మరణంలేని జీవి!! (పార్ట్ 1)


మనిషి మృత్యువును జయించలేకపోవచ్చు...
కానీ, మరణంలేని జీవి ఒకటి ఈ భూమిపైనే ఉంది...!
అది ఎక్కడ ఉన్నది? ఎలా ఉన్నది??
ఆ వివరాలు తెలుసుకోవాలని ఉందా...!!

   ప్రకృతి చక్రంలో జీవుల జనన, మరణాలు అంతర్భాగాలు. అయినప్పటికీ, మరణాన్ని జయించాలన్న తపన మాత్రం చావడంలేదు. యుగయుగాలుగా అమరత్వసాధన కోసం ప్రయత్నాలు జరుగుతూనేఉన్నాయి. మృత్యువును జయించాలన్న కోరికతో మనిషి సాగిస్తున్న అన్వేషణఇది. తెగిన తోకను బల్లి మళ్ళీ సృష్టించుకుంటే, తానెందుకు అలా చేయలేకపోతున్నాడన్న తపన... ఈ తపన నుంచే అమరత్వం కోసం ఆరాటం. ఈ తపన నుంచే మరణాన్ని జయించాలన్న ఆరాటం.
 పుట్టిన ప్రతిజీవి ఏదోఒక రోజు గిట్టక తప్పదని అంటూఉంటారు. కానీ ఇందులో నిజంలేదు. ఈ భూమిమీద ఒకే ఒక్క జంతువు మాత్రం ఎప్పటికీ మరణం లేకుండా ఉండిపోతున్నది. అది అమృతం తాగిందా....? లేదంటే ఏ దేవుడైనా వరం ప్రసాదించాడా?? అన్న అనుమానాలు రావచ్చు. శాస్త్రవేత్తలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసిన ఆ జంతువు ఏమిటి...అది ఎలా ఉంటుంది?

  ఆ జంతువు మరేదో కాదు...సముద్రంలో తిరగాడే ఓ జెల్లీఫిష్. అవును, ఇది నిజం... `టురిటోప్సిస్ న్యూట్రిక్యులా' అనే జాతికి చెందిన జెల్లీ ఫిష్ కు మరణం లేదని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు.
 ఈ జెల్లీ ఫిష్ జీవిత చక్రమే చిత్రంగా ఉంటుంది. ఇది కూడా మిగతా జీవుల లాగానే పెరుగుతుంది. పెద్దదవుతుంది. కానీ  ఆ తరువాతనే ఓ చిత్రం జరుగుతుంది. adult satge నుంచి సడన్ గా జీవిత చక్రంలోని ఆరంభ దశ అయిన పాలిప్ స్టేజ్ (polyp stage) కు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ అడల్ట్ స్టేజ్ కు వస్తుంటుంది. అంటే, ఈ రెండు దశలు ఒకదాని తరువాత మరొకటి చక్రభ్రమణంలా తిరుగుతూనే ఉంటాయి.  ఫలితంగా ఈ జంతువుకు చావన్నదే లేకుండా పోయింది.
  Trans differentiation (ట్రాన్స్ డిఫరెన్సియేషన్) ప్రక్రియ వల్లనే ఇదంతా సాధ్యమవుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రక్రియలో ఒక కణం మరొక రకం కణంగా మారిపోతుంటుంది. ఈ మార్పు వల్ల ఈ జెల్లీ ఫిష్ వృద్ధాప్యాన్ని జయించి, మళ్లీ శైశవ దశకు వచ్చేస్తుంటుంది.

 Trans differentiation ప్రక్రియ టురిటోప్సిస్  న్యూట్రిక్యులా అనే ఈ జెల్లీ ఫిష్ లో చాలా చురుగ్గా ఉంటే, మిగతా కొన్ని జీవుల్లో స్వల్పస్థాయిలో ఉంటున్నది. ఈ కారణంగానే బల్లిలా ఉండే సాలమండర్స్ పూర్తిగా విరిగిపోయిన కాళ్లను మళ్ళీ పుట్టించుకోగలుగుతున్నాయి. బల్లి కూడా తెగిన తోకను మళ్ళీ పుట్టించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది కూడా కొంతమేరకు అమరత్వాన్ని సాధించడమే....
 (సముద్ర జలాల్లో తిరిగే ఒక రకం జెల్లీఫిష్ మరణాన్ని జయించిన మాట నిజమేఅయితే, మరి ఆ బయొలాజికల్ ఫార్ములాను మనం ఎందుకు ఉపయోగించుకులేకపోతున్నాం.... అసలు, వంద- వేయి సంవత్సరాలకు పైగానే జీవించే జీవులు ఎన్ని ఉన్నాయో  ఆ వివరాలు రెండో భాగంలో..)
                      - తుర్లపాటి నాగభూషణ రావు
                            98852 92208











కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!