25, నవంబర్ 2013, సోమవారం

వేపపళ్లతో వ్యాపారం, ఓ ఆట

ప్రసాద్ తుర్లపాటి చక్కని విషయం గుర్తుచేశారు. జొన్న కాండం ఎండితే దాన్ని చొప్ప అంటారు. అది చాలా పెళుసుగా ఉంటుంది. ఒక కణుపు నుంచి మరో కణుపు వరకు విరగ్గోడితే, గోరుతోనే చొప్ప దంటు పై భాగాన్ని నాలుకబద్దల్లా విడగొట్టవచ్చు. అప్పుడు లోపల తెల్లటి బెండు ఉంటుంది. అదే సాప్ట్ గా ఉండే మేటిరియల్. గుండ్రటి స్తంభాల్లా ఉండే ఈ బెండునీ, నాలుకబద్దల్లా వచ్చే పై పొలుసులను వాడుతూ మేమంతా సమ్మర్ లో రావులపాడు వెళ్ళినప్పుడు చిన్నసైజు బండి, నాగలి, ఫ్యాన్ వంటి బొమ్మలు చేసేవారం. అదో సరదా. అంతేకాదండోయ్. ఎండాకాలం పండిన వేపపళ్లు చెట్టుమీద నుంచి రాలి కింద పడితే వాటిని ఏరుకుని సరదాసరదాగా మామిడిపళ్ల వ్యాపారం (వేపపళ్లతో) చేసేవాళ్లం. వేపపళ్లు కాస్తంత తియ్యగా ఉంటాయి. ఎప్పుడైనా తిన్నారా ? వేపపళ్లు తింటే పిచ్చి రాదు , ఇదీ నా గ్యారంటీ. తియ్యటి గుజ్జుతో తింటుంటే భలే గమ్మత్తుగా ఉంటాయి. కాస్తంత చేదుకూడా కలుస్తుంది. ఇలా తినడం వల్ల కడుపులోని నులిపురుగులు పోతాయని మా అమ్మ (స్వరాజ్యలక్ష్మి) చెబుతుండేవారు. ఇలా సమ్మర్ లో వేపపళ్లతో వ్యాపారం ఆట ఆడటంవల్ల మాకు బోలెడంత కాలక్షేపం. పైగా నాలెడ్జీ (వ్యాపారం ఎలా చేయాలన్న) వచ్చేసిందని నమ్మేశం. అలా నమ్మేసి వ్యాపారం పెట్టి చేతులు కాల్చుకోవడం కూడా జీవితంలో ఓ సరదానే.