అన్నా హజారే స్పూర్థి కొనసాగాలి



|
దేశం అంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్ అంటూ రాసిన మహాకవి గురజాడ అప్పారావు ఆనాటి తెలుగు జాతిలో స్పూర్తి రగిలించారు. తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది అని స్పూర్తిని ప్రేరేపించారు నేటి తరం
ప్రఖ్యాత కవి, జ్ఞనాపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి. ఇలా ఎందరో మహనీయులు జాతి ఉద్దీపనకు కృషి చేశారు. నిన్న గాక మొన్న జరిగిన ప్రపంచ క్రికెట్ కప్‌ ఫైనల్ మాచ్ లో ఇండియా గెలవాలంటూ భారత జాతి అంత ఊగిపోయింది. ఆసేతు హిమాచలం ఒకటే మాట. ఒకటే బాట. ఒకటే ఆకాంక్ష. అది మనం గెలవాలని. క్రికెట్ మాచ్ రోజున ఉండే ఆ చైతన్యం మరి మిగిలిన రోజులలో ఎందుకు ఉండడం లేదు? మనలో మనకు తగాదాలు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ జీవులు సైతం ఆ రోజు వరకు ప్రజలను వదిలేశారు.. ఆ మాట అనకూడదేమో. వారి వెంట నడపకపోతే తమను ప్రజలు వదిలిపెడతారని భయపడ్డారేమో. ఇక్కడ నిజానికి క్రీడా స్పూర్థి ఉండాలి. అంటే దానర్ధం క్రీ డ అన్న తర్వాత ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడతారు. ఇద్దరూ బాగా ఆడాలి.చివరికి ఎవరు మరీ బాగా ఆడితే వారిది విజయం అవుతుంది. రెండోవారు దానిని గౌరవించాలి. అది క్రీడా స్పూర్తి. అది లేకుంటే క్రీడలు ఉండవు. పోటీలు ఉండవు. కాని ఇది దేశాల మధ్య పోటీ అయ్యేసరికి ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరికి వారు తామే ఆడుతున్నట్ల ఫీల్ అయ్యారు.తామే గెలిచినట్లు అనుభూతి పొందారు. క్రీడా స్పూర్తి సంగతి ఎలా ఉన్నా, జాతీయ భావం వెల్లివిరిసిందిలే, అదే పదివేలని అంతా సంబర పడ్డాం.మరి మన దేశంలో ఎన్నో అనేక ఇతర విషయాలలో ఎందుకు ఈ చైతన్యం రావడం లేదు?ముఖ్యంగా వేల కోట్ల అవినీతి జరుగుతున్నా మనం ఎందుకు నిశ్చేష్టులై నివ్వెరపోయి నిస్సహాయంగా చూస్తున్నాం. రాజకీయ నాయకులు ఒకరు నువ్వు లక్ష కోట్ల తిన్నావు అంటే , మరొకరు నువ్వు రెండు ఎకరాల ఆసామివి వేలకోట్ల ఆస్తులు ఎలా సంపాదించావు అంటే మనం కూడా దానిని వినోదంగా చూస్తూ సరిపెట్టుకుంటున్నాము కాని, ఇందులో ఏది వాస్తవం అని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం.చివరికి ఎవరు అవినీతి పరులు కారులే అని సరిపెట్టకునే దశకు ఎందుకు చేరుకుంటున్నాము?ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చలేమా?
రాజకీయ నాయకులు వారి స్వార్ధం కోసమో, పదవీ రాజకీయాల కోసమో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే మనం కూడా భలే ఖర్చు చేస్తున్నారులే అని సంబరపడుతున్నామే కాని, ఇదేమిటి నిలదీసే మానసిక పరిస్థితి ఎందుకు రావడం లేదు. ఓట్లను అడ్డగోలుగా కొనుగోలు చేసినవారు ఆ తర్వాత అంతకన్నా అడ్డగోలుగా సంపాదిస్తారన్న కనీస స్పృహ కూడా మనలో రావడం లేదు. ఆ తర్వాత అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి అని గగ్గోలు పెడుతున్నామే తప్పఎవరైమైనా స్వచ్చందంగా ఇలాంటివి జరగకుండా చూద్దాం అని ప్రయత్నం చేస్తున్నామా? అంటే అదేం లేదు. నువ్వెంత తిన్నావు? నాకు ఎంత ఇచ్చావు అన్న సింపుల్‌ ధీరీకి లొంగిపోతున్నాము.ఒక్కటి గుర్తుంచుకోవాలి. మనకు రూపాయి అక్రమంగా ఇచ్చారంటే, ఆ ఇచ్చిన వ్యక్తికి దానికి పదిరెట్ల ప్రయోజనం ఉంటేనే అలా చేస్తారన్న కనీస జ్ఞానం కూడా ఉండడం లేదు. ఇక రాజకీయ పార్టీలు ఎవరి ఇంట్లో డబ్బు తీసుకువచ్చి ప్రజలకు వెచ్చించడం లేదు. అదంతా మన డబ్బే. ప్రజలందరి డబ్బే. ప్రజలకు జవాబుదారిగా, ట్రస్టీగా ఉండి ఆ డబ్బును ఖర్చు చేయడానికే రాజకీయ నాయకులకు అధికారం ఇస్తున్నాం. కాని మనం ఎవరం అలా అనుకోవడం లేదు. ఒకసారి ఓటు హక్కు వినియోగించుకోగానే మన బాధ్యత నెరవేరినట్లు ఫీల్ అవుతున్నాం. మిగిలినదంతా నాయకులదే అనుకుంటున్నాం. దాంతో వారు ప్రజలకు సేవకులుగా కాక, యజమానులమనుకుని ఆ ప్రకారమే యధేచ్చగా వ్యవహరిస్తున్నారు.మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు మనం నోరు మూసుకుని కూర్చుంటున్నాం. ఒక్క అవినీతి అన్న విషయమే కాదు. ఏ విషయం చూసినా పరిస్థితి అలాగే ఉంది. పార్టీల ఎజెండాలు చూడండి.మానిఫెస్టోలు చూడండి. ఆకాశాన్ని, ఆకాశంలోని చందమామను తీసుకు వచ్చి మనకు ఇస్తామంటే మనం నమ్మేస్తున్నాం.మనల్నీ మనమే మోసం చేసుకుంటున్నాం. మన మద్య విద్వేషాలు పెంచడం గురించి ఆలోచిస్తుంటే మనకు వేదనే మిగులుతుంది. మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, కులం పేరుతో ఇలా ఎన్ని రకాలుగా విడదీయాలో అన్ని రకాలుగానూ సమాజాన్ని చీల్చి పారేయడంలో రాజకీయ నేతలు సఫలం అయ్యారు. ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు చేస్తున్న ప్రకటనలు, రెచ్చగొడుతున్న తీరు చూస్తుంటే మనం ఆధునిక యుగంలో ఉన్నామా? లేక ఆటవిక యుగంలో ఉన్నామా? అన్న ప్రశ్న ఎదురవుతుంటుంది. మన రాష్ట్రం వరకు చూస్తుంటే ఉగాది వచ్చిందన్న సంతోషమే మిగలడం లేదు. మనం రాష్ట్రం ఎలా అభివృద్ది చెందాలన్నదానిపై ఆలోచించడం ఎప్పుడో మానేశాం. మనుషుల మధ్య ఎంత అంతరాలు పెంచాలో అంత పెంచడానికి సర్వశక్తులు ఒడ్డుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం రానివ్వండి. రానివ్వకపోండి. కాని ప్రజలు మాత్రం జీవించాలి. ప్రజలకు జీవనోపాధి కలగాలి. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలి. కాని ఈ విషయం బోధించే నాధుడే లేడు. తెలంగాణ వచ్చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని, లక్షల ఉద్యోగాలు వస్తాయని,ప్రతి ఒక్కరికి మూడు ఎకరాల బూమి వస్తుందని, చాలా ఇళ్లు ఖాళీ అయిపోతే, అవన్ని మనకు దక్కుతాయని, ఇలా ఉన్నవి, లేనివి చెప్పి అమాయక ప్రజలను కొందరు మోసం చేస్తున్నారు.నిజానికి తెలంగాణ వచ్చినా ప్రజలకు ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. ఎవరి బతుకు వారు బతకాల్సిందే. ఆ సంగతిని ఎవరూ చెప్పడం లేదు. అలాగే రాష్ట్ర సమైక్యంగా ఉంటేనే
అబివృధ్ది సాధిస్తామని, విడిపోతే ఏవేవో గొడవలు జరుగుతాయని , లేనిపోని మాటలు సమైక్యవాద నేతలు చెబుతున్నారు. ఇరువర్గాలు పంతాలు,పట్టింపులకు పోతూ సమస్యలను జటిలం చేస్తుంటే సామాన్య జనం ఏమిటో ఈ డ్రామా అని విస్తుపోవడం మినహా ఏమి చేయలేపోతున్నాం.క్రికెట్ మాచ్ చూడడంలో ఉన్న ఆనందం,
క్రికెట్ మాచ్ లో ఇండియా గెలవాలని కోరుకోవడంలో లేని ప్రాంతీయ వివక్షత, లేని కుల, మత వివక్షత, మన సొంత విషయాలలో ఎందుకు రావాలన్నదానిపై అంతా ఆలోచించాలి. తెలంగాణ రానివ్వండి, రాకపోనివ్వండి, మనం సమ్యైక్యంగా ఉన్నా, విడిపోయినా, ముందు మనం తెలుగువారం. అందరం కలిసి మనందరి అభివృద్దికి కృషి చేయాలని ఆలోచించగలిగితే రాజకీయ నాయకుల కుయుక్తులు,పన్నాగాలు ముందుకు సాగవు. క్రికెట్ లో ఎలాంటి స్పూర్తి రగిలిందో, మన తెలుగువారం కూడా అదే తరహా స్పూర్తిని పెంపొందించుకోవాలన్నది ఆకాంక్షించడం తప్పుకాదేమో.ప్రఖ్యాత సంఘసేవకుడు అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్ పాల్ బిల్లు కోరుతూ ఢిల్లీలో నాలుగు రోజులుగా చేసిన ఆమరణ దీక్ష దేశ ప్రజలలో స్పూర్తిని రగిలించింది. డెబ్బై రెండేళ్ల వయసులో ఆయన చేసిన పోరాటం నిరుపమానమైంది. కేంద్రం స్వయంగా దిగి వచ్చిందంటే ఆయన వ్యక్తికాదు. శక్తి అని రుజువు అవుతుంది.దేశ ప్రజలలో ఉన్న ఆర్తి కూడా బయటపడింది. ఎక్కడికక్కడ ప్రజలు స్పందించిన తీరు గత నాలుగు దశాబ్దాలలో ఇదే మొదటిసారి. అయితే ఇదొక్కటే సరిపోదు. ప్రతి ఒక్కరు అన్నా హాజరే కావాలి. ఎవరికి వారు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. జన చైతన్యం వెల్లివిరియాలి. అప్పుడే అన్నా హజారే దీక్షకు సార్ధకత లభిస్తుంది. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయిలెవ్వరు? అన్న శ్రీశ్రీ కవితను ఆదర్శంగా తీసుకుని రాజకీయ నేతలు కాదు ముఖ్యం. ఆ నేతలను గెలిపించిన ప్రజలు ముఖ్యం. నేతలను సృష్టించే మనం ఆ నేతల చేతిలో బందీలు కాకుండా ఉంటే మంచిది.
- కొమ్మినేని శ్రీనివాసరావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!