రైల్వే బడ్జెట్ - ఎవరికి మేలు?

  నెలంతా ఇల్లు గడవాలన్నా, బతుకుబండి సాఫీగా సాగాలన్నా, బడ్జెట్ చూసుకోవాల్సిందే. లెక్కాపత్రం లేకుండా ఎడాపెడా ఖర్చుపెట్టేస్తే, చివరకు అప్పుల తిప్పలు తప్పవు. ఇంటి పరిస్థితి అయినా, దేశం పరిస్థితి అయినా ఒకటే. అందుకే బడ్జెట్ల సీజన్ రాగానే అందరి చూపు అటే పడుతుంది.
కేంద్ర బడ్జెట్ కు ముందు దూసుకురాబోతున్న రైల్వే బడ్జెట్ పై సగటు ప్రయాణీకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసారి రైల్వే బడ్జెట్ ఎలా ఉండబోతున్నది. పొగ బండి, సెగలు కక్కుతుందా, లేక సామాన్యుడి కంటనీరు తుడుస్తుందా?
`బతుకు బండిని నడిపేది రైలు బండి...' అంటూ పాటలు కూడా ఉన్నాయి. ఇది నిజమే. మనదేశ పౌరుల జీవనస్థితిగతులు తెలుసుకోవాలంటే ఒక్కసారి రైలెక్కితేచాలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టే, పొగలు, సెగలు కక్కుతున్న రైల్వే బడ్జెట్ పై మరోసారి అందరి చూపు పడుతోంది. ఈసారి రైల్వే బడ్జెట్ లో మనరాష్ట్రానికి ఒరిగేదేమిటి? కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా, మన రాష్ట్రానికి నామమాత్రపు కేటాయింపులే ఎందుకు దక్కుతున్నాయి?
`కేంద్రంలో మంత్రిపదవి ఆఫర్ వస్తే ఏ శాఖ కావాలంటారు' అని మీరు ఎవరైనా ఎంపీని అడగండి.... రైల్వే శాఖ అని ఠక్కున చెబుతారు. అంతేమరి.. అదైతే కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. నచ్చినన్ని ప్రాజెక్ట్‌లు సొంత రాష్ట్రానికి కేటాయించుకోవచ్చు. అక్కడ పలుకుబడి పెంచుకోవచ్చు. ఇప్పటివరకూ రైల్వే మంత్రులుగా పనిచేసినవారి తీరుతెన్నులు గమనిస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. నెహ్రూ హయాంలో రైల్వేశాఖ చూసిన లాల్‌బహదూర్ శాస్త్రి.. తన హయాంలో జరిగిన ఓ ప్రమాదానికి బాధ్యత వహించి ఏకంగా రాజీనామా చేశారు. ఆయనంత ధైర్యం ఇప్పటి రైల్వే మంత్రులకు ఉందా?
హంగూ, ఆర్భాటం, ఆదాయం అన్నీ ఉన్నాయి. కానీ.. అసలైంది... అభివృద్ధే కరవైంది. విజయవాడ రైల్వే డివిజన్ గురించి ఇంతకన్నా ఎక్కువగా చెప్పక్కరలేదు. మన రాష్ట్రంలో ముఖ్యమైన జంక్షన్... ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే జంక్షన్ కూడా ఇదే. దీనికి ఇంత ప్రాముఖ్యత ఉన్నా ఏం ప్రయోజనం? రైల్వేశాఖకు మాత్రం కేవలం దీని నుంచి వచ్చే డబ్బుమాత్రమే కావాలి. అందుకే కొత్త ప్రాజెక్టులు, లైన్లు, సదుపాయాల సంగతే మరిచిపోయింది.
రాష్ట్రానికి ఉక్కునగరం. రాజధానితో పోటీపడేలా వైభవం. ఎంతో ఘన చరితం. కానీ ఏం లాభం? రైల్వే సదుపాయాల విషయంలో మాత్రం దీని పరిస్థితి దుర్లభం. ఐటీ, పర్యాటక రంగాల్లో దూసుకుపోతున్నా.. స్టేట్‌లోనే ఫేమస్ సిటీగా ఉన్నా... ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతున్నా... దీనిని ప్రత్యేక జోన్‌గా రైల్వే ఎందుకు గుర్తించడం లేదు? ఇది ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యమా? విధానపరమైన లోపమా? మన పాలకుల అసమర్థతా? ఏంటి దీనికి కారణం?
కాజీపేట జంక్షన్.. ప్రత్యేక డివిజన్‌గా మారేదెప్పుడు? ప్రారంభించిన పనిని పూర్తిగా చేసే పద్దతి రైల్వేశాఖకు ఎప్పుడు అలవాటు అవుతుంది? వివిధ ప్రాంతాల్లో కొత్త లైన్లకు ఎప్పటికి మోక్షం లభిస్తుంది? ఖమ్మం జిల్లాలో రైల్వే పనుల పరిస్థితి చూస్తే గుండె రగిలిపోతుంది. గుంతకల్లు రైల్వే డివిజన్ పై అధికారులకు కనికరం లేకుండా పోతోంది. రైల్వే మంత్రికి బెంగాల్‌పై అమ్మప్రేమ.. మనపై సవతి ప్రేమ ఎందుకు? మనం ఏం అన్యాయం చేశాం? ఇంతకీ రైల్వే ఛార్జీలు పెరగబోతున్నాయా?
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది కాజీపేట జంక్షన్ పరిస్థితి. వరంగల్ జిల్లాలో కాజీపేటను... ప్రత్యేక డివిజన్‌గా మార్చాలని ఎప్పటినుంచో నోరెండిపోయేలా అడుగుతున్నా.. కాళ్లరిగేలా తిరుగుతున్నా... బస్తాల కొద్దీ వినతులు సమర్పించినా ప్రయోజనం శూన్యం. దీన్ని డివిజన్ చేస్తే కోట్లకొద్దీ ఆదాయం వస్తుంది అని నెత్తీనోరు కొట్టుకుని మరీ చెబుతున్నా.. వినే నాధుడేడి? వీటికే దిక్కులేదు. డోర్నకల్-కొవ్వూరు, మణుగూరు-రామగుండ లైన్ల పరిస్థితి గురించే ఇంకేం చెబుతాం! అయినా ప్రత్యేక లైన్లు, ప్రాజెక్టుల గురించి రైల్వేశాఖ పట్టించుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి?
మీరైతే ఒక పని ప్రారంభించాక దానిని మధ్యలో వదిలేస్తారా? పూర్తి చేస్తారా? మీ సంగతేమో కాని.. రైల్వే శాఖకు మాత్రం ఇది అలవాటే. ప్రాజెక్టుకు ఓకే అనడం, పనులు ప్రారంభించడం, నిధులు లేవని మధ్యలో వదిలేయడం... దానికి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులే సాక్ష్యం. కరీంనగర్-నిజామాబాద్, హైదరాబాద్‌-జగిత్యాల లైన్ల గతి ఇప్పటికే అధోగతే! ప్రస్తుతానికి వీటికే గతిలేదు. ఇక కొత్తవాటి గురించి ఏమని అడగగలం. ఏమని చెప్పగలం?
అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. కాని అడిగినా కూడా పెట్టకపోతే? అది సవతిప్రేమ. పోనీ పెట్టినా... అంతా అరకొర.. అది అప్పుడు కొంత, ఇప్పుడు కొంత. రైల్వే శాఖకు ఇది అక్షరాలా సరిపోతుంది. అన్నివిధాలా కరెక్ట్ అనిపిస్తుంది.  ఖమ్మం జిల్లాలో రైల్వే లైన్ల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వందల కోట్లలో అంచనాలు ఉంటే.. కేవలం ఐదు, పది కోట్లు ఇస్తే ఆ పనులు ఎలా అవుతాయనుకుంది? లాలూకు ఎలాగూ దయలేదు. కనీసం మమతకైనా మమతానురాగాలు లేవా? మన రాష్ట్రంపై ఆమాత్రం ప్రేమ కూడా కరవైపోయిందా?

పేరు గొప్ప- ఊరు దిబ్బలా తయారైంది గుంతకల్లు రైల్వే డివిజన్ పరిస్థితి. మన రాష్ట్రంలో కీలకమైన రైల్వే డివిజన్లలో ఇది ఒకటి. రద్దీగా ఉన్న మార్గాల్లో కొత్త రైళ్లను వేయండి మహాప్రభో! అని వేడుకున్నా... రైల్వే అధికారులకు కనికారం లేకుండా పోయింది. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు రైళ్లను రద్దు చేస్తున్నారు. మళ్లీ వాటిని పునరుద్దరించండి అంటే... చూద్దాం.. చేద్దాం అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? అని ఆవేదనతో కళ్లనీళ్లు పెడుతున్నారు గుంతకల్లు వాసులు.
  వచ్చే రైల్వే బడ్జెట్‌లో రైలు ఛార్జీలు పెరగనున్నాయా? టిక్కెట్ రేట్లు పెంచి ఖజానా నింపుకునే ధైర్యం మమతకు ఉందా? త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. అలాంటప్పుడు.. ఇలాంటి పెంపు విషయాలను రైల్వే శాఖ ఎంతవరకూ అనుమతిస్తుంది? అందులోనూ ఆరోవేతన సంఘం సిపార్సులతో ఇప్పటికే సతమతమవుతోంది. ఇలాంటప్పుడు మమత స్ట్రాటజీ ఏంటి? ఈ సమస్యను ఎలాంటి పరిష్కారం చూపనున్నారు? రైల్వేలకు ఎలా లాభాలను తీసుకురాబోతున్నారు? ఏం మంత్రం వేయబోతున్నారు? ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు?
డీజిల్ మోత....పెట్రోల్ వాత... అయినా రైల్వే ఛార్జీలు మాత్రం పెద్దగా పెంచడంలేదు. ఇది నిజానికి ఊరట కలిగించే విషయమే. అయితే, కొత్త ప్రాజెక్టుల కేటాయింపులు మాత్రం రైల్వే మంత్రిగారి మ్యాజిక్కే. సొంత ఊరికి, సొంత రాష్ట్రానికి ప్రాజెక్టులను పరుగులుపెట్టిస్తుంటే, మిగతా రాష్ట్రాల వాళ్లు నోరువెళ్లబెట్టాల్సిందే. అందరికి సమన్యాయం అన్న రాజ్యాంగ స్పూర్తిని తుంగలోకి తొక్కేస్తున్న వారిని నిలదీయాలి...కడగేయాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!