29, డిసెంబర్ 2011, గురువారం

జ‌ర్నలిస్టుల నిర‌స‌న‌లు..


హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాన్ని కొందరు జర్నలిస్టులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంత సరైన చర్య అనిపించుకోదు. సమావేశంలో టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేయడంపై వీరు నిరసన వ్యక్తం చేశారని చెబుతున్నారు. జర్నలిస్టులు ఎవరైనా గొడవ చేస్తుంటే వాటిని కవర్ చేయడం జరుగుతుంటుంది. కాని అందుకు భిన్నంగా వారే నిరసన తెలపడం జర్నలిజంలో కొత్తపోకడగా బావించాలి. మన దేశంలో భావస్వేచ్చ ఉందని,పత్రికా స్వేఛ్చ ఉందని , దానివల్లనే వారు ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నారని మర్చిపోయి , వారే ఎదుటివారి స్వేచ్చకు ఆటంకం కలిగించడం, ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అనుకూలంగా బహిరంగంగా వ్యవహరించడం సరైన పద్దతి అనిపించుకోదు.ఒక వేళ సమావేశంలో మాట్లాడినవారి అబిప్రాయాలతో ఏకీభవించకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవచ్చు. తమ పత్రికలలోనో, టీవీలలోనో తమకు నచ్చిన రీతిలో వార్తలు ఇచ్చుకోవచ్చు. అలాకాకుండా జర్నలిస్టులే ఇలాంటి చర్యలు దిగడంలో ఆంతర్యం ఏమిటో అర్దం కాదు.ఎదుటివారు వాదించడానికి చెప్పడానికి అవకాశం ఇవ్వడానికి ఇష్టం పడడం లేదంటే వారు తమ వాదన బలహీనమైదని భావిస్తున్నట్లుగా అనుకునే అవకాశం ఉంటుంది.మారుతున్న కాలానికి మారిన పద్దతులు ఇవి కాబోలు అని సరిపెట్టుకోవాలా?కాగా సమావేశం జరుగుతున్న హాలు ముట్టడించడానికి కొందరు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.

లొల్లి రాష్ట్రప‌తి ద‌గ్గర‌కు వెళ్తుందా..?


మంత్రి శంకర్రావుపై దాడి జరిగిన విషయాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ దృష్టికి తీసుకుపోనున్నామని ఎమ్మార్పీయస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. రాష్ట్రపతిని కల్సిన తర్వాత కూడా తగిన చర్యలు లేకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన అన్నారు. హోంమంత్రిగా సబిత ఇంద్రారెడ్డి అనర్హురాలని.. ఆమెను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి దాడి చేసిన వారిపై కేసులలు నమోదు కాకుండా హోం మంత్రి స్థానిక పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

కంగారూల చేతిలో కుదేల‌య్యారు..


భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 122 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇండియా 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా స్కోర్లు – 333, 240 కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 282 గా ఉంది. విదేశాల్లో భారతికి వరుసగా ఐదో ఓటమి. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టగా, టెండుల్కర్ 32, అశ్విన్ 30 పరుగులు చేయగలిగారు. టెస్ట్‌లో మొత్తం ఆరు వికెట్లు తీసిన ఆసిస్ బౌలర్ ప్యాటిన్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. బ్యాటింగ్‌లో వైఫల్యం వల్లే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోయామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేర్కొన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తమ బ్యాటింగ్ ఘోరంగా ఉందని మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. మొదటి టెస్ట్‌లో ఆసీస్ చేతిలో 122 పరుగుల తేడాతో ఓడిపోవడం పట్ల ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘థానే’ తో తీరాలు అల్లక‌ల్లోలం..


బంగాళాఖాతంలో ఏర్పడిన థానే తుపాను తీర ప్రాంతాన్ని కలవర పరుస్తోంది. బుధవారం తీరంలో తుపాను ప్రభావం పెరిగింది. సముద్ర తీరం వెంబడి అలల తీవ్రత పెరిగింది. నిజాంపట్నం హార్బర్ వద్ద అలలు ఎగసి పడుతుండటంతో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే నిజాంపట్నం హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. బాపట్ల నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఒక పడవలోని నలుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. తుపాను ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి వాతావరణంలో పెనుమార్పు చోటు చేసుకుంది.
ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. రేపల్లె ప్రాంతంలో చిరు జల్లులు పడ్డాయి. నిజాంపట్నం హార్బర్ వద్ద రెండో నెంబర్ ప్రమాద సూచిక కొనసాగుతోంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యం త్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీర ప్రాంతంలో ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అలాగే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసి అందరూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
థానే తుఫాను చెన్నైకి 300 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి రేపు చెన్నై-నాగపట్నం మధ్య పుదిచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటలకు 90-110 వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. థానే తుఫాను ప్రభావంతో వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అన్ని ప్రాంతాల ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. థానే తుఫాను ప్రభావంపై ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో ఫోన్‌లో మాట్లాడారు. తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంత మత్స్యకారులకు తగిన సహాయం అందించాలని సీఎం వెల్లడించారు.

ఉనికి కోసం బాబు పాట్లు


పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన గురువారం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తెలంగాణ సాధన కోసం అధిష్టానంపై ఒత్తిడి కొనసాగిస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. బాబుకు చిత్తశుద్ది ఉంటే చిదంబరానికి తెలంగాణపై లేఖ ఇవ్వాలన్నారు. టీడీపీ-టీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణపై స్పష్టత లేదని మంత్రి పేర్కొన్నారు.

గాలికి మ‌ళ్లీ చుక్కెదురే..!


ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డిల జ్యుడిషియల్ రిమాండ్ ను జనవరి 12వ తేదీ వరకూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంపొడిగించింది. చంచలగూడ జైల్లో ఉన్న వీరిని న్యాయమూర్తి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు.  కాగా తన తల్లి వర్థంతికి హాజరయేందుకు రెండు రోజులు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్దనరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో బళ్లారిలో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ వేసిన ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అత‌నే ‘కిర‌ణం’


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అధిష్టానంలో పట్టు పెరిగిందని ఆయన శిబిరంలోని ముఖ్యులు వ్యాఖ్యా నిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి పని చేస్తున్న తీరుపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు నమ్మకం కుదురుతోందన్నది వీరి వాదనగా ఉంది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం అందులో ఒకటి కాగా, ప్రభుత్వాన్ని ఆయన ముందుకు తీసుకు వెళుతున్న తీరు కూడా మరో ముఖ్యమైన అంశమని వారు వివరిస్తున్నారు. ప్రత్యేకించి యువనేత, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు అయిన రాహుల్ గాంధీ కూడా కిరణ్ పట్ల సంతృప్తి కనబరుస్తున్నారని అంటున్నారు. రాహుల్ ప్రత్యేకించి అన్నారో లేదో కాని ఆయన వద్ద పనిచేసే ఒక ముఖ్యమైన బాధ్యుడు మాత్రం ఒక వ్యాఖ్య చేశారట. రెండువేల పద్నాలుగులో ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిస్తే ఎలాగూ కిరణ్ కుమార్ రెడ్డే నాయకత్వం వహిస్తారు. వివిధ రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ ఓడిపోతే కనుక తిరిగి 2019 ఎన్నికల నాటికి కూడా కాంగ్రెస్ తరపున నాయకత్వ బాధ్యతలు కిరణ్ కుమార్ రెడ్డే వ్యవహరిస్తారని అన్నారట. ఈ విషయం ఉత్తరప్రదేశ్ లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక తెలుగు ప్రముఖుడితో అనగా, ఆ మాట ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శిబిరం వరకు చేరింది. దానితో సహజంగానే సి.ఎమ్. క్యాంప్ ఆనందం వ్యక్తం చేస్తోంది.అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరని, ఈలోగా ఎన్ని మార్పులు రాకపోవచ్చని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే రాహుల్ గాందీ వద్ద కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి మార్కులు పడితే , రాహుల్ సన్నిహిత టీమ్ లో కిరణ్ కూడా ఒకరిగా ఉంటారని మరి కొందరు భావిస్తున్నారు.

2011.. హిట్సూ.. ఫ్లాప్స్‌..


2012కి స్వాగ‌తం ప‌లుకుతూ 2011 సంవ‌త్సరం ముగియ‌ బోతోంది.. ఈ సంద‌ర్భంగా ఒక‌సారి  తెలుగు చిత్రాల జ‌యా ప‌జ‌యాల గురించి రివ్యూ చేస్తే… 2010 సంవ‌త్సరం క‌న్నా ఈ సంవ‌త్సరం తెలుగు చిత్రాల విజ‌యాలు కాస్త మెరుగ్గానే ఉన్నా తెలుగు చిత్రసీమ‌కి ఈ విజ‌యాలు స‌రిపోవు. సంవ‌త్సరం మొద‌ట్లో వ‌చ్చిన స్టార్ హీరోల చిత్రాలు ఘోర ప‌రాజ‌యాలు కావ‌డం అంద‌రినీ నిరాశ‌ప‌రిచిన‌ప్పటికీ సంవ‌త్సరం చివ‌ర్లో వ‌చ్చిన చిత్రాలు వ‌రుస‌గా వ‌సూళ్ళు సాధించ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. 2011లో మొత్త వ‌చ్చిన తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు 114 కాగా త‌మిళం, క‌న్నడం, మ‌ళ‌యాలం, హిందీ భాష‌ల‌నుండి డ‌బ్బింగ్ అయిన చిత్రాల సంఖ్య 120 ఉండ‌టం విశేషం. అయితే డ‌బ్బింగ్ చిత్రాల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్నప్పటికీ విజ‌యాల‌ని న‌మోదు చేసుకున్న చిత్రాలు మాత్రం నాలుగ‌యిదు కంటే ఎక్కువ‌గా లేవు. తెలుగు స్ట్రెయిట్ విష‌యాల‌కి వ‌స్తే… ‘పరమవీరచక్ర’, ‘మిరపకాయ్’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల‌య్యాయి.. మరో బెబ్బులిపులి అంటూ విడుదలకు ముందు గాండ్రించిన పరమవీరచక్ర… పిల్లిలా కుదేలైపోయింది. దాసరి నారాయణరావు-బాలకృష్ణల కలయిక కాసుల వర్షం కురిపించలేదు సరికదా… థియేటర్‌లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. ‘మిరపకాయ్’లో రవితేజ ప్రయోగాల జోలికి పోకుండా తనకు అచ్చొచ్చిన మాస్ మసాలా కథే ఎంచుకున్నారు. దాంతో గట్టెక్కేశారు. గొప్ప కథ కాకపోయినా, సినిమాలో ఊహించని మలుపులూ లేకపోయినా ఈ సినిమా ఆడిందంటే కారణం. రవితేజ కామెడీ టైమింగే. దాంతోపాటు సంక్రాంతి బరిలో పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడంతో వసూళ్లు బాగానే పిండుకొన్నారు. ‘గోల్కొండ హైస్కూల్’ క్లాస్ టచ్ ఎక్కువై ఆ వర్గానికే పరిమితమైంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్‌తో బ్రహ్మాండం బద్దలుగొడతాం అని బయల్దేరిన ధీరుడు… ఏమాత్రం మెప్పించలేదు. సిద్ధార్థ్ కళ్లకు గంతలు కట్టడం నుంచి సినిమా డ్రాపవుట్ అయిపోయింది.
ఇక ఈ సంవ‌త్సరం ఎంతో ఘ‌నంగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, గోపీచంద్, పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌లకు ఈ ఏడాది ఒక్క హిట్టూ దక్కలేదు. ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ‘శక్తి’, ‘ఊసరవెల్లి’ రెండూ భారీ అంచనాలతో వచ్చినవే. ఆ అంచనాలే ఈ సినిమాల కొంప ముంచా యి. ‘శక్తి’లో హంగూ ఆర్భాటం తప్ప విషయం లేకపోవడంతో తేలిపోయింది. ‘ఊసరవెల్లి’ తొలిరోజు వసూళ్లు అదరగొట్టినా… ఆ ఊపు కొనసాగించలేకపోయింది. ఎన్టీఆర్ పాత్ర చిత్రణలో లోపాలు ఈ సినిమాకి శాపంలా తోచింది. గోపీచంద్ ‘వాంటెడ్’, ‘మొగుడు’ సినిమాలతో జనం ముందుకొచ్చారు. దర్శకుడి వైఫల్యంతో ‘వాంటెడ్’ బోర్లా పడింది. కథలో కొత్తదనం లేకపోవడంతో ‘మొగుడు’ ఆకట్టుకోలేదు. ఇక పవన్‌కల్యాణ్ సినిమాలు ‘తీన్‌మార్’ ‘పంజా’ సినిమాలు ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. నాగచైతన్యకు ‘100% లవ్’ ఒక్కటే ఊరట నిచ్చింది. మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నాలు ‘దడ’, ‘బెజవాడ’ రూపంలో బెడిసికొట్టాయి. ఇక ప‌క్కా మాస్ క్యారెక్టర్‌ల‌తో హీరోయిజాన్ని చూపించే ప్రభాస్ ఒక మంచి కుటుంబ క‌థని న‌మ్ముకుని చేసిన  ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో ప్రభాస్ కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చాడు. ఈ సినిమాపై తొలుత డివైడ్ టాక్ నడిచినా… వసూళ్లు క్రమంగా ఊపందుకొన్నాయి. కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేయడంతో ఈ చిత్రం విజయతీరాలకు చేరగలిగింది. తెలుగు చిత్రపరిశ్రమలో మినిమం గ్యారెంటీ ట్యాగు సంపాదించుకొన్న హీరోలు ఇద్దరున్నారు. ఒకరు రవితేజ, ఇంకొకరు అల్లరి నరేష్. వీరిద్దరికి ఈసారి మిశ్రమ ఫలితాలే వచ్చాయి. రవితేజ ‘మిరపకాయ్తో తన ఫార్ములా కరెక్టే అని నిరూపించుకొన్నా… ‘దొంగలముఠా’, ‘వీర’ సినిమాలతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నరేష్ పరిస్థితీ అంతే. ‘అహనా పెళ్లంట’ ఒక్కటే ఈ ఏడాది చెప్పుకోదగిన సినిమా. ‘సీమ టపాకాయ్’, ‘మడతకాజా’, ‘సంఘర్షణ’ సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకోవలసి వచ్చింది.
చిన్న సినిమా తన ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఏడాది కూడా ఆపసోపాలు పడింది. ‘అలా మొదలైంది’. ‘పిల్లజమిందార్’ సినిమాలు చిన్న నిర్మాతలకు కొండంత బలాన్నిచ్చాయి. ముఖ్యంగా నందినిరెడ్డి ‘అలా మొదలైంది’ అంటూ ప్రేక్షకులకు ఓ ప్రేమకథను చూపించారు. నటీనటుల ప్రతిభ, చక్కని సంగీతం, సున్నితమైన భావాల్ని తెర మీద ఆవిష్కరించిన విధానం, కథకు వినోదం అద్దిన తీరు ప్రేక్షకులకు నచ్చాయి. దాంతో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాయికుమార్ తనయుడు ఆదిని కూడా ప్రేక్షకులు ఆశీర్వదించారు. ‘ప్రేమకావాలి’ పాస్ మార్కులు దక్కించుకుంది.  కొత్త ఆలోచనలతో తీసిన ‘ఎల్బీడబ్ల్యు’ విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంది. ప్రేక్షకుల్ని పదిహేను రోజుల ముందే ఏప్రిల్ ఫూల్స్‌గా మార్చారు రాంగోపాల్‌వర్మ. ఐదు రోజుల్లో సినిమా తీసి భళా అనిపించారు. తీరా బొమ్మ చూస్తే ఆ సినిమాకి ఒకరోజు కూడా ఎక్కువే అనిపించింది. అదే ‘దొంగలముఠా’. ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 19 నుంచి థియేటర్లో ఒక్కరంటే ఒక్కరూ కనిపించలేదు. వివాదాల‌తో సినిమాన గ‌ట్టెక్కించాల‌నే రాంగోపాల్ వ‌ర్మకి ప్రేక్షకుటు ఈ ఏడాది గ‌ట్టిగానే బుద్ది చెప్పారు.. ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’తో చేసిన ప్రయత్నం కూడా ఘోరంగా బెడిసికొట్టింది. ఇక బెజ‌వాడ అని హంగామా క్రియేట్ చేసినా ఆ చిత్రం లో స‌రుకు ఏమీ లేక‌పోవ‌డంతో దాన్నీ ప్రేక్షకులు తిర‌స్కరించారు.
ఈ సంవ‌త్సరం చివ‌ర్లో వ‌చ్చిన శ్రీ‌రామ రాజ్యం, రాజ‌న్న చిత్రాలు బాక్సాఫీసు వ‌ద్ద మంచి విజ‌యాన్నే న‌మోదు చేసుకున్నాయి. బాల‌కృష్ణకి సంవ‌త్సరం మొద‌ట్లో ప‌ర‌మ‌వీర చ‌క్ర ఫ్లాఫ్ రావ‌డం, చివ‌ర్లో శ్రీ‌రామ‌రాజ్యం లాంటి మంచి చిత్రంతో విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డంతో ఆయ‌న ఈ సంవ‌త్సరం రెండు మిశ్రమ ఫ‌లితాల‌ని చ‌వి చూడాల్సి వ‌చ్చింది.
ఈ ఏడాది రికార్డుల గురించి మాట్లాడుకొన్నది, పాత రికార్డులు సవరించాల్సి వచ్చింది ‘దూకుడు’ సినిమా విషయంలోనే జరిగింది. శ్రీనువైట్ల-మహేష్‌బాబుల మాయాజాలం బాగా పనిచేసింది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ ఈ సినిమాకి బాగా ప్లసయ్యారు. కోన వెంకట్ సృష్టించిన పాత్రల మధ్య ‘దూకుడు’ హంగామా చేసింది. కథ, కథనాల మాట అటుంచితే మహేష్ నటన, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. అగ్ర హీరో సినిమా హిట్‌టాక్ సంపాదించుకొంటే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. అయితే ఏడాదికి ఒక్క సూపర్‌హిట్ సరిపోదు. పరిశ్రమ ఇంకా కోరుకొంటోంది. తెలుగు ప్రేక్షకుడు సినిమాల‌ని అంచ‌నా వేయ‌డంలోనూ, సినిమా స‌క్సెస్ చేయ‌డంలోనూ ఎప్పుడూ వెనుకాడ‌లేదు. మంచి క‌థ‌, క‌థ‌నాల‌తో వ‌చ్చే చిత్రం వ‌స్తే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌నేది కూడా చూడ‌కుండా ఆ చిత్రాన్ని ఘ‌న విజ‌యం సాధిస్తారు. దీనికి చ‌క్కని ఉదాహ‌ర‌ణ త‌మిళ హీరో జీవా న‌టించిన రంగం చిత్రం. ఈ చిత్రం త‌మిళ అనువాద‌మ‌యినా, ఇందులోని హీరో జీవా తెలుగువారికి అంత‌గా ప‌రిచ‌యం లేక‌పోయ‌నా సినిమాని మాత్రం వంద‌రోజులు ఆడించారు. వ‌చ్చే సంవ‌త్సరం కూడా తెలుగు చిత్ర సీమ‌లో కొన్ని ప్రయోగాల‌తో కూడిన చిత్రాలు ముందుకు వ‌స్తున్నాయి. మ‌హేష్‌, వెంక‌టేష్ క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు రాబోతున్నాయి. హీరోల క‌మిట్‌మెంట్‌, ద‌ర్శకుల స్పీడు చూస్తుంటే 2012 తెలుగు చిత్ర సీమ‌కి బంగారు భ‌విష్యత్తుని అంద‌స్తుంద‌ని అనిపిస్తుంది.. ఇదే నిజం కావాలని ఆశిస్తూ… అంద‌రికీ నూత‌న సంవ‌త్సర శుభాకాంక్షల‌తో…
-సిఎస్‌కె
checheske@gmail.com

ఉత్తర కోస్తాకు పెను తుఫాను


పెనుతుఫాన్‌గా మారిన ‘థానే’ చెన్నైకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని రేపు ఉదయం చెన్నై- నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడుతోపాటు మన రాష్ట్రంలోని దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉత్తరకోస్తాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

సిఎం ఢిల్లీ టూర్ వెనుక‌..


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హటాత్తుగా డిల్లీ వెళుతుండడంతో రాజకీయ వర్గాలలో మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఇంతవరకు వారికి ఇస్తామన్న మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై ఆ వర్గం గుర్రుగా ఉంది. అలాగే మంత్రివర్గంలో డాక్టర్ శంకరరావు, డి.ఎల్.రవీంద్ర రెడ్డి వంటి కొద్ది మందితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సరిపడడం లేదు.శంకరరావు అయితే మరీ రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారన్న అబిప్రాయం ఉంది. ఇదంతా కాంగ్రెస్ కు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట కలుగుతున్నదన్న వాదన కూడా ఉంది.అలాగే పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ను మంత్రి పదవి నుంచి తప్పించాలని కూడా ముఖ్యమంత్రి కోరుతున్నారు.ఈ నేపధ్యంలో పార్టీ అధిష్టానంతో మంత్రివర్గంలో మార్పులు,చేర్పుల గురించి చర్చించవచ్చని భావిస్తున్నారు.అయితే తెలంగాణ అంశం పరిష్కారం కాకుండా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా అన్న సందేహం ఉంది. అలా కాని పక్షంలో మంత్రివర్గ విస్తరణ కేవలం చిరంజీవి వర్గానికి పరిమితం కావచ్చని అంటున్నారు.

బోత్స మాస్టర్ ప్లాన్‌


పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారా యణ మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనను ముఖ్యమంత్రి ఇరికించి అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్న బొత్స సత్యనారాయణ ఏకంగా నూట అరవై మంది ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ చేయించి ఎవరెవరికి మద్యం వ్యాపారంతో సంబందం ఉందో తేల్చాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి సంచలనం సృష్టించారు.స్వయంగా ఆయన ఈ లేఖను ముఖ్యమంత్రికి అందచేయడమే కాకుండా పార్టీ హై కమాండ్ కు కూడా ఈ లేఖ ప్రతిని పంపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు చేసే ఆరోపణలతో మనం ఏమి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారని కధనాలు వస్తున్నాయి. అయినప్పట్టికీ సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని బొత్స లేఖను అందచేశారని, ఈ సందర్భంగా వారిద్దరి మద్య కాస్త వాగ్వాదం జరిగిందని కదనాలు వస్తున్నాయి.మధ్యం వ్యాపారం ద్వారా తానొక్కడినే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు రావడంపై బొత్స ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా ఎవరెవరికి మద్యం వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయో తెలిపే జాబితాను కూడా ముఖ్యమంత్రికి బొత్స సమర్పించారని అంటున్నారు. ఏది ఏమైనా బొత్సను తేలికగా అంచనా వేయరాదని మరోసారి రుజువు అయింది.నిజంగానే బొత్స కోరినట్లు సిబిఐ విచారణకు ఆదేశిస్తే మొత్తం పార్టీ అంతా కష్టాలలో పడే ప్రమాదం ఉంది. అలా చేయని పక్షంలో బొత్స తన డిమాండ్ ను ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నించే అవకాశం తెచ్చుకోవడం ద్వారా తాను క్లీన్ అన్న భావాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లగలుగుతారు.

జ‌న‌వ‌రిలో తెలంగాణ‌..?


తెలంగాణ అంశంపై కేంద్రం జనవరి మొదటి వారంలో ప్రకటన చేసే అవకాశం ఉందా?తెలంగాణ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం వచ్చే కొద్ది రోజులలో ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయవచ్చని టిఆర్ఎస్ వర్గాలకు, ఇటు కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందుతోంది. కేంద్ర ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దీనిపై ఒక ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఏకాబిప్రాయం లేనందున తెలంగాణ ఇవ్వలేకపోతున్నామని కేంద్రం చేసే ప్రకటన సారాంశంగా ఉండవచ్చు. అంతేకాక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపైకి నెపం నెట్టే యత్నం కూడా జరగవచ్చని అంటున్నారు. అలాగే ఆయా పార్టీలు తెలంగాణ అంశంలో యు టర్న్ తీసుకున్న విషయాన్ని కేంద్రం ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ టిఆర్ ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావులు కలుసుకున్నప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని , ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కుదరకపోవచ్చని పవార్ అన్నట్లుగా టిఆర్ఎస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో దీనిపై జవాబు ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ కూడా ఏకాభిప్రాయం ఉంటేనే తెలంగాణ సాధ్యమన్న సూచన ఇచ్చారని కొందరు గుర్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జనవరిలో తెలంగాణపై నిర్దిష్ట ప్రకటన రావచ్చని, ఒక వేళ ఉప ఎన్నికలు, లేదా ఏదైనా ముఖ్యమైన కారణంతో జనవరిలో ప్రకటన రాకపోతే, జూన్, జూలై నెలలవరకు ఈ అంశం తేలకపోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.

శోక‌స‌ముద్రంలో అక్కినేని కుటుంబం


ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అన్నపూర్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు 79 సంవత్సరాలు. అన్నపూర్ణ మృతితో అక్కినేని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.
అక్కినేనితో ఫిబ్రవరి 18, 1949 తేదిన అన్నపూర్ణ వివాహం జరిగింది. అన్నపూర్ణకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు నాగార్జున, నిర్మాత వెంకట్ అక్కినేనిలు అన్నపూర్ణ కుమారులు. 2009 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు దంపతులు వివాహ వజ్రోత్సవం జరుపుకున్నారు.
అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అన్నపూర్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. తన తల్లి మరణవార్తను తెలుసుకున్న సినీ నటుడు నాగార్జున హుటాహుటిన బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

కోర‌లు లేని లోక్‌పాల్ బిల్లు


కోర‌లు లేని లోక్‌పాల్ బిల్లు

రాజ్యాంగ హోదా కల్పించకుండా లోక్ పాల్ బిల్లును ఆమోదించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇది కోరలు లేని లోక్ పాల్ బిల్లు అని విపక్షాలు, సామాజిక బృందం నేత అన్నా హజారే తీవ్రంగా వ్యాఖ్యాని స్తుండగా, లోక్ సభే సుప్రిం గా ఉండాలని పార్లమెంటు సభ్యులు పలువురు అభిప్రాయ పడుతున్నారు.ఈ బిల్లుకు ఓటింగ్ జరిగిన సమయంలో ఇరవై ఐదు మంది యుపిఎ సభ్యులు కూడా సభలో లేకపోవడం విశేషం.కాగా సమాజవాది పార్టీ, బి.ఎస్.పి, లెఫ్ట్ పార్టీలు వాకౌట్ చేశాయి.అయితే రాజ్యసభలో యుపిఎకు బలం లేదు. అలాంటప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అన్నది సందేహాస్పదంగా ఉంది.అయితే అన్నా హజారే ఈ బిల్లుపై మండి పడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు.సిబిఐని లోక్ పాల్ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ను ప్రభుత్వం తిరస్కరించింది. అయితే సిబిఐ పనిలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అంటున్నారు.

ఛార్జీల పెంపుతో కాంగ్రెస్‌లో గుబులు


రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తోంది. ఉప ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదన రావడం, దానికి విస్తృతంగా ప్రచారం రావడం,ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థిరపడుతున్నారని భావిస్తున్న తరుణంలో విద్యుత్ ఛార్జీల ప్రబావం ఎలా ఉంటుందోనన్న ఆందోళనను ముఖ్యమంత్రి సన్నిహితులు, కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో అదికారుల మాటకే ప్రాముఖ్యత ఇస్తున్నారని, ఆచరణలో ఏమి జరుగుతుందో ఆలోచించడం లేదని ఒక ఎమ్మెల్సీ అన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన వివిధ పదకాలు కిరణ్ కు పాజిటివ్ వాతావరణం తెచ్చిపెట్టాయని, ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినా ప్రజలు పరిస్థితిని అర్ధం చేసుకుంటారని అదికారులు కిరణ్ కు చెబుతున్నారని, ఆయన కూడా ఇదే అభిప్రాయానికి వస్తున్నారన్న భావన కలుగుతోందని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్నారు.అయితే ఇది ప్రమాదకరమని, కరెంటు ఛార్జీలు పెరిగితే ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత వస్తుందని , చంద్రబాబునాయుడు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచే దెబ్బతిన్నారని వారు గుర్తు చేస్తున్నారు. అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే కరెంటు ఛార్జీలు ఈ స్థాయిలో పెరిగితే ఇక ఆశలు వదులుకోవలసి వస్తుందని కాంగ్రెస్ నేతలు కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే ఛార్జీలు పెంచకుండా, ప్రభుత్వం నిదులు సమకూర్చకుండా , విద్యుత్ కోతలు యధావిధిగా కొనసాగిస్తే అది మొత్తం వ్యవస్థకే డేంజర్ అవుతుందని,అప్పుడు రాజకీయంగా ఏమి చేసినా ప్రయోజనం ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటి విషయాలు ఎప్పుడూ పరస్పర వైరుద్య స్వభావం కలిగి ఉంటాయని, ప్రభుత్వంలో ఉన్నవారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోకతప్పదని కొందరి వాదనగా ఉంది.చివరికి కరెంటు ఛార్జీల వ్యవహారం ఏమవుతుందో కాని, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటినుంచే భయపడుతున్నారు.

పైచేయి సాధించిన కిర‌ణ్‌


పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై చేయి సాధించారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రోజుల క్రిందట కాంగ్రెస్ లో తానే సర్వం అన్న చందంగా బొత్స వ్యవహరించి కాంగ్రెస్ శ్రేణులలో గందరగోళానికి కారకులయ్యారని, అయితే ఆ తర్వాత పరిణామాలలో ఆయన కొంత వెనుకబడి కిరణ్ ది పై చేయి అయిందని కిరణ్ శిబిరం భావిస్తోంది.దానికి రెండు, మూడు కారణాలు ప్రధానంగా చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంలో ప్రజారాజ్యం వర్గం ఎమ్మెల్యేలు కొందరిని బొత్స రెచ్చగొట్టారని, చిరంజీవిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారని, ఆ విషయం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లిందని కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ఆ మీదట అదిష్టానం బొత్స పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచిందని, ఆ సమాచారం కూడా తమ వద్ద ఉందని వీరు చెబుతున్నారు.పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలేమిటని అధిష్టానం ప్రశ్నించిందన్నది వీరి వాదన.అదే తరుణంలో మద్యం సిండికేట్ల వ్యవహారం , ఎసిబి దాడులతో వెలుగులోకి వచ్చిన అంశాలపై బొత్స ఆత్మరక్షణలో పడ్డారని, దీంతో బొత్స కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చిందని కిరణ్ మద్దతుదారులు చెబుతున్నారు.ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్ గాంధీకి సైతం బొత్స మద్యం సిండికేట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందని,కాందరు ఆంధ్ర నేతల వద్ద రాహుల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.అయితే కిరణ్ కుమార్ రెడ్డి కోరుకున్నట్లు బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించి , కేవలం పిసిసి అధ్యక్ష పదవికి పరిమితం చేయాలన్నదానిపై అధిష్టానం ఇంకా సానుకూలంగా స్పందించిందని వీరు గట్టిగా చెప్పలేకపోతున్నారు.అదే సమయంలో బొత్స కూడా వ్యూహాత్మకంగా కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా, తెలివైన నాయకుడని, అంత తేలికగా లొంగే తత్వం కాదని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి, పిసిసి అద్యక్షుల మధ్య పెనుగులాట వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది.

ప‌టోళ్ళ గోవ‌ర్థన్ రెడ్డి దారుణ హ‌త్య


పరిటాల రవి హత్య కేసులో నిందితుడు పటోళ్ల గోవర్థన్‌రెడ్డి(50) ఆబిడ్స్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. ఆటోలో వెళుతున్న ఆయనను ముగ్గురు దుండగులు కత్తులతో నరికి చంపారు. కొద్ది నెలల క్రితమే ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. రంగారెడ్డి జిల్లా తాండూరు చెందిన ఆయన విప్లవ దేశభక్త పులులు(ఆర్‌టీపీ) అనే సంస్థను స్థాపించి, నడిపారు. పటోళ్ల గోవర్థన్‌రెడ్డి హత్య వెనుక పరిటాల అనుచరులు పోతుల సురేష్, చమన్ పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

జ‌క్కన్న చండ‌శాస‌నుడు


దర్శకుడు రాజమౌళి చండశాసనుడు అంటూ అక్కినేని నాగార్జున సర్టిఫై ఇచ్చాడు. రాజమౌళి కుర్రాడు కాబట్టి చాలా చురుగ్గా ‘రాజన్న’లో సన్నివేశాల్ని తీశాడు అంటూ ఆయన్ను మెచ్చుకున్నాడు. ‘రాజన్న’ చిత్రం సక్సెస్‌మీట్‌ ఆదివారం రాత్రి మాదాపూర్‌లో ‘ఎన్‌’ కన్‌వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాజన్న కథను విజయేంద్రప్రసాద్‌ చాలా కష్టపడి ప్రణాళికప్రకారం జరిపారు. 70 సంవత్సరాల ఏజ్‌లో చాలా చురుగ్గా పనిచేశారు. చాలా ఆశ్చర్యపోయాను. రాజమౌళి అయితే.. తననుకున్నది వచ్చేదాకా ఎవ్వరినీ వదలేదు. చండశాసనుడులాంటివాడు. అలాగే నా మేనకోడలు సుప్రియను చాలా ఇబ్బందిపెట్టాను.. నిర్మాతగా ఆమె ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించింది అన్నారు.
ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ… తెలుగులో ఒకప్పటి సావిత్రి, సూర్యకాంతంలాంటి నటీమణులు నేడు లేరేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు బాలనటి యాని రూపంలో వచ్చింది. రాజన్నలో ఆమె నటించిన తీరు అబ్బురపర్చింది. ఇకపోతే… నేను ఈ సినిమాలో రెండు ఫైట్లకు దర్శకత్వం వహించాను. కానీ అంతా రాజమౌళి ముద్ర ఉందని అన్నారు. నేను ఆయన కొడుకును. ఆయన నాకంటే ముందు దర్శకుడు అవ్వాల్సింది. కానీ అవకాశం నాకు ముందు వచ్చింది. అందుకే ఆయన నాకు స్ఫూర్తి‌… ఆయన ముద్రే నాపై ఉంది అన్నారు.

ర‌మ్యభార‌తి క‌థ‌ల‌పోటీ విజేత‌లు వీరే..


బోర్డర్‌ని దాటేసిన స‌చిన్‌టెస్ట్ క్రికెట్‌లో అస్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ రికార్డును భారత క్రికెట్ సంచలనం సచిన్ టెండూల్కర్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్‌లో బోర్డర్ నమోదు చేసిన 64 అర్ధ సెంచరీల రికార్డును సచిన్ తిరగరాశాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సచిన్ 65 అర్ధ సెంచరీని సాధించాడు. ప్రస్తుతం సచిన్ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అన్నా దీక్షకి ఫీవ‌ర్ అడ్డమా..?


ప‌టిష్ఠమైన లోక్‌పాల్ బిల్లుకోసం అన్నా హ‌జారే దీక్ష చేయ‌డానికి పూనుకున్నారు. అయితే.. గ‌త కొద్ది రోజులుగా అన్నా ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే.. త‌న అనారోగ్యాన్ని కూడా లెక్కచేయ‌కుండా  అన్నా హజారే మూడు రోజుల దీక్షను మంగళవారం ముంబైలో ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేలవమైన లోక్‌పాల్ బిల్లుకు నిరసనగా హజారే మూడు రోజుల దీక్షను చేపట్టనున్నారు. దీక్ష కోసం సోమవారం రాత్రి రాలేగావ్‌సిద్ధి నుంచి ముంబైకి చేరుకున్నారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షను చేపట్టేందుకే మొగ్గు చూపారు. బాంద్రా సబర్బన్ నుంచి ర్యాలీ నిర్వహించి, ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. జుహూలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి ముందుకు సాగనున్నారు. హజారే ర్యాలీ శాంతాక్రజ్, తులిప్ స్టార్ హోటల్, మితిబాయి కాలేజి, ఎస్‌వీ రోడ్, విలే పర్లే, ఖర్, బంద్రా హైవేలలో నిర్వహించనున్నారు.

నిర‌స‌న‌ల మ‌ధ్య బాబు టూర్‌..


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణ వాదులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరుబాట యాత్రను మంగళవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ యాత్రను అడ్డుకుని తీరుతామని తెలంగాణ వాదులతో పాటు తెరాస నేతలు హెచ్చరించారు. ఏది ఏమైనా యాత్ర జరిగి తీరుతుందని తెదేపా శ్రేణులు ప్రకటించాయి.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు యాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గం లంబాడిపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెడతారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. సీతారాంపూర్, ములకనూరు, మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామాల మీదుగా నుస్తులాపూర్‌కు యాత్ర చేరుకుంటుందని వివరించింది. సాయంత్రం 5 గంటలకు నుస్తులాపూర్‌లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపింది.
ఇదిలావుండగా, తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయకుండా రెండు కళ్ల వాదం, తటస్థ సిద్ధాంతమంటూ నాలుక మడతపెట్టే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును ఇక తెలంగాణలో తిరుగనీయకూడదు… జై తెలంగాణ అంటేనే చంద్రబాబును తెలంగాణ జిల్లాలో తిరుగనిస్తామని తెలంగాణ జేఏసీ, తెలంగాణవాదులు విస్పష్టంగా పిలుపునిచ్చారు.

దీక్షకు రెడీ అవుతున్న కేసీఆర్‌..?


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు తనపై వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకునో, లేక వ్యూహాత్మ కంగానో వాటిని తిప్పికొట్టడానికో తెరపైకి ప్రముఖంగా వచ్చారు. ఒక డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత మళ్లీ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ప్రకటించారు. వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నామే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని నిలిపివేయలేదని ఆయన స్పష్టం చేశారు.తెలుగుదేశం నేతలు కుక్కల కంటే హీనమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అవసరమైతే మరోసారి ఆమరణ దీక్ష చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే పరిస్థితులు మళ్లీ తీవ్రం అవుతాయా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.సకల జనుల సమ్మె కారణంగా తెలంగాణ ఉద్యమం కొంత దెబ్బ తిన్నదని చెప్పాలి. సకల జనుల సమ్మె వ్యూహ రీత్యా సరైనదే అయినా, దానిని సకాలంలో విరమిస్తున్నట్లు ప్రకటించినా ఉద్యమ నేతలకు పేరు వచ్చేది. అలా కాకుండా జనం నష్టపోయినా ఫర్వాలేదన్నట్లు వ్యవహరించడంతో దెబ్బతిన్నారు. ఈ నేపధ్యంలో కెసిఆర్ మళ్లీ ఆమరణ దీక్ష చేస్తానంటున్నారు. మరి ప్రజలలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.