మిలియన్ మార్చ్ లో పెట్టిన కేసులు ఎత్తివేయాలా?



తెలంగాణ ఉద్యమంలో ఇదొక ముఖ్యమైన కోణం.ప్రతిసారి ఏదో ఒక చోట తీవ్ర స్థాయిలో ఆందోళన జరగడం,విధ్వంసమో, లేక ప్రభుత్వ ఆస్తుల దహనమో లేక ఆర్టీసి బస్ ల ధ్వంసమో జరగడం దానిపై కేసులు నమోదు చేయడం జరుగుతోంది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కేసులు ఎత్తివేయాలని డిమాండు మొదలవుతోంది.అదే క్రమంలో శుక్రవారం నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి మిలియన్ మార్చ్ సందర్భంగా విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.అయితే తెలంగాణ ఉద్యమ నేతలు ఇక్కడ ఎవరు ఆందోళన చేసినా, ఎవరు హింసకు పాల్పడినా, వారందరిని విద్యార్ధులుగా పేర్కొంటూ కేసులు ఎత్తివేయాలని డిమాండు చేయడం కూడా సర్వసాధారణంగా మారింది. కొంతమంది విద్యార్ధులు ఉండవచ్చు. కాని అంతా నిజంగా విద్యార్ధులైతే అన్ని విగ్రహాలను అంత దారుణంగా పడగొట్టగలుగుతారా? వారిదగ్గర అందుకు సంబంధించిన పరికరాలు సిద్దంగా ఉంటాయా?అది వేరే విషయం.చిన్న చిన్నకేసులు అయితే ఎత్తివేయడంలో పెద్ద తప్పు కూడా ఉండదు. తీవ్రమైన కేసులనుఎత్తివేసే విషయంలోనే ఇబ్బంది వస్తుంది. ఆయా వర్గాల ఒత్తిడి అనండి, మరే కారణం అన్నా అనండి ప్రజాప్రతినిధులు ఈ అంశంలో బాగా ఇబ్బండి పడుతున్నారు. కేసులు ఎత్తివేయాలని కేసులలో ఉన్నవారి తాలూకూ సంబంధీకులు ఒత్తిడి చేస్తుంటారు. అదే సమయంలో ప్రభుత్వం వైపు నుంచి హింసకు పాల్పడినవారిని ఎలా వదిలిపెట్టగలం అని ప్రశ్నలు వస్తుంటాయి. ఈ రెంటి మధ్య వీరు నలిగిపోతుంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు ఈవిషయంలో మరీ చిక్కులు ఎదుర్కుంటుంటారు.ఈ నేపధ్యంలోనే కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్.పిలు నిరవధిక దీక్ష చేసి కేసులు ఎత్తివేయాలని డిమాండు చేశారు. ఆ సందర్భంలో ప్రభుత్వం నుంచి కొన్ని హామీలు కూడా పొందారు. అయితే అనంతరం మళ్లీ హింసాకాండ ఘటనలు జరిగాయి.ముఖ్యంగా మిలియన్ మార్చ్ లో ఏకంగా కాంగ్రెస్ ఎమ్.పిలు కేశవరావుపై, మధు యాష్కిపై కూడా దాడి జరిగింది. ఒకవైపు ఉద్యమం జరగడం, మరోవైపు హింసాకాండ, వాటిపై కేసులు , తర్వాత ఆ కేసులు ఎత్తివేతకు తిరిగి ఆందోళన జరగడం ఆనవాయితీగా, ఒక సర్కిల్ గా మారింది. ఇందులో భాగంగానే అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండు చేస్తూ మహాధర్నా చేపట్టినట్లు జెఎసి ఛైర్మన్ కోదండరామ్ ప్రకటించారు.ఉద్యమాలలో ఇలాంటివి తప్పవేమో.
- కొమ్మినేని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!