ప్రళయ సంకేతాలు


సౌర తుపాను వచ్చేస్తోంది.
ఆకాశంలో రెండో సూర్యుడు కనబడబోతున్నాడు...
పదమూడవ రాశి వచ్చేసింది.
అందరి బంధువైన చందమామ  విలన్ గా మారిపోయాడు...

గ్రహశకలం భూమిని ఢీకొనబోతోంది...
అన్నీ ఆకాశ వింతలే...
ఏవో భయాలు, మరేవో ఆందోళనలు కలిగించే దృశ్యాలే...

ఇవన్నీ ఎప్పుడో వేలాది సంవత్సరాల తరువాత రావడంలేదు.
అతి సమీపకాలంలోనే ఈ ఖగోళ వింతలు జరగబోతున్నాయి.
అంటే, 2012, లేదంటే, 2013లో ఈ వింతలు జరగబోతున్నాయన్నమాట.
ఏ వింతకు ఆ వింతను విశ్లేషించుకుంటే, శాస్త్రీయ కారణాలు గోచరించవచ్చు.
కేవలం ఖగోళ వింతగానే భావించాలే తప్ప, భయపడకూడదంటూ ధైర్యవచనాలు చెప్పుకోవచ్చు.
అయితే, ఇవన్నీ ముప్పేట దాడిలా రానున్న ఒకటి రెండేళ్లలోనే రావడమేమిటి! సరిగా ఇదే సమయంలో ప్రళయం తప్పదనీ, యుగాంతం అవుతందంటూ  శతాబ్దాల కిందటే చెప్పిన కాలజ్ఞానానికీ, ఈ వింతలకూ ఏమైనా సంబంధం ఉన్నదా? గ్రహశకలం 2012 డిసెంబర్ లో ఢీకొనబోతున్నదంటూ చెబుతున్న వాదనకు ఊతం ఇచ్చేలా ఈ వింతలు ఎందుకు జరగబోతున్నాయి? ఇది,
కాకతాళీయమా...? లేక ప్రళయ సంకేతాలా?

ప్రపంచ కత్రినా
కత్రినా పేరు వినే ఉంటారు. అమెరికాను అతలాకుతలం చేసిన కత్రినా పెనుతుపాను కంటే కోటానుకోట్ల రెట్టు కీడు చేసే సోలార్ సునామీ అతి త్వరలోనే విరుచుకుపడబోతున్నది. అందుకే దీన్ని ప్రపంచ కత్రినా గా పిలుస్తున్నారు.  ఏక్షణంలోనైనా సూర్యుడి నుంచి అసాధారణరీతిలో విద్యుదావేశ పదార్ధాలు భారీగా భూమివైపుకు దూసుకురాబోతున్నాయి.
 సౌర తుపాను ఏ క్షణంలోనైనా భూమిని తాకవచ్చు. అదే జరిగితే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి? ఇప్పుడు ఇదో పెద్ద చర్చనీయాంశమైంది. సూర్యునిపై ఏర్పడిన విద్యుత్‌ రేణువులు భూమివైపుకు దూసుకువచ్చేస్తున్నాయి.  సూర్యుడిపై 1092వ సన్‌స్పాట్ పై ఈ మధ్య పెద్ద పేలుడు సంభవించడంతో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.
 అయస్కాంత వ్యవస్థల అసహజ కదలికల వల్ల ఏర్పడిన సౌర సునామీ ఎప్పుడు రాబోతున్నది. అది చుట్టుముట్టినప్పుడు వాతావరణంలో ఎలాంటి మార్పులు ఏర్పడబోతున్నాయన్నదే అసలు ప్రశ్న..
  సూర్యుడి వాతావరణంలోని అయస్కాంత వ్యవస్థల్లో తీవ్రమైన అలజడి ఏర్పడింది.  ఈ కారణంగా,  ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతి, నిప్పు రవ్వలు కనబడతాయని అంటున్నారు. కాలచక్రంలో సూర్యుడు అత్యంత చురుకైన దశలోకి చేరుకుంటున్నాడు. దీంతో దుష్ప్రభావాలు తీవ్రంగానే ఉండవచ్చని భావిస్తున్నారు. 2013లోకానీ, లేదా ఆ తరువాతకానీ ఈ పరిస్థితి తలెత్తవచ్చు.

సోలార్ సునామీ తెచ్చే నష్టాలు
2012లో ప్రళయం వచ్చేస్తుందంటూ చెప్పిన జోస్యాల్లాంటిది కాదిది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ - నాసా తేల్చిచెప్పిన నిజం. భూమిమీద జీవరాశికి ఎలాంటి ముప్పులేకపోయినా, మనం సృష్టించిన ఉపగ్రహాలకు మాత్రం పెద్దనష్టమే వాటిల్లుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 సూర్యుడిలో అనూహ్యంగా ఏర్పడుతున్న పరిణామాల కారణంగా, విస్పోటన పదార్ధాలు భూమి దిశగా వేగంగా దూసుకువచ్చేస్తున్నాయి. ఇదే జరిగితే భూమిపై ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. మారణహోమం జరగకపోయినా, సమాచార వ్యవ్యస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం లేకపోలేదు.
సూర్యుడినుంచి భారీఎత్తున జ్వాలలు దూసుకురాబోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌరజ్వాలల కారణంగా, తలెత్తిన అయాస్కాంత తుపాను గతంలో కూడా ఓసారి వచ్చింది.  1859లో కల్లోలం సృష్టించింది.

 సౌర సునామీ విరుచుకుపడినప్పుడు ఆకాశంలో రాత్రివేళ  అరోరా కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. రంగురంగుల ఆ కాంతిలో ఆ కాంతిలోనే పత్రికలు, పుస్తకాలు చదువుకోవచ్చు.
సౌరతుపాను కారణంగా జరగబోయే నష్టాన్ని అమెరికా వంటి దేశాలు ఇప్పటికే అంచనావేశాయి.

సౌరజ్వాలలు ఎగిసిపడితే
జరిగే నష్టాలు...

.........................
- టెలిగ్రాఫ్ తీగలపై ప్రభావం
- పలుచోట్ల అగ్నిప్రమాదాలు
- ఆకాశంలో అరోరా కాంతి
- విమాన సర్వీసలకు దెబ్బ
- సమాచార వ్యవస్థకు విఘాతం
- బ్యాంక్ సేవలకు అంతరాయం
- రేడియో వ్యవస్థకు దెబ్బ
- ఉపగ్రహాలకు తీవ్ర నష్టం
- విద్యుత్ కు అంతరాయం



ఆకాశంలో రెండో సూర్యుడు

..........................
ఆకాశంలో మరో వింత త్వరలోనే చూడబోతున్నాం. చిత్రమేమంటే ఇది కూడా సూర్యుడికి సంబంధించిందే. ఆకాశంలో రెండో సూర్యుడు వచ్చేస్తున్నాడని - ఈ మధ్య వార్తలొచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉన్నదో తెలియదుకానీ, ఊహలకు రెక్కలొచ్చాయి. దీంతో అనేక భయాలు వచ్చేస్తున్నాయి.
   ఒక సూర్యుడు భగభగమండితేనే తట్టుకోలేకపోతున్నాం. కానీ అతిత్వరలో మనం మరో ఖగోళ అధ్బుతాన్ని చూడబోతున్నాం. ఓ అధ్బుతమైన కాంతి మన భూమిపై పడబోతున్నది. అది సూర్యుడి నుంచి వచ్చింది కాదు. ఎక్కడో సుదూరంలో ఉన్న ఒక నక్షత్రం సూపర్ నోవా దశకు చేరుకుంది. ఈ కారణంగా దేదీప్యమానంగా వెలుగులు ప్రసరిస్తాయి. ఆ వెలుగు కిరణాలు అంతరక్షంలో ప్రయాణిస్తూ మన భూమికి చేరబోతున్నాయి. నిజం చెప్పాలంటే, 640 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బీటల్ గూస్ అనే నక్షత్రం ఎప్పుడో `డెడ్' అయింది. ఆ సమయంలో వెలువడిన కాంతి సుదూర అంతరిక్షంలో ప్రయాణం చేస్తూ ఈ భూమికి ఇప్పుడు చేరబోతున్నది.
సూపర్ నోవా వెలుగుల ప్రభావం ఇలా ఉంటుంది...
- రాత్రి  పగలుగా మారిపోతుంది.
-  కొన్ని వారాల పాటు ఇదే పరిస్థితి.
- కొంతకాలానికి వెలుగులు అదృశ్యం
- మళ్ళీ మామూలు పరిస్థితి

నక్షత్ర విస్ఫోటనం- సూపర్ నోవా
.................................
రాత్రిపూట వెలుగులు కనబడినంతమాత్రాన రెండో సూర్యుడు వచ్చాడని ఎలా అనుకోగలం? మరి శాస్త్రవేత్తలు ఈ నక్షత్ర కాంతిని రెండో సూర్యునితో ఎందుకు పోలుస్తున్నారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
  బీటిల్ గూస్ నక్షత్ర విస్ఫోటనం చెందతో వెలువడిన కాంతి పుంజాలు పగటి పూట స్పష్టంగానే కనబడతాయి. అయితే, ఆ సమయంలో ఈ కాంతి పుంజం రెండో సూర్యునిలా ప్రకాశిస్తుందని కొందరంటున్నారు.అందుకే, భూమిపై రెండో సూర్యుడు కనబడతాన్న ప్రచారం వచ్చేసింది.
 భూమి పుట్టిన నాటి నుంచి ఇలాంటి అద్భుతం జరిగిందా...? అన్న సందేహం రావచ్చు. నిజమే, సూర్యుడి నుంచి ఈ భూమి ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ఖగోళ వింతలు చోటుచేసుకున్నాయి. అయితే, సూపర్ నోవా కారణంగా నక్షత్ర విస్ఫోటన కాంతి పుంజాలు అంతరిక్షయానం చేసి భూమికి చేరడమన్నది ఎప్పుడైనా జరిగిందా లేదా అన్నది కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే, దీనికి ఆధారాలు ఎక్కడాలేవు. పైగా కోట్లాది సంవత్సరాల కాలగమనంలో జరిగే మార్పులు శాస్త్రవేత్తల ఊహలకు కూడా అందడంలేదు.

సూపర్ నోవా - ప్రళయం
.........................
 భూమి చరిత్రలోనే అరుదైన ఈ ఘటన కచ్చితంగా ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై మాత్రం శాస్త్రవేత్తలు ఓ అంచనాకు రాలేక పోతున్నారు. మాయన్ క్యాలెండర్, డూమ్స్‌డే సిద్ధాంతం ప్రకారం..2012లో యుగాంతం వస్తోందని, ఈ సూపర్‌నోవాతోనే ప్రళయం సంభవిస్తోందని ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ సూపర్‌నోవా నక్షత్రం విస్తరించే సమయంలో భారీ శబ్ధంతో కూడిన పేలుడు సంభ విస్తుందని, ఆకాశం ప్రకాశవంతమై, దాని నుంచివెలువడిన అతిచిన్న కణాలైన న్యూట్రినోలు, అంతరిక్షంలో భారీ స్థాయిలో వర్షిస్తాయని అంటున్నారు.
సూపర్‌నోవాలోని 99 శాతం శక్తి , న్యూట్రినోల రూపంలో వెలువడుతుంది. ఈ న్యూట్రినోలు భూమిలోకే కాక మానవుల శరీరంలోకి చొచ్చుకుపోతాయి. మరి వీటివల్ల  ఉపద్రవాలు తప్పవని కొందరు వాదిస్తున్నారు.

నక్షత్ర కాంతి ఎప్పుడొస్తుంది?
...............................
`బీటెల్ గ్యూస్' నక్షత్ర కాంతి ఎప్పుడు భూమిని చేరుతుంది? 2012 డిసెంబర్ లో ప్రళయం రాబోతున్నదని అంతా అంటున్నారు. సరిగా అదేసమయంలో అద్భుత వింతకాంతులు ఆకాశంలో కనిపించబోతున్నాయా? ఒక వేళ ఇదే నిజమైతే, ఇది దేనికి సూచిక... మంచికా? చెడుకా?
   బీటెల్ గ్యూస్ విరజిమ్మే కాంతి పుంజాలు ఎప్పుడు భూగోళానికి చేరతాయన్న విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అది అంతా ఊహిస్తున్నట్టు 2012లో వచ్చేస్తుందని కొందరు అంటుంటే, అదేమీకాదు, మరో లక్ష సంవత్సరాల తరువాత కానీ సూపర్ నోవా కాంతి భూమికి చేరదని మరికొందరు వాదిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, అంతా భయపడుతున్నట్టుగా రెండో సూర్యుడిలా ఈ కాంతి పుంజాలు ఉండకపోవచ్చు. ఆమాటకొస్తే, చంద్రుడు విరజిమ్ముతున్నంత కాంతి కూడా ఉండకపోవచ్చు. మహాఅయితే, శుక్రగ్రహం కంటే కాస్తంత ఎక్కువ ప్రకాశవంతంగా బీటెల్ గ్యూస్ కాంతి పుంజాలు ఉండవచ్చని మరికొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది ఖగోళశాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగించే దృశ్యమే అవుతుందే తప్ప, ప్రళయాన్ని సృష్టించదన్నది కొందరి వాదన.

పదమూడవ రాశి
..................

  మీన మేషాలు లెక్కిస్తున్న మనం ఇప్పుడు పదమూడోరాశి గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. సర్పధారి ఆకారంలో వినీల ఆకాశంలో కనపిస్తున్న ఈ నక్షత్ర రాశి మానవులపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నది.
  మనిషి హాయిగా బతకాలంటే అదృష్టదేవత చేయిపట్టుకుని నడవాలని అంటారు. అదృష్టం కలిసివస్తేనే నిచ్చెనలు టకటకా ఎక్కేయవచ్చని కూడా చాలామంది నమ్ముతుంటారు. మరో పక్క హేతువాదులు మాత్రం, ఎక్కడో దూరాన ఉన్న నక్షత్రాలకీ, అదృష్టానికీ ముడిపెట్టడాన్ని విమర్శిస్తూనే ఉన్నారు.  అయితే, ఎవరి ఆలోచనలు వారివి...మానవ జాతి మనుగడను నక్షత్రరాశులు శాసిస్తన్నాయన్నది -  ఒక్క మనదేశంలోనేకాదు, ప్రపంచమంతటా విశ్వసిస్తున్న నమ్మకం.  అందలం ఎక్కించినా, అధోపాతాళానికి తోసేసినా రాశి ఫలం వల్లనే జరుగుతుందని జ్యోతిష పండితులు నొక్కి వక్కాణిస్తున్నారు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశులను లెక్కలోకి తీసుకుని జాతకాలు చెబ్తున్న వారంతా ఇప్పుడు అయోమయంలో పడిపోతున్నారు. ఎందుకంటే, ఇప్పుడు సర్పధారి రాశి వచ్చి చేరింది. దీంతో మొత్తం రాశుల సంఖ్య 13కి చేరింది. మారిన రాశుల సంఖ్యతో మనుషుల జాతకాలు కూడా మారబోతున్నాయా?

ఒఫికస్...ఇదే సర్పధారి రాశి
.............................

 పదమూడవ రాశి పేరు - ఒఫికస్.  రాబోయే ఎండాకాలంలో ఉత్తర దిక్కున  ఈ కొత్త నక్షత్ర రాశిని తుల, వృశ్చిక, ధనస్సు రాశుల వద్ద చూడవచ్చు.
మనిషి సర్పం పట్టుకున్నట్టుగా ఈ రాశి ఉంటుంది. ఈ నక్షత్ర మండలం గురించి శాస్త్రవేత్తలు ముందుగానే అంచనావేశారు.

13వ రాశి - వివరాలు
..................
- ఆకారం: సర్పధారి
- ప్రధాన నక్షత్రాల సంఖ్య: 10
- చిన్నాచితకా నక్షత్రాలు; 62
- ప్రకాశవంతమైనవి: 5
- సమీప రాశులు: తుల, ధనస్సు


ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు 88 నక్షత్ర రాశులను గుర్తించారు. అయితే, వాటిలో ఇప్పటివరకు 12 మాత్రమే పాపులర్ అయ్యాయి. వీటి చుట్టూనే జాతక చక్రాలు అల్లుకుంటున్నాయి.

13వ రాశి - చరిత్ర
.....................
పదమూడవ రాశి ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షమైనది కాదు. నిజానికి దీని ఉనికి గురించిన ప్రస్తావన గ్రీకు పురాణాల్లో కూడా ఉన్నదని అంటున్నారు. మరణాన్ని జయించాలన్న తపనతో పాముల నుంచి విద్య నేర్చుకున్నఒక వ్యక్తి పేరిటే ఈ నక్షత్ర మండలాన్ని అప్పట్లో గుర్తించినట్టు చెబుతున్నారు.
  ఒఫికస్ రాశి ఆకారం సర్పాన్ని పట్టుకున్న వ్యక్తి ఆకారంలో ఉండటంతో అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఆస్కెలిపియస్ అనే వ్యక్తి పాముల నుంచి మరణానికి విరుగుడు గుర్తించాడు. ఒక పాము మరోపాముకు మూలికలతో వైద్యం చేయడం గమనించి వాటి ద్వారా మరణాన్ని జయించాడు. మొత్తం మానవాళికి మరణం లేకుండా చేద్దామనుకున్నాడు ఆస్కెలిపియస్. ఈ విషయం తెలిసి జీయస్ అతన్ని చంపేశాడు. కానీ ఆస్కెలిపియస్ చేసిన మంచి పనికి నిదర్శనంగా స్వర్గంలో అతని రూపాన్ని ప్రతిష్టించారు. అదే ఒపికస్ అని చెబ్తున్నారు.

 సర్పధారి - అరిష్టం
.....................
2012లో ప్రళయం వస్తుందంటూ వాదనలు వినిపిస్తున్న టైమ్ లోనే ఈ 13వ రాశి వెలుగుచూడటమేమిటి? 13 అంకె శుభప్రదం కాదనీ, ఖచ్చితంగా ఈ భూగోళానికి ఏదో కీడు జరగబోతున్నదన్న వాదనలు కూడాపుట్టుకొచ్చాయి.   సర్పధారి రాశి కనిపించడం ప్రళయానికి సంకేతమన్న వాదనలు ఇప్పుడు బలంగా వినబడుతున్నాయి. 2012 డిసెంబర్ లో ఈ రాశి కారణంగానే ప్రళయం సంభవించబోతుందన్న ప్రచారం జరుగుతోంది.
మరో పక్క పదమూడవ రాశి రావడంతో అందరి జాతకాలు తారుమారు అవుతాయన్న వాదనలు కూడా బలంగా వినబడుతున్నాయి.

ఇంకా రాశులు పెరుగుతాయా?
................................
 నిన్నటి దాకా 12 రాశులనుకున్నాం. ఇప్పుడు పదమూడో రాశి వచ్చేసింది. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేకుంటే, 14వ రాశి, ఆపైన,15వరాశి వచ్చేస్తాయా....? అసలు, వినీల ఆకాశంలో కొత్త ఆకారాలు ఎందుకు కనిపిస్తున్నాయి? దీనికి కారణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం...
  మనలో చాలామంది బస్సులో ప్రయాణం చేసే ఉంటారు. మనకు తెలిసిన ప్రాంతామీదగా బస్సు వెళుతుంటే, పెద్దగా పట్టించుకోం. అదే, కొత్త ప్రాంతాల్లోకి వెళ్లగానే అప్పటి వరకు చూడని దృశ్యాలు కనబడుతుంటాయి. కొండలు, గుట్టలు, సెలయేర్లు కనిపించవచ్చు. వాటి ఆకారాలను బట్టి వాటికి పేర్లు పెట్టుకోవచ్చు. సరిగా ఇలాంటిదే, అంతరిక్షంలో సౌర కుటుంబ ప్రయాణం. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. ఈ కారణంగానే సూర్య ప్రయాణం అంటే, అందులో అన్ని గ్రహాల ప్రయాణం ఉన్నట్టే. అంటే సూర్య ప్రయాణమే, మన భూమి ప్రయాణమన్నమాట. సౌరకుటుంబం తన కక్ష్యలో సాగిపోతుంటే, కొత్తకొత్త నక్షత్ర మండలాలు కనబడుతుంటాయి. ఇప్పటివరకు మనకు తెలిసిన నక్షత్ర మండలాల ప్రాంతం నుంచి బయటకు వెళితే, కొత్తకొత్త నక్షత్ర మండలాలు కనబడతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే.
  భూమి కాలమానం ప్రకారం, ఇలా నక్షత్ర మండలాలు పూర్తిగా మారాలంటే, బహుశా వేలాది సంవత్సరాలు పట్టవచ్చు. అంటే, ఇప్పుడున్న మీనం, మేషం వెయ్యిఏళ్ల తరువాతనో, రెండువేల సంవత్సరాల తరువాతనో, ఇలాగే  కనపిస్తూనే ఉంటాయని అనుకోవడానికి వీల్లేదు. కాలగమనంలో కొత్తరాశులు వస్తూనే ఉంటాయి. పాత రాశులు కనుమరుగు అవుతుంటాయి. ఇదంతా సహజమని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

సూపర్ మూన్
.................

మరో పది రోజుల్లో భూమికి చంద్రుడు 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చేరువకు రావడంతో భూకంపాలు , అగ్నిపర్వత విస్ఫోటనాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నాయి. జపాన్ లో పెనుభూకంపం, సునామీ, అగ్నిపర్వతం పేలిపోవడం మనం కళ్లారా చూశాం. చంద్రుడు అత్యంత సమీపంగా భూమికి చేరడాన్ని
'ఎక్స్‌ట్రీమ్‌ సూపర్‌ మూన్‌'  ప్రభావం అని అంటున్నారు. మార్చి 19న ఈ వింత చోటుచేసుకోబోతున్నది. చంద్రుడు భూమికి 2,21,556 మైళ్ల దగ్గరకు వస్తాడు. ఇలా జరగడం గత 20 ఏళ్ళలో ఇదే మొదటిసారి. గతంలో 1955, 1974, 2005ల్లో ఇటువంటి సూపర్‌మూన్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సంవత్సరాలన్నిటిలో వాతవరణంలో మార్పులు సంభవించాయి.
దగ్గరైనా, దూరమైనా ప్రమాదమే
.................................
  చంద్రుడు భూమి నుంచి దూరంగా జరిగివెళ్ళినా, లేదా భూమిని ఢీకొన్నా, ప్రళయం తప్పదు. అనేక ఉత్పాతాలు ఏర్పడతాయి. చంద్రుడు లేని భూమిపై మానవజాతి బతికుండే ఛాన్సే లేదంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, అప్పటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా భూమిపై కొత్త జాతులు ఆవిర్భవించవచ్చు. అవి మనం ఇప్పుడు చూస్తున్న జీవులతో పాటుగా కొత్త రకాల జీవులు కూడా ఆవిర్భవించవచ్చు. ముఖ్యంగా చీకట్లో బతకడానికి ఇష్టపడే జీవులకు ఈ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 ఒక వేళ చంద్రుడు భూమిని ఢీకొంటే, ప్రళయం తప్పదు. దాదాపుగా భూమిపై జీవరాశి మాడిమసైపోతుంది.
 కాలం కలిసివచ్చినప్పుడు అంతా మంచిగానే ఉంటుంది.
అదే, చెడ్డకాలం దాపురించినప్పుడు, దారిన పోతుంటే నెత్తిమీద పిడుగు పడవచ్చు. ఇంట్లో కూర్చున్నా, పైకప్పు కూలవచ్చు. ఇప్పటివరకు ఎలా ఉన్నా, ఇక మన భూమికి గడ్డుకాలం వచ్చేసిందని చెప్పేవారి సంఖ్య ఎక్కువ అయింది. సౌరసునామీ వచ్చేస్తోంది. మరో పక్క, రెండో సూర్యడిని తలపించేలా  ఎక్కడో దూరాన ఉన్న నక్షత్రం నుంచి అనూహ్యమైన రీతిలో కాంతి పుంజాలు వచ్చేస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే, ఆకాశాన పదమూడవ రాశి కనబడుతోంది. 2012లో గ్రహశకలం ఢీకొంటుందన్న వాదన ఉండనే ఉంది. మొత్తంగా చూస్తే, వచ్చే రెండుమూడు ఏళ్లలో అనేక ఖగోళ వింతలు చోటుచేసుకోబోతున్నాయనే చెప్పాలి. వీటిని కేవలం వింతలుగానే భావించాలా? లేక, ప్రళయకాల సంకేతాలుగా గుర్తించాలా...? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.
                          - తుర్లపాటి నాగభూషణరావు
                               98852 92208
                            

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!