మధుయాష్కీ ఫ్యామిలీవి నకిలీ సర్టిఫికెట్లేనా?


నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధుయాష్కీ కుటుంబసభ్యులు కొందరు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో అమెరికా వీసాలు సంపాదించినట్లుగా పోలీసులు నిర్దారించారు. మధుయాష్కీ సోదరులు వివేకనందా యాష్కీ, సుధాకర్ యాష్కీ, సోదరి అమరజ్యోతిలు ఈ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులు చేసిన దర్యాప్తు నివేదికలోని అంశాలను డెక్కన్‌ క్రానికల్ ప్రచురించింది. ఆ వివరాలు ప్రకారం దర్యాప్తు అధికారి గుల్బర్గా, కాకతీయ యూనివర్శిటీలకు సిబ్బందిని పంపి యాష్కీ కుటుంబసభ్యుల డిగ్రీ సర్టిఫికెట్ల వాస్తవికతపై పరిశోధన చేయించారు. గుల్బర్గా యూనివర్శిటీ రిజిస్ట్రార్, కాకతీయ వర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలాయి. వివేకనందయాష్కీ, అమరజ్యోతిలు నకిలీ ఇంజనీరింగ్ డిగ్రీలు, సుధాకర్ బిఎస్సీ నకిలీ ఢిగ్రీని ఢిల్లీలోని అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్‌కు హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధుయాష్కీ కుటుంబసభ్యుల దొంగ సర్టిఫికెట్లపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు 2008 జనవరి 4 న ఫిర్యాదు చేశారు. తదుపరి డిజిపి హైదరాబాద్ పోలీస్‌కు ఆ కేసును రిఫర్ చేయగా, సిసిఎస్ ఆ కేసును దర్యాప్తు చేసింది. విశేషమేమిటంటే 2008 ఫిబ్రవరి 22నాటికే దర్యాప్తు పూర్తయినప్పటికీ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో గోనె ప్రకాశరావు హైకోర్టును ఆశ్రయించగా వాస్తవపరిస్థితిని తెలియజేయాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసుతో తనకు సంబంధం లేదని మధుయాష్కీ అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్యభూమిక పోషిస్తూ కొందరు కాంగ్రెస ఎంపీల పైనే తీవ్రస్థాయి ఆరోపణలు చేసే మధుయాష్కీకి ఇది ఇబ్బందికర పరిస్థితి. మధుయాష్కీకి ఈ కేసుతో సంబంధం ఉన్నా లేకపోయినా తన స్వంత కుటుంబసభ్యులే ఈరకమైన మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడవడంతో ఆయన కూడా సంజాయిషీ ఇచ్చికోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- కొమ్మినేని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!