Health Deteriorates

The health condition of the fasting former Kadapa MP Y S Jagan Mohan Reddy showed mild signs of deterioration on Monday as his Deeksha entered fourth day. A team of doctors visited the hunger strike camp at Indira Park and examined Jagan. The young leader is running mild temperature and complained of weakness.
Jagan had launched his week-long Deeksha on February 18, demanding immediate clearance of fee reimbursement dues in the interests of the student community. Apart from a large number of students, as many as 19 MLAs attended his Deeksha camp and expressed solidarity with him.
Though the government had sought resolve the issue by holding talks with the representatives of private professional colleges and released Rs 600 crore towards partial clearance of the dues, Jagan has refused to end his stir. His Deeksha is scheduled to conclude on February 24.
“The government will be responsible if anything happens to Jagan’s health,” warned Konda Surekha, the fiery MLA from Warangal district and a key follower of the rebel camp. She said that “Chalo Assembly” would be organized on February 24, to expose the government’s failure on fee reimbursement issue.

21, ఫిబ్రవరి 2011, సోమవారం

`సెగ'బండి బడ్జెట్

   నెలంతా ఇల్లు గడవాలన్నా, బతుకుబండి సాఫీగా సాగాలన్నా, బడ్జెట్ చూసుకోవాల్సిందే. లెక్కాపత్రం లేకుండా ఎడాపెడా ఖర్చుపెట్టేస్తే, చివరకు అప్పుల తిప్పలు తప్పవు. ఇంటి పరిస్థితి అయినా, దేశం పరిస్థితి అయినా ఒకటే. అందుకే బడ్జెట్ల సీజన్ రాగానే అందరి చూపు అటే పడుతుంది.
కేంద్ర బడ్జెట్ కు ముందు దూసుకురాబోతున్న రైల్వే బడ్జెట్ పై సగటు ప్రయాణీకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసారి రైల్వే బడ్జెట్ ఎలా ఉండబోతున్నది. పొగ బండి, సెగలు కక్కుతుందా, లేక సామాన్యుడి కంటనీరు తుడుస్తుందా?
`బతుకు బండిని నడిపేది రైలు బండి...' అంటూ పాటలు కూడా ఉన్నాయి. ఇది నిజమే. మనదేశ పౌరుల జీవనస్థితిగతులు తెలుసుకోవాలంటే ఒక్కసారి రైలెక్కితేచాలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టే, పొగలు, సెగలు కక్కుతున్న రైల్వే బడ్జెట్ పై మరోసారి అందరి చూపు పడుతోంది. ఈసారి రైల్వే బడ్జెట్ లో మనరాష్ట్రానికి ఒరిగేదేమిటి? కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా, మన రాష్ట్రానికి నామమాత్రపు కేటాయింపులే ఎందుకు దక్కుతున్నాయి? ఓ సారి మీరూ ఆలోచించండి....మీ అభిప్రాయాలను తెలియజేయండి...
ఎన్.ఆర్. తుర్లపాటి
9885292208
nrturlapati@gmail.com


ఇదండి సంగతి - నవ్వుల ఫీచర్


సరదాగా కాసేపు....నవ్వుకోండి

సరదాగాకాసేపు నవ్వుకోవడానికీ, పుష్పకవిమానంలో విహరించడానికి మీకోసం....
ఈ లఘుచిత్రం నిర్మాత, దర్శకత్వం కొలికపూడి నీల్. (టివీ5 సీనియర్ జర్నలిస్ట్) 95732 62602
మీ అభిప్రాయాలను ఈ బ్లాగ్ ద్వారా కూడా తెలియజేయండి.భగ్నముని - వెలెంటైన్స్ స్పెషల్

ప్రేమ విశ్వవ్యాప్తమైనది. అయితే ఇది మాత్రం ఓ భగ్నప్రేమికుని కథ.
రచన, దర్శకత్వం: కొలికపూడి నీల్
రచయత వివరాలు: టివీఫైవ్ లో సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్
 - 95732 62602


అంతరిక్ష చెత్త!


 భూమిమీద పేరుకుపోతున్న చెత్తను వదిలించుకోవడానికే నానాహైరానపడుతుంటే, ఇప్పుడు అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్త కూడా పెనుమస్యగామారిపోయింది. మానవాళికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయోగిస్తున్న ఉపగ్రహాలకు స్పేస్ గార్బేజీ భద్రత లేకుండా చేస్తోంది.
 ఏభైఏళ్ల కిందట మొట్టమొదటిసారిగా కృత్రిమ ఉపగ్రహాన్ని మనిషి ప్రయోగించిననాటికీ, వేలాదిగా ఉపగ్రహాలు తిరగాడుతున్న నేటి పరిస్థితిలో ఎంతో మార్పువచ్చింది. పనికిరాని శకలాలతో అంతరిక్షం ఓ చెత్తకుండీలా మారిపోతోంది.
 అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, సోవియట్ యూనియన్ పోటీపడుతున్న కాలం అది. సరిగా అలాంటప్పుడే సోవియట్ యూనియన్ 1957లో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ `స్పుత్నిక్' ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. అప్పటి నుంచి అనేక దేశాలు కృత్రిమ ఉపగ్రహాలవైపు దృష్టిపెట్టాయి. శాటిలైట్స్ ప్రయోగాలపట్ల జిజ్ఞాసను పెంచుకున్నాయి. సరిగా ఆసమయంలోనే అంతరిక్షంలో చెత్త పేరుకుపోవడానికి కూడా బీజం పడింది.
  50కిపైగా దేశాలు తమకు కావలసిన సేవలకోసం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నాయి. 18వ శతాబ్దిలో కాల్పనిక వస్తువుగా ఉన్న శాటిలైట్,  ఆ తరువాత వాస్తవరూపం దాల్చింది.
 ఉపగ్రహాలను పంపడంలో ప్రతిదేశం ఆసక్తి చూపుతుండటంతో అంతరిక్షంలో తిరగాడే మానవ నిర్మిత వస్తువల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. నిర్ణీత కాలవ్యవధిదాకా పనిచేసి ఆ తరువాత మూలనపడ్డ శాటిలైట్స్,  వాటి శకలాలు కూడా అంతరిక్షంలో తిరగాడుతూనే ఉన్నాయి. ఇలాంటివి సుమారు ఎనిమిదివేలదాకా ఉంటాయని ఓ అంచనా. ఇవి కాకుండా రాకెట్ ముక్కలు, స్పెష్ మిషెన్ లోని భాగాలు కూడా సొంత కక్ష్యల్లో తిరగాడుతున్నాయి. వీటిలో కొన్ని టన్నులకొద్దీ బరువుకలవికాగా, మరికొన్ని పది పౌండ్లు తూగేవీ ఉన్నాయి. మరికాస్త వివరంగా చెప్పుకోవాలంటే, అంతరిక్షంలో తిరగాడే వస్తువుల్లో కేవలం ఏడు శాతం మాత్రమే మానవాళికి సేవలందిస్తున్నాయి. మిగతావి అంతరిక్ష శిథిలాలే. వీటి సంఖ్య ఏటికేడు ఎక్కువ అవుతుండటంతోనే అసలు సమస్య వచ్చిపడింది.
 1957 నుంచి ఇప్పటివరకు 4,600 సార్లు ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయి. మన భూమి చుట్టూ సుమారు ఆరువేల కృత్రిమ ఉపగ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి సంఖ్య రాబోయే కాలంలో మరింత పెరగడం ఖాయం.
అంతరిక్షంలో చెత్తను పేరుస్తూ మానవుడు పెద్దతప్పే చేస్తున్నాడా? భూమి ఉపరితలాన్ని చెత్తతో నింపిన మానవుడు ఇప్పుడు స్పేస్ ని సైతం వదిలిపెట్టడంలేదు. తన అవసరాలకోసం ప్రయోగించిన శాటిలైట్స్ ను పని పూర్తయ్యాక పట్టించుకోవడంలేదు. ఫలితంగా అవన్నీ చెత్తపదార్ధాలుగా భూమి చుట్టూ తిరగాడుతున్నాయి.
 ఆకాశ చెత్తలో 22 శాతం ఉపయుక్తంలోలేని ఉపగ్రహాల వల్ల ఏర్పడిందే. ఇది ఇంకాఇంకా పెరిగితే ఉపగ్రహాలు తరచూ ప్రమాదాలకు గురికావడం ఖాయం. రోడ్డు ప్రమాదలంత కామన్ గా అంతరిక్ష ప్రమాదాలు భవిష్యకాలంలో చోటుచేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 స్పేస్ ఆర్బిట్ లోకి ఉపగ్రహాన్ని పంపేసి సంబరపడిపోయే రోజులుకావివి. అంతరిక్షంలో పనిపాటాలేకుండా తిరగాడే వేలాది శకలాలనుంచి ఉపగ్రహాలను రక్షించుకోవడం ఇప్పుడో పెద్ద సమస్య. అందుకే, సంపన్నదేశాలు -  అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేపనిలో పడ్డాయి.
 అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించడంకోసం ఇప్పటికే అనేక మార్గాలను అన్వేషించారు. అయితే పూర్తిగా తొలగించడం మాత్రం పెను సవాలే. అంతరిక్షంలో స్పెస్ ప్రాబ్లం ఉండదని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదు, శకాలల సంఖ్య పెరిగిపోతుంటే, రాబోయేది గడ్డుకాలమే. అంతరిక్షంలో తిరగాడే చెత్త పదార్ధాలను ముందుగా గుర్తించి వాటిని భూవాతావరణంలోకి చేర్చి కాల్చేయాలి. కానీ అది అంత సులువైన పనికాదు. భారీ శకలాల నుంచి చిన్నాచితకా డెబ్రీస్ వేలాదిగా భూమిచుట్టూ తిరగాడుతున్నాయి. పైగా `స్పేస్ జంక్' ని తొలగించాలంటే అన్ని దేశాల మధ్య అవగాహన ఉండాలి. కలిసికట్టుగా కార్యక్రమం చేపట్టగలగాలి. గ్లోబల్ వార్మింగ్ విషయంలోనే అంటీముట్టనట్టున్న దేశాలు ఆకాశచెత్త గురించి పట్టించుకుంటాయని అనుకోలేం.
 వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరాక ఏ చిన్న వస్తువుని బయటకు విసిరేసినా అది SPACE CRAFTని వెంటాడే వస్తుంటుంది. అదే వస్తువును బలమైన శక్తితో తోసేస్తే ఆ వస్తువు వేరే ఆర్బిట్ ను ఏర్పాటుచేసుకుని మళ్ళీ ఎక్కడోఓచోట అడ్డం తగులుతుంది. లేదా అలా విసిరివేయబడిన వస్తువు వేరే శాటిలైట్ ని ఢీకొనే ప్రమాదమూలేకపోలేదు. అంటే స్పేస్ ట్రావెల్ అంత తమాషాకాదన్నమాట. ఏప్పుడోఅప్పుడు ఏ క్షణంలోనైనా శకలాలు ఎదురుకావచ్చు. అవి స్పేస్ క్రాఫ్ట్ ని ఢీకొనవచ్చు.
 1996లో ఫ్రెంచ్ గూఢచారి ఉపగ్రహాన్ని సూట్ కేస్ అంత సైజు ఉన్న ఓ శకలం ఢీకొంది. దీంతో ఉపగ్రహం దెబ్బతింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో అత్యంత సామాన్యమైనవిగా మారిపోతాయన్నదే ఇప్పుడు అందర్ని పట్టిపీడిస్తున్న భయం.
చాలాకాలం నుంచి వేలాదిగా అంతరిక్షనౌకలను ప్రయోగించారు. వాటిలో చాలా మటుకు పనిపూర్తయ్యాక విచ్ఛిన్నమయ్యాయి. అయితే వాటిలో కొన్ని భాగాలు ఇప్పటికీ స్పేస్ ఆర్బిట్స్ లో తిరగాడుతూనేఉన్నాయి. ఇలాంటి శకలాలను భూమికి మరింత దూరంగా నెట్టివేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఇందుకు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారన్నది అసలు ప్రశ్న. లేజర్ కిరణాలను ఉపయోగించడం ద్వారా కూడా అంతరిక్షంలోని చెత్తను తొలగించవచ్చని అంటున్నారు.
 ఉపగ్రహ ప్రయోగాలను కూడా లాభసాటి వ్యాపారంగా మలచుకునే దేశాలకు `స్పెష్ జంక్' ఓ పెద్ద సవాల్. కోట్లాది డాలర్లు ఖర్చుచేసి నిర్ణీతకక్ష్యలోకి పంపినా వాటి ఆయుష్షు ఎంతకాలమో శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. 
 అది 2009 ఫిబ్రవరి నెల. ఎవ్వరూ ఊహించని రీతిలో అమెరికా, రష్యాదేశాలకు చెందిన ఉపగ్రహాలు ఒకదానితోమరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా అంతరిక్షంలో భారీగా శకలాలు వెదజల్లబడ్డాయి. వాటిలో చాలామటుకు సొంత కక్ష్యల్లో తిరగాడుతున్నాయి.
అంతరిక్షంలోకి మనం ప్రయోగించే ఉపగ్రహాలకు భద్రతలేదని ఈ సంఘటనతో తేలిపోయింది. కోట్లాది డాలర్లు కుమ్మరించి పైకి పంపించే శాటిలైట్స్ కు కాస్మిక్ కిరణాల నుంచి కూడా ముప్పుతప్పడంలేదు. నక్షత్రాల జీవితకాలం అయిపోయేసమయంలో భారీ విస్పోటనలు ఎదురవుతాయి. ఇలాంటి పేలుళ్లు సంభవించినప్పుడు వెలువడే కాస్మిక్ తరంగాలు ఉపగ్రహాలను నాశనం చేస్తున్నాయని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. సతీష్ ధావన్ అంతరిక్షకేంద్రం నుంచి PSLV-c15 రాకెట్ ఏకంగా ఐదు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. కెనడా, స్విట్జర్లండ్, అల్జీరియా దేశాలకు చెందిన మూడు ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక విద్యార్థులు తయారుచేసిన `స్టడ్ శాట్' లను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టారు.
 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తుంటే, స్పేస్ గార్బేజ్ వల్ల ఇబ్బందులు తప్పడంలేదని అనేకమంది నిపుణులు అంటున్నారు.
 మూడు నెలల కిందట GSLV ప్రయోగంలో దొర్లిన అపశృతి దొర్లినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మన అంతరిక్ష శాస్త్రవేత్తలు ఈసారి PSLV రాకెట్ ను విజయవంతగా ప్రయోగించారు. దీంతో భారత త్రివర్ణ పతాకం మరోమారు ఆకాశవీధిలో రెపరెపలాడింది.
 అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రతి వస్తువు ఓ నిర్ణీత కక్ష్యలో తిరగాడాల్సిందే. కాలంచెల్లిపోయిన ఉపగ్రహాల నుంచి, ఎన్నోరకాల డెబ్రీస్ - స్పేస్ లో తిరగాడుతూనే ఉన్నాయి. వీటి సంఖ్య పెరిగిపోతుండటంతో ఆకాశవీధి ఈ శకలాలకు ఓ శ్మశానవాటికలా మారిపోయింది.
- ఎన్.ఆర్. తుర్లపాటి
మీ అభిప్రాయాలను తెలియజేయండి....
98852 92208
(nrturlapati@gmail.com)


బడ్జెట్ లో మహిళ వాటా రూ. 1200

మీకీ విషయం తెలుసా.... మన ఘనమైన కేంద్ర ప్రభుత్వం మరికొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రకటించబోతున్నది. అందులో మహిళలకు అందే వాటా ఎంతో తెలుసా...ఏడాదికి ప్రతి ఒక్క మహిళకు వివిధ సంక్షేమ పథకాల కింద అందే మొత్తం అక్షరాలా కేవలం 1200 రూపాయలు మాత్రమే. ఆకాశంలో సగభాగం అంటూ ఆవేశపడే మహిళలారా....ఈ విషయం ఆలోచించండి. బడ్జెట్ లో సగం రాకపోతేమానే...కానీసం ఏడాదికి అందే 1200 రూపాయలతో మీరు ఏమేరకు లబ్దిపొందగలరు? 1200 రూపాయలతో నెల కూడా గడవదు. ఇదీ మన ఘనమైన కేంద్ర ప్రభుత్వం మహిళకు వేస్తున్న పెద్దపీట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) రాబోతున్న తరుణంలో మైకు పుచ్చుకుని ఉపన్యాసాలు ఇచ్చే మహిళలారా బడ్జెట్ లో మీ వాటా గురించి ముందు తేల్చుకోండి...మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.
                                                                                                                    - ఎన్.ఆర్. తుర్లపాటి
                                                                                                                   (nrturlapati@gmail.com)