సెల్ రేడియేషన్ - పక్షులకు యమగండం

కాకితో కబురుపెడితే చాలు వచ్చి ఇంట్లో వాలిపోతాడు - అంటూ దురపు బంధువులపై చురకలేయడం మనకు తెలిసిందే. పావురాలతో ప్రేమికులు తియ్యటి సందేశాలను పంపుకోవడం కథల్లో కనబడుతూనే ఉంటుంది.
హంసరాయబారాలు, చిలుక రాయబారాలు ప్రబంధాల్లో ఉండనే ఉన్నాయి. కొత్త దంపతుల సంసారాన్ని పోల్చాలన్నప్పుడు చిలకా గోరింకలనో, లేదా పిచ్చుకలతోనూ పోలుస్తుంటారు. మానవ జీవితాలతో ఇంతగా మమేకమైన పక్షులకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చేసింది.
 ప్రకృతి శాపాలను, కోపాలను తట్టుకుంటూ బతుకు లాగిస్తున్న పక్షులకు మానవ తప్పిదాలు కూడా తోడయ్యాయి.  వేటాడే హంతకులను నుండి పక్షులు తప్పించుకోవచ్చేమోకానీ, అంతకంటే సైలెంట్ కిల్లర్స్ గా తిరగాడుతున్న హంతకుల నుంచి మాత్రం అవి తప్పించుకోలేకపోతున్నాయి.
 ఇంచుమించుగా ప్రతి ఒక్కరి వద్ద సెల్ ఫోన్లు ఉంటున్నాయి. అవన్నీ రేడియేషన్ విడుదల చేస్తూనే ఉంటాయి. రేడియేషన్ తరంగాలు మన కంటికి కనిపించకపోవచ్చు. కానీ అవి చేసే హానీ అంతాఇంతాకాదు.
సెల్ టవర్స్ నుంచి నిరంతరాయంగా రేడియేషన్ తరంగాలు విడుదలవుతూనే ఉంటాయి. ఆమాటకొస్తే, కనిపించని ఈ తరంగ పౌనఃపున్యాలు రేడియో టవర్స్ నుంచీ అలాగే టివీ టవర్స్ నుంచి కూడా వెలువడుతూనే ఉంటాయి.
   .హైఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం అనాలసిస్ ఇది. రేడియేషన్ ప్రభావం రేడియో స్టేషన్, టివీ టవర్స్ నుంచి కంటే, సెల్ టవర్స్ నుంచి వెలువడుతున్నదే చాలా ఎక్కవగా ఉంది. సెల్ టవర్ కు సమీపంలో ఉన్న ప్రాంతాలు ఎంతగా రేడియేషన్ కు ప్రభావితమవుతున్నాయో చాలా స్ఫష్టంగా చూడవచ్చు. సెల్ టవర్ ఉన్న చోటునుంచి మొదటి ఆరు నుంచి పది మీటర్ల దూరాన్ని డేంజరస్ జోన్ గా చెప్పుకోవచ్చు.
 సెల్ టవర్ నుంచి మొదటి వందమీటర్ల దూరందాకా రేడియేషన్ ప్రభావం ఎక్కువగానే ఉంటున్నది. యాంటినా ఉన్న వైపు మరింత శక్తివంతమైన రేడియేషన్ ఉన్నట్టు తేలింది. యాంటినాలకు వ్యతిరేక దిశలో కొంతలో కొంత ఈ రేడియేషన్ ప్రభావం తక్కువగానే ఉన్నదని విశ్లేషకులు చెబ్తున్నారు.
   అంతటి భయంకరమైన రేడియేషన్ ప్రభావం మనపైనేకాదు, పశుపక్షాదులపైన కూడా పడుతూనే ఉంది. మౌనంగా అవి రోదిస్తున్నాయి. విహంగాల విలాపానికి ప్రత్యక్షంగా మనమే కారణం అవుతున్నాం. సెల్ టవర్స్ వచ్చాక వందలాది పక్షులు నేలరాలిపోతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు అందిపుచ్చుకున్నామంటూ మనం తెగ సంబరపడిపోతున్నాం. కానీ, అవే పక్షులపాలిట యమపాశాలయ్యాయి. ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ వల్ల కనిపించని విషం సర్వత్రా కమ్ముకుంటోంది.
   తేనెటీగలు చాలా తెలివిగలవి. సంతోషాన్నీ, విషాదాన్ని చాలా చక్కగా వ్యక్తీకరించగలవు. బోలెడంత తేనే దొరికితే, ఆ తేనెను పట్టులో దాచగలిగితే అవి ఎంతగానో సంతోషిస్తాయి. పూలనుంచి సేకరించిన మకరందాన్ని తెట్టులోని గదుల్లో ఓ క్రమపద్ధతిలో నిల్వచేయగల సత్తా వాటికి ఉంది. ఎక్కువ తేనె సేకరిస్తే వాటికి పండగ వచ్చినట్టే, అప్పుడే అవి డాన్స్ చేస్తాయి.  ఎప్పుడు తెల్లవారుతుందో, ఏ దిశలో విరబూసిన పూలు ఉంటాయో కూడా తేనెటీగలు తేలిగ్గా గుర్తించగలవు. మిగతా వాటికి దిశానిర్దేశం కూడా చేయగలవు. అలా, అలా... తేనెటీగలు పూలమీద చేరతాయి.
మకరందాన్ని సేకరించిన తరువాత తిరిగి తెట్టుకు చేరుకునే సమయంలోనే వాటికి కష్టాలువచ్చిపడ్డాయి. ఈ కష్టం అక్షరాలా మానవుని తప్పిదాల వల్ల మొలకెత్తిందే....
  పక్షులేకాదు...తేనెటీగలు కూడా రేడియేషన్ ప్రభావానికి గురై దారితప్పిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
రేడియేషన్ పెరిగిపోవడంతో తేనెటీగలు దారిమరచిపోతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
  సెల్ టవర్స్ నుంచీ, ఇంకా ఇతరత్రా వచ్చే మైక్రోవేవ్స్ వల్ల తేనెటీగల మెదడు మొద్దుబారిపోతుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంగానే అవి దారిమరచిపోతున్నాయట. అందుకే క్షేమంగా ఇళ్లకు చేరలేకపోతున్నాయి. ఫలితంగా తేనె తెట్టులో తేనె నిండుకోవడంలేదు. ఫలితంగా తేనె దిగుబడి తగ్గిపోతోంది.
కంటిముందు కనిపించేవాటిని అతిగా పట్టించుకుంటూ, కంటికి ఆనని వాటిని నిర్లక్ష్యంగావదిలేయడం ఏమాత్రం మంచిదికాదు. అలాంటిదే ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా. రేడియోధార్మిక తరంగాలు, అయస్కాంత తరంగాలు వంటి మైక్రోవేవ్స్ కూడా ఒక్కోసారి మేలుకంటే కీడే ఎక్కువ చేస్తుంటాయి. సెల్ టవర్స్ , శాటిలైట్స్ ఇంకా అనేక వాటి నుంచి నిరంతరాయంగా రేడియోధార్మికత ప్రసరితమవుతోంది.
 ఇలాంటి తరంగాల ప్రభావం మానవులమీదనేకాదు, జంతుజాలంమీద కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవసరాల కోసం మనం ఏర్పాటుచేసుకునే సౌకర్యాలు జీవుల పాలిట శాపంగా మారిపోతున్నాయి.మరి ఈ పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలో ఓసారి ఆలోచించండి...ప్లీజ్...
- తుర్లపాటి నాగభూషణరావు
98852 92208
nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!