మృత్యు సౌందర్యం (పార్ట్ 2)

శవాలు కుళ్ళిపోకుండా ఉండాలని
ఎందుకు కోరుకుంటున్నారు? 
అలా అనుకోవడం మంచిదేనా...??


  సభ్యసమాజాలలో పుట్టినప్పటి నుంచీ ఆఖరి శ్వాస తీసుకునేవరకు ప్రతి ఘట్టానికీ కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ఆత్మసిద్ధాంతాన్ని నమ్మిన దేశాల్లో పిత్రుదేవతలకు ఆహారం పెట్టడం ఓ ఆచారంగా వస్తుంటే, ఈజిప్టు వంటి దేశాల్లో మమ్మిఫికేషన్ ఓ ఆచార ప్రక్రియగా చోటుచేసుకుంది.
రాజులు, చక్రవర్తులు..లేదా రాజవంశీకులు మరణానంతరం కూడా తమ శరీరం పదిలంగా ఉండాలని కోరుకునేవారు. బహుశా ఈ కోరిక బలంగా ఉండబట్టే మృతదేహాలను కాపాడే పద్ధతికి అంకురార్పణ జరిగి ఉంటుంది. అంతేకాదు, ప్రముఖులు తమ భౌతిక శరీరాలను ఎక్కడో ఊరిచివర శ్మశానంలో పూడ్చిపెట్టాలని అనుకోరు. తమ ఇంటికి సమీపంలోనే తమ బంధు,మిత్రులు రోజూ నడిచే ప్రాంతంలోనే సమాధి ఉండాలని కోరుకునేవారు. ఇలా చేస్తే ప్రతినిత్యం తమ ఆత్మ వారిని పలకరించడానికి వీలుచిక్కుతుందని నమ్మేవారు. ఈ ఆలోచనల కారణంగానే ఎంబామింగ్ చోటుచేసుకుంది.
 ఇక ఆధునిక కాలంలో మనిషి శరీరం లోపలి భాగాలను స్టడీ చేయడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పడే శరీర భాగాలు కుళ్లకుండా ఉండే ప్రక్రియ కూడా మొదలైంది. అంటే అనాటమీలో విజ్ఞాన సముపార్జన కోసం మొదలైన ఎంబామింగ్ ఆ తరువాత ప్రముఖుల పార్ధివదేహాలను కాపాడటంలోనూ ఉపయోగపడిందని చెప్పాలి. శరీరంలోని ధమనుల ద్వారా ఎంబామింగ్ చేసే పద్ధతి నెదర్లాండ్స్ లో 17వ శతాబ్దిలో మొదలైనట్టు చెబుతుంటారు. ఇక ప్రస్తుతం అమలుచేస్తున్న ఎంబామింగ్ పద్దతిని అమెరికా సివిల్ వార్ సమయంలో తొలిసారిగా అనుసరించారు. యుద్ధంలో మరణించిన సైనికుల డెడ్ బాడీస్ ని కుళ్ళిపోకుండా బంధువులకు చేర్చడంలో ఈ పద్ధతి అప్పట్లో పాపులర్ అయింది.
 1867లో ఫార్మల్డిహైడ్ అనే రసాయనాన్ని జర్మన్ శాస్త్రవేత్త విల్ హెమ్ వాన్ హాఫ్ మన్ తొలిసారిగా గుర్తించారు. ఈ కెమికల్ ఆవిష్కరణతో ఎంబామింగ్ మరింత సులువైంది.
  ఎంబామింగ్ కి కొన్ని దేశాల్లో చట్టబద్ధత ఉన్నప్పటికీ, మరికొన్ని దేశాల్లో దీనికి అనుమతి లేదు. వివిధ సమాజాల ఆచారవ్యవహారాలనుబట్టి చట్టబద్ధతలో మార్పులు ఏర్పడ్డాయి. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఎంబామింగ్ స్వేచ్ఛగా సాగుతుంటే, మరికొన్ని దేశాల్లో పర్మిట్లు, లైసెన్స్ లు అవసరం. చాలాచోట్ల ప్రత్యేకమైన వైద్య నిపుణులు మాత్రమే ఎంబామింగ్ చేస్తున్నారు. ఎంబామింగ్ పద్దతిలో నాలుగు విభాగాలు ఉన్నాయి.

 ఎంబామింగ్ - రకాలు


1. ధమనుల ఎంబామింగ్
2. కావిటీ ఎంబామింగ్
3. హైపోడెర్మిక్ ఎంబామింగ్
4. ఉపరితల ఎంబామింగ్

 గ్రూమింగ్ ప్రక్రియ ద్వారా కూడా డెడ్ బాడీని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఈ పద్దతి ద్వారా ముఖవర్చస్సు పెరుగుతుంది.
 ఈజిప్టు చరిత్ర తిరగేస్తే, మమ్మిఫికేషన్ ప్రక్రియ చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. ఈజిప్టు పూర్వీకుల్లో అనేక నమ్మకాలు ఉండేవి. చివరకు వారు స్వర్గానికి కూడా నాలుగు దారులు ఏర్పాటు చేశారు.
 ఆయా దిక్కులకు నలుగురు దేవతలను ప్రతిష్ఠించారు. ఆకాశాన్నీ, భూమినీ, ఆఖరికి స్వర్గానికి కూడా దిశలను రూపొందించారు.  ఈజిప్ట్ ‘మమ్మిఫికేషన్’ జరిగే తంతులో ఈ తంతు కనిపించింది.  పురాతన ఈజిప్టియన్ల మృతదేహాల భాగాలను - నాలుగు స్థూపాల్లో భద్రపరిచి అవి కుళ్లిపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునేవారట.
(ఎంతో మంది ప్రముఖుల భౌతిక శరీరాలను ఎంబామింగ్ పద్ధతి ద్వారా ఎక్కువకాలం నిల్వఉంచగలిగారు? ఆ వివరాలు తరువాయి భాగంలో....)
- తుర్లపాటి నాగభూషణ రావు
   9885292208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!