మాజీమంత్రి జెసి కొత్త ఫిటింగ్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భూ కేటాయింపుల విషయంలో జాగ్రత్తగా అడుగు వేస్తూ ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలని భావిస్తుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆయనకు చుక్కెదురు అవుతోంది.భూకేటాయింపులపై సభా కమిటీని వేస్తామని కాని, అన్నిటికి వర్తింప చేస్తే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి ఆటంకం కలుగుతుందని శాసనసభలో కిరణ్ చెప్పారు. కొన్ని నిర్దిష్టమైన కేసులలో సాక్ష్యాధారాలు ఉంటే వాటిపై కమిటీ వేయడానికి సిద్దమేనని అంటూ ఆ బాద్యతను ఉప సభాపతికి అప్పగిస్తున్నామన్నారు. కిరణ్ తాను వై.ఎస్. రాజశేఖరరెడ్డికి వ్యతిరేకం కాదన్న భావన కలిగించడానికి యత్నిస్తూనే, ఆయన హయాంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. అసలు ఈ సభా సంఘం ఎలా ఉంటుందో,ఏమి పరిశీలిస్తుందో తెలియక ముందే ఇది వివాదంగా మారింది. వై.ఎస్. జగన్ ఇప్పటికే ఇది కాంగ్రెస్ , టిడిపి కలిసి చేస్తున్న కుట్ర అని ద్వజమెత్తితే, కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి కొత్త పిటింగ్ పెట్టారు.1994 నుంచి ఇప్పటివరకు చేసిన భూ కేటాయింపులపై సభాసంఘాన్ని వేయాలని డిమాండు చేస్తున్నారు.అప్పుడే వాస్తవ విషయాలు బయటికి వస్తాయని ఆయన అన్నారు. ఒకరకంగా జెసి పరోక్షంగా జగన్ చెబుతున్నట్లుగా కాంగ్రెస్, టిడిపిల మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న సంకేతాన్ని ఇవ్వడానికి యత్నిస్తున్నారు.2004 నుంచి 2009 వరకు వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో దివాకరరెడ్డి కూడా మంత్రి గా ఉన్నారు.
ఆ సమయంలో జరిగిన భూ కేటాయింపులకు మంత్రివర్గ సభ్యుడిగా ఆయన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఆయన తెలుగుదేశం హయాంతో సహా మొత్తం పదిహేనేళ్ల కేటాయింపులపై సభా సంఘం విచారణ చేయాలని సూచిస్తున్నారు. ఈ రకంగా ఈ వ్యవహారం రోజుకో వివాదంగా మారుతోంది.
- కొమ్మినేని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!