అమ్మా, విలీనం చేస్తాం... రాష్ట్రం ఇచ్చేయండి

 అమ్మా.. విలీనం చేస్తాం.. రాష్ట్రం ఇచ్చేయండి. వచ్చే జూన్ నెలలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయండి. ఆ తర్వాత తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాం అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పినట్టు సమాచారం. ఇవి బయటకు పొక్కడంతో తెరాసకు చెందిన అగ్రనేతలు వివరణ ఇచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్‌లో ఎంఎస్ఓల సమావేశం జరిగింది. ఇందులో తెరాస అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇచ్చినట్టు చెప్పారు.
   రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె విధించిన షరతుకు తాను సమ్మతించానని చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పానని ఆ సమావేశంలో గుర్తు చేసినట్టు వినికిడి. పదేళ్ళ పాటు హైదరాబాద్ ఇరు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రాంతానికే హైదరాబాద్ రాజధానిగా వ్యవహరిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
   ఈ వ్యాఖ్యలను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ స్క్రోలింగ్‌లో ప్రసారం చేసింది. ఆ వెనువెంటనే కేసీఆర్ మినహా తెరాస నేతలు హరీష్ రావు, రఘునాథ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి వంటి వారు ఆ ఛానల్‌కు ఫోన్ చేసి.. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో తెరాస విలీన కాదని స్పష్టం చేశారు. ఇవంతా కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెరాస బలమైన రాజకీయశక్తిగా తన పాత్రను పోషిస్తుందని స్పష్టం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!