ప్రధానిగా చంద్రబాబు !!


ఇదేంటీ...చంద్రబాబు ప్రధాని అంటూ `గాలి' ఫోటో చూపిస్తున్నారేంటీ...అనుకుంటున్నారా... పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది...
 తెలుగుదేశంలో సీనియర్ నాయకుడిగా ఉన్న గాలి ముద్దు కృష్ణమనాయుడుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ ప్రజలను ఆకర్షిస్తూ ఉంటారు. ఆయనలో విశిష్టత ఏమిటంటే ఎవరైనా గాలి భుజాన వేసుకుంటే ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అలాగే విమర్శించడం మొదలుపెట్టారో పాతాళానికి తీసుకు వెళ్లడానికి చూస్తారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి, గాలికి అసలు సరిపడేదికాదు. ఎన్.టి.ఆర్ జీవించి ఉన్నంత కాలం గాలి టిడిపిలో చంద్రబాబు వ్యతిరేక గ్రూపులో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉండేవారు. టిడిపి చీలిక సమయంలో ఎన్.టి.ఆర్ పక్షాన ఉన్న ముద్దుకృష్ణమనాయుడు, తదుపరి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గా ఉంటూ చంద్రబాబు ఎన్ని రకాల ఆరోపణలు చేశారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ముద్దు తదుపరి మళ్లీ టిడిపిలోకి వచ్చేశారు. ఆరోసారి నగరి నుంచి శాసనసబకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి చంద్రబాబు వీరమద్దతుదారుడిగా ఉంటున్నారు. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబునాయుడు దేశ రాజకీయాలలోకి వెళ్లి, కాంగ్రెస్ అవినీతిని పారదోలడానికిగాను ప్రధాని పదవి చేపట్టాలని గాలి సూచించారు. తెలుగుదేశం పార్టీని అందరి ఆమోదంతో మరొకరికి అప్పగించి నడిపించాలని కూడా ముద్దు అభిప్రాయపడ్డారు.దేశానికి 1996లోనే ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని ముద్దు చెప్పారు. అప్పట్లో యునైటెడ్‌ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఒక దశలో ప్రధాని అవ్వాలన్న ప్రతిపాదన వచ్చిందని అంటారు. అయితే తనకు ఇంకా వయసు ఉందని చెప్పి ఆయన తిరస్కరించారు. అప్పట్లో కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న దేవెగౌడ ప్రధాని అయ్యారు.కాని ఆయన ఏడాదిన్నర కూడా పదవిలో ఉండలేకపోయారు. తదుపరి వచ్చిన ప్రధాని ఐకె గుజ్రాల్ పరిస్థితి అంతే. దాంతో యునైటెడ్‌ ఫ్రంట్ కు చంద్రబాబు గుడ్ బై చెప్పి బిజెపి నాయకత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్ కు మద్దతు ఇచ్చారు. 1999లో తెలుగుదేశం పార్టీని బిజెపితో కలిసి విజయపధంలో నడిపించారు.కాని రెండువేల నాలుగులో, తిరిగి రెండువేల తొమ్మిది సంవత్సరంలో పరాజయం చెందడంతో ఆయన పార్టీ కాస్త క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఈ దశలో ముద్దుకృష్ణమ నాయుడు తాజాగా చంద్రబాబు దేశ రాజకీయాలలోకి వెళ్లాలని, టిడిపిని మరొకరికి అప్పగించాలని అనడం కొత్త చర్చకు అవకాశం కలుగుతోంది. బహుశా చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కు ఆ బాధ్యత అప్పగించాలన్నది ముద్దు ఉద్దేశ్యం కావచ్చు.
- kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!