ఈరోజు రాత్రి ఓ గంట లైట్లు ఆపేయండి


   వేడెక్కుతున్న ఈ భూమిని మనం రక్షించుకోవాలి. ఈ భూమిమీద ఉన్న జీవజాలాన్ని కాపాడుకోవాలి. వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులతో ప్రాణకోటి అల్లల్లాడుతోంటే కనీసం ఒక్క గంట - మనమంతా భూమి కోసం కేటాయించలేమా? ఒక్కసారి ఆలోచించండి. సరిగా ఈ ఉద్దేశంతోనే ప్రతిఏటా మార్చినెలలోని ఆఖరి శనివారం రాత్రి ప్రపంచదేశాలు `ఎర్త్ అవర్'ను పాటిస్తున్నాయి. భూమిని రక్షించుకుందామన్న ఏకైక లక్ష్యంతో ఈరోజు శనివారం రాత్రి 8గంటల 30 నిమిషాల నుంచి గంటసేపు మనమంతా ఎర్త్ అవర్ పాటించబోతున్నాం. ఈ గంటసేపు విద్యుత్ దీపాలను ఆపేసి బంగారు భవితకు బాటలువేస్తూ చిరుదీపాలను వెలిగించుకుంటాం.  చీకట్లోనుంచే వెలుగురేఖలు ప్రసరిస్తాయని చాటిచెప్పేదే  `ఎర్త్ అవర్' 


   ప్రపంచ పర్యావరణానికి ముప్పు వాటిల్లింది. ఒక గంటసేపు విద్యుత్ ఆపడం ద్వారా పెద్దపెట్టున ఒక్కసారిగా కాలుష్యాన్ని తగ్గించలేకపోవచ్చు. కానీ ఎర్త్ అవర్ కచ్చితంగా ఒక స్పూర్తిగా నిలుస్తుందనే చెప్పాలి.
ఇటు ఆస్ట్రేలియా నుంచి అటు అమెరికా వరకు అనేక దేశాలు మార్చినెలలోని ఆఖరి శనివారంనాడు రాత్రి ఓ గంటసేపు విద్యుత్ ను ఆపివేయడానికి సిద్ధమవుతున్నారు. భూమికోసం తపించేవారందరినీ చైతన్యపరిచేందుకే ఈ లైట్స్ ఆఫ్...
   గంటసేపు విద్యుత్ వాడకాన్ని ఆపివేయాలన్న ఆలోచన వచ్చి ఇప్పటికి నాలుగేళ్లయింది.
.సరిగా 2007వ సంవత్సరంలో సిడ్నీలో పుట్టింది `లైట్స్ ఆఫ్' ఆలోచన. భూతాపాన్ని చల్లార్చాలన్న నినాదంతో, పృధ్విని రక్షించాలన్న తపన నుంచే `ఎర్త్ అవర్' కార్యక్రమం పుట్టుకొచ్చింది.
ఇప్పుడీ ఆలోచన  ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో పాతుకుపోయింది. అందుకే మార్చి ఆఖరి శనివారం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
 2007లో - సిడ్నీలోని 20లక్షల మంది ప్రజలు స్వచ్చంధంగా లైట్స్ ఆఫ్ చేసేసి ఎర్త్ అవర్ సందేశాత్మక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఆస్ట్రేలియాలో పుట్టిన ఈ ఆలోచన ఇప్పుడు యావత్ ప్రపంచాన్నీ చైతన్య పరుస్తోంది.
WWF అనే సంస్థ ఎర్త్ అవర్ ని  ప్రపంచమంతటా నిర్వహిస్తోంది. `వరల్డ్ వైడ్ ఫండ్ పర్ నేచర్' అనే ఈ సంస్థ - ప్రపంచదేశాల్లోని అన్ని వర్గాల ప్రజలకు `ఎర్త్ అవర్' సందేశాన్ని అందజేస్తోంది.
      ఒక గంటసేపు విద్యుత్ దీపాలు ఆపినంత మాత్రాన భూవాతావరణంలో మార్పువస్తుందా? అంటూ పెదవివిరిచేవారూ ఉన్నారు. నిజమే కావచ్చు. కానీ ఇదో చైతన్య ఉద్యమం. ఎంత లబ్దిపొందామన్నదానికంటే, ఎంత తృప్తి మిగుల్చుకున్నామన్నదే చాలా ముఖ్యం.
    ప్రపంచంలోని పలునగరాల్లో గంటసేపు విద్యుత్ నిలిపివేయడమంటే మాటలు కాదు. ఎన్నో ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే ఎర్త్ అవర్ ప్రొగ్రాం కంపల్సరీగా పాటించాలని ఎవ్వరూ చెప్పడంలేదు. అత్యవసరాలకు విద్యుత్ వాడినా, అనవసరమైన వాడకాన్ని తగ్గించడమే ఈ పిలుపులోని పరమార్ధం. ఇప్పటికే ఎన్నో పారిశ్రామిక నగరాలు రేయింబవళ్లు విద్యుత్ ను యధేచ్ఛగా ఉపయోగిస్తునే ఉన్నాయి. గంటసేపు కరెంట్ ను ఆపేయడంవల్ల కొంతమేర కర్బన ఉద్గారాలను  తగ్గించవచ్చు.
   ప్రకృతిని రక్షించుకోవడంలో ఇదో చిన్న ప్రయత్నం మాత్రమే. ఇందుకు అందరూ సహకరిస్తే భూతాపాన్ని కొంతలోకొంత తగ్గించవచ్చు.
మహానగరాల్లో కరెంట్ ఒక గంట లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులమాట పక్కనబెడితే, ఆ గంటా- ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఓసారి ఆలోచించండి. కరెంట్ ఆదాఅవడం ఒక ప్రయోజనం. అయితే ఆ ఒక్క గంట విద్యుత్ ఆదాపెద్దగా లెక్కలోకి రాకపోవచ్చు. అయితే మనం కూడా పృధ్వికోసం మహాసంకల్పం చెప్పుకున్నామన్న తృప్తి మిగులుతంది. విద్యుత్ పరికరాలకు దూరంగా జరిగి,  కాసేపు ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ- క్యాండిల్స్ వెలుగుల్లో కుటుంబసభ్యులతో ఆనందంగా గడపవచ్చుకదా..


   ఎర్త్ అవర్ పాటించే సమయంలో ఓసారి మనమంతా పర్యావరణకాలుష్యం గురించి గుర్తుచేసుకోవాలి. ఈ ప్రకృతిని, జీవరాశిని రక్షించేందుకు మనవంతు కృషిగా ఏమి చేయాలో ఆలోచించుకోవాలి. కాలుష్యభూతం వల్ల పర్యావరణం ఎంతగా దెబ్బతింటున్నదో పిల్లలకు తెలియజెప్పాలి. భూతాపం తెస్తున్న అనర్థాలను మననం చేసుకోవాలి. ఈ భూమిని రక్షిస్తానంటూ మరోసారి ప్రతినబూనాలి. అలా..అలా ఈ గంటను సద్వినియోగం చేకోవచ్చు.  ఆహ్లాదకరమైన మార్పుకోసం మరి మీరు కూడా మొదటి అడుగువేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. ఎర్త్ అవర్ ని నిండుమనసుతో పాటించండి. లైట్స్ ఆఫ్ చేసేయండి. ఒకేనా...
`ఎర్త్ అవర్' పాటించేవారి సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. మనదేశంలో కూడా ఎర్త్ అవర్ పై అవగాహన కలిగించడానికి స్వచ్ఛంధ సంస్థలు ముందుకువస్తున్నాయి.
  ఎర్త్ అవర్ ని అసలెందుకు ఎందుకు పాటించాలన్న సందేహం ఉంటే దాన్ని ఎర్త్ అవర్ నిర్వాహకులు చిటికలో తీర్చేస్తున్నారు. అలాగే,  చైతన్య సందేశాన్ని మీమిత్రులకు, బంధువులకు ఎలా పంపించాలని ఆలోచిస్తున్నారా? దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమేలేదు.
  ఎందుకంటే ఎర్త్ అవర్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఎర్త్ అవర్ ఎందుకు పాటించాలి, ఎలా పాటించాలి, పేర్లు నమోదు చేసుకోవడం, మిత్రులకు, బంధువులకు సందేశాలు ఇచ్చుకోవడం వంటి అనేక అంశాలను వెబ్ సైట్స్ లో పొందుపరిచారు.
  అంతేకాదు, ఎర్త్ అవర్ సందేశంతో మీకు నచ్చిన లాంతర్ ని మీరే సిద్ధం చేసుకోవడం, రంగురంగుల లాంతర్లను ఎంచుకోవడం వంటి ఎన్నో www.earthhour.orgలోని `ఫన్ స్టప్' లో చూడొచ్చు...
  పిల్లల్లో ఎర్త్ అవర్ పై అవగాహన పెంచడానికి కిడ్స్ కోసం గేమ్స్ కూడా ఉన్నాయి.
  హైదరాబాద్ లోని అనేక స్వచ్చంధ సంస్థలు ఎర్త్ అవర్ పాటించడానికి సిద్ధమవుతున్నాయి. బ్లూక్రాస్ సంస్థ వ్యవస్థాపకరాలు అమల కూడా ఎర్త్ అవర్ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు మనవంతు తోడ్పాటు ఇవ్వాలని అనేక మంది పిలుపునిచ్చారు.
 ఎర్త్ అవర్ ప్రారంభం కాగానే విద్యుత్ దీపాలను స్విచ్ ఆఫ్ చేస్తేస్తాం. సరే, మరి ఎలాంటి కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా అన్న దర్మసందేహం రావచ్చు. దీనికి కూడా WWF సంస్థ వివరణలు ఇచ్చేసింది. పెట్రోలియం పదార్ధాలతో తయారైన క్యాండిల్స్ ను వాడటంకంటే, సహజసిద్ధమైన క్యాండిల్స్ వాడమంటున్నారు. అంతేకాదు, క్యాండిల్స్ ని వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి....
.-  చిన్నపిల్లలు వెలిగించకూడదు
- కిందపడిపోయేలా ఉంచకూడదు
- పేపర్లు, కర్టెన్లు, బట్టలకు దూరంగా ఉంచాలి
- కిటికీలపై ఉంచకండి
ఎర్త్ అవర్ అనగానే ఏదో ఆవేశపడిపోయి లైట్లన్నీ ఆర్పేసి కారుచీకట్లో మగ్గమని కాదు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన తరువాతనే ఎర్త్ ఆవర్ ను  చైతన్య పూరితంగా పాటించాలి. అంతేకానీ ప్రమాదాలు కోరితెచ్చుకోకూడదు.
ఎర్త్ అవర్ సమయంలో నగరమంతా గాఢాందకారంలో మగ్గిపోతుందని ఎవ్వరూ భయపడనక్కర్లేదు. ఎందుకంటే, వీధుల్లోనూ, అత్యవసర సేవావిభాగాల్లోనూ లైట్స్ అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయి. మితిమీరి ఉన్నచోట్ల లైట్లు ఆర్పేయవచ్చు.

ఎర్త్ అవర్ అయిన తరువాత అంతా ఒక్కసారిగా లైట్లు వెలిగించడం వల్ల పవర్ ఫెయిల్యూర్స్ వస్తాయా అన్న అనుమానాలు రావచ్చు. కానీ అలాంటివి జరగకుండా ఉండేలా విద్యుత్ కేంద్రాలు ముందస్తు చర్యలు తీసుకుంటాయి.
ఎర్త్ అవర్ ని మార్చి చివరి శనివారం జరుపుకోవాడనికి ఓ కారణం ఉంది. ఇది వసంత రుతువు ఆగమన వేళ. రాత్రి, పగలు సరిసమానంగా ఉండే సమయం.
   `చిరుదీపం' చీకటిని పారద్రోలినట్లే, `ఎర్త్ అవర్' అనే ఈ చిన్ని ఆలోచన రేపటి `కాలుష్యరహిత ప్రపంచానికి' దారితీస్తే- అంతకన్నా ఆనందించేసంగతి మరొకటి ఉంటుందా? ఒక్కసారి మీరూ ఆలోచించండి.
- తుర్లపాటి నాగభూషణ రావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!