31, జులై 2011, ఆదివారం

కేసీఆర్ కామెంట్‌పై గ‌రం..గ‌రం..


తెలంగాణ రాకపోతే విషం తాగడమే నయమన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. జూలై పద్నాలుగో తేదీన రెండువారాలలో తెలంగాణ వస్తుందన్న కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ రాకపోతే విషం తాగడమే నయమని అనడంలో అర్దం ఏమిటని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు దీనిని ఒక జోక్ గా కొట్టిపారేశారు. ఆ పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణవాదులను ఆత్మహత్య లకు కెసిఆర్ పురికొల్పుతున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అన్నారు. కాగా తాము ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నా కార్యక్ర మానికి ఆటంకం కలిగించేందుకు కెసిఆర్ రాస్తరకోల ఆందోళనకు పిలుపు ఇచ్చారని వెంకట వీరయ్య వ్యాఖ్యానిం చారు. వీరయ్య వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్న కెసిఆర్ అంతటి పెద్ద నాయకుడు విషం తాగడం నయమని వ్యాఖ్యానించడం సరైన విషయంగా కనిపించదు. ఉద్యమాన్ని ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు రెండువారాలో వస్తుందనో , ఫలానా తేదీకి వస్తుందనో చెబుతూ ఇప్పుడు తెలంగాణ రాదన్న సంకేతం ఇచ్చే విధంగా విషం తాగడం నయమని అనడం మాత్రం ఆయన స్థాయికి తగినట్లుగా లేదు. తెలంగాణ సమాజాన్ని పురోగతిలో నడిపించవలసిన సమయంలో ఇలా ఆత్మన్యూనత భావానికి గురి చేయడం, అమాయకులను ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా మాట్లాడడం ఏ మాత్రం సబబు అనిపించదు.

ప‌ద్మనాభ‌స్వామి ఆల‌య స‌మీపంలో భారీ పేలుడు


ల‌క్షల‌కోట్ల రూపాయ‌ల సంప‌ద బ‌య‌ట‌ప‌డిన కేర‌ళ‌, తిరువ‌నంత‌పురంలోని అనంత ప‌ద్మనాభ‌స్వామి ఆల‌య స‌మీపంలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఆల‌య స‌మీపంలో ఉన్న దుకాణాల‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిన మంట‌లు, భారీ పేలుళ్ళ శ‌బ్దాల‌తో ఆల‌య ప్రదేశం ద‌ద్దరిల్లింది. ఈ ఆల‌యం నుండి ల‌క్షల కోట్ల నిధి బ‌య‌ట‌ప‌డి ప్రపంచం దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం తెలిసింది. ఆల‌యంలోని 5 నేల‌మాళిగ‌ల‌లోనుండి ఈ నిధి బ‌య‌టికి తీసారు. అయితే ఆర‌వ నేల‌మాళిగ‌ను తెర‌వ‌డానికి ప్రయ‌త్నించినా ఆ నేల‌మాళిగ‌కు నాగ‌బంధ‌నం ఉంద‌న్న తెలుసుకుని దానిని తెరిచే ప్రయ‌త్నం విర‌మించుకున్నారు. మ‌రో ప్రక్క ఆ 6వ నేల‌మాళిగ‌ను ప‌రిశీలించ‌డానికి సోమ‌వారం నాడు నిపుణుల బృందం ఆల‌యానికి రాబోతున్నారు. ఈ సంద‌ర్భంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం అంద‌రినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘ‌ట‌న వెనుక కార‌ణం ఏమై ఉంటుంద‌న్నదాని గురించి చ‌ర్చలు మొద‌ల‌య్యాయి. 6వ నేల‌మాళిగ‌ని తెరిస్తే అరిష్టం అని, దాన్ని తెరిచే ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని కొంద‌రు చెప్పిన‌ప్పటికీ దాన్ని తెర‌వడానికి చేస్తున్న ప్రయ‌త్నం కార‌ణంగానే ఈ సంఘ‌ట‌న జ‌రిగిందా..? అన్న అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే సంఘ‌ట‌నా స్థలానికి డిజిపి, ఎస్‌.పి. జిల్లా క‌లెక్టరు హుటాహుటిన బ‌యల్దేరారు. అయితే ప‌ద్మనాభ స్వామి ఆల‌యంలో ఉన్న ల‌క్షల‌కోట్ల నిధికి ఎలాంటి ఆప‌దా లేద‌ని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. ఈ పేలుళ్ళ వెనుక ఆ నిధిని కొల్లగొట్టడానికి ఎవ‌రైనా చేసిన ప్రయ‌త్నం ఉందేమో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

వివాదంలో వి.వి.ఎస్ ల‌క్ష్మణ్‌


వివాదాలకు దూరంగా ఉండే హైదరాబాద్ స్టయిలిస్ బ్యాట్స్‌మన్ వివియస్ లక్ష్మణ్‌పై ఓవివాదంలో ఇరుక్కు న్నారు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండ‌వ టెస్ట్ మ్యాచ్‌లో వివిఎస్‌. ల‌క్షణ్ త‌న బ్యాట్ చివ‌ర‌ల‌కి వాజిలిన్ రుద్దిన‌ట్టు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆరోపించాడు. డిసిషన్ రివ్యూ సిస్టమ్‌లో హాట్ స్పాట్ టెక్నాలజీని మాయ చేయడానికి లక్ష్మణ్ తన బ్యాట్‌పై వాజిలిన్ వాడినట్లు, వాజిలిన్ రుద్దడం వల్లనే బ్యాట్‌ అవుట్ సైడ్ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లిన బంతికి అవుటైనప్పటికీ లక్ష్మణ్ దొరకలేదని మైఖెల్ వాన్ త‌న ట్విట్టర్‌లో రాశాడు. ఇప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. లక్ష్మణ్ 27 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమ్స్ అండర్సన్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతి బ్యాట్‌నుంచి వెళ్లిపోయింది. దాంతో ఇంగ్లాండు క్రీడాకారులు అవుట్‌కు అపీల్ చేశారు. అంపైర్ అసద్ రవూఫ్ నాటవుట్‌ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండు స్కిప్పర్ డిఆర్ఎస్‌కు వెళ్లాడు. దాంట్లో కూడా లక్ష్మణ్‌కు అనుకూలంగానే నిర్ణయం వచ్చింది. కెవిన్ పీటర్సన్, లక్ష్మణ్ స్వల్ప వాగ్వివాదానికి కూడా దిగారు. అయితే, బంతి బ్యాట్‌ను రాసుకుంటూ వెళ్లిందని స్టార్ట్ బ్రాడ్ మీడియా ప్రతినిధులతో అన్నాడు. కొన్ని సార్లు అతి సున్నితంగా బంతి తాకినా హాట్ స్పాట్ పట్టుకోలేదని బ్రాడ్ అన్నాడు. అయితే, మైఖెల్ వాన్ ఆరోపణతో వివాదం ప్రారంభమైంది. బ్రాడ్ లక్ష్మణ్ బ్యాట్‌ను పరిశీలించాడు కూడా. దానికి వాజిలిన్ గానీ, ఇతర ద్రవపదార్థం గానీ లేదని బ్రాడ్ స్పష్టం చేశాడు. కొన్నిసార్లు ఫెయింట్ ఎడ్జ్‌ను హాట్ స్పాట్ పట్టుకోలేదని అనతు అన్నాడు. మైఖేల్ వాన్ చేసిన ఈ విమ‌ర్శని కొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. టెస్ట్ మ్యాచుల్లో వివిఎస్ ల‌క్ష్మణ్ బ్యాటింగ్‌లో రానిస్తూ భార‌త్ గెలుపుకు త‌న వంతు కృషి చేస్తుండ‌డంతో ఓర్వలేకే ఈ వివాదం సృష్టించార‌ని కొంద‌రు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏది ఏమ‌యిన‌ప్పటికీ వివాదాల‌కి దూరంగా ఉండే వి.వి.ఎస్‌. ల‌క్ష్మణ్ ఈ వివాదంలో ఇరుక్కోవ‌డం భార‌త క్రికెట్ అభిమానుల‌కు రుచించ‌డంలేదు.

తెలంగాణ స‌మ‌స్యకి ప‌రిష్కారం..?


ఎన్నో స‌వాళ్ళతో స‌త‌మ‌త‌మ‌వుతున్న కేంద్ర ప్రభుత్వం స‌వాళ్ళని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకి సాగుతుంద‌ని ప్రధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్ అన్నారు. ఆదివారం నాడు  స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ అంశంపై  స్పందించారు. తెలంగా ణ ఎం.పి.లు పదిమంది పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడంతో తెలంగాణ స‌మ‌స్య తీవ్రత తెలుస్తుంద‌ని,  తెలంగాణ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ప్రధాని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా 2జి కుంభ‌కోణంతో ఉక్కిరి బిక్కిరి అవుతుండ‌డం, సాక్షాత్తూ క్యాబినెట్ మంత్రుల‌నే అరెస్టు చేసి జైలులో పెట్టడం వంటివి ప్రధాన‌మంత్రికి చికాకు క‌లిగిస్తున్నాయి. ఇక దేశంలోనే అధిక ఎం.పి.ల‌ని అందించిన ఆంధ్రప్రదేశ్‌లో స‌మైఖ్య, ప్రత్యేక వాదం స‌మ‌స్యని వీల‌యినంత త్వర‌గా తేల్చేయ‌డానికే ప్రధాని, సోనియా భావిస్తున్నట్టు ప్రధాని మాట‌ల‌ని బ‌ట్టి తెలుస్తోంది. అయితే ఈ స‌మస్య అంత తేలిక‌గా కొలిక్కి వ‌చ్చేట్టు క‌నిపించ‌డం లేదు. ఓ వైపు ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ తెలంగాణ బంద్‌ల‌కి పిలుపునిస్తూ ఉద్యమం తీవ్రత‌రం చేస్తూండ‌డం, మ‌రో వైపు స‌మైఖ్యవాదులు కూడా అదే స్థాయిలో ఉద్యమాన్ని న‌డిపించ‌డానికి ప్రయ‌త్నిస్తుండడం వెర‌సి ఈ స‌మ‌స్య కేంద్రానికి పెద్ద త‌ల‌నొప్పి వ్యవ‌హార‌మే అని వేరే చెప్పాల్సిన ప‌ని లేదు.. మొత్తానికి ఈ స‌మ‌స్యని ప్రధాని, సోనియా ఎలా ప‌రిష్కరిస్తారో వేచి చూడాలి.

ఆగ‌స్టు 5న‌ తెలంగాణ బంద్‌..


తెలంగాణ జిల్లాలో మ‌ళ్లీ ఒకరోజు బంద్ వ‌చ్చేస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14ఎఫ్ తొలగించ కుండా ఎస్సై పరీక్షలు నిర్వహించాలని మొండిగా వెళితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నారు. 14ఎఫ్ రద్దు చేయకుండా ఎస్సై పరీక్షలు నిర్వహిస్తే.. ప‌రీక్ష‌ల‌ను అడ్డుకోవ‌డానికి  ఆగస్టు 1న రాస్తా రోకోలు, 2వ తేదిన నిరసన ర్యాలీలు, 3వ తేదిన ముఖ్యమంత్రి, డిజిపి దిష్టి బొమ్మలు దగ్ధం, 4వ తేదిన అఖిల పక్షాలతో రౌండ్ టేబులు సమావేశం నిర్వహిస్తామ‌ని అప్పటికీ ముఖ్యమంత్రి దిగి రాకుంటే ఆగ‌స్టు 5న తెలంగాణ బంద్‌కి పిలుపునిస్తాన‌ని అన్నారు. ఎస్సై పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థి జెఏసి చేస్తున్న ఆందోళనలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.

దూకుడు షూటింగ్‌లో టి-వాదుల ర‌గ‌డ‌


మహేశ్ బాబు కొత్త సినిమా దూకుడు సినిమాకు తెలంగాణ సెగ అంటుకుంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను తెలంగాణా వాదులు అడ్డుకున్నారు. షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ ను ధ్వంసం చేశారు. గత రెండు రోజులుగా వికారాబాద్ రైల్వేస్టేషన్ లో దూకుడు సినిమాకు సంబంధించి కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం.. కొందరు తెలంగాణ వాదులు వచ్చి.. షూటింగ్ ను నిలిపేయాలని కోరారు. కానీ తర్వాత షూటింగ్ యథావిధిగా కొనసాగింది. అయితే సాయంత్రం మరోసారి తెలంగాణ వాదులు.. అడ్డుకున్నారు. అక్కడ వేసిన సెట్లను ధ్వంసం చేశారు. జై తెలంగాణ నినాదాలతో.. షూటింగ్ కు ఆటంకం కలిగించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. అదే సమయంలో.. మహేశ్ బాబు కార్ లో దగ్గర్లో ఉన్న గెస్ట్ హౌజ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన కారును కూడా అడ్డుకున్నారు. ఒక్కసారిగా కార్లపై రాళ్లతో కర్రలతో దాడి చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే అప్పటికప్పుడే.. మహేశ్ బాబును వేరే కార్లో హైదరాబాద్ కు పంపించారు. దీంతో మహేశ్ సేఫ్ గా బయటపడ్డారు. కాగా సంఘటనా స్థలంలోకి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో మహేశ్ బాబు ఖలేజా సినిమా షూటింగ్ ను కూడా ఇలాగే తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.

య‌డ్యూర‌ప్ప రాజీనామా..!


గ‌త కొద్ది రోజులుగా అనేక మ‌లుపులు తిరుగుతున్న క‌ర్నాట‌క రాజ‌కీయాల అనిశ్చితికి నేడు తెర‌ప‌డింది. మైనింగ్ అక్రమాల‌లో క‌ర్నాట‌క సి.ఎం. య‌డ్యూర‌ప్ప హ‌స్తం ఉంద‌ని లోకాయుక్త తేల్చడంతో య‌డ్యూర‌ప్ప సి.ఎం. ప‌ద‌వికి గండం ఏర్పడింది. త‌న ప‌ద‌విని కాపాడుకోవ‌డం కోసం య‌డ్యూర‌ప్ప ఎన్ని ప్రయ‌త్నాలు చేసిన‌ప్పటికీ ఫ‌లితం లేకుండా పోయింది. ఆదివారం ఉద‌యం య‌డ్యూర‌ప్ప త‌న రాజీనామా ప‌త్రాన్ని పార్టీ అధ్యక్షుడు గ‌డ్కరీకి పంపారు.  మధ్యాహ్నం మూడున్నరకు గవర్నర్‌ భరద్వాజ్‌ను కలవడానికి అపాయింట్‌ మెంట్‌ కూడా తీసుకున్నారు. మరోవైపు CM పీఠం తాను సూచించిన వ్యక్తికే ఇవ్వాలని పట్టుబడుతూ.. ఇప్పటికే అధిష్టానానికి కొన్ని పేర్లు సిఫార్సు చేశారు యడ్యూరప్ప. విశ్వసనీయ సమాచారం ప్రకారం సదానంద గౌడకే CM అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విధుల‌కు హాజ‌ర‌య్యేది లేదు..!


తెలంగాణకు చెందిన 12 మంది మంత్రుల్లో ఎనిమిది మంది ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మరో నలుగురు గైర్హాజరయ్యారు. కె. జానా రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, సారయ్య, సునీతా లక్ష్మా రెడ్డి, డికె అరుణ ముఖ్యమంత్రితో ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. నలుగురు మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శంకరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. ఈ స‌మావేశంలో విధుల‌కు హాజ‌రుక‌మ్మని ముఖ్యమంత్రి వారిని కోరారు. అయితే తాము విధులకు హాజరయ్యేది లేదని వారు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది మంత్రులు శనివారం సాయంత్రం రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఢప్తిని వారు తోసిపుచ్చారు. ఉద్యమం తీవ్రమైన ప్రస్తుత తరుణంలో తాము విధులకు హాజరైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీకి నష్టం జరుగుతుందని వారు చెప్పారు. తాము ప్రజల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు విధులకు హాజరు కావడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని వారు చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అంశం కోసం టిడిపి తెలంగాణ ఫోరం త‌ర‌పున చురుకుగా ఉద్యమాలు ర‌చిస్తుండ‌డం, తెలంగాణ పొలిటిక‌ల్ జెఎసి కూడా త‌మ‌దైన శైలిలో ఉద్యమాలు రూపొందిస్తున్న ప్రస్తుత త‌రుణంలో తాము మంత్రులుగా కొన‌సాగితే న‌ష్టమే త‌ప్ప ఎలాంటి ప్రయోజ‌నం ఉండ‌ద‌ని తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పారు.

ఆగ‌స్టు 1 నుండి ఉద్యమం..


రాజీనామాల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మరోసారి రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం తెలంగాణ నేతలు.. ఎప్పుడు చేస్తామనేది ఆగస్టు 1 న ప్రకటిస్తామని ఫోరం సభ్యలు తెలిపారు. కాగా ఆగస్టు నుంచి రాజకీయ జేఏసీ నిర్వహిస్తున్న సకల జనుల సమ్మెకు తమ పూర్తి మద్దతుంటుందని.. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి స్పష్టం చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టాలని.. ఆగస్టు 1 న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తమ భవిష్యత్ కార్యాచరణ అంతా అదే వేదికపైనే ప్రకటిస్తామన్నారు. రాజీనామాల విషయం, రాజ్యాంగ సంక్షోభం తేవాలన్న విషయాన్ని అదే వేదికపైనే ప్రకటిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డికి పార్లమెంట్ లో నివాళులు అర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎర్రబెల్లి, రమణ, కొత్తకోట దయాకర్రావు తెలిపారు. తమల్ని రెచ్చగొట్టి.. తీవ్రవాదులుగా మార్చొద్దని వారు హెచ్చరించారు.

జ‌గ‌న్ జైలు కెళ్తే పై విశేష స్పంద‌న‌..


ప్రస్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన జ‌గ‌న్ ఆస్తుల‌పై సిబిఐ విచార‌ణ నేప‌థ్యంలో వైఎస్‌. జ‌గ‌న్ భ‌విత‌వ్యం ఏమిట‌న్నది ఈ కేసుపై ఆధార‌ప‌డి ఉండ‌డంతో ఈ అంశాన్ని స్పృషిస్తూ ప్రముఖ ర‌చ‌యిత‌, సీనియ‌ర్ జ‌ర్నలిస్టు శ్రీ తుర్లపాటి నాగ‌భూష‌ణం గారు ర‌చించిన జ‌గ‌న్ జైలుకెళితే..? ‌వ్యాసాని‌కి విశేష‌మైన స్పంద‌న వ‌స్తోంది.. వాటిని య‌థాత‌దంగా పాఠ‌కుల‌కు అందిస్తున్నాము..
1. ఎలాంటి రాజకీయానుభవం లేకుండా మా నాన్నగారు ముఖ్యమంత్రిగా పని చేశారు కనుక నాకూ ముఖ్యమంత్రి పదవి కావాలి అంటే జగన్‌కి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు? ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో సిసి కెమెరా ఆపరేటర్‌గా పని చేసిన మా నాన్నగారు చనిపోతేనే ఆయన ఉద్యోగం నాకు గానీ మా తమ్ముడికి గానీ ఇవ్వలేదు. కీలకమైన ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా కావాలంటే ఎవరిస్తారు?
2. Praveen Sarma గారికి ,
మన దేశములో మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అన్ని పదవులు ఎలాంటి రాజకీయానుభవం లేకుండా వారసత్వముగా వచ్చినవే. ఇప్పుడు మన రాష్ట్రం లొ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు, స్పీకర్ , డిప్యూటి స్పీకర్ , హోం మంత్రి , ఇంకా చాలామంది ఉన్నారు గమనించండి. వీరిలొ కొద్దిమంది మాత్రమె అంటె చంద్రబాబు గారు మాత్రమే ముందు నుంచి రాజకీయాలలొ ఉంది. వీరికి వున్న వారసత్వము జగన్ కి వస్తె తప్పు ఎమిటి ?
3.  అందరూ గడ్డి తింటున్నారు కాబట్టి మనమూ గడ్డి తినాలని రూలేమీ లేదు. పది మంది నమ్మినదే నిజం అనుకుంటే హిట్లర్‌లాగ పచ్చి అబద్దాలని కూడా నిజాలు చేసెయ్యొచ్చు. వారసత్వం పేరుతో రాజకీయాల్లోకి వచ్చినవాణ్ణి ప్రజల మనిషి అనొద్దు. తాను ప్రజల మనిషి కాదు అనే విషయం జగన్‌కి బాగానే తెలుసు.
4. అప్పుడు విజయమ్మ Andhra రబ్రీ దేవి అవుతారు. నీతిమంతుడు CM కాలేడు. కొంతలో కొంత, క్రొత్తరక్తం యూత్‌ జగన్ కే నా ఓటు.
pravata Reddy
5. How Much Money Paid Jagan to Write This STORY , YOU Mean to Say Jagan very Intteligent, Why false speculation is creating …, Why dont you write positive stories about other leaders, Please promote JP , Dont promote Fraud Jagan , All the voters are not internet news followers. MIND IT

30, జులై 2011, శనివారం

వేడెక్కిన తమిళ రాజకీయాలు..


తమిళనాడులో కక్షల రాజకీయాలు మళ్లీ విజృంభించాయి. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ను తిరువారూర్ లో అరెస్టు చేశారు. ఈయనకు ముందుగా మరో సీనియర్ మాజీ మంత్రి , డిఎమ్ కె నేత అన్బళగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కరుణానిధి ప్రవేశపెట్టిన ఏకీకృత విద్యావిదానాన్ని అమలు చేయాలని డిఎమ్ కె ఆందోళన కు పిలుపు ఇచ్చింది. అయినా ప్రభుత్వ చర్యల వల్ల డి.ఎమ్.కె అందోళన సజావుగా జరగలేదు. కాగా తిరువారూర్ లో జరిగిన ఆందోళనలో ఒక వ్యక్తి మరణించారు. తిరువారూర్ ఎమ్మెల్యే ఇందుకు బాధ్యత వహించాలంటూ ఒక కేసు నమోదైంది. ఈ కేసు గొడవలో కొందరిని అరెస్టు చేయబోగా స్టాలిన్ చట్టం ప్రకారం వ్యవహరించాలని డిమాండు చేశారు.దీనిపై రాస్తారకో చేసిన స్టాలిన్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు కాగా సీనియర్ నేత అన్బళగన్ ను కబ్జా కేసు కింద అరెస్టు చేయడం కూడా వివాదాస్సదం అయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కక్ష రాజకీయాలు సర్వసాధారణమైపోయాయి.

ఐదుగురు భామలతో మోహన్ బాబు


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సునీల్ కాంబినేషన్లో రాయుడు గార్కి కోపమొచ్చింది….అనే సినిమాని రూపొందించ డానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే…విలక్షణ నటుడు మోహన్ బాబు మళ్లీ కథానాయకుడుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఓ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ చిత్రానికి ఇ నివాస్ దర్శకత్వం వహిస్తాడు. దీనికి కోన వెంకట్, గోపీమోహన్, బి.వి.యస్.రవి రచయితలుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి మోహన్ బాబు మాట్లాడుతూ, ‘ముగ్గురు రచయితలు ఏడాది పాటు కష్టపడి దీనికి ఓ అద్భుతమైన కథ తయారుచేశారు. ఇది మా బ్యానర్లో మరో మంచి సినిమా అవుతుంది. ఐదుగురు హీరోయిన్లు వుంటారు. ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. ఈ రోజు తన మేరేజ్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని మోహన్ బాబు ప్రకటించారు.

పదవీ గండానికి యాగం..


కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప యడ్యూరప్ప శత్రు సంహార యాగం తలపెట్టారు. దైవ భక్తి అధికంగా ఉన్న ఆయన శనివారం మధ్యాహ్నం ఈ యాగం చేయనున్నారు. ఇందుకు గాను ఆయన పది మంది పూజారులు, ఓ గోమాతను తెప్పించారు. తన నివాసంలో ఆయన ఈ యాగం చేయనున్నారు. అక్రమ మైనింగ్‌పై లోకాయుక్త నివేదిక నేపథ్యంలో తనకు పదవీ గండం ఏర్పడడంతో ఆయన ఈ యాగం చేస్తున్నారు.
కాగా, యడ్యూరప్ప శనివారం ఉదయం బిజెపి కేంద్ర పరిశీలకులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి రేపు ఆదివారం రాజీనామా చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం కేంద్ర నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించే దాకా వెళ్లిన యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొన్ని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి వర్గ సభ్యులు కూడా తాను సూచించినవారే ఉండాలని ఆయన షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం అన్నారు. మొత్తానికి శనివారం చేస్తున్న శత్రు సంహార యాగం ఫలించి, ఆదివారం వరకు ఏదైనా అద్భుతం జరిగి తన పదవి పదిలంగా ఉంటుందని యడ్యూరప్ప కోరుకుంటున్నారు.. రాజకీయాలలో ఏదైనా జరిగే అవకాశం వుంటుంది కాబట్టి.. ఏమవుతుందో.. వేచి చూడాలి.

రాజీనామాలు ఆమోదిస్తే.. అంతే..!


తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు ఆమోదం పొందుతాయా? అన్న చర్చ జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ లో ఈ విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు కేవలం ఫాక్స్ ద్వారానే తమ రాజీనామా లేఖలు పంపారు కనుక పెద్దగా ఇబ్బంది ఉండదు. వారు మళ్లీ స్వయంగా వచ్చి రాజీనామాలు సమర్పించడమో, లేక స్పీకర్ ను కలిసి రాజీనామాల గురించి చెప్పడమో జరిగే వరకు పట్టించుకోనవసరం లేదు. కాని నాగం జనార్దనరెడ్డి, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారి, జోగు రామన్నలు స్వయంగా వచ్చి స్పీకర్ కార్యాలయానికి మళ్లీ రాజీనామా లేఖలు అందించారు. వీటిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. పైగా స్పీకర్ కిందటిసారి తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలను సామూహికంగా తిరస్కరించిన తర్వాత, నాగం జనార్ధనరెడ్డికి తన పి.ఎస్. ద్వారా ఫోన్ చేయించి మళ్లీ రాజీనామా లేఖ ఇస్తే ఆమోదిస్తామని చెప్పించారు.అందువల్ల అది కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య అల్లా తెలంగాణ కు సంబందించి కొందరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మళ్లీ రాజీనామాలు ఇవ్వవలసి వస్తుంది. అప్పుడు మరోసారి తిరస్కరించడం స్పీకర్ కు కూడా కష్టం అవుతుంది. అందువల్ల ఏమి చేయాలన్నదానిపై కాంగ్రెస్ లో మల్లగుల్లాలు పడుతున్నారు. స్పీకర్ ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్ కు తిరిగి వచ్చాక మళ్లీ రాజీనామాల అంకానికి తెర లేస్తుంది.

కే.సి.ఆర్. మోసం చేస్తున్నాడు..


తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మోసం చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. రెండు వారాలలో తెలంగాణ వస్తుందని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఆ మాట గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై ఎప్పుడూ కెసిఆర్ ఏదో ఒకటి చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుల దీక్ష శిబిరానికి వెళ్లి రెండువారాలలో తెలంగాణపై కేంద్రం ఒక ప్రకట చేస్తుందని కెసిఆర్ ఏ ఆధారంతో చెప్పారని దయాకరరావు ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ సాధనకోసం అందరు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. కేవలం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు పనిచేసుకుంటూ పోతే దానివల్ల ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు.

ముందు దడ ఆ తరువాతే ఆ సినిమా..


సినిమా రంగంలో కూడా వ్యాపార రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రముఖ నటుడు నాగార్జున తన కుమారుడు నాగచైతన్య సినిమా కోసం మరో సినిమా విడుదలను కొంత కాలం జాప్యం చేయిస్తున్నారని కధనాలు వస్తున్నాయి. నాగచైతన్య, కాజోల్ హీరో, హీరోయిన్ లుగా దడ సినిమాను తీస్తున్నారు.దడ సినిమా వచ్చే నెలలో కాని విడుదల కాదు. ఈలోగా ఎప్పుడో ఏడాదిన్నర క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని ,విడుదలకు సిద్దంగా ఉన్న హౌస్ ఫుల్ సినిమాను మరికొంతకాలం వాయిదా వేసుకోవలసిందిగా నాగార్జున ఈ సినిమా నిర్మాతను కోరారట. దానికి రెండు కారణాలు చెబుతున్నారు. కొత్త డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నఅజయ్ భుయాన్ ఇంతకు ముందే హౌస్ ఫుల్ సినిమాకు దర్శకత్వం వహించారు. వివిధ కారణాల రీత్యా అది ఇంకా విడుదల కాలేదు. ఇప్పుడు దడ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ దర్శకత్వంలో విడుదలైన తొలి సినిమాగా పరిచయం చేయాలన్న ఉద్దేశ్యం ఒకటైతే, చిన్న బడ్జట్ సినిమా అయిన హౌస్ ఫుల్ విడుదల ప్రభావం పెద్ద బడ్జెట్ సినిమా అయిన దడ పై పడుతుందేమోనని సందేహం ఉండడం మరో కారణంగా చెబుతున్నారు. హౌస్ ఫుల్ నిర్మాత చంద్ర సిద్దార్ద తాను దడ సినిమా విడుదల తర్వాతే తన సినిమాను విడుదల చేస్తానని చెప్పారు. అలా చేస్తే ఈ సినిమాకు అవసరమైన సాయం చేస్తానని కూడా నాగార్జున చెప్పారని కూడా కధనాలు వచ్చాయి. ఏది ఏమైనా కొడుకు సినిమా కోసం తండ్రిగా నాగార్జున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో వ్యాపార సూత్రం కూడా ఇమిడి ఉంది కదా!

29, జులై 2011, శుక్రవారం

అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యం ముంబ‌యిలో..


నిధుల వెల్లండింపుతో వార్తల్లోకెక్కిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం మీకు చూడటం కుదరదా ? ఆందోళన చెందకండి ! ఇపుడు ఖ్యాతి గాంచిన ఈ దేవాలయాన్ని ముంబై వాసులు రాబోయే గణేష్ పండుగ సందర్భంగా నగరంలోనే చూడవచ్చు. అంధేరీ లోని ఒక మండలి ఈ దేశాలయ నకలును ఇసుకతో నిర్మిస్తోంది.
ఈ దేవాలయ నకలును నిర్మించి అత్యధికంగా ప్రజలను ఆకర్షించటమే లక్ష్యమని అంధేరిచా రాజా సార్వజనిక్ గణేశోత్సవ మండలి చెపుతోంది. ఈ మండలి ఏటా రకరకాల ఆకర్షణీయమైన అలంకరణలు గణేశ ఉత్సవ పందిళ్ళలో చేస్తుంది.
గుజరాత్ లోని అక్షర ధామాన్ని కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోగతంలో నిర్మించింది. పందిళ్ళలో గణేషుడి విగ్రహ ముందరి భాగంలో ఈ ఆకర్షణీయ ఖ్యాతిగాంచిన దేవాలయాల నిర్మాణాల నకళ్ళను పెట్టి ప్రజలను ఆకర్షించటం ఈ మండలి చేసే ప్రత్యేక పని గా మండలికి చెందిన ఉదయ్ సాలిన్ చెపుతారు. అక్షర ధామ్ గుడి నమూనాలను ఆర్టు డైరెక్టర్ అనంత షిండే చిత్రీకరిస్తున్నారు. ఇక ఇసుకతో నిర్మించబడుతున్న కేరళ దేవాలయం సైకత శిల్పి మన్మోహన్ మహాపాత్ర నిర్మిస్తున్నారు. గత సంవత్సరం ఈయన సోమనాధ్ దేవాలయ నకలును నిర్మించారు. ఆ నిర్మాణంలో 14 రోజులు పట్టిందని, ఇక ఇపుడు కేరళ దేవాలయ నకలు నిర్మాణానికి ఇసుక కొరకై అన్వేషిస్తున్నామని మహాపాత్ర చెపుతున్నారు. ఇసుక నిపుణులు దేవాలయ సూక్ష్మ పరిశీలనలకై కేరళ వెళ్ళారట. ఈ సైకత నిర్మాణపు ఎత్తు 18 అడుగులు వుండి నిర్మాణపు ప్రదేశం పూర్తిగా ఎయిర్ కండిషన్ చేస్తారట.
సుమారు 22 బిలియన్ డాలర్ల విలువ కల గుప్త నిధులు, నాణేలు, ఆభరణాలు, దేవతా మూర్తుల విగ్రహాలు అన్నీ బంగారువేగా బయటపడ్డ కేరళ అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రపంచంలోనే ఒక అరుదైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ దేవాలయంలోని ఆరో గది లో ఏముందనేది ఇంకా సస్పెన్స్ గానే వుండటం మరో విశేషం.

జగన్ జైలుకెళ్తే…జగన్ కంపెనీలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చేస్తున్న విచారణ, కేసు తదుపరి పరిణామాల కారణంగా ఒక వేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాల్సి వస్తే, ఏం జరుగుతుందన్న చర్చ ఊపెక్కింది. జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే, అతని రాజకీయ జీవితం కుప్పకూలినట్టే అని ఒక పక్క కాంగ్రెస్, టిడిపీలోని పెద్దలు భావిస్తుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన `చిన్నోళ్లు’ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధభావాల నేపథ్యంలో జగన్ జైలుకెళ్తే ఏం జరుగుతుందన్న ఈ రచయిత కొంతమంది రాజకీయ విశ్లేషకులను కదిలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవి…

1. జగన్ జైలుకు వెళ్తే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుకుంటున్నట్టుగా జగన్ పార్టీకి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి) పెద్దగా నష్టం రాదు.

2. జగన్ జైలుకు వెళ్లడమన్నది ప్రజల్లో ఓ పాజిటీవ్ ఇమేజ్ నే క్రియేట్ చేస్తుంది.

3. వాస్తవాలను అధికార కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు తెలుసుకోలేకపోతున్నారు. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను చాలా తక్కువగా ఊహించుకుంటున్నారు. వీరిలో కొన్ని రకాల భ్రమలు, అపోహలు ఉన్నాయి. జగన్ అక్రమ సంపాదన వ్యవహారం తేలినా, న్యాయస్థానాలు తీర్పు చెప్పినా, ఆయన జైలుకు వెళ్ళినా ప్రజల్లో కూడగట్టుకున్న అభిమానం మరింత పెరిగే అవకాశమే ఉంటుందేతప్ప, ఇసుమంత కూడా తగ్గదు.

4. జగన్ ఇప్పటికే ప్రజల్లో కూడగట్టుకున్న ప్రజాఅభిమానంతో ఆయన  జైల్లో ఉన్నా, `కథ’ నడిపించగలరు.

5. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతోనే జగన్ ఊహించినదానికంటే ఎక్కువగానే సానుభూతి సంపాదించుకున్నారు. పైగా ఓదార్పు యాత్రలతో ఇది మరింత ఎక్కువ అవుతోంది. దీనికి తోడుగా, జగన్ జైలుకు వెళ్తే, కచ్చితంగా ఈ సానుభూతి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో జైల్లో ఉన్నా, జగన్ మహానేతగానే వెలిగిపోవడం ఖాయం.

6. రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ కదుపుతున్న పావులు చివరకు జగన్ కు చెక్ పెట్టకపోగా, ఆయనకే సహకరించవచ్చు.

7. తమిళనాట  రాజ, కనిమొళిలకు జరిగిన నష్టం అలాగే డీఎంకెకు వాటిల్లిన కష్టం వంటివి ఇక్కడ జగన్ కు గానీ, ఆయన ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ కలగే అవకాశాలు లేవు. అంటే, తమిళనాడులో వేసిన మంత్రం ఇక్కడ పారదు.

8. తాను జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమోనన్న భయం జగన్ కు కూడా లేకపోలేదు. అందుకే, ఆయన ఇప్పటి నుంచే రాజకీయ పవర్ ను డీసెంట్రలైజ్ (వికేంద్రీకరణ) చేస్తున్నారు. పార్టీ అంటే తానొక్కడే అన్న భావన నుంచి పార్టీ అంటే అనేక యువనేతల సమాహారమన్న దిశగా జగన్ పార్టీని తీసుకువెళ్తున్నారు.

9. అందుకే, డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రకటించారు. ఇకపై మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించవచ్చు.

10. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయన్న సంకేతాన్ని ఇవ్వడం కోసమే జగన్ ఈ ప్రకటనలు చేశారని అనుకోలేము, అంతకంటే మరో వ్యూహం ఏమిటంటే, తన పార్టీ పవర్ ను డిసెంట్రలైజేషన్ చేయడమే.

11. అలా చేస్తే, జగన్ జైల్లో ఉన్నా పార్టీకి జరిగే నష్టం బహుస్వల్పమే అవుతుంది.

12. అంటే, జగన్ జైల్లో ఉన్నా, ఆ పార్టీ అఖండ విజయం సాధించడానికి ఇప్పటి నుంచే వ్యూహరచన ప్రారంభమైందనే అనుకోవాలి.

13. జగన్ అనూలోచితంగానో, లేదా, ఆవేశపూరితంగానో ప్రకటనలు చేయడంలేదు. వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహాలు ఫలిస్తే, రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. తెలుగుదేశం పార్టీ విస్తుపోవడం ఖాయం.
తుర్లపాటి నాగభూషణ రావు
nrturlapati@gmail.com

లోకాయుక్త పై బిజెపి విసుర్లు


కర్నాటక లోకాయుక్తపై ఆ రాష్ట్ర మంత్రులు ఎదురు దాడి ఆరంభించారు.లోకాయుక్తలో అనేక తప్పులు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. ప్రత్యేకించి బళ్లారి కి చెందిన గాలి సోదరులు దీనిపై మండిపడుతున్నారు. తాను నాలుగేళ్ల క్రితమే మైనింగ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటే, లోకాయుక్త తనపై వ్యాఖ్యలు చేయడం ఏమిటని గాలి కరుణాకరరెడ్డి ప్రశ్నిస్తు న్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ భరద్వాజకు ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా బిజెపి సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడు ఎమ్.వెంకయ్య నాయుడు కూడా లోకాయుక్తను తప్పుపడుతూ మాట్లాడడం విశేషం. ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప స్వయంగా ఇనుప ఖనిజ తవ్వకాలను నిషేధించారని, ఈయన అధికారంలోకి వచ్చాక ఒక్క మైనింగ్ లీజ్ కూడా ఇవ్వలేదని , అయినప్పటికీ ఆయనపై కూడా లోకాయుక్త అభియోగాలు చేసిందని ఆయన అన్నారు. అయితే బిజెపి మాత్రం విలువలకు కట్టుబడి ముఖ్యమంత్రితో రాజీనామా చేయిస్తున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని వెంకయ్య నాయుడు ఆరోపించారు.కాగా బిజెపికి చెందిన పన్నెండు మంది ఎమ్.పిలు లోకాయుక్త నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసి ముఖ్యమంత్రి ఎడ్యూరప్పను మార్చాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని సూచించడం కొసమెరుపు. ఎడ్యూరప్ప చివరి నిమిషం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.పధ్నాలుగుమంది ఎమ్.పిలు, మెజార్టీ ఎమ్మెల్యేలు వెంకయ్యనాయుడును కలిసి ఎడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిమాండు చేయడం విశేషం.

భ‌ద్ర‌త స‌దుపాయాలే ప్ర‌ధాన ఎజెండా..!


ముంబై పేలుళ్ల తర్వాత మహారాష్ట్రకు రెండువేల బుల్లట్ ఫ్రూఫ్ జాకెట్లను సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయిం చింది. అంతేకాక మహారాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రతకు సంబంధిం చిన సదుపాయాలను ప్రధాన ఎజెండాకు చేసుకోవలసిందిగా కూడా కేంద్రం సలహా ఇచ్చింది.మహారాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఈ విషయాన్ని శాసనమండలిలో తెలిపారు. కేంద్రం హోం మంత్రి చిదంబరం రాష్ట్రానికి ఒక ఆదేశాన్ని పంపుతూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాల సేకరణ వంటి వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మహరాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.నిఘా వ్యవస్థ కనుక పసి కట్టగలిగి ఉంటే టెర్రరిస్టుల దాడులను అరికట్టకలిగి ఉండేవారమని ఆయన అన్నారు.ముంబై వీధులలోని ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపడుతున్నామని, వీటి వల్ల కూడా ఉగ్రవాదుల దాడులకు దోహదం అవుతున్నాయని ఆయన అన్నారు.అనుమానితులను గుర్తించడంలో పౌరులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని, వారు కూడా పౌర పోలీసులుగా వ్యవహరించాలని, ఇందుకోసం ఒక ప్రత్యేక పధకాన్ని తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు.అలాగే అమ్మోనియం నైట్రేట్ ను నియంత్రిం చడానికి అవసరమైన నిర్ణయాన్ని సత్వరమే తీసుకోవాలని కూడా కేంద్రాన్నికోరామని పాటిల్ చెప్పారు. ఉగ్రవాదు లను ఎదుర్కోవడానికి అవసరమైనప్పుడు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

సాక్షి చేస్తోంది కూడా అదేగా..!


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైన, ఆయన మీడియా సంస్థలపై విమర్శలు కురిపిస్తున్నారు. కారు స్పీడ్ ఎక్కువైతే ప్రమాదాలు జరిగి పరలోకాలకు వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు. కారు స్పీడ్ ఎక్కువైతే ప్రమాదం అన్నంత వరకు ఫర్వాలేదు కాని పరలోకాలకు వెళతారని ముఖ్య మంత్రి అనడం అంత సమంజసంగా ఉండదు. ప్రత్యర్ధి వై.ఎస్.జగన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకునే అవకాశం ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా ఫర్వాలేదు కాని పోతావు అని హెచ్చరించినట్లుగా చేయడం సెంటిమెంటుకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఇక జగన్ మీడియాపై కూడా గుంటూరుజిల్లా పర్యటనలో కిరణ్ విమర్శలు చేశారు.రెండువేల ఎనిమిదిలో సాక్షి పత్రిక, ఛానల్ పెట్టడానికి ముందు రెండు పత్రికలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడానికే సాక్షిని ప్రారంభిస్తున్నామని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, సాక్షి కూడా ఇప్పుడు అదే ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు. రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమనడానికి ఇది కూడా ఒక ఉదాహరణే. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డికి ఈనాడు పత్రికకు ఉప్పు,నిప్పుగా ఉండేది.అలాంటి ఇప్పుడు జగన్ మీడియా ఆయనకు దూరం అయితే ఈనాడు, ఇతర పత్రికలు సన్నిహితంగా ఉంటున్నాయి. అదే రాజకీయ వైచిత్రి.

బ్యాంకాక్‌లో బిజినెస్ మ్యాన్‌..!


మ‌హేష్‌బాబు హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే సినిమా బిజినెస్‌మ్యాన్ షూటింగ్ బ్యాంకాక్‌లో జ‌రుగు తుందా.. అని అనుకుంటున్నారా..?  కాదు.. కాదు.. బిజినెస్‌మ్యాన్ షూటింగ్ ఇంకా మొద‌లే అవ‌లేదు.. కానీ.. బిజినెస్ మ్యాన్ స్క్రిప్ట్ వ‌ర్క్ మాత్రం బ్యాంకాక్‌లో ఊపిరి పోసుకుంటుంది. సాధార‌ణంగా పూరీ జ‌గ‌న్నాథ్ త‌న సినిమా స్క్రిప్ట్‌ల‌ని బ్యాంకాక్‌కి వెళ్ళి రాసుకునే అల‌వాటు ఉన్న‌ది. ఈ బిజినెస్ మ్యాన్ చిత్రానికి కూడా జ‌గ‌న్ బ్యాంకాక్‌కి వెళ్ళి స్క్రిప్ట్ పూర్తి చేసాడు. ఆల్రెడీ డైలాగ్ వ‌ర్ష‌న్ కంప్లీట్ అయిపోయిన ఈ చిత్రం షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వ‌బోతోంది. మ‌హేష్ ప్ర‌స్తుతం దూకుడు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయిన త‌ర్వాత ఆయ‌న బిజినెస్ మ్యాన్స్ షూటింగ్‌లో పాల్గొంటాడు. ఆర్‌.ఆర్ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం అత్యంత ప్రాతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఆర్‌.ఆర్ మూవీ మేక‌ర్స్ ర‌వితేజ తో తీసిని కిక్ సూప‌ర్ హిట్ అవ‌డం తెలిసిందే.. ఇప్పుడ మ‌హేష్‌బాబు లాంటి స్టార్ హీరోతో మొద‌లెట్టిన ఈ చిత్రంపై కూడా భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి పండ‌క్కి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నారు.

28, జులై 2011, గురువారం

నిజాయితీలో నేనే నెంబ‌ర్‌వ‌న్‌


అని అంటున్నాడు వైఎస్‌. జ‌గ‌న్‌. ఆయ‌న క‌ర్నూలు జిల్లాలో త‌న ఓదార్పు యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో ఏ నాయ‌కుడిలో నేని నిజాయితీ త‌న వ‌ద్ద ఉంద‌ని త‌న‌ని తాను స‌మ‌ర్థించుకున్నారు. త‌న‌పై ఉన్న సిబిఐ కేసుతో త‌న‌ని ఇర‌కాటంలో పెట్టాల‌ని, త‌న‌ని, త‌న త‌ల్లిని అప్ర‌తిష్ట‌పాలు చేయాల‌ని, సి.ఎం. కిర‌ణ్‌, చంద్ర‌బాబు లు కుట్ర‌ప‌న్నుతున్నార‌ని విమ‌ర్శించారు. త‌న‌కి త‌న త‌ల్లికి, వైఎస్ ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీర్వాదాలతో పాటు త‌నని ప్రేమించే మంచి మ‌నుషుల అండ ఉన్నంత కాలం త‌న ప్ర‌త్య‌ర్థులు ఎంత‌మంది ఎన్ని ర‌కాలు త‌న‌ని దెబ్బ కొట్ట‌డానికి చూసినా త‌న‌కి ఏమీ కాద‌ని, వ‌చ్చే ఎల‌క్ష‌న్ల‌లో భారీ మెజారిటీతో నెగ్గి అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. జ‌గ‌న్ త‌న ప్ర‌స‌గంలో తన‌ని తాను నిజాయితీ ప‌రుడ‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చుకుంటే స‌రిపోతుందా…? ఆయ‌న ఎంత నిజాయితీ ప‌రుడో, ఆయ‌న అక్ర‌మాల‌కు, అన్యాయాల‌కు పాల్ప‌డ‌కుండా నిజాయితీగా ఆయ‌న ఆస్తులు కూడ‌గ‌ట్టుకున్నాడో సోమ‌వారం రోజు తెలిసిపోతుంది..

మైనింగ్ కింగ్‌కి ఎదురుగాలి..


మైనింగ్ కింగ్‌గా పేరు సంపాదించుకున్న కర్ణాటక మంత్రి గాలి జ‌నార్థ‌న్‌రెడ్డికి ప్ర‌స్తుతం ఎదురు గాలి వీస్తోంది.  గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బళ్లారి గనుల డబ్బంతా ఎటు వెళ్లిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాధి కారులకు వెల్లడించిన సొమ్ము కన్నా ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరిగాయని అక్రమ మైనింగ్‌పై తుది నివేదిక తెలియజేస్తోది. ఆ సొమ్ము విషయంలో గాలి సోదరులు పన్ను ఎగవేతకు, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకొడా మాదిరిగానే గాలి బ్రదర్స్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న 215.12 కోట్ల రూపాయల విషయంలో ఐటి శాఖ దర్యాప్తు చేసి కచ్చితమైన నష్టాన్ని అంచనా వేసి, భారత్‌కు ఆ డబ్బును రప్పించే ఏర్పాట్లు చేయాలని నివేదిక సూచించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) నుంచి అక్రమంగా విదేశాలకు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, మంత్రి శ్రీరాములు తరలించారని యువి సింగ్ నేతృత్వంలోని అధికారులు కనిపెట్టారు. ఇప్ప‌టికే గాలి జ‌నార్థ‌న్‌రెడ్డిపై ఎన్నో ఆరోప‌ణ‌లు ఉన్న‌ప్ప‌టికీ అధికార బ‌లంతో వాట‌న్నింటినీ దాటుకుని వెళ్ళిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ అనిశ్చితి దృష్ట్యా గాలి జ‌నార్థ‌న్ రెడ్డి, ఆయ‌న సోద‌రుడు క‌రుణాక‌ర్ రెడ్డి, మ‌రో మంత్రి శ్రీ‌రాముల మంత్రి ప‌ద‌వులు కూడా ఊడిపోయే అవ‌కాశాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ ఎదురుగాలి నుండి గాలి సోద‌రులు ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.