రాష్ట్రం రావ‌ణ‌కాష్టంలా మండుతోంది..!


అవును… రాష్ట్రం రావ‌ణ‌కాష్టంలా మండుతోంది.. స్వార్థ పూరిత రాజ‌కీయాల‌తో, అధిష్టానం అమ్మ చేతిలో తొలు బొమ్మల్లా ఆడుతున్న రాజ‌కీయ‌నాయ‌కుల జ‌గ‌న్నాట‌కంలో అమాయ‌కులు బ‌ల‌వుతున్నారు. రాష్ట్రాన్ని చీల్చాల‌ని కాదు రాష్ట్రం ఒక్కటిగానే ఉండాల‌ని సాగుతున్న ఉద్యమాల‌లో సామాన్యుడు కాలి బూడిద‌యిపోతున్నాడు.. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని పేద వాడు ఆ రోజు రెక్కల క‌ష్టం చేసుకుని త‌న క‌డుపునింపుకోవ‌డానికి బ‌య‌లుదేరితే.. బందుల పేరుతో వాడి ప‌ని మానించి, వాడి నోటికి వ‌చ్చే కూడును రాబందుల్లా లాక్కుంటున్నారు.. ఉద్యమాల‌తో సంబంధం లేని ఓ అమాయ‌కుడు, త‌న మాన‌న త‌ను వాహ‌నంపై వెళుతుంటే.. ఉద్యమం మాటున దాగున్న కొద‌రు ముష్కరులు వాడి వాహనాన్ని ధ్వంసం చేసి త‌న్ని త‌రిమేస్తే..పాపం అమాయ‌కుడు.. ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క‌.. మ‌న‌సులోనే కుమిలిపోతున్నాడు.. చెల్లా చెదురుగా ప‌డిపోయిన వాహ‌న‌పు శిథిలాల‌ని చూడ‌గాని వాడి హృద‌యం మండిపోయింది.. కానీ..ఏమి చేస్తాడు..పాపం..!
ఉద‌యాన్నే నిద్రలేచి ఆరోజు క‌డుపు నింపుకోవ‌డం కోసం త‌ను తెచ్చుకున్న అద్దె ఆటో బ‌య‌ట‌కి తీసిన మ‌రొక అమాయ‌కుడు, మొద‌టి బ్యారం కోసం ఆశ‌గా ఎదురు చూస్తూ రోడ్డెక్కిన వాడికి త‌న ఆటో అద్ధం బ్రద్దలు కొడుతున్న కొద‌రిని చూసి నిశ్చేష్ఠుడైపోయాడు.. బంద్ పేరుతో బ‌రితెగించి విధ్వంసం సృష్టిస్తున్న వారికి ఏం తెలుసు.. ఆ ఆటోవాడి వ్యధ‌.. ఆరోజు బ్యారం త‌గ‌ల‌క పోగా.. మ‌రో భారం ప‌డినంద‌కుకు మ‌న‌సులో మంట‌లు రేగుతుండ‌గా… ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క లోలోప‌లే కుమిలిపోయాడు.. పాపం..!
గ‌వ‌ర్నమెంటు హాస్పిట‌ల్‌లో చావు బ‌తుకుల‌తో ఉన్న త‌న తండ్రిని చివ‌రిచూపు చూడ‌డం కోసం బ‌స్సెక్కిన ఓ కూతురు కొద్ది దూరం రాగానే బ‌స్సుపై కొంద‌రు ముష్కరులు దాడి చేసి, అద్దాలు ప‌గుల‌గొట్టి, బ‌స్సులో ఉన్న ప్రయాణీకుల‌ని బ‌య‌టికి నెట్టేసి, బ‌స్సు డ్రైవ‌ర్‌ని, కండ‌క్టర్‌ని కిందికి తోసేసి, ఆ బ‌స్సుపై పెట్రోలు పోసి, భ‌గ భ‌గా మండుతున్న మంట‌ల‌ను చూస్తూ విక‌టాట్టహాసం చేస్తున్న ఆ ముష్కరుల పైశాచిక ఆనందంలో ఆ కూతురు ఆశ ఆవిర‌యిపోయింది.. ఆ తండ్రి శ్వాస అనంత‌వాయువుల్లో క‌లిసిపోయింది…!
చెప్పాలంటే ఎన్నో హృద‌య‌విదార‌క సంఘ‌ట‌న‌లు.. సామాన్యుడి న‌డ్డి విరుస్తున్న ఘ‌ట‌న‌లు.. తెల్లారి లేస్తే బ‌తుకుపోరుకై పోరాడుతున్న సామాన్యుడు కొంద‌రు స్వార్థప‌రుల విష‌పు కోర‌ల‌లో చిక్కుకుని అల్లాడిపోతున్నాడు.. రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజ‌లు నేటి నాయ‌కుల ఆకృత్యాల‌ను చూస్తూ హ‌య్యో అని త‌ల‌బాదుకుంటున్నారు..
స‌మ‌స్య ప‌రిష్కారం కావడానికి సామాన్యుడి ఉసురు పోసుకోవాల్సిందేనా.. బంద్‌ల పేరుతో రాష్ట్రాన్ని రావ‌ణ‌కాష్టంలా త‌యారు చేయ‌డ‌మేనా…
నాయ‌కులారా.. మీ స్వార్థం కో్సం కాకుండా సామాన్యుడి గురించి ఆలోచించండి.. మీరు స‌మ‌స్యపై పోరాడాల‌నుకుంటే అన్నా హ‌జారేలా ఆమ‌ర‌ణ దీక్షలు చేయండి.. అంతేకానీ.. ఓట్లు వేసి గెలిపించుకున్న ఖ‌ర్మానికి సామాన్యుడితో ఆడుకోకండి..
ఇక‌నైనా మారండి…

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!