ఎన్నికల అభ్యర్థిని ప్రకటించిన జగన్ !

ఆలులేదు, చూలు లేదు, అల్లుడిపేరు రామలింగం అన్నట్టుగా జగన్ తన పార్టీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించే పనికి శ్రీకారం చుట్టారు. జగన్ మాటల్లో చెప్పాలంటే, మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అందుకు అంతా సిద్ధం కావాలి. ఎన్నికల అభ్యర్థులను సైతం ఖరారు చేసేసుకుందాం... పైకి చూడటానికి ఇదేదో తొందరపాటు చర్యగా అనిపించవచ్చేమేకానీ, జగన్ మాత్రం మధ్యంతరం రావడమా, లేదా అన్నది తన చేతుల్లోనే ఉన్నట్టుగా సాగిపోతున్నారు.
  కాంగ్రెస్ నుంచి వేరుపడి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన జగన్... మధ్యంతర ఎన్నికల దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అంటూ యువనేత ఇంతకుముందే సంకేతాలు పంపారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఓదార్పు యాత్రలో ఆ దిశగా అడుగు వేశారు. డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రకటించారు. తెలంగాణ సమస్యతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న వేళ జగన్ ప్రకటన సంచలనం రేకెత్తిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్.. మధ్యంతర ఎన్నికలకు తొందరపడుతోందా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈమధ్య చంద్రబాబు కూడా తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని ప్రస్తావించారు. పార్టీ శ్రేణులన్నీ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు యువనేత జోరు చూస్తుంటే.. రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాట్ నెక్స్ట్ అనేది తెలియాలంటే వెయిట్ అండీ సీ.
                                                                                                                        - బాలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!