చిరంజీవిపై కోర్టులో కేసు


జస్టిస్ శ్రీకృష్ణ కమిటీపై కేసు పెట్టడానికి కొంతకాలం క్రితం నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ న్యాయవాదుల సంఘానికి మరింత ఉత్సాహం వచ్చినట్లుంది.సామాజిక తెలంగాణ అని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి తర్వాత మాట మార్చారంటూ మరో కేసును ఫైల్ చేశారు.నాంపల్లి కోర్టులో కేసు వేస్తూ చిరంజీవి మాట మార్చడం వల్ల తెలంగాణాలో ఆత్మహత్యలు జరగడానికి కారణమయ్యారని వారు ఆరోపిస్తున్నారు.దీనిపై కేసును మే ఐదో తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ రకంగా ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చలేదని క్రిమినల్ కేసులు పెట్టే పరిస్థితి వస్తే రాజకీయ పార్టీలన్నీ మూతపడాల్సిందేనేమో. ఎందుకంటే ఆ పార్టీల నేతలంతా ఆ కేసులలో ఇరుక్కుని జైలులో కూర్చోవాల్సి వస్తుంది కనుక.అయితే ఇక్కడ ఒక వాస్తవం గమనించాలి. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఏదో ఒక హామీ ఇవ్వడం, ఆ తర్వాత వాటిని ఉల్లంఘించడం రివాజైపోయింది. అయితే ఇది ఇవ్వాళే మొదలు కాలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి జరుగుతూనే ఉంది.
ఓటర్లను ఆకట్టుకోవడం కోసం రాజకీయ పార్టీలు అనేక నినాదాలు ఇస్తుంటాయి. ఉదాహరణకు ఇందిరాగాందీ గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చారు. ఎన్నికలలో ఆమె ఈ దేశం నుంచి పేదరికాన్ని తరిమేస్తామని కూడా ప్రకటించారు. మరి పేదరికం పోయిందా?చంద్రబాబు నాయుడు `1996 ఎన్నికలకు ముందు తాను గెలిస్తేనే రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్య నిషేధం వంటివి అమలు అవుతాయని, కాంగ్రెస్ గెలిస్తే అవి కుదరవని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన కోరుకున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది. కాని ఎన్నికల తర్వాత బియ్యం దర ఐదున్నర అయింది. మద్య నిషేధం ఎత్తివేశారు. తెలంగాణ అంశంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో చెప్పినదానికి అనుగుణంగా కట్టుబడి లేరు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్ట్లో తొమ్మిది గంటల కరెంటు సరఫరా చేస్తామని చెప్పింది. ఇంతవరకు అమలు కాలేదు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని వారందరిమీద కేసు పెట్టే పరిస్థితి ఉంటుందా?మరి న్యాయస్థానం ఏమి చేస్తుందో చూద్దాం.ఒక వేళ చిరంజీవిమీద కేసు పెట్టమని కోర్టు కనుక ఆదేశిస్తే అది సంచలనమే అవుతుంది.
kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!