తెలంగాణ‌కి చంద్ర‌బాబు సుముఖ‌మే..?


కేంద్రంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలంగాణపై ఇప్పటికే తమ విధానాన్ని ప్రకటించామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సత్వరమే నిర్ణయం తీసుకుని తెలంగాణ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండు చేశారు.కేంద్ర మంత్రులు గులాం నబీ అజాద్, చిదంబరంలు విపక్షాలతో కూడా మాట్లాడతామని , తెలుగుదేశం కూడా ఏకాభిప్రాయ సాధనకోసం కృషి చేయాలని సూచించిన నేపధ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చంద్రబాబు చెబుతున్నదానిని బట్టి చూస్తే ఆయన మెల్లగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అనుకూలం అన్న సంకేతం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే రెండువేల ఎనిమిదిలో తెలంగాణం రాష్ట్ర ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది.ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత అధికారం రాలేదు. అయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన మహానాడులో తెలంగాణ తీర్మానానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. తదుపరి రెండువేల తొమ్మిది డిసెంబరు ఏడున తాము తెలంగాణకు మద్దతు ఇస్తామని అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పారు.కాని తొమ్మిదోతేదీన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రకటించగా, తదుపరి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి ప్రకటన చేస్తారా అన్న వ్యాఖ్య చేశారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలుకాని, టిఆర్ఎస్ నేతలు కాని చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించేవారు. చంద్రబాబు తనకు రెండు కళ్లు సమానమని అనడం కూడా వివాదం అయింది. కాని క్రమేపి వచ్చిన పరిణామాలలో కొద్ది రోజుల క్రితం డిసెంబరు తొమ్మిది కి ముందే తాము తెలంగాణపై తమ అభిప్రాయాన్నిచెప్పామనడం ద్వారా ఆయన ఒక సంకేతాన్ని ఇస్తున్నట్లు ఉంది. అక్కడ నుంచి మరో అడుగు ముందుకేసి తెలంగాణపై తమ వైఖరిని చెప్పామని అనడం ద్వారా తాము తెలంగాణ పై గత విధానాన్ని మార్చుకోలేదని, ప్రణబ్ కు అప్పట్లో ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోలేదని పార్టీ నతలు చేసే వాదనను బలపరిచినట్లుగా ఉంది. తెలంగాణ రాదన్న నమ్మకంతో చంద్రబాబు ఇలా అంటున్నారో , లేక తెలంగాణపై ఇక ఏదో ఒక విధానానికి వెళ్లకపోతే క్రెడిబిలిటి దెబ్బతింటుందని భావిస్తున్నారో కాని ఆయన మాటల సారాంశాన్ని గమనిస్తే మాత్రం ఆయన ధోరణిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. దానికి తగినట్లుగానే తెలంగాణ టిడిపి నాయకులు కూడా ఒక ప్రకటన చేశారు. కాంగ్రెస్ లోని రెండు ప్రాంతాల నాయకులలో ఏకాభిప్రాయం వస్తే సరిపోతుందని, తెలంగాణ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవలసింది కేంద్రం,కాంగ్రెస్ పార్టీనేని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టడం వ్యూహమా? లేక తెలంగాణ ఇచ్చినా అభ్యంతరం లేదని సంకేతం ఇవ్వడమా అన్నదానిపై విశ్లేషించుకోవలసి ఉంటుంది.సీమాంధ్ర నేతలు కూడా వాదనలకోసం తాము తెలంగాణ తీర్మానాన్ని వెనక్కి తీసుకోలేదని, కాకపోతే తమ ప్రజల మనో భావాలకు అనుగుణంగా ఉద్యమం చేస్తున్నామని అంటుంటారు. రాజకీయ నాయకుల డబుల్ గేమ్ తోనే రాష్ట్రం ఈ దుర్దశకు చేరింది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఏకాభిప్రాయ సాధనతో పని లేదని చెప్పడానికి కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు అర్ధం చేసుకోవాలి. మరి వచ్చే రోజులలో కూడా చంద్రబాబు నాయుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణకు సంబంధించినంతవరకు కట్టుబడి ఉంటామని చెప్పగలిగితే ఆయన పార్టీలో ఏకాభిప్రాయ సాధన వచ్చినట్లే. ఎందుకంటే పార్టీలో ఆయనను వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. ఒక వేళ ఉన్నా వారు పార్టీ నుంచి వైదొలగవలసి ఉంటుంది. వీటన్నిని దృష్టిలో ఉంచుకుని , తన పార్టీ రాజకీయ భవిష్యత్తుతతో పాటు , తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం కూడా ఆయన అడుగులు వేస్తే మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!