మనిషి వేలాది సంవత్సరాలు బతకొచ్చా? (మరణంలేని జీవి పార్ట్ -3)

మరణం లేదని తెలిస్తే, ఎగిరిగంతేస్తాం. అయితే, దీంతోపాటు వృద్ధాప్యం కూడా లేకుండా వందలాది సంవత్సరాలు ఉత్సాహంగా బతుకు బండిని లాగించే ఛాన్స్ వస్తే, ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఇప్పుడు ఇది సాధ్యం కాకపోయినా, పురాతన కాలంలో మనిషి ఆయుఃప్రమాణం చాలా ఎక్కువేనని పురాణాలు చెబుతున్నాయి.
రాజులు, చక్రవర్తులు, మనులు, మహర్షులు ఎలా ఎందరో వేలాది సంవత్సరాలు హాయిగా జీవించారని పురాణాల్లో ఉంది.  మరణం ఎంతో భయంకరమైనది. అప్పటివరకు మనమధ్యనే ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి కట్టెలా మారిపోతే ఆ దృశ్యాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆదిమానవులు ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించారు. రాయి నుంచి నిప్పుపుట్టించగలిగారు. అదే రాయిని ఆయుధంగా మలుచుకోగలిగారు. శబ్దాల నుంచి సంగీతాన్ని పుట్టించగలిగారు. కానీ మరణం ఎందుకు వస్తుందో వారికి అర్థమయ్యేదికాదు. ఏదో పెనుభూతం తమలోని వారిని నోటికి కరుచుకుని వెళ్ళిపోతుందని అనుకునేవారు. కాసేపు చింతించేవారు, ఆ తరువాత మరచిపోయేవారు. కానీ ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది.
 కాలం మారుతున్నా, ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు. అయితే, క్రీస్తు పూర్వం 22వ శతాబ్దిలోనే గిల్గమేష్ అనే సాహసికుడు మరణాన్ని జయించడంకోసం తపించినట్టు చరిత్రపుటల్లో ఉంది.


  ఒకసారి హిందూ పురాణాలు తిరగేస్తే ఎంతో మంది పుణ్యపురుషులు వేలాది సంవత్సరాలు జీవించినట్టుగా కనబడుతుంది. రావణాసురుడు వేలాది సంవత్సరాలు జీవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మకోసం రావణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడట. అయినా బ్రహ్మ ప్రత్యక్ష్యం కాకపోవడంతో రావణాసురుడు ఒక తలను నరికి అగ్నికి ఆహుతి చేశాడు. ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒక తలను నరికేసుకున్నాడు. ఇదే నిజమైతే రావణబ్రహ్మ వయస్సు ఎంతై ఉండాలి? తపస్సుకే పదివేల సంవత్సరాలు పడితే, మొత్తం జీవిత కాలమెంత? ఇది నిజమేనా...లేక అభూతకల్పనా...
  పూర్వకాలంలో మునులు, రాజులు జువ్వి ఫలాలను ఆహారంగా తీసుకుంటూ పదివేల సంవత్సరాలకు పైగానే జివించినట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి. పృధూ అని పేరుగల చక్రవర్తి సముద్రగర్భంలో పదివేల సంవత్సరాల పాటు తన కుటుంబంతోపాటుగా వెళ్ళి తపస్సు చేసినట్టు పృధూ పాఖ్యానంలో ఉంది.


 విశ్వామిత్రుడు ఒక సందర్భంలో దక్షిణ దిక్కుకువెళ్ళి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడనీ, అలాగే, మరో సారి పశ్చిమ దిక్కుకు వెళ్ళి మరో పదివేల సంవత్సరాలు తపస్సు చేసాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రకంగా చూస్తే, తపస్సుకే విశ్వామిత్రుడు 20, 30 వేల సంవత్సరాలు వెచ్చిస్తే, ఆయన జీవిత కాలమెంత అయిఉండాలి...? అది నిస్సందేహంగా లక్షలాది సంవత్సరాలు అయిఉంటుందా?
  చంద్రవంశంలో జన్మించిన చక్రవర్తి నహుషుడు కూడా వేలాది సంవత్సరాలు జీవించాడు. అగస్త్య మహాముని శాపం కారణంగా పదివేల సంవత్సరాలపాటు సర్పంగా పడిఉండమని శపిస్తాడు. ఒక్క నహుషుడే కాదు, అనేక మంది పూర్వకాల చక్రవర్తులు, రాజులు వేలాది సంవత్సరాలు రాజ్యమేలినట్టు పురాణాలు చెబుతున్నాయి.
 బైబిల్ కూడా ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అబ్రహం తన వందోఏట తండ్రి అయ్యాడు. అలాంటప్పుడు ఆయన కొన్ని వందల సంవత్సరాలు జీవించినట్టుగానే భావించుకోవాలి.
ఇవన్నీ అభూత కల్పనలే అనుకున్నప్పటికీ, మన తాతముత్తాతలు నిక్షేపంగా వందేళ్లకు పైగా జీవించడం అబద్దం కాదుగా...

(మరణం లేనంత మాత్రాన అమరులు అవుతారా.... వచ్చే భాగంలో...)
- తుర్లపాటి నాగభూషణ రావు
9885292208


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!