31, మార్చి 2011, గురువారం

ఎమ్ సెట్ మే 22 కి వాయిదా

కడప ఉప ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగవలసిన ఎమ్ సెట్ పరీక్షను ప్రభుత్వం మే ఇరవై రెండో తేదీకి వాయిదా వేసింది. మే ఎనిమిదో తేదీన ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్ సెట్ తేదీని మార్చవలసి వచ్చింది.

సాక్షి సీఈఓ రామ్‌కు ప్రచారబాధ్యతలుసాక్షి టివి ఛానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ రామిరెడ్డి అలియాస్ రామ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచార బాధ్యతలు చేపట్టబోతున్నారా? సాక్షి మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న రామ్‌ ప్రచార వ్యూహాల్లో దిట్టగా పేరు పొందారు. ఆయనకు యాడ్ ఏజేన్సీని సక్సెస్‌ఫుల్‌గా నడిపిన అనుభవం కూడా ఉంది. సాక్షి టివి, పత్రికలను పెట్టిన తర్వాత రెండింట్లో కూడా ఆయన తనపాత్రను పోషిస్తున్నారు, సాక్షి దినపత్రికలో ఫ్యామిలీ పేజీని సక్సెస్‌ చేశారన్న పేరు ఆయనకు ఉంది. అలాగే టివిలో కూడా ప్రత్యేకకార్యక్రమాలు నడుపుతూ ఉంటారు. అందర్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడేతీరు , ప్రచార మెళుకువలు బాగా తెలిసిన వ్యక్తిగా గుర్తింపు ఉన్న దృష్ట్యా ఆయన్ను రాజకీయ అవసరాల కోసం ప్రత్యేకించి పార్టీ ప్రచారం కోసం వినియోగించుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే రామ్ మీడియా రంగాన్ని వదిలి, రాజకీయ ప్రచార రంగానికి వెళ్తారా అన్న చర్చ మీడియా వర్గాల్లో జరుగుతుంది. అయితే వైఎస్‌కు వీరాభిమానిగా ఉండే రామ్‌ ఈ బాధ్యతను సవాల్‌గా తీసుకోవచ్చని కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా రాజకీయాల్లోకి దిగి ఈ బాధ్యతలు నిర్వహిస్తారా లేక కేవలం వృత్తిపరంగా ప్రచార ప్రకటనలు తయారు చేయడం, నేతల స్పందన విషయంలో సలహాలివ్వడం తదితర ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతారనేది తేలాల్సి ఉంది.

మాజీమంత్రి జెసి కొత్త ఫిటింగ్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భూ కేటాయింపుల విషయంలో జాగ్రత్తగా అడుగు వేస్తూ ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలని భావిస్తుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆయనకు చుక్కెదురు అవుతోంది.భూకేటాయింపులపై సభా కమిటీని వేస్తామని కాని, అన్నిటికి వర్తింప చేస్తే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి ఆటంకం కలుగుతుందని శాసనసభలో కిరణ్ చెప్పారు. కొన్ని నిర్దిష్టమైన కేసులలో సాక్ష్యాధారాలు ఉంటే వాటిపై కమిటీ వేయడానికి సిద్దమేనని అంటూ ఆ బాద్యతను ఉప సభాపతికి అప్పగిస్తున్నామన్నారు. కిరణ్ తాను వై.ఎస్. రాజశేఖరరెడ్డికి వ్యతిరేకం కాదన్న భావన కలిగించడానికి యత్నిస్తూనే, ఆయన హయాంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. అసలు ఈ సభా సంఘం ఎలా ఉంటుందో,ఏమి పరిశీలిస్తుందో తెలియక ముందే ఇది వివాదంగా మారింది. వై.ఎస్. జగన్ ఇప్పటికే ఇది కాంగ్రెస్ , టిడిపి కలిసి చేస్తున్న కుట్ర అని ద్వజమెత్తితే, కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి కొత్త పిటింగ్ పెట్టారు.1994 నుంచి ఇప్పటివరకు చేసిన భూ కేటాయింపులపై సభాసంఘాన్ని వేయాలని డిమాండు చేస్తున్నారు.అప్పుడే వాస్తవ విషయాలు బయటికి వస్తాయని ఆయన అన్నారు. ఒకరకంగా జెసి పరోక్షంగా జగన్ చెబుతున్నట్లుగా కాంగ్రెస్, టిడిపిల మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న సంకేతాన్ని ఇవ్వడానికి యత్నిస్తున్నారు.2004 నుంచి 2009 వరకు వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో దివాకరరెడ్డి కూడా మంత్రి గా ఉన్నారు.
ఆ సమయంలో జరిగిన భూ కేటాయింపులకు మంత్రివర్గ సభ్యుడిగా ఆయన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఆయన తెలుగుదేశం హయాంతో సహా మొత్తం పదిహేనేళ్ల కేటాయింపులపై సభా సంఘం విచారణ చేయాలని సూచిస్తున్నారు. ఈ రకంగా ఈ వ్యవహారం రోజుకో వివాదంగా మారుతోంది.
- కొమ్మినేని

జై ఆంద్రా కృష్ణ...పలుకవేమిరా...?

అప్పుడు జై ఆంధ్రా అన్న సినీ నటుల్లో చాలామంది ఇప్పుడెందుకు సమైక్య రాగం అందుకున్నారో ఓసారి ఆలోచించాలి. హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టడంతో నాడు జైఆంధ్ర ఉద్యమానికి ఊపిరిలూదిన నాటి నాయకులు, సినీనటులు నేడు కనీసం ఆ మాట ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడటంలేదు. అందుకే మౌనముద్రవేసుకుని మూలన కూర్చున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
 మిగతా నటుల సంగతి ఎలా ఉన్నా, ఇంతటి మహోద్యమం జరుగుతుంటే సూపర్ స్టార్ కృష్ణ మౌనంగా ఎందుకు ఉంటున్నారు?  నాడు జై ఆంధ్రా అంటూ స్పష్టమైన ప్రకటన చేసిన కృష్ణ ఇప్పుడు ఎందుకని పెదవి విప్పడంలేదు? దీనికి కారణాలు ఏమిటో చెప్పండి...
(ఈ సందర్భంగా జైఆంధ్రా ఉద్యమం జరిగినప్పుడు తెనాలిలోని టౌన్ వైడ్ కృష్ణ కల్చరల్ యూనిట్ విడుదల చేసిన ఓ పోస్టర్ ని ఓసారి చూడండి...)

పులివెందుల నుంచి కాంగ్రెస్ తప్పుకున్నట్లేనా?


పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తన అభ్యర్దిని రంగంలో దించాలా?వద్దా అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతోంది.మేనెల ఎనిమిదో తేదీన కడప లోక్ సభ , పులివెందుల శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వై.ఎస్‌.విజయలక్ష్మి పోటీచేయనున్నారు. వారికి ప్రత్యర్దులుగా ఎవరిని నిలపాలన్నదానిపై కాంగ్రెస్ లో తర్జనభర్జనలు పడుతోంది. రాజశేఖరరెడ్డిపై గౌరవంతో ఈసారి కూడా పులివెందులలో ఆయన భార్యకు పోటీ పెట్టకుండా వదిలేస్తే ఎలా ఉంటుదన్నదానిపై ఆలోచన సాగుతోంది.కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు సూచనప్రాయంగా వెల్లడించారు. దానిని నిజం చేసే దిశగానే అడుగులు పడుతున్నాయని అంటున్నారు
    అయితే ఇది కాంగ్రెస్, జగన్ పార్టీల మేచ్ ఫిక్సింగ్ అని టిడిపి ఆరోపించడానికి సిద్దమవుతోంది.అయినప్పటికీ తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవలసింది జగన్ పోటీచేస్తున్న కడప లోక్ సభ నియోజకవర్గంపై అని కాంగ్రెస్ నాయకత్వం అబిప్రాయపడుతోంది. కాగా జగన్ పై పోటీచేయడానికి ఉర్రూతలూగుతున్న తప అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని వెంటబెట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి ముఖ్యమంత్రిని గురువారం నాడు కలిశారు. పులివెందులలో పోటీచేయకపోవడం వల్ల లాభం కలుగుతుందా? లేదా అన్నదానిపై కాంగ్రెస్ అంచనా వేస్తోంది.పులివెందులలో ఎటూ గెలిచే అవకాశం తక్కువ కనుక ఆ విధంగా చేస్తే రెండు విధాలుగా ఉపయోగం ఉంటుందని కొందరు నేతలు అబిప్రాయపడుతున్నారు.పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కడప జిల్లా నేతలతో చర్చించి ఆయన ముఖ్యమంత్రితో కలసి అదిష్టానంతో కూడా మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటారు.

క్యాలెండర్ మ్యాజిక్...1983, 2011 ఒకేలా ఉన్నాయ్

శతాబ్దాలు, దశబ్దాల క్యాలెండర్లు తిరగేస్తుంటే కొన్ని అద్భుతాలు కనబడుతుంటాయి. ఇప్పుడు అలాంటి అద్భుతమే ఒకటి ఆవిష్కృతమైంది. 1983 క్యాలెండర్, 2011 క్యాలెండర్ ఒకేలా ఉన్నాయట. ఎందుకని అంటారా....క్యాలెండర్ మ్యాజిక్ సంగతేమోకానీ, ఓ, క్రికెట్ అభిమానిమాత్రం ఇలా వివరణ ఇచ్చారు....
1983 - వరల్డ్ కప్ ను గెల్చుకున్న సంవత్సరం
2011 - మళ్లీ మనం వరల్డ్ కప్ ను గెల్చుకోబోతున్న సంవత్సరం.
ఈ మ్యాజిక్ ఫలించాలని కోరుకునేవారంతా తప్పకుండా మీ విషెష్ తెలియజేయండి...చక్ దె ఇండియా...
కవితకు ఉత్తమ మీడియా మహిళా లైబ్రేరియన్ అవార్డు


 టివీ 5లో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న చింతమనేని కవిత కుమారికి ఉత్తమ మీడియా మహిళా లైబ్రేరియన్ అవార్డు దక్కింది. ఇటీవల హైదరాబాద్- అమీర్ పేట లోని హోటల్ సితారలో జరిగిన సర్ సివీ రామన్ అకాడమీ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ సభలో కవిత కుమారి ఈ పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి శంకర్ రావు చేతులమీదగా అందుకున్నారు.30, మార్చి 2011, బుధవారం

మధుయాష్కీ ఫ్యామిలీవి నకిలీ సర్టిఫికెట్లేనా?


నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధుయాష్కీ కుటుంబసభ్యులు కొందరు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో అమెరికా వీసాలు సంపాదించినట్లుగా పోలీసులు నిర్దారించారు. మధుయాష్కీ సోదరులు వివేకనందా యాష్కీ, సుధాకర్ యాష్కీ, సోదరి అమరజ్యోతిలు ఈ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులు చేసిన దర్యాప్తు నివేదికలోని అంశాలను డెక్కన్‌ క్రానికల్ ప్రచురించింది. ఆ వివరాలు ప్రకారం దర్యాప్తు అధికారి గుల్బర్గా, కాకతీయ యూనివర్శిటీలకు సిబ్బందిని పంపి యాష్కీ కుటుంబసభ్యుల డిగ్రీ సర్టిఫికెట్ల వాస్తవికతపై పరిశోధన చేయించారు. గుల్బర్గా యూనివర్శిటీ రిజిస్ట్రార్, కాకతీయ వర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలాయి. వివేకనందయాష్కీ, అమరజ్యోతిలు నకిలీ ఇంజనీరింగ్ డిగ్రీలు, సుధాకర్ బిఎస్సీ నకిలీ ఢిగ్రీని ఢిల్లీలోని అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్‌కు హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధుయాష్కీ కుటుంబసభ్యుల దొంగ సర్టిఫికెట్లపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు 2008 జనవరి 4 న ఫిర్యాదు చేశారు. తదుపరి డిజిపి హైదరాబాద్ పోలీస్‌కు ఆ కేసును రిఫర్ చేయగా, సిసిఎస్ ఆ కేసును దర్యాప్తు చేసింది. విశేషమేమిటంటే 2008 ఫిబ్రవరి 22నాటికే దర్యాప్తు పూర్తయినప్పటికీ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో గోనె ప్రకాశరావు హైకోర్టును ఆశ్రయించగా వాస్తవపరిస్థితిని తెలియజేయాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసుతో తనకు సంబంధం లేదని మధుయాష్కీ అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్యభూమిక పోషిస్తూ కొందరు కాంగ్రెస ఎంపీల పైనే తీవ్రస్థాయి ఆరోపణలు చేసే మధుయాష్కీకి ఇది ఇబ్బందికర పరిస్థితి. మధుయాష్కీకి ఈ కేసుతో సంబంధం ఉన్నా లేకపోయినా తన స్వంత కుటుంబసభ్యులే ఈరకమైన మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడవడంతో ఆయన కూడా సంజాయిషీ ఇచ్చికోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- కొమ్మినేని

వివేకా బాధకు అసలు కారణం ఇది...!!

దివంగత నేత వైఎస్ సోదరుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వివేకానంద రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.  బుధవారం ఉదయం వివేకా ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని కలసి తన రాజీనామా లేఖ అందించారు.   నిన్నటితో ఎమ్మెల్సీ గా ఆయన పదవీ కాలం ముగిసింది.
  సోమ వారం అసెంబ్లీ లో జరిగిన ఘటన పట్ల వివేకా విచారం ప్రకటించినా, సభలో కాంగ్రెస్ మంత్రులు ,సభ్యులు తనకు మద్దతుగా నిలవ లేదని వివేకా   ఆగ్రహం తో వున్నట్టు తెలుస్తోంది. అలాగే మంగళ వారం కూడా సభలో వైఎస్ పై టీడీపీ విమర్శలు చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు .వైఎస్ సర్కార్ తో తమ కెలాంటి సంబంధం లేనట్టు కిరణ్   కాబినెట్ సభ్యులు వ్యవహరించిన తీరు  వివేకాకు బాధ కల్గించి నట్టు  సమాచారం. అలాగే భూ కేటాయింపులపై సభా సంఘం వేయడం పట్ల కూడా వివేకా గుర్రుగా వున్నారని అంటున్నారు   .ఈ నేపధ్యం లోనే ఆయన   రాజీనామా చేసినట్టు చెబుతున్నారు .గవర్నర్ కోటా క్రింద వివేకకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని వార్తలు వచ్చిన క్రమం లో ఆయన  రాజీనామా చేయడం తో ఇప్పుడేమి జరుగుతుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి .
-jaijainayaka

నూటొక్క జిల్లాల అందగాడు ఇక కనబడడు

‘దేశం చాలా క్లిష్ట పరిస్థితి ఉంది’, ‘ ఫాదరీ ఫాదరీ ‘ , ‘ దేవుడో దేవుడా ‘  అనే డైలాగ్స్ ఒకప్పుడు ప్రేక్షకులు తెగ చెప్పుకునేవారంటే  నూతన్ ప్రసాద్  గారు ఆ డైలాగ్స్ చెప్పిన శైలి అటువంటిది.  విభిన్నమైన నటనతో  ప్రేక్షకుల మనసు దోచుకుని వారితో నూటొక్క జిల్లాల అందగాడుగా పిలిపించుకున్న  విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ ఈరోజు (30-03-2011) కన్నుమూశారు. అయన మరణం సినీ పరిశ్రమకు , ప్రేక్షకులకు తీరనిలోటు.  నూతన్ ప్రసాద్ గారి అసలు పేరు తాడినాడ దుర్గా సత్య వరప్రసాద్. వారి స్వగ్రామం  కృష్ణాజిల్లా కైకలూరు. 38 సంవత్సరాల సినీ జీవితం లో అయన ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు.  1973 లో వచ్చిన అందాల రాముడు సినిమాతో ఆయన చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.  ఆ తర్వాత అనేక సినిమాలలో  ప్రతినాయకులలో  ఒకరిగా అయన తన ప్రస్థానం కొనసాగించారు. విభినమైన హాస్యన్ని రంగరించి విలనీ పండించడం లో ఆయనకీ ఆయనే సాటి.  విలన్ గా కమెడియన్ గా నే కాక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అయన రాణించారు. ‘ పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రం లో  ‘దేశం  చాలా క్లిష్ట పరిస్థితి లో ఉంది ‘ అనే డైలాగ్ నొక్కి నొక్కి చెప్పి  జనం చేత ఆ డైలాగ్ పలికించిన ఘనత ఆయనకే దక్కింది.  1980 లో వచ్చిన రాజాధిరాజు  చిత్రంలో సైతాన్ గా ఆయన నటన అద్భుతం . ఆ చిత్రం లో ‘కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి ‘ అనే పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందో వేరే చెప్పనక్కరలేదు. నటుడిగా అయన కెరీర్ తారాస్థాయిలో ఉన్న రోజుల్లో  బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ సందర్భంగా  జరిగిన ప్రమాదం లో ఆయన తీవ్రంగా  గాయపడ్డారు. వెన్నెముక దెబ్బ తినడంతో అప్పటి నుండి ఆయన  వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.  అటువంటి పరిస్థితిలో కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకి సాగి  ఆత్మవిశ్వాసానికి అసలైన అర్ధం చెప్పారు. నడవలేని పరిస్థితిలో కూడా తగిన పాత్రలను ఎంచుకుని తన సినీ ప్రస్థానం కొనసాగించిన ఆయన ఎందరికో స్పూర్తినిచ్చారు.
  నూతన్‌ ప్రసాద్‌ 1945, డిసెంబరు 12న కృష్ణాజిల్లాలోని కైకలూరులో జన్మించారు. ఆయన అసలు పేరు తాడివాడ వరప్రసాద్‌. ఐటీఐ చదివే రోజుల్లోనే నాటకాల్లో పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నూతన్‌ ప్రసాద్‌ తన ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న తొలి బహుమతి 'ఒక దువ్వెన' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నూతన్‌ప్రసాద్‌కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నూతన్‌ కుమార్‌ కూడా నటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు.
 గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నూతన్ ప్రసాద్ ఈ ఉదయం కన్ను మూశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్దిస్తూ వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాం.

జయలలిత కోసం చంద్రబాబు

 
మన రాష్ట్రనేతలు చంద్రబాబు,చిరంజీవి ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో పోటాపోటీగా ప్రచారం చేయబోతున్నారు. శాసనసభ లాబీల్లో చంద్రబాబు, చిరంజీవి ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. తనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమిళనాడు, పాండిచ్చేరిల్లో ప్రచారం చేయాలని కోరిందని, ఆ తరువాత పశ్చిమబెంగాల్‌కు వెళ్తానని చిరంజీవి చెప్పారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ తాను కూడా తమిళనాడు పర్యటనకు వస్తున్నానని, కాకపోతే మీకు వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేయబోతున్నానని వెల్లడించారు, నిజానికి చంద్రబాబుకి తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె నేత కరుణానిధితో మంచి సంబంధాలున్నాయి. ఒకరంటే ఒకరికి పరస్పరం గౌరవం కూడా ఉంది. యునైటెడ్ ఫ్రంట్ హయాంలోనూ , ఎన్డీఎ హయాంలో కూడా వీరు మిత్రపక్షాలుగా జాతీయస్థాయిలో పనిచేశారు, అంతేకాక కరుణానిదికి , ఎన్టీఆర్‌కు కూడా గతంలో స్నేహం ఉండేది, కరుణానిధి స్వయంగా 1987లో జరిగిన విజయవాడ మహానాడులో కూడా పాల్గొని ప్రసంగించారు. కానీ 2004లో బేజేపీతే విబేధించి డిఎంకె కాంగ్రెస్‌వైపు మళ్లడంతో చంద్రబాబుకి కాస్త ఇబ్బందిగా మారి డిఎంకెతో సంబంధాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇక జయలలితతో స్నేహసంబంధాలు అంతంతమాత్రమే. ఒక సందర్భంలో జయలలిత, చంద్రబాబుతో మరికొన్ని చిన్నపార్టీలు సమావేశమై మూడోఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్నా మొగ్గలోనే ముగిసిపోయింది. కారణమేదైనప్పటికీ ప్రస్తుతం జయలలిత చంద్రబాబును తనకు మద్ధతుగా ప్రచారానికి ఆహ్మానించినట్లున్నారు. అక్కడికి వెళ్లి ఆయన డిఎంకెని తిట్టగలుగుతారా అన్న ప్రశ్న కూడా ఉంది. అందుకే బహుశా ఆయన కాంగ్రెస్‌నే టార్గెట్‌గా చేస్తూ ప్రచారం చేయవచ్చు, కానీ జయలలితకు డిఎంకెని, కరుణానిధిని విమర్శించడం అవసరం. మరి చంద్రబాబు ఆ పని చేయగల్గుతారా అన్నది ప్రశ్న.
                                                                                                                           - కొమ్మినేని
                                                                                                                          (kommineni.info)

క్రికెట్ స్నాక్స్

ఓహ్ ....వాటెనైడియా!
..............................................................

కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకునేవారికి శుభవార్త.
నిర్భయంగా మీరు హైదరాబాద్ మెయిన్ రోడ్స్ పై
80 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్లవచ్చు.
ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం.
ఎందుకంటే, ఈరోజు ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్.
మధ్యాహ్నం నుంచి రోడ్లన్నీ ఖాళీ...


ఇండో పాక్ క్రికెట్ - స్నాక్స్


మిత్రుడు: ఏరా మీ ఆవిడ ఇంట్లో కనిపించడంలేదు....ఎక్కడికి వెళ్ళింది...?
ఇంటి యజమాని: నేనే పుట్టింటికి పంపించా...
మిత్రుడు: ఏం...ఎందుకని.... ఏం తప్పుచేసిందట?
ఇంటి యజమాని: అదేంకాదు...ఈవేళ భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ఉందికదా... ఆమె ఇంట్లో ఉంటే సీరియల్స్ కోసం ఛానెల్స్ తిప్పేస్తుంటుంది.నాకేమో, క్రికెట్ లైవ్ వచ్చే ఛానెల్ మారిస్తే నచ్చదు.  అందుకే ఆమెను పుట్టింటికి పంపించా....


29, మార్చి 2011, మంగళవారం

వివేకాకు ఉండవల్లి స్క్పిప్ట్


రాజమండ్రి లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణకుమార్ కు మంచి రాతగాడుగా పేరుంది.నేతలకు లేఖలు రాయడం, ఉపన్యాసాలు రాడం వంటి వాటిలో సిద్దహస్తుడన్న పేరు ఉంది. ఆయన స్వయంగా మంత్రి వివేకానదరెడ్డికి శాసనసభలో ఏమి చదవాలో రాసిచ్చారు. అందుకే ఆయన ఎక్కడా వై.ఎస్. విషయంలో రాజీపడనంటూ మరీ సీరియస్ గా క్షమాపణ చెప్పకుండా రాసుకు వచ్చిన ప్రకటనను చదివి ఊరుకున్నారు.దీనిలో రాజశేఖరరెడ్డి కోసం తమ్ముడు పోరాడుతున్నట్లు ఉపన్యాసం సాగింది.అంతేకాక అన్న ఏమన్నా అంటే ఊరుకోనని కూడా మళ్లీ హచ్చరించే అవకాశం ఉండవల్లి తయారు చేసిన లేఖ ద్వారా కలిగింది. అసలు వివేకానందరెడ్డి ఆవేశపడిన తర్వాత రాజీనామా చేయడానికి సిద్దపడినప్పటికీ ఆసక్తికర పరిణామాల నేపధ్యంలో తన రాజీనామా లేఖను జెబులోనో ఉంచేసుకున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సోమవారంనాడు ఉదయం శాసనసభలో టిడిపి ఎమ్మెల్యేలపై దాడి చేసిన తర్వాత ఆయన నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ ఛాంబర్ లోకి వెళ్లారు. అక్కడ అవసరమైతే రాజీనామా చేస్తానని అన్నారు. అయితే వివేకానంద రెడ్డి బిపితో ఉన్నారని అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి డాక్టర్లను పిలిపించి చికిత్స చేయించారు. సభలో జరిగిన హడావుడిలో వివేకా కాలికి కూడా చిన్న గాయం అయింది. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆయన మంత్రి వట్టి వసంతకుమార్ , ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ లతో కాసేపు సమావేశం అయ్యారు.తదనంతరం వివేకా తన ఛాంబర్ లోకి వెళ్లి పోయి సుమారు రెండు గంటల సేపు విశ్రాంతి తీసుకున్నారు.అనంతరం ఒక జేబులో రాజీనామాల లేఖను కూడా సిద్దం చేసుకుని, మరో జేబులో శాసనసభలో చేయదలిచిన ప్రకటన ప్రతిని కూడా పెట్టుకుని బయటకు వచ్చారు.అయితే అంతలో ఫ్లోర్ లీడర్లు రాజీనామాకు అంతగా పట్టుబట్టడంలేదని, రాజీనామాకు తొందరపడనవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబితే ఆయన రాజీనామా లేఖను బయటకు తీయకుండా విచారం వ్యక్తం చేసే ప్రకటనను మాత్ర చదివి సభలో కూర్చున్నారు. మొత్తం మీద విపక్షాలు గట్టి పట్టు పట్టకపోవడం వల్లనే వివేకానందరెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా పోయిందా?
By: kommineni

28, మార్చి 2011, సోమవారం

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!

బర్నింగ్ కామెంట్రీ - 5
..................................................
                                                                          నగ్న పాచికల జూదం!!   


వయసువెన్నెల్లో
తడిసి మెరిసిన సింగారం
కాసుల కోసం `షార్ట్'కట్స్ లో
వెండితెరపై ఆరేసిన అందం
చూసేవాళ్ల కంటిమీద
గ్యారెంటీగా కునుకు దూరం!
ఇది నేడు హిట్ ల కోసం ఆడే
నగ్న పాచికల జూదం!!

                                                         
                                 -నీల్ కొలికపూడి

వివేకా, ఇంతకీ, కోపిష్టా, శాంతస్వరూపుడా?

 రాష్ట్ర మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి శాసనసభలో ప్రవర్తించిన తీరుపై మానసిక శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయనే చెప్పాలి. ఎప్పుడూ శాంతంగా ఉన్న ఒక మనిషి హఠాత్తుగా రెచ్చిపోతే దాన్ని అంత తేలిగ్గా తీసిపారేయకూడదని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాంతమూర్తి వివేకా అసెంబ్లీలో చెలరేగిపోవడానికి లోతైన కారణాలు ఉంటాయని అనుకుంటున్నారు.
 కడప జిల్లా నేలలోనే పౌరుషం ఉంటే ఉండవచ్చు. వివేకా, రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై ఫ్యాక్షనిస్టుగా ముద్రపడి ఉంటేఉండవచ్చు. కానీ వివేకా మొదటి నుంచీ శాంతంగానే ఉంటున్నారు. అన్న రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ  పరిణామాల కారణంగా వివేకా తన అన్న కుమారుడైన జగన్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫలితంగా ఇంటా బయటా ఆయన తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తీవ్ర వత్తిడికి గురి కావడం వల్లనే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని వైద్యవర్గాలు గుసగుసలాడుతున్నాయి.

 ఇంతకీ ఇదంతా రాజకీయమా, లేక అనారోగ్య లక్షణమా...వెయిట్ అండ్ సీ...
                                                                               - రాజకీయ`జీవి'

-

26, మార్చి 2011, శనివారం

తిరుమలలో తమిళ రాజకీయ డబ్బు ...గోవిందా...
రాజకీయనాయకులకు భలే ఐడియాలు వస్తాయి.చట్టాలు వారే చేస్తారు. వాటిని ఎలా ఉల్లంఘించాలో ప్రణాళికలు కూడా వారే తయార చేస్తారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఆరంభం కావడంతోనే ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి రావడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబ్బు దిగుమతి చేసుకోవడం, పంపిణీ చేయడం కష్టం అనుకున్నట్లున్నారు రాజకీయ జీవులు. దాంతో వారికో ఐడియా వచ్చింది.తమిళనాడు సరిహద్దుకు దగ్గరలో ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం ఈ ఆర్ధిక లావాదేవీలకు మంచి అనువైన ప్రదేశంగా గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి డబ్బును పెద్ద మొత్తాలలో తిరుమల తెప్పించుకుంటున్నారు. ఏ కారణం వల్ల పోలీసుల కంట పడితే, దేవుడి హుండిలో వేయడానికి తెచ్చామని చెప్పి తప్పించుకోవచ్చన్నది వారి వ్యూహమట.తదనుగుణంగానే వారు ఆ స్కీమ్ ను అమలు చేయడం ఆరంభించారు. ఎవరూ గమనించకపోతే తమిళనాడు నుంచి పదిహేను మందితో కూడిన బృందం కూడా తిరుమలకు ఈలోగా చేరుకుంటుంది. ఆ పెద్ద మొత్తాన్ని చిన్నమొత్తాలుగా విడదీసి వారికి పంపిణీ చేసి వారిద్వారా తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారట.అయినా కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో పట్టుకుంటే సుమారు అరవైనాలుగు లక్షల రూపాయల మొత్తం దొరికింది. అంటే అప్పటికే ఎంత మొత్తం తమిళనాడులోని ఆయా నియోజకవర్గాలకు చేరిందో ఊహించుకోవచ్చని చెబుతున్నారు.తమిళనాడు నిఘా విభాగం ఈ విషయం కనిపెట్టి సంబంధిత వర్గాలకు ఉప్పందించడంతో రాజకీయ నేతలు అమలు చేస్తున్న ఈ కొత్త స్కీమ్ విషయం వెలుగులోకి వచ్చింది.

భారత్‌-పాక్‌లలో ఎవరు గెలవాలో చెప్పమ్మా...సానియా


 వచ్చే బుధవారం (మార్చి 30) నాడు మొహాలీలో  జరిగే భారత్‌- పాకిస్థాన్ సెమీస్ మ్యాచ్ సానియామీర్జాలో టెన్షన్‌ రేపుతోంది. దాయాదులు పోరు కావడం, అందులో ఒకటి అమ్మగారిది, మరొకరిది అత్తగారి దేశం. ఏ రంగంలో చూసిన శత్రుత్వం పెంచుకున్న ఇరు దేశాలు ప్రపంచకప్‌లో తలపడుతుండటం, వీరిలో ఎవరికి మద్ధతు తెల్పాలన్నదానిపై గత ఏడాది పాకిస్థానీ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జాకు గుబులురేపుతోంది. మరో వైపు తన భర్త షోయబ్‌మాలిక్‌ పాకిస్థాన్‌ క్రికెటర్ కావడం , తను ఇప్పటికీ టెన్నిస్‌లో భారత్‌కే ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఇరువైపులా టెన్షన్ ఉండటంతో ఆమె ఆచితూచి స్పందించింది. ఏది ఏమైనా నా సొంత దేశం భారత్‌ జట్టు గెలవాలని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్‌ విజయం ఖాయమని తన భర్త షోయబ్‌మాలిక్ తన సందేశంలో పేర్కొన్నారు. ణరి ఇరువురిలో ఎవరి మాట నెగ్గుతుందో..ఎవరి కోరిక నెగ్గుతుందో బుధవారం వరకు వేచిచూడాల్సిందే..

ఈరోజు రాత్రి ఓ గంట లైట్లు ఆపేయండి


   వేడెక్కుతున్న ఈ భూమిని మనం రక్షించుకోవాలి. ఈ భూమిమీద ఉన్న జీవజాలాన్ని కాపాడుకోవాలి. వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులతో ప్రాణకోటి అల్లల్లాడుతోంటే కనీసం ఒక్క గంట - మనమంతా భూమి కోసం కేటాయించలేమా? ఒక్కసారి ఆలోచించండి. సరిగా ఈ ఉద్దేశంతోనే ప్రతిఏటా మార్చినెలలోని ఆఖరి శనివారం రాత్రి ప్రపంచదేశాలు `ఎర్త్ అవర్'ను పాటిస్తున్నాయి. భూమిని రక్షించుకుందామన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు శనివారం రాత్రి 8గంటల 30 నిమిషాల నుంచి గంటసేపు మనమంతా ఎర్త్ అవర్ పాటించబోతున్నాం. ఈ గంటసేపు విద్యుత్ దీపాలను ఆపేసి బంగారు భవితకు బాటలువేస్తూ చిరుదీపాలను వెలిగించుకుంటాం.  చీకట్లోనుంచే వెలుగురేఖలు ప్రసరిస్తాయని చాటిచెప్పేదే  `ఎర్త్ అవర్' 


   ప్రపంచ పర్యావరణానికి ముప్పు వాటిల్లింది. ఒక గంటసేపు విద్యుత్ ఆపడం ద్వారా పెద్దపెట్టున ఒక్కసారిగా కాలుష్యాన్ని తగ్గించలేకపోవచ్చు. కానీ ఎర్త్ అవర్ కచ్చితంగా ఒక స్పూర్తిగా నిలుస్తుందనే చెప్పాలి.
ఇటు ఆస్ట్రేలియా నుంచి అటు అమెరికా వరకు అనేక దేశాలు మార్చినెలలోని ఆఖరి శనివారంనాడు రాత్రి ఓ గంటసేపు విద్యుత్ ను ఆపివేయడానికి సిద్ధమవుతున్నారు. భూమికోసం తపించేవారందరినీ చైతన్యపరిచేందుకే ఈ లైట్స్ ఆఫ్...
   గంటసేపు విద్యుత్ వాడకాన్ని ఆపివేయాలన్న ఆలోచన వచ్చి ఇప్పటికి నాలుగేళ్లయింది.
.సరిగా 2007వ సంవత్సరంలో సిడ్నీలో పుట్టింది `లైట్స్ ఆఫ్' ఆలోచన. భూతాపాన్ని చల్లార్చాలన్న నినాదంతో, పృధ్విని రక్షించాలన్న తపన నుంచే `ఎర్త్ అవర్' కార్యక్రమం పుట్టుకొచ్చింది.
ఇప్పుడీ ఆలోచన  ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో పాతుకుపోయింది. అందుకే మార్చి ఆఖరి శనివారం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
 2007లో - సిడ్నీలోని 20లక్షల మంది ప్రజలు స్వచ్చంధంగా లైట్స్ ఆఫ్ చేసేసి ఎర్త్ అవర్ సందేశాత్మక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఆస్ట్రేలియాలో పుట్టిన ఈ ఆలోచన ఇప్పుడు యావత్ ప్రపంచాన్నీ చైతన్య పరుస్తోంది.
WWF అనే సంస్థ ఎర్త్ అవర్ ని  ప్రపంచమంతటా నిర్వహిస్తోంది. `వరల్డ్ వైడ్ ఫండ్ పర్ నేచర్' అనే ఈ సంస్థ - ప్రపంచదేశాల్లోని అన్ని వర్గాల ప్రజలకు `ఎర్త్ అవర్' సందేశాన్ని అందజేస్తోంది.
      ఒక గంటసేపు విద్యుత్ దీపాలు ఆపినంత మాత్రాన భూవాతావరణంలో మార్పువస్తుందా? అంటూ పెదవివిరిచేవారూ ఉన్నారు. నిజమే కావచ్చు. కానీ ఇదో చైతన్య ఉద్యమం. ఎంత లబ్దిపొందామన్నదానికంటే, ఎంత తృప్తి మిగుల్చుకున్నామన్నదే చాలా ముఖ్యం.
    ప్రపంచంలోని పలునగరాల్లో గంటసేపు విద్యుత్ నిలిపివేయడమంటే మాటలు కాదు. ఎన్నో ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే ఎర్త్ అవర్ ప్రొగ్రాం కంపల్సరీగా పాటించాలని ఎవ్వరూ చెప్పడంలేదు. అత్యవసరాలకు విద్యుత్ వాడినా, అనవసరమైన వాడకాన్ని తగ్గించడమే ఈ పిలుపులోని పరమార్ధం. ఇప్పటికే ఎన్నో పారిశ్రామిక నగరాలు రేయింబవళ్లు విద్యుత్ ను యధేచ్ఛగా ఉపయోగిస్తునే ఉన్నాయి. గంటసేపు కరెంట్ ను ఆపేయడంవల్ల కొంతమేర కర్బన ఉద్గారాలను  తగ్గించవచ్చు.
   ప్రకృతిని రక్షించుకోవడంలో ఇదో చిన్న ప్రయత్నం మాత్రమే. ఇందుకు అందరూ సహకరిస్తే భూతాపాన్ని కొంతలోకొంత తగ్గించవచ్చు.
మహానగరాల్లో కరెంట్ ఒక గంట లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులమాట పక్కనబెడితే, ఆ గంటా- ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఓసారి ఆలోచించండి. కరెంట్ ఆదాఅవడం ఒక ప్రయోజనం. అయితే ఆ ఒక్క గంట విద్యుత్ ఆదాపెద్దగా లెక్కలోకి రాకపోవచ్చు. అయితే మనం కూడా పృధ్వికోసం మహాసంకల్పం చెప్పుకున్నామన్న తృప్తి మిగులుతంది. విద్యుత్ పరికరాలకు దూరంగా జరిగి,  కాసేపు ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ- క్యాండిల్స్ వెలుగుల్లో కుటుంబసభ్యులతో ఆనందంగా గడపవచ్చుకదా..


   ఎర్త్ అవర్ పాటించే సమయంలో ఓసారి మనమంతా పర్యావరణకాలుష్యం గురించి గుర్తుచేసుకోవాలి. ఈ ప్రకృతిని, జీవరాశిని రక్షించేందుకు మనవంతు కృషిగా ఏమి చేయాలో ఆలోచించుకోవాలి. కాలుష్యభూతం వల్ల పర్యావరణం ఎంతగా దెబ్బతింటున్నదో పిల్లలకు తెలియజెప్పాలి. భూతాపం తెస్తున్న అనర్థాలను మననం చేసుకోవాలి. ఈ భూమిని రక్షిస్తానంటూ మరోసారి ప్రతినబూనాలి. అలా..అలా ఈ గంటను సద్వినియోగం చేకోవచ్చు.  ఆహ్లాదకరమైన మార్పుకోసం మరి మీరు కూడా మొదటి అడుగువేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఎర్త్ అవర్ ని నిండుమనసుతో పాటించండి. లైట్స్ ఆఫ్ చేసేయండి. ఒకేనా...
`ఎర్త్ అవర్' పాటించేవారి సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. మనదేశంలో కూడా ఎర్త్ అవర్ పై అవగాహన కలిగించడానికి స్వచ్ఛంధ సంస్థలు ముందుకువస్తున్నాయి.
  ఎర్త్ అవర్ ని అసలెందుకు ఎందుకు పాటించాలన్న సందేహం ఉంటే దాన్ని ఎర్త్ అవర్ నిర్వాహకులు చిటికలో తీర్చేస్తున్నారు. అలాగే,  చైతన్య సందేశాన్ని మీమిత్రులకు, బంధువులకు ఎలా పంపించాలని ఆలోచిస్తున్నారా? దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమేలేదు.
  ఎందుకంటే ఎర్త్ అవర్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఎర్త్ అవర్ ఎందుకు పాటించాలి, ఎలా పాటించాలి, పేర్లు నమోదు చేసుకోవడం, మిత్రులకు, బంధువులకు సందేశాలు ఇచ్చుకోవడం వంటి అనేక అంశాలను వెబ్ సైట్స్ లో పొందుపరిచారు.
  అంతేకాదు, ఎర్త్ అవర్ సందేశంతో మీకు నచ్చిన లాంతర్ ని మీరే సిద్ధం చేసుకోవడం, రంగురంగుల లాంతర్లను ఎంచుకోవడం వంటి ఎన్నో www.earthhour.orgలోని `ఫన్ స్టప్' లో చూడొచ్చు...
  పిల్లల్లో ఎర్త్ అవర్ పై అవగాహన పెంచడానికి కిడ్స్ కోసం గేమ్స్ కూడా ఉన్నాయి.
  హైదరాబాద్ లోని అనేక స్వచ్చంధ సంస్థలు ఎర్త్ అవర్ పాటించడానికి సిద్ధమవుతున్నాయి. బ్లూక్రాస్ సంస్థ వ్యవస్థాపకరాలు అమల కూడా ఎర్త్ అవర్ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు మనవంతు తోడ్పాటు ఇవ్వాలని అనేక మంది పిలుపునిచ్చారు.
 ఎర్త్ అవర్ ప్రారంభం కాగానే విద్యుత్ దీపాలను స్విచ్ ఆఫ్ చేస్తేస్తాం. సరే, మరి ఎలాంటి కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా అన్న దర్మసందేహం రావచ్చు. దీనికి కూడా WWF సంస్థ వివరణలు ఇచ్చేసింది. పెట్రోలియం పదార్ధాలతో తయారైన క్యాండిల్స్ ను వాడటంకంటే, సహజసిద్ధమైన క్యాండిల్స్ వాడమంటున్నారు. అంతేకాదు, క్యాండిల్స్ ని వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి....
.-  చిన్నపిల్లలు వెలిగించకూడదు
- కిందపడిపోయేలా ఉంచకూడదు
- పేపర్లు, కర్టెన్లు, బట్టలకు దూరంగా ఉంచాలి
- కిటికీలపై ఉంచకండి
ఎర్త్ అవర్ అనగానే ఏదో ఆవేశపడిపోయి లైట్లన్నీ ఆర్పేసి కారుచీకట్లో మగ్గమని కాదు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన తరువాతనే ఎర్త్ ఆవర్ ను  చైతన్య పూరితంగా పాటించాలి. అంతేకానీ ప్రమాదాలు కోరితెచ్చుకోకూడదు.
ఎర్త్ అవర్ సమయంలో నగరమంతా గాఢాందకారంలో మగ్గిపోతుందని ఎవ్వరూ భయపడనక్కర్లేదు. ఎందుకంటే, వీధుల్లోనూ, అత్యవసర సేవావిభాగాల్లోనూ లైట్స్ అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయి. మితిమీరి ఉన్నచోట్ల లైట్లు ఆర్పేయవచ్చు.

ఎర్త్ అవర్ అయిన తరువాత అంతా ఒక్కసారిగా లైట్లు వెలిగించడం వల్ల పవర్ ఫెయిల్యూర్స్ వస్తాయా అన్న అనుమానాలు రావచ్చు. కానీ అలాంటివి జరగకుండా ఉండేలా విద్యుత్ కేంద్రాలు ముందస్తు చర్యలు తీసుకుంటాయి.
ఎర్త్ అవర్ ని మార్చి చివరి శనివారం జరుపుకోవాడనికి ఓ కారణం ఉంది. ఇది వసంత రుతువు ఆగమన వేళ. రాత్రి, పగలు సరిసమానంగా ఉండే సమయం.
   `చిరుదీపం' చీకటిని పారద్రోలినట్లే, `ఎర్త్ అవర్' అనే ఈ చిన్ని ఆలోచన రేపటి `కాలుష్యరహిత ప్రపంచానికి' దారితీస్తే- అంతకన్నా ఆనందించేసంగతి మరొకటి ఉంటుందా? ఒక్కసారి మీరూ ఆలోచించండి.
- తుర్లపాటి నాగభూషణ రావు

25, మార్చి 2011, శుక్రవారం

బర్నింగ్ కామెంట్రీ - రాజకీయ, సామాజిక వ్యంగ్యాస్త్రం - 4


బర్నింగ్ కామెంట్రీ -4
 ............................................
                                                  `బ్యాక్'టు పెవిలియన్ 
ప్రపంచకప్పులోన
నిజంగానే యువరాజు
ఎనిమిదేళ్ల కసినంతా
`ఒక్క'రోజులోనే బాదినాడు!
ఆసిస్ లంతా ఈ విధంగా
`బ్యాక్'టు పెవిలియన్ దారిపట్టినారు!!                                 -నీల్ కొలికపూడి

మరుగు దొడ్డా?మనీ కేంద్రమా?

తమాషా`కీ' 
........................
మరుగు దొడ్డా?మనీ కేంద్రమా?
 
  ఒహో అకౌంట్లో డబ్బులు పడ్డాయికదాని ఎగేసుకెళ్ళి ఏ.టి.ఎం లో దూరి టకటకా పిన్ నెంబర్ నొక్కి డబ్బులు లాగేసి చికెన్ బిర్యాని లాగించడానికెల్తున్నారా?అయితే ఒక్క సెకండాగండాగండి..వచ్చినయి డబ్బులే కాదు,జబ్బులు కూడా అని గ్రహించండి.
ఏ.టి.ఎం అనగా నగదు బట్వాడ యంత్రమే కాదు,నానా జబ్బుల బట్వాడ యంత్రం కూడాను!
ఈమధ్య ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలిన సత్యమేమనగా ..కీపాడ్,కీ బోర్డ్,ఏ.టి.ఎం లోబ్యాక్టీరియాలకు ,పబ్లిక్ టాయిలెట్లో వున్న బ్యాక్టీరియాలకు అవినభావ సంబందముందట.మరుగుదొడ్ల నుంచి చేతివేళ్ళ ద్వారా ఏ.టి.ఎం కరెన్సీ మిషన్ మీద తిష్ట వేశాయంటున్నాడు డా.రిచర్డ్ హాస్పింగ్స్ ఆఫ్ బయో కోట్ లి.,
అంతేకాదు ఆఫీసు థంబ్ పంచింగ్ మిషన్లో,పబ్లిక్ ఫోన్ లో కూడా ఈ బ్యాక్టీరియాలు మనవల్ల మనకోసం కాపు కాసుకు కూచున్నాయట..అరివీర భయంకర జబ్బులను మనకు అంటగట్టడానికి ఆవురావురుమంటున్నాయట.. కాబట్టి జర సూస్కొని పని జేసుకోండ్రి..
- మృత్యుంజయ

మిలియన్ మార్చ్ లో పెట్టిన కేసులు ఎత్తివేయాలా?తెలంగాణ ఉద్యమంలో ఇదొక ముఖ్యమైన కోణం.ప్రతిసారి ఏదో ఒక చోట తీవ్ర స్థాయిలో ఆందోళన జరగడం,విధ్వంసమో, లేక ప్రభుత్వ ఆస్తుల దహనమో లేక ఆర్టీసి బస్ ల ధ్వంసమో జరగడం దానిపై కేసులు నమోదు చేయడం జరుగుతోంది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కేసులు ఎత్తివేయాలని డిమాండు మొదలవుతోంది.అదే క్రమంలో శుక్రవారం నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి మిలియన్ మార్చ్ సందర్భంగా విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.అయితే తెలంగాణ ఉద్యమ నేతలు ఇక్కడ ఎవరు ఆందోళన చేసినా, ఎవరు హింసకు పాల్పడినా, వారందరిని విద్యార్ధులుగా పేర్కొంటూ కేసులు ఎత్తివేయాలని డిమాండు చేయడం కూడా సర్వసాధారణంగా మారింది. కొంతమంది విద్యార్ధులు ఉండవచ్చు. కాని అంతా నిజంగా విద్యార్ధులైతే అన్ని విగ్రహాలను అంత దారుణంగా పడగొట్టగలుగుతారా? వారిదగ్గర అందుకు సంబంధించిన పరికరాలు సిద్దంగా ఉంటాయా?అది వేరే విషయం.చిన్న చిన్నకేసులు అయితే ఎత్తివేయడంలో పెద్ద తప్పు కూడా ఉండదు. తీవ్రమైన కేసులనుఎత్తివేసే విషయంలోనే ఇబ్బంది వస్తుంది. ఆయా వర్గాల ఒత్తిడి అనండి, మరే కారణం అన్నా అనండి ప్రజాప్రతినిధులు ఈ అంశంలో బాగా ఇబ్బండి పడుతున్నారు. కేసులు ఎత్తివేయాలని కేసులలో ఉన్నవారి తాలూకూ సంబంధీకులు ఒత్తిడి చేస్తుంటారు. అదే సమయంలో ప్రభుత్వం వైపు నుంచి హింసకు పాల్పడినవారిని ఎలా వదిలిపెట్టగలం అని ప్రశ్నలు వస్తుంటాయి. ఈ రెంటి మధ్య వీరు నలిగిపోతుంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు ఈవిషయంలో మరీ చిక్కులు ఎదుర్కుంటుంటారు.ఈ నేపధ్యంలోనే కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్.పిలు నిరవధిక దీక్ష చేసి కేసులు ఎత్తివేయాలని డిమాండు చేశారు. ఆ సందర్భంలో ప్రభుత్వం నుంచి కొన్ని హామీలు కూడా పొందారు. అయితే అనంతరం మళ్లీ హింసాకాండ ఘటనలు జరిగాయి.ముఖ్యంగా మిలియన్ మార్చ్ లో ఏకంగా కాంగ్రెస్ ఎమ్.పిలు కేశవరావుపై, మధు యాష్కిపై కూడా దాడి జరిగింది. ఒకవైపు ఉద్యమం జరగడం, మరోవైపు హింసాకాండ, వాటిపై కేసులు , తర్వాత ఆ కేసులు ఎత్తివేతకు తిరిగి ఆందోళన జరగడం ఆనవాయితీగా, ఒక సర్కిల్ గా మారింది. ఇందులో భాగంగానే అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండు చేస్తూ మహాధర్నా చేపట్టినట్లు జెఎసి ఛైర్మన్ కోదండరామ్ ప్రకటించారు.ఉద్యమాలలో ఇలాంటివి తప్పవేమో.
- కొమ్మినేని

జపాన్ చిన్నారుల కోసం వాటర్ బాటిల్ పంపించండి

 

ఈ చిన్నారులకు ఎంత కష్టం వచ్చింది. ఆడుతూపాడుతూ ఎగిరే వయసులో రేడియేషన్ భూతం విరుచుకుపడింది. టాప్ లో నుంచి వచ్చే మంచినీళ్లలో కూడా రేడియేషన్ ప్రభావం ఉన్నట్టు జపాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి నీళ్లు తాగితే మరీ ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్ అంధకారం అవుతుందని అంతా భయపడుతున్నారు. ఇప్పటికే అనేక దేశాలు జపాన్ చిన్నారుల కోసం మంచినీళ్ల బాటిల్స్ పంపిస్తున్నాయి. మరి మీరు కూడా కనీసం ఒ లీటర్ బాటిల్ ను టోక్యోకి పంపించండి.....

    పెను భూకంపం సృష్టించిన ప్రళయ సునామీ దెబ్బకు కకావికలమై.. అణు సంక్షోభానికి దారి తీసిన జపాన్‌లో ప్రజలు భయంతో మగ్గుతున్నారు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని బద్దలు కొట్టుకుని.. సమీప ప్రాంతాలను చుట్టుముట్టేసిన రేడియేషన్, ఇప్పుడు టోక్యో నగరాన్నీ కమ్మేస్తోంది.

ఇళ్లలోనే ఉండాలని, కిటీకీలు గట్టిగా బిగించుకోవాలని చేసిన హెచ్చరిక గుబులు పుట్టిస్తోంది. మరోవైపు.. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో రియాక్టర్‌లను చల్లబర్చే పని తీవ్రస్థాయిలో సాగుతోంది. వీటి నుంచి వెలువడిన రేడియేషన్ వాతావరణాన్ని, జలాలను కలుషితం చేసింది. నీటిశుద్ధి ప్లాంటులు రేడియేషన్‌కు గురికావడంతో పంపుల ద్వారా సరఫరా అయ్యే నీరు చిన్నారులకు శ్రేయస్కరం కాద ని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో దేశ వాసులు స్టోర్‌లలోని బాటిల్డ్ వాటర్‌ను ఖాళీ చేశారు.

టోక్యోలో పసిబిడ్డల కోసం 2.40 లక్షల మంచినీటి బాటిళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జపాన్ చిన్నారుల కోసం భారత్ సుమారు పది వేల లీటర్ల మంచినీటి బాటిళ్లను పంపింది. జపాన్‌లోని ఆహార పదార్థాలకు కూడా రేడియేషన్ పాకడంతో ఆ దేశ ఉత్పత్తులను అమెరికా నిలిపేసింది. కాగా, జపాన్‌లో ప్రళయం వల్ల కలిగిన నష్టాన్ని రూ.13 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. తమ దేశంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్షలు నిర్వహించేందుకు అమెరికా సిద్ధమవుతోంది.

సీమాంధ్రఎంపీలతో కలిసికూర్చోం - టి-కాంగ్రెస్ ఎంపీలు


సీమాంధ్ర,తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య సయోధ్యకు గులాంనబీ అజాద్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ముందు వేర్వేరుగా సమావేశపరిచి, ఆ తరువాత ఇద్దర్ని కలిసి కూర్చోపెట్టి సమావేశం జరపాలని గులాంనబీఅజాద్ భావించారు. తదనుగుణంగా శుక్రువారం నాడు ముందుగా తెలంగాణ ఎంపీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, శ్రీకృష్ణకమిటీ ఎనిమిదో అధ్యాయంలో పొందపర్చిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను మేనేజ్ చేయాలన్న వ్యాఖ్య తమను ఇబ్బంది పెడుతుందని వారు వ్యాఖ్యానించారు. ఆ తరువాత సీమాంధ్ర ఎంపీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తే తాము హాజరుకాలేమని వారు చెప్పడంతో బిత్తెరపోవడం అజాద్ వంతయింది. ఈ సమావేశం పూర్తికాగానే బయటకు వచ్చిన మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలతో కలిసి కూర్చోమని నిక్కచ్చిగా చెప్పేశామని వెల్లడించారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లోనే కలుసుకోవడం లేదు అలాంటప్పుడు అజాద్‌ దగ్గర కలిసి కూర్చోవడం, చెట్టపట్టాల్ వేసుకోవడం ఎలా జరుగుతాయి? , అలాగే కలిసి ఫోటోలు ఎలా దిగుతాం..మా మనసు ఒప్పుకోవడం లేదు. 600మంది బలిదానంతో త్యాగాలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోతాం..అందుకే కలిసి కూర్చోలేమని చెప్పేశామని సర్వే సత్యనారాయణ వివరించారు. మే నెల వరకు అధిష్టానం ఆగమన్నది కనుకే ఆగామని కూడా ఆయన చెప్పారు. దీంతో గులాంనబీఅజాద్‌కు తెలంగాణ ఎంపీల నుంచి మొదటి షాక్‌ ఎదురయినట్లు లెక్క. ఆ తరువాత సీమాంధ్రఎంపీలతో భేటీ అయ్యారు. అజాద్‌కు కూడా తెలంగాణ అంశం ఓ పరీక్షగా మారింది.
- కొమ్మినేని

24, మార్చి 2011, గురువారం

చిరంజీవి అల్లుడు అమాయకుడా? (ప్రత్యేక కథనం)

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు మంచివాడేనా...? లోపమంతా చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ లోనే ఉన్నదా...?? శ్రీజ హైదరాబాద్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో తన భర్త శిరీష్ భరద్వాజ్ కట్నం కోసం వేధిస్తున్నాడంటూ చాలా స్ట్రాంగ్ గా కేసుపెట్టింది. దీంతో భరద్వాజ్ నీ, అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన భరద్వాజ్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. దీంతో కేసు ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతోంది. మరో పక్క భరద్వాజ్ తన భార్యను చూడాలని ఉన్నదంటూ మానవ హక్కుల సంఘానికి (హెచ్.ఆర్.సి) విజ్ఞప్తి చేసుకున్నాడు.
 ఈ నేపథ్యంలో కొన్నివిషయాలపై ఆసక్తి నెలకొంది.
1. గత కొంతకాలంగా శ్రీజ అత్తింట్లోలేదు. ఆమె పుట్టినింటనే ఉంటున్నది.
2. శిరీష్ భరద్వాజ్ గురించి ఎంత గుచ్చిగుచ్చి అడిగినా సమాధానం చెప్పడంలేదు.
3. ఫిబ్రవరి 26న బేగంపేటలోని ఒక పబ్ లో శ్రీజ దంపతులు ఫోటోకి ఫోజ్ ఇచ్చారు.
4. అదే రోజున గోవాలోని మేనేజ్ మెంట్ కంపెనీతో వాణిజ్య సంబంధాలను భరద్వాజ్ మెరుగుపరుచుకున్నారు. అందుకు ఈ పబ్ సమావేశం దోహదపడింది.
5. అంతకు ముందు నాలుగు నెలల కిందటే భరద్వాజ్ గోవాలోని టిటొస్ గ్లోబల్ ఈవెంట్స్ అనే కంపెనీతో టైఅప్ పెట్టుకున్నాడు.
6. హైదరాబాద్ లో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ డీల్ కుదిరింది.
7. భరద్వాజ్ తన వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే అదే రోజున ప్రముఖ సినీనటులను, సినీ తారలను పిలిపించాడు.
8. అందుకే తన భార్య (చిరంజీవి రెండో కుమార్తె)ను కూడా  పార్టీకి తీసుకువచ్చాడు.
9.  శ్రీజ- భరద్వాజ్ ల ప్రేమపెళ్ళి జరిగి మూడున్నరేళ్లు అవుతోంది. వీరి ప్రేమ వివాహం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. వివాహం తరువాత దంపతులు చాలా ఆనందంగానే ఉన్నారు.
10. అయితే, అదే సమయంలో చిరంజీవి ఇంట్లో ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ తయారైందని ఫిల్మ్ నగర్ వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి.
11. చిరంజీవిలో మార్పు వచ్చినా, అల్లుడిని మాత్రం మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోయారని మెగాస్టార్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నిర్మాత బాహాటంగానే అంటున్నారు.
12. చిరంజీవి తండ్రి స్వర్గస్థులైనప్పుడు, 2007లో శ్రీజ మొదటిసారిగా పుట్టింటికి వెళ్ళింది.
13. ఈ మధ్యకాలంలో శ్రీజ పుట్టింటికి రావడం తరచూ జరిగే సంఘటనే అయింది. అంతేకాదు, ఆమె తన తల్లిదండ్రులతో పార్టీలకు కూడా వెళుతూనే ఉంది. ఇంటి అల్లుడు మాత్రం ఎప్పుడూ కనబడలేదు.
14. భర్త లేకుండా శ్రీజ ఒక్కతే తండ్రి చిరంజీవితో పాటుగా పార్టీల్లో కనబడినప్పుడే ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడాయి.
15. మనవరాలు పుట్టినప్పుడైనా తాత చిరంజీవి మనసు మారుతుందని అల్లుడు భరద్వాజ్ భావించారు. కానీ ఆ పప్పులు ఉడకలేదు. మనవరాలిని చూసేందుకు 2008లో చిరంజీవి సతీమణి సురేఖ, శ్రీజ సోదరుడు రాం చరణ్ తేజ మాత్రమే ఆస్పత్రికి  వెళ్ళారు.
16. చిరంజీవి కుటుంబం నుంచి ఎంతగా వ్యతిరేకత వస్తున్నా, భరించిన భరద్వాజ్ చివరకు రెండో దారి (వ్యాపారానికి డబ్బు కావాలని అడిగే దారి)ని ఎంచుకునేలా పరిస్థితులు కల్పించారనీ, ఇదంతా మెగా స్క్రిప్ట్ లో అంతర్భాగమేనని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
17. మెగాస్టార్ ఇంట్లో శ్రీజకు పెద్దపెట్టునే `కౌన్సిలింగ్' జరిగిందనీ, దీంతో శ్రీజకు ప్రేమ స్థానంలో తన భర్త పట్ల ద్వేషం పుట్టుకువచ్చిందనీ, ఈ సమయంలోనే భరద్వాజ్ వ్యాపారం నిమిత్తం డబ్బు అడిగేసరికి శ్రీజ ఉవ్వెత్తున వ్యతిరేకించి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పుకుంటున్నారు.
 అయితే, ఏది నిజం, మరేది మసిపూసిన మారేడుకాయే దర్యాప్తులోగానీ తెలియదు. అప్పటివరకు ఈ కథకు ఫుల్ స్టాప్ ఉండదు.

ఉస్మానియా విద్యార్ధుల కష్టాలు


ఒక పక్క ఉస్మానియా యూనివర్శిటీలో పరీక్షల మూడ్ వస్తుంటే, మరో పక్క యూనివర్శిటీలోకి ఆర్టీసి బస్ లు రాకపోవడంతో విద్యార్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఆయా పి.జి,తదితర వృత్తివిద్య కోర్సులకు సంబందించి వందలాదిమంది విద్యార్ధులు సెమిస్టర్ పరీక్షలు ఆరంభమవుతున్నాయి. కొంతకాలం క్రితం పరీక్షలు రాయబోమని, లేదా వాయిదా వేయాలని డిమాండు చేస్తూ ఆందోళనలు జరిగేవి. ఇప్పుడు అవన్ని సద్దుమణిగి పరీక్షలకు విద్యార్ధులు తయారవుతున్నారు.కాని ఇలాంటి సమయంలో బస్ లు తిరగకపోవడంతో మండుటెండల్లో విద్యార్ధులుచెమటలు కక్కుతూ రెండు,మూడు కిలోమీటర్లు నడవవలసి వస్తోంది. దీనికి కారణం గతంలో ఉస్మానియా వర్శీటీలో ఐదు బస్ లను దహనం చేయడం, సుమారు ముప్పై బస్ ల అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేయడం వంటివాటివల్ల ఆర్టీసి బస్ లను నడపడం లేదు. బస్ లను నడపడానికి పోలీసులు అనుమతించి రక్షణ కల్పిస్తే బస్ లు నడుపుతామని ఆర్టీసి చెబుతుంటే,పోలీసులు విద్యార్ధి నాయకులు కనుక బస్ లకు నష్టం చేయమని హామీ ఇస్తే అనుమతి ఇస్తామని లేకుంటే కష్టమని చెప్పారు. దీనిపై ఆందోళనలకు నాయకత్వం వహంచే వారిని అడిగితే తాము అలాంటి హామీ ఇవ్వలేమని, తెలంగాణ రావడం తమకు ముఖ్యమని చెబుతున్నారు. యూనివర్శిటీలో బస్ లను ధ్వంస చేసినందువల్ల ఆరీ్టీసికి సుమారు ఏభై లక్షల నష్టం వాటిల్లింది.ఈ పరిస్థితిలో వాహనాలు ఉన్న వారు ఇబ్బంది లేకుండా తిరుగుతున్నారు. మరి వాహనాలు లేని విద్యార్ధుల గతి ఏమిటి?ఎండలలో కష్టాలు పడవలసిందేనా?

హైదరాబాద్ లో డైనోసార్

తమాషాకీ...
.................
హైదరాబాద్ లో డైనోసార్
........................................


ఏ పార్క్ కు ఎళ్దాం..ఇందిరా పార్కా ? లుంబినీ పార్కా ? అంటే జురాసిక్ పార్క్ అనేవోన్ని నేను..ఏ పెద్దాయన కనిపించినా సార్ కు బదులు "డైనోసార్ !" అని పిలిసేవోన్ని.. అట్లుండేది నా పిచ్చి సొవాయితం..

డైనోసార్ ని సైన్మాల్లో సూడ్డం కాదు..సేసి సూడాలి..సూసి సేయాలి అనుకున్నా..సెంద్రుడు పోయి సూర్యుడు వస్తుండు..గనియారం ముల్లు ఓహో ఒకటే తిరగతా వుంది..టిపిను బాక్సులు పెట్టుకొని ఆపీసుకు,ఇంటికి తిరగతా వుంటి..చాయిలమీద చాయిలు తాగుతావుంటి..ఎనక్కి తిరిగి సూస్తే ఏముంది..సేసింది లే...సూసింది లే..సచ్చింది లే..డైనోసార్ కల అట్నే ఏడిసింది..
ఏదైతే అదైతని పట్టుపట్టి సేయనే సేస్తి..డైనోసార్ ని 2డి లో గుసాయించి 3డి లోపటాయించిన.. డైనోసార్ అంబరుపేటకు రానే వచ్చింది.
2డి యా 3డి యా ఏ డి అయితేనేమి??..డి అంటే డి ..
సేయాలన్న కుతకుత నరాల్లో వుండాలి గానీ,నాలుక మీదే వుంటే వస్తందా సస్తందా..?
                                                                       - మృత్యుంజయ

సోనియాబొమ్మకు చెప్పులు వేసిన వ్యక్తికి టిక్కేట్టా?చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్ధిగా తయారై, పంటికింద రాయిలా మారిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కొత్త వాదనను తీసుకువస్తున్నారు. తన తరపున గెలిచిన దేశాయి తిప్పారెడ్డి కాంగ్రెస్ వ్యక్తేనని పెద్దిరెడ్డి చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సోనియాగాందీ బొమ్మకు చెప్పుల దండ వేసిన నరేష్ కుమార్ రెడ్డికి టిక్కట్ ఇచ్చారని అందుకే తాము అతనిని వ్యతిరేంచామని, జగన్ వర్గం కూడా తమకు సహకరించిందని పెద్దిరెడ్డి చెబుతున్నారు. సహజంగానే సోనియాగాంధీని అవమానించిన వ్యక్తికి టిక్కట్ ఇచ్చారన్న ప్రచారం జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మరక్షణలో పడతారు. అందుకే పెద్దిరెడ్డి తెలివిగా ఈ వ్యూహాన్ని ఎంపిక చేసుకున్నారు. సత్వరమే పెద్దిరెడ్డిపై చర్య తీసుకోవాలని అనుకున్నా, కాంగ్రెస్ అధిష్టానం ఒకటికి,రెండుసార్లు ఆలోచిస్తుందని అంటున్నారు. అదే సమయంలో కిరణ్‌ను పదవినుంచి దింపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని పెద్దిరెడ్డి నిర్మొహమాటంగా చెబుతున్నారు.

తిరుమలలో అదిగో పులి!

AA


తిరుమలను పులిభయం ఇంకా వీడలేదు. ఈ ఉదయం నడక మార్గంలో చిరుత మరోసారి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలో ఉన్న దివ్యారామం సమపంలో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన భక్తులు టీటీడీకి సమాచారమందించారు. గత మూడు నెలల కాలంలో కాలినడక మార్గంలో చిరుతలు కనిపించడం ఇది ఎనిమిదోసారి.

సినీప్రముఖుల ఇళ్లలో 2వరోజూ IT సోదాలు


AA


* IT కన్నుకప్పి కోట్ల రూపాయల లావాదేవీలు
* ఆరేళ్ల ఆదాయం లెక్కలు తేలుస్తున్న అధికారులు
* విశాఖలో భూములు కొనుగోళ్లపై వివరణకు వారం గడువు

ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు IT శాఖ సమన్లు జారీ చేసింది. IT శాఖ కన్నుకప్పి కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా జరిగాయన్నదానిపై కూపీ లాగుతోంది. హైదరాబాద్‌, మద్రాస్‌, బెంగళూరుల్లో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టిందీ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున, రవితేజ, అనుష్క, నిర్మాత శివప్రసాద్‌రెడ్డి, అనుష్క ఆస్తుల లెక్కింపు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇటీవల నాగార్జున విశాఖలో కొనుగోలు చేసిన భూముల లావాదేవీలకు సంబంధించన సమాచారం వారం రోజుల్లో తమకు ఇవ్వాలని ఆదేశించారు.

శ్రీకృష్ణకమిటీపై హరీష్ రావు, కిషన్ రెడ్డి చురకలు

శ్రీకష్ణకమిటీ ఎనిమిదో అధ్యాయం రాష్ట్రంలో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇంతకాలం రహస్యంగా ఉన్న నివేదికలోని ఎనిమిదో అధ్యాయంలోని ముఖ్యాంశాలను జస్టిస్ నర్సింహారెడ్డి బట్టబయలు చేయడంతో పలువిషయాలు వెలుగులోకి వచ్చాయి. అవన్నీ తెలంగాణవాదానికి, తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు వ్యతిరేకంగా ఉండటంతో తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.
టీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు:
     శ్రీకృష్ణకమిటీ అమ్ముడుపోయిందని రుజువైంది.  దీనిపై న్యాయపోరాటం చేస్తాం , కమిటీ సభ్యులకు శిక్ష పడేలా చేస్తాం.
 బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, బీజేఎల్పీ నేత అయిన జి.కిషన్‌రెడ్డి:
   శ్రీకృష్ణకమిటీ రిపోర్టును బీజేపీ రాష్ట్రకార్యాలయంలో చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాదు.దీనికి అంతకుమించి విలువ లేదు.
కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి :
      శ్రీకృష్ణకమిటీకి అయిన ఖర్చును ఆ సభ్యుల నుంచే రాబట్టాలి. ప్రజాధనాన్ని వృథా చేశారు.
 కరీంనగర్ ఎంపీ పొన్నంప్రభాకర్:
    శ్రీకృష్ణకమిటీ ఓ కన్సల్టెన్సీ మాదిరిగా పనిచేసింది. సీమాంధ్రనేతలకు అమ్ముడుపోయింది.

తమాషా`కీ': పదివేల పవార్లు = ఒక జగన్

 తమాషా`కీ'

భారతదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న డబ్బు లెక్కలు ఇవి.... వందలు, వేలు, కోట్లు...ప్రస్తుతం అంతగా  వాడుకలో లేవు. మరి ఏ యూనిట్స్ అమలో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా....? కమాన్ బీ రెడీ...

1కోటి = 1 కోకా
500 కోట్లు = ఒక కోడా


 

వెయ్యి కోట్లు = ఒక రాడియా


 

పదివేల కోట్లు= ఒక కల్మాడి


 

లక్ష కోట్లు = ఒక రాజా
 


వంద రాజాలు= ఒక పవార్


 

పదివేల పవార్లు= ఒక జగన్


23, మార్చి 2011, బుధవారం

బర్నింగ్ కామెంట్రీ - రాజకీయ, సామాజిక వ్యంగ్యాస్త్రం - 3

                        బర్నింగ్ కామెంట్రీ - 3


హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు
`గ్లామర్' మిస్టేక్ లకు కొదవులేదు మనకు
మెగా డాటరప్పుడే మడిమదిప్పి వెళ్లిపోయే...
కోర్టు ముందు భార్యకోసం భరద్వాజ 
 `శిరీషా'సనం వేయించుండే!
                                                                                                                          -నీల్ కొలికపూడి


మీకు తెలుసా? చిరంజీవి అల్లుడి వ్యధ

మీకు తెలుసా..?


నాభార్యతో 
మాట్లాడే అవకాశం కల్పించండి
-HRCతో చిరంజీవి అల్లుడు భరధ్వాజ్‌
 దీనిభావమేమి తిరుమలేశా...!???

కన్నీరు పెట్టిన గంగాభవాని


మహిళా కాంగ్రెస్ నేత, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు గంగా భవాని ఓడిపోయారు.పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేసి ఎంత కష్ట పడినా ఓడిపోయారు. దీంతో ఆమె కంట కన్నీరు వచ్చేసింది. బోరున ఏడ్చేశారు.
     పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు మంత్రులు వట్టి వసంత కుమార్, పితాని సత్యనారాయణ ఉన్నప్పటికీ, అక్కడ అదికార కాంగ్రెస్ అభ్యర్ధి గంగా భవాని ఓడిపోవడం, జగన్ వర్గానికి చెందిన జడ్పి ఛైర్మన్ శేషుబాబు , టిడిపి అభ్యర్ధి అంగర రామ్మోహన్ విజయం సాధించారు.మంత్రులు ఇద్దరికి ఇబ్బంది కలిగించే అంశమే. అయితే గంగాభవాని అభ్యర్ధిత్వంపై తొలుత అసమ్మతి వ్యక్తం అయింది. దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.కాగా ఎమ్.పిలు కావూరి సాంబశివరాఉ, బాపిరాజు వంటివారు మద్దతు ఉన్నప్పటికీ గంగా భవాని ఓడిపోవడ గమనించ దగిన విశేషం.పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ వర్గం గెలుపొందడడం, వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ కు ఉత్సాహం కలిగిస్తుంది.

స్క్రీన్ పై అమితాబ్, జయబచ్చన్

అమితాబ్ బచన్, జయ బచన్ పదేళ్ల విరామం తరువాత మరోసారి స్క్రీన్ పై కనబడబోతున్నారు. 2001లో కరన్ జోహర్ నేతృత్వంలోని కభీ కుషీ కభీ ఘామ్ ప్రొగ్రామ్ లో కలసి నటించిన ఈ దంపతులు ఇప్పుడు మరోసారి తనిష్క జ్యువెలరీ బ్రాండ్ కాంపైన్ యాడ్ లో స్క్రీన్ మీద నటించబోతున్నారు. బిగ్ బీ స్వయంగా ఈ విషయం తన బ్లాగ్ లో రాసుకున్నారు.
 అమితాబ్ - జయ 1973 నుంచి అనేక బాలీవుడ్ చిత్రాల్లో జంటగా నటించారు. వాటిలో జంజీర్, అభిమాన్, చుప్కే చుప్కే , షోలే, సిల్సిలాలు కూడా ఉన్నాయి.

టాలీవుడ్ పై ఐటీ ఉచ్చు

ఉన్నట్టుండి ఐటీ శాఖ తెలుగు సినీపరిశ్రమ (టాలీవుడ్) పై విరుచుకుపడింది. బుధవారం (23-03-11) ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఐటీ అధికారులు నాగార్జున, అనుష్క, రవితేజ కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు లోని ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. అంతేకాదు, కామాక్షి మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ బెంబెలెత్తిపోయింది. ఈ ఐటీ దాడుల వెనుక `రాజకీయ' వ్యూహం ఉన్నట్టుగా టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.


22, మార్చి 2011, మంగళవారం

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!


దోమల శృంగారంపై పూర్తి అవగాహన ఉంటే, డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా, నిజమేనంటున్నారు అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలోని జీవరసాయన శాస్త్రవేత్తలు.
  ఆడెస్ ఈజిప్టీ దోమల సెక్స్ లో ఒక రకమైన రసాయన చర్యల పట్టికను శాస్త్రవేత్తలు గుర్తించారు. మగదోమ స్పెర్మ్ లో ఉండే వంద రకాల ప్రొటీన్లు ఆడదోమల్లోని లక్షణాల్లో శాశ్వత ప్రాతిపదికన  మార్పులు తీసుకువస్తాయి. అవి ఆహారం (రక్తం) తీసుకునే విషయంలోనూ, అండాలను విడుదల చేయడంలోనూ, కలయక పద్ధతుల్లోనూ ఈ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడతాయట. మగ దోమల్లో అంతకు ముందు కూడా కొన్ని రకాల ప్రొటీన్లు గుర్తించినా, సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఏ తరహా ప్రొటీన్లు ఆడదోమలోకి స్పెర్మ్ ద్వారా పోతున్నాయో ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ఈ ప్రొటీన్లను స్పష్టంగా గుర్తించడం వల్ల రాబోయే కాలంలో ఆడ దోమలు పుట్టకుండా చేయడానికి వీలుచిక్కుతుందనీ, అప్పుడు డెంగ్యూ, వెస్ట్ నిలే వంటి వైరస్ ల వల్ల మనుషుల్లో జ్వరాలు రాకుండా చూడవచ్చని కార్నెల్  యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 అసలు సంగతేమిటంటే, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ఆడ దోమల వల్లనే వస్తున్నాయి. ఆడ దోమలు మనిషిని కుట్టడం వల్ల (రక్తం కోసం) అందులోని ప్రాణాంతక వైరస్ క్రిములు మనిషిలోకి ప్రవేశించి డెంగ్యూ వంటి రోగాలను కలగజేస్తున్నాయి.ఈ రోగాల కారణంగా ప్రపంచమంతటా ఏటా లక్షలాది మృత్యువాత పడుతున్నారు.
 దోమల్లోని ప్రొటీన్ల మ్యాప్ ని గుర్తించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టే వ్యూహాలను సమర్థవంతంగా చేపట్టవచ్చన్నది శాస్త్రవేత్తల యోచన. ఆడదోమల్లో అండాల తయారీని నివారించవచ్చు. అంతేకాదు, ఆడదోమల్లో రక్తం `దాహాన్ని' కూడా తగ్గించవచ్చు. అప్పుడు దోమల సంఖ్య తగ్గడంతోపాటుగా, వాటిలో రక్తం పీల్చాలన్న ఆలోచనలు తగ్గిపోతాయి. ఫలితంగా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధి దోమల ద్వారా వ్యాప్తిచెందడం తగ్గిపోతుందన్నది శాస్త్రవేత్తల ఆలోచన.
- సైన్స్ డెస్క్

అమ్మా, విలీనం చేస్తాం... రాష్ట్రం ఇచ్చేయండి

 అమ్మా.. విలీనం చేస్తాం.. రాష్ట్రం ఇచ్చేయండి. వచ్చే జూన్ నెలలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయండి. ఆ తర్వాత తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాం అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పినట్టు సమాచారం. ఇవి బయటకు పొక్కడంతో తెరాసకు చెందిన అగ్రనేతలు వివరణ ఇచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్‌లో ఎంఎస్ఓల సమావేశం జరిగింది. ఇందులో తెరాస అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇచ్చినట్టు చెప్పారు.
   రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె విధించిన షరతుకు తాను సమ్మతించానని చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పానని ఆ సమావేశంలో గుర్తు చేసినట్టు వినికిడి. పదేళ్ళ పాటు హైదరాబాద్ ఇరు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రాంతానికే హైదరాబాద్ రాజధానిగా వ్యవహరిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
   ఈ వ్యాఖ్యలను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ స్క్రోలింగ్‌లో ప్రసారం చేసింది. ఆ వెనువెంటనే కేసీఆర్ మినహా తెరాస నేతలు హరీష్ రావు, రఘునాథ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి వంటి వారు ఆ ఛానల్‌కు ఫోన్ చేసి.. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో తెరాస విలీన కాదని స్పష్టం చేశారు. ఇవంతా కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెరాస బలమైన రాజకీయశక్తిగా తన పాత్రను పోషిస్తుందని స్పష్టం చేశారు.