జ `గన్' పేలితే రాలే ఓట్లు...?

   రాష్ట్రంలో రోజురోజుకీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. నిన్నమొన్నటిదాకా ప్రతిపక్షనేతగా ఉన్న కొణిదెల శివశంకర వరప్రసాద్...అదేనండీ...మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దర్జాగా  కాంగ్రెస్ కు సలామ్ కొట్టేశాడు. మరో పక్క నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్ ఎంపీగా చలామణి అయిన జగన్మోహన్ రెడ్డి (జగన్) కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి సొంతపార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే, ఈ రెండూ చాలా ముఖ్యమైన రాజకీయ పరిణామాలే. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల దాని ప్రభావం జగన్ మీద ఏమేరకు ఉంటుందన్నది ఇప్పుడు తలెత్తిన ప్రశ్న. జగన్ వర్గీయులు మాత్రం, చిరు ప్రభావం జగన్ మీద ఉండదనే అంటున్నారు. అయితే, రాజకీయ సర్వేలు మాత్రం సుమారు ఆరుశాతం వరకు ప్రభావం ఉంటుందని అంటున్నారు.
 ఇక రెండో కీలక అశం. రెడ్డి ఓట్లు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే రెడ్డి ఓట్లు చీలిపోతాయా?ఇది మరో ప్రశ్న. మహాఅయితే, ఐదు శాతం ఓట్లు మాత్రమే చీలిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
 మరో ముఖ్యమైన అంశం... మీడియా ప్రభావం. ఈ మధ్యకాలంలో మీడియా తిమ్నిని బ్రహ్మిని చేస్తోంది. జీరోని హీరోగా చూపుతోంది. వీధి రౌడీని రాజకీయవేత్తగా చిత్రీకరిస్తోంది. కనుక, వచ్చే ఎన్నికల్లో మీడియా ప్రభావాన్ని విస్మరించలేం. అయితే, ఈ ప్రభావం వల్ల జగన్ కు కలిసొచ్చే ఓట్లు ఐదు శాతం దాటవు.
 అన్నింటికంటే, ముఖ్యమైన విషయం మరచిపోయాం. అదే...జగన్ పట్ల సానుభూతి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో తలెత్తిన సానుభూతి రాబోయే ఎన్నికప్పుడు (2014 లేదా 2012) ఎంత ఉంటుందన్నది ఆలోచించాల్సిందే. ఏడాది కిందటికీ ఇప్పటికీ సానుభూతి పవనాల్లో మార్పు వచ్చిందనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో రెండుమూడేళ్ల తరువాత ఈ సానుభూతితో గెలవాలనుకోవడం కేవలం భ్రమే అవుతుందని జగన్ వ్యతిరేకులు ఆక్షేపిస్తున్నారు. పోనీ సానుభూతి ఉన్నప్పటికీ, ఎన్నికల వేళలో దీని ప్రభావం కేవలం ఒక్క శాతానికి మించదనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 జగన్ కు మరో వ్యతిరేక వైఖరి...తెలంగాణ పట్ల ఆయన సానుకూలత వ్యక్తం చేయకపోవడం. ఇది రెండు నుంచి 8 శాతం వరకు రాబోయే ఎన్నికల్లో ప్రభావితం చూపబోతున్నది. అయితే, కాంగ్రెస్ లోని అనైక్యత మాత్రం జగన్ కు కొంతలోకొంత కలసిరావచ్చు. ఇది 5 నుంచి 8 శాతం వరకు ఉంటుందని అంటున్నారు.
 మొత్తంగా చూస్తే, జగన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే, అనేక అంశాల్లో సానుకూల పవనాలు వీచాలి. మరి ఇదంతా సాధ్యమేనా...?లేదంటే, పిట్టపోరు - పిట్టపోరు పిల్లితీర్చిందన్నట్టుగా తెలుగుదేశం అధికారాన్ని ఎగరేసుకుపోతుందా...???

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!