ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

 ఈ శతాబ్దం నాదీ అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీకి ఒక శతాబ్దం నిండింది. మహాకవి 101వ జయంతి (శనివారం- 30-04-11) వేడుకల సందర్భంగా ఓసారి ఆ మహాకవిని స్మరించుకుందాం...
 కవితా మహర్షి మరో శతాబ్దిలోకి తన చైతన్యకాంతులను ప్రసరింపజేస్తున్నాడు. పాత పదాలకు కొత్త అర్థం కల్పించి కవిత్వానికి దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ .
 `ఆధునిక కవిత్వం అర్థంకాలేదంటే, ఆధునిక జీవితమే అర్థం కాలేదన్నమాట' అంటూ మోడర్న్ భావాలకు పెద్దపీట వేసిన దీర్ఘదర్శి మహాకవి శ్రీశ్రీ. అందుకేనేమో `పదండిముందుకు, పదండి తోసుకు '- అంటూ మరో ప్రపంచాన్ని ముందస్తుగానే చూపించాడు శ్రీశ్రీ. `రాబోవు యుగం నా యుగం అవుతుంది' అంటూ శాసించిన మహాకవి శ్రీశ్రీ. 1930 వరకు తెలుగుసాహిత్యం తనను నడిపిస్తే, ఆ తరువాత దాన్ని తానే నడిపించానంటూ సగర్వంగా చెప్పుకున్నవాడు శ్రీశ్రీ. అనతికాలంలోనే మహాకవిగా ఎదిగి తెలుగుసాహిత్యంలో మధ్యాహ్న భానుడిలా ప్రకాశించాడు శ్రీశ్రీ.
 `శ్రీశ్రీకంటే మిన్న- ఏదైనా వుంటే, అది శ్రీశ్రీ కవితే సుమా'- అన్నంతగా శ్రీశ్రీ కవితలు జనహృదయాల్లో నాటుకుపోయాయి.
 `భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను...
స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం
ఆవల వేదికముందు అస్రనైవేద్యం...'
అంటూ `ఐ' అన్న గీతికలో శ్రీశ్రీ తననుతాను ఆవిష్కరించుకున్నా...
 `పాపం, పుణ్యం, ప్రపంచమార్గం
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ, ఏమీ ఎరుగని పూవుల్లారా
అయిదారేడుల పాపల్లారా-
' అంటూ శైశవగీతిని ఆలపించినా,
`పోనీ, పోనీ, పోతే పోనీ, సతుల్, సుతుల్, హితుల్, పోనీ...' అంటూ కళారవిని వెన్నుతట్టినా అది శ్రీశ్రీకే చెల్లింది.
 శ్రీశ్రీకి అనేక సాహిత్య ప్రక్రియల్లో ప్రవేశముంది. కానీ పాఠకులకు శ్రీశ్రీ అనగానే ఆయనలోని కవే కనిపిస్తాడు. కష్టజీవికి రెండువైపులా కాపుకాసేవాడే కవి అని నమ్మినవాడు కాబట్టి శ్రీశ్రీలోని కవే `మహాకవి' అయ్యాడు. అప్పటివరకు ఆకాశపు దారులంట హడావుడిగా పరుగెత్తే కవిత్వాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించినవాడే శ్రీశ్రీ.
 కవిగానే కాకుండా పౌరహక్కుల ఉద్యమనేతగా, భారత- చైనా మిత్రమండలికి, `అరసం', `విరసం'లకు అధ్యక్షునిగా ఉన్న శ్రీశ్రీ వామపక్షాలకూ, అన్నింటికీ మించి పేదలకు కొండంత అండగా నిలిచాడు. అందుకే తెలుగువారు ఏమారుమూలన ఉన్నా గర్వంగా చెప్పుకునే మాట...`శ్రీశ్రీ మా వాడ'నే...
(శ్రీశ్రీ లో రెండు అక్షరాలే ఉన్నాయి. కానీ, ఆయన గురించి లోతుగా అధ్యయనం చేస్తే మూడు అంశాలు కనిపిస్తాయి...ఆ వివరాలు తరువాయి భాగంలో...)
 - రచన: తుర్లపాటి నాగభూషణ రావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!