నూటొక్క జిల్లాల అందగాడు ఇక కనబడడు

‘దేశం చాలా క్లిష్ట పరిస్థితి ఉంది’, ‘ ఫాదరీ ఫాదరీ ‘ , ‘ దేవుడో దేవుడా ‘  అనే డైలాగ్స్ ఒకప్పుడు ప్రేక్షకులు తెగ చెప్పుకునేవారంటే  నూతన్ ప్రసాద్  గారు ఆ డైలాగ్స్ చెప్పిన శైలి అటువంటిది.  విభిన్నమైన నటనతో  ప్రేక్షకుల మనసు దోచుకుని వారితో నూటొక్క జిల్లాల అందగాడుగా పిలిపించుకున్న  విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ ఈరోజు (30-03-2011) కన్నుమూశారు. అయన మరణం సినీ పరిశ్రమకు , ప్రేక్షకులకు తీరనిలోటు.  నూతన్ ప్రసాద్ గారి అసలు పేరు తాడినాడ దుర్గా సత్య వరప్రసాద్. వారి స్వగ్రామం  కృష్ణాజిల్లా కైకలూరు. 38 సంవత్సరాల సినీ జీవితం లో అయన ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు.  1973 లో వచ్చిన అందాల రాముడు సినిమాతో ఆయన చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.  ఆ తర్వాత అనేక సినిమాలలో  ప్రతినాయకులలో  ఒకరిగా అయన తన ప్రస్థానం కొనసాగించారు. విభినమైన హాస్యన్ని రంగరించి విలనీ పండించడం లో ఆయనకీ ఆయనే సాటి.  విలన్ గా కమెడియన్ గా నే కాక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అయన రాణించారు. ‘ పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రం లో  ‘దేశం  చాలా క్లిష్ట పరిస్థితి లో ఉంది ‘ అనే డైలాగ్ నొక్కి నొక్కి చెప్పి  జనం చేత ఆ డైలాగ్ పలికించిన ఘనత ఆయనకే దక్కింది.  1980 లో వచ్చిన రాజాధిరాజు  చిత్రంలో సైతాన్ గా ఆయన నటన అద్భుతం . ఆ చిత్రం లో ‘కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి ‘ అనే పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందో వేరే చెప్పనక్కరలేదు. నటుడిగా అయన కెరీర్ తారాస్థాయిలో ఉన్న రోజుల్లో  బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ సందర్భంగా  జరిగిన ప్రమాదం లో ఆయన తీవ్రంగా  గాయపడ్డారు. వెన్నెముక దెబ్బ తినడంతో అప్పటి నుండి ఆయన  వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.  అటువంటి పరిస్థితిలో కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకి సాగి  ఆత్మవిశ్వాసానికి అసలైన అర్ధం చెప్పారు. నడవలేని పరిస్థితిలో కూడా తగిన పాత్రలను ఎంచుకుని తన సినీ ప్రస్థానం కొనసాగించిన ఆయన ఎందరికో స్పూర్తినిచ్చారు.
  నూతన్‌ ప్రసాద్‌ 1945, డిసెంబరు 12న కృష్ణాజిల్లాలోని కైకలూరులో జన్మించారు. ఆయన అసలు పేరు తాడివాడ వరప్రసాద్‌. ఐటీఐ చదివే రోజుల్లోనే నాటకాల్లో పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నూతన్‌ ప్రసాద్‌ తన ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న తొలి బహుమతి 'ఒక దువ్వెన' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నూతన్‌ప్రసాద్‌కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నూతన్‌ కుమార్‌ కూడా నటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు.
 గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నూతన్ ప్రసాద్ ఈ ఉదయం కన్ను మూశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్దిస్తూ వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!