దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!


దోమల శృంగారంపై పూర్తి అవగాహన ఉంటే, డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా, నిజమేనంటున్నారు అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలోని జీవరసాయన శాస్త్రవేత్తలు.
  ఆడెస్ ఈజిప్టీ దోమల సెక్స్ లో ఒక రకమైన రసాయన చర్యల పట్టికను శాస్త్రవేత్తలు గుర్తించారు. మగదోమ స్పెర్మ్ లో ఉండే వంద రకాల ప్రొటీన్లు ఆడదోమల్లోని లక్షణాల్లో శాశ్వత ప్రాతిపదికన  మార్పులు తీసుకువస్తాయి. అవి ఆహారం (రక్తం) తీసుకునే విషయంలోనూ, అండాలను విడుదల చేయడంలోనూ, కలయక పద్ధతుల్లోనూ ఈ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడతాయట. మగ దోమల్లో అంతకు ముందు కూడా కొన్ని రకాల ప్రొటీన్లు గుర్తించినా, సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఏ తరహా ప్రొటీన్లు ఆడదోమలోకి స్పెర్మ్ ద్వారా పోతున్నాయో ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ఈ ప్రొటీన్లను స్పష్టంగా గుర్తించడం వల్ల రాబోయే కాలంలో ఆడ దోమలు పుట్టకుండా చేయడానికి వీలుచిక్కుతుందనీ, అప్పుడు డెంగ్యూ, వెస్ట్ నిలే వంటి వైరస్ ల వల్ల మనుషుల్లో జ్వరాలు రాకుండా చూడవచ్చని కార్నెల్  యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 అసలు సంగతేమిటంటే, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ఆడ దోమల వల్లనే వస్తున్నాయి. ఆడ దోమలు మనిషిని కుట్టడం వల్ల (రక్తం కోసం) అందులోని ప్రాణాంతక వైరస్ క్రిములు మనిషిలోకి ప్రవేశించి డెంగ్యూ వంటి రోగాలను కలగజేస్తున్నాయి.ఈ రోగాల కారణంగా ప్రపంచమంతటా ఏటా లక్షలాది మృత్యువాత పడుతున్నారు.
 దోమల్లోని ప్రొటీన్ల మ్యాప్ ని గుర్తించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టే వ్యూహాలను సమర్థవంతంగా చేపట్టవచ్చన్నది శాస్త్రవేత్తల యోచన. ఆడదోమల్లో అండాల తయారీని నివారించవచ్చు. అంతేకాదు, ఆడదోమల్లో రక్తం `దాహాన్ని' కూడా తగ్గించవచ్చు. అప్పుడు దోమల సంఖ్య తగ్గడంతోపాటుగా, వాటిలో రక్తం పీల్చాలన్న ఆలోచనలు తగ్గిపోతాయి. ఫలితంగా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధి దోమల ద్వారా వ్యాప్తిచెందడం తగ్గిపోతుందన్నది శాస్త్రవేత్తల ఆలోచన.
- సైన్స్ డెస్క్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!