కేంద్ర బడ్జెట్ పై ఆశలు- వాస్తవాలు

  ఫిబ్రవరి నెలాఖరులో దేశ ప్రజలంతా ఒక దృశ్యాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. కేంద్రంలో ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి,  బడ్జెట్ పత్రాలున్న బ్రీప్ కేస్ ను పట్టుకుని ఎంతో హుందాగా పార్లమెంట్ లోకి అడుగుపెడతారు. ఆయన రాకకోసమే గౌరవసభ్యులంతా ఎదురుచూస్తుంటారు. బడ్జెట్ పత్రాలను తీసి చదవడం ప్రారంభించగానే అంతటా నిశ్శబ్దం. ఒక్క పార్లమెంట్ లోనే కాదు. యావత్ జాతి బడ్జెట్ ఎలా ఉన్నదో తెలుసుకోవాలని ఎంతో శ్రద్ధగా వింటుంది. అందరిలో ఎందుకింత ఆసక్తి? బడ్జెట్ ఎటు పోతే మనకేమిటని ఊరుకోవచ్చుకదా... కానీ, అలా ఉండిపోలేం. ఎందుకంటే, కేంద్రం ప్రతిఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ - దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై ప్రభావితం చూపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బడ్జెట్ దేశ ప్రజల బతుకుబండిని నడిపిస్తోంది. అందుకే, బడ్జెట్ కు అంత క్రేజ్. మరి, ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతున్నది? 
 బడ్జెట్లో కేటాయింపులు ఎన్ని చేసినా, అసంతృప్తి వీడటంలేదు. మంత్రులు కూడా తమ శాఖకు చేసిన కేటాయింపులు చాలవనీ, మరింత కేటాయిస్తేనే, `అభివృద్ధి' పట్టాలు తొక్కుతుందని- మైకు పుచ్చుకుని చెప్పడం మనందరం వింటూనే ఉన్నాం. అయితే, వాస్తవాలేమిటో కూడా ఓసారి చూడాలి. కేంద్ర మంత్రుల్లో చాలామంది తమ శాఖలకు కేటాయించిన  మొత్తాలను ఖర్చు పెట్టలేక వెనక్కి పంపించేస్తున్నారు. ఉదాహరణకు టిబీ, క్యాన్సర్ నిరోధక చర్యల కోసం కేటాయిస్తున్న సొమ్ము మళ్ళీ వెనక్కి పోతున్నది. అంతేకాదు, పోలీస్ శాఖ సంస్కరణల కోసం కేటాయించే మొత్తాలు కూడా పూర్తిగా ఖర్చు కావడంలేదు. ఇవన్నీ ఎవరో చెబితే మనం అంతగా పట్టించుకోం. కానీ కాగ్ తన నివేదికలో ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పింది.
  ప్రత్యేక నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆశయంతో కేంద్ర బడ్జెట్ లో ఇంతకుముందు, 247 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేకపోయారు. అంతేకాదు, `జాతీయ మెరిట్ స్కాలర్ షిప్ పథకం' క్రింద106 కోట్లు కేటాయించినా ఇదే తంతు. అక్కడిదాకా ఎందుకు, మధ్యహ్న భోజన పథకం కింద కేటాయించిన నిధుల్లో సగం మాత్రమే కేంద్రం ఖర్చు చేయగలిగింది.
శాఖలు - తిరిగి ఇచ్చేసే మొత్తాలు
  1. -పాఠశాల విద్య - రూ. 2,668 కోట్లు
  2. - ఆరోగ్యశాఖ - రూ. 1,467.46 కోట్లు
  3. -హోంశాఖ - రూ. 285.07 కోట్లు
  4. - ఆహారం, ప్రజాపంపిణీ - రూ. 500 కోట్లు
  కేంద్ర బడ్జెట్ లో మహిళల వాటా చాలా తక్కువగానే ఉంటోంది. వారికోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పథకాలు వాటి అమలు కోసం కేటాయిస్తున్న నిధులు అరకొరగానే  ఉంటున్నాయి.
  బడ్జెట్ లో మహిళల వాటా
  1. - మొత్తం బడ్జెట్ లో 6.1 శాతం
  2. - మహిళకు అందే నెల వాటా: రూ.100
    కేంద్ర బడ్జెట్ ను Gender based గా చూసినప్పుడు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గడచిన బడ్జెట్స్ తో పోలిస్తే, మహిళల వాటా ఎంతోకొంత పెరిగినట్టు కనబడుతున్నా, అదేమీ వారి అవసరాలను తీర్చడానికి సరిపోయేదిగా లేదన్నది సుస్పష్టం. ఇదే విషయాన్ని Centre for Governance Accountability - CBGA- లెక్కాపత్రాలతో సహా బయటపెట్టింది.
  బడ్జెట్ - మహిళల తలసరి వాటా
...........................................
  • - 2007-08లో - రూ.410
  • - 2009-2010లో - రూ.1000
  • - 2010-11లో - రూ. 1200
- కొత్త బడ్జెట్ లో ఈ వాటా ఎంతన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.
  మహిళ తలసరి బడ్జెట్ విలువ 1200 రూపాయలకు పైనే ఉంటుందని అనుకున్నా, ఏడాదికి ఈ మొత్తం వల్ల మహిళ ఏమేరకు సాధికారత సాధిన్నదో, మరి ఏమేరకు మహిళలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
  మహిళాభ్యుదయానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. మహిళా సాధికారిత పథకాలకూ, బాలికల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పథకాలకు నామమాత్రంగానే నిధులు మంజూరు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.....
పథకం - నిధులు
................
  • మహిళ ఉపాధి - రూ. 40 కోట్లు
  • బాలికల అభ్యున్నతికి - రూ.15 కోట్లు
`గృహహింస'చట్టం అమలు అసలే నిధులు లేకపోవడం గమనార్హం.
    ఫిబ్రవరి వచ్చిందంటేచాలు గృహిణి తల్లడిల్లిపోతుంటుంది. కేంద్ర బడ్జెట్ భారం తమ ఇంటిపై ఏమేరకు పడుతుందోనని ఆందోళన చెందుతుంటుంది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సతీమణి `సువ్ర ముఖర్జీ'కి కూడా మినహాయింపులేదు. బడ్జెట్ ను, ఘాటుగా మోతెక్కించి ఇంటికి చేరితే, ఆర్థిక మంత్రికి సైతం ఇంట్లో నిరసన `ఘాటు 'తప్పదు. ఇంతకీ గృహిణులు బడ్జెట్ పరంగా ఏమి ఆలోచిస్తారో కూడా గమనించాల్సిందే...
గృహిణులు గమనించేవి...
.........................
  • - నిత్యావసరాల ధరలు
  • - ఉల్లి, కూరగాయల ధరలు
  • - గృహోపకరణాలు
   ఒక పక్క ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. నిత్యావసర వస్తువుల ధరలు నేలకు దిగిరావడంలేదు. ఏ వస్తువు మీద చేయివేసినా ధర చూసి షాక్ కి గురికావాల్సి వస్తోంది. దీనికి తోడు ఆదాయపు పన్ను భారం ఒకటి. మెడలు వంచి వసూలు చేసే ఆదాయపు పన్ను విషయంలో నెల జీతగాళ్లు కలవరపడుతుంటారు. ప్రతిసారీ బడ్జెట్ వచ్చేముందు, ఆదాయపు పన్ను పరిమితి పెరిగితే బాగుంటుందని ఆశపడుతూనే ఉన్నారు.
టాక్స్ పేయర్స్ కోరుకునేవి...
.........
  • - ఆదాయపు పన్నుపరిమితి పెంపు
  • - పన్ను రాయితీలు
  • - పన్ను మినాహాయింపులు
 ...
ఆదాయపు పన్ను పరిమితిని లక్షా 60వేల నుంచి 2లక్షలకు పెంచాలన్న డిమాండ్ చాలాకాలం నుంచి ఉంది. అలాగే, బీమా పాలసీల ప్రిమియమ్ లకు ఇచ్చే పన్ను మినహాయింపులను 60వేలకు పెంచాలన్న డిమాండ్ ఉంది. ఇవి అ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా పాపులరైంది. 2005 సంవత్సరంలో చట్టబద్దత కల్పిస్తూ తీసుకువచ్చిన ఈ పథకం ఏడాదికి కనీసం వంద రోజులు పని దొరికే వెసులుబాటు కల్పించారు. ఇది ఒకరకంగా మేలు చేస్తున్నా, మరో రకంగా రైతులకు - వ్యవసాయ కూలీల కొరత సృష్టిస్తోంది. సకాలంలో వర్షాలు పడుతున్నా, దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా, వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటప్పుడు రైతులు ఏం కోరుకుంటున్నారో కూడా ఆలోచించాల్సిందే...
రైతులు ఆశపడేవి
.................
  • - కూలీలు వలసపోకుండా ఉండాలి
  • - పనికి ఆహార పథకం దెబ్బతీయకూడదు
  • - వ్యవసాయ రుణాల మాఫీ
  • - ఆధునిక సాగు పద్ధతులు
...
వారూ, వీరు అని కాదు, అన్ని రంగాల వారు కేంద్ర బడ్జెట్ లో తమకు కనీస న్యాయం జరగాలనే కోరుకుంటున్నారు.

  ఇది 20 ఏళ్ల కిందటి సంగతి. 1991 ఫిబ్రవరి... కేంద్ర బడ్జెట్ ను సమర్పించే తరుణం వచ్చేసింది. యశ్వంత్ సిన్హ (Yashwant Sinha) ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1991-92 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ తయారుచేసే పనిలో పడ్డారు ఆయన. సరిగా, అదేసమయంలో చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కూల్చాలని  కాంగ్రెస్ కుట్రపన్నింది. బడ్జెట్ కు ముందు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వ్యూహం పన్నింది. దేశ ఆర్థిక పరిస్థితి అధ్వన్నంగా ఉన్నప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంది. అందుకే, ప్రజల ఆశలకు ఆలంభనమైన బడ్జెట్ ను సైతం నాయకులు పట్టించుకోలేదు.
 1997లో సీతారాం కేసరి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పటి దేవె గౌడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది. దీంతో యునైటెడ్ ఫ్రంట్ కొత్త ప్రధానిగా గుజ్రాల్ ను నియమించాల్సి వచ్చింది. ఇదంతా కూడా బడ్జెట్ టైమ్ లోనే జరిగింది.
  1999లో మరోసారి సంక్లిష్ట పరిస్థితి తలెత్తింది. 1999-2000 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత వాజి్ పేయ్ ప్రభుత్వం కూలిపోయింది. అయితే, బడ్జెట్ ఆమోదం పొందేలా మాత్రం అన్ని రాజకీయ పార్టీలు చూడగలిగాయి. ఆ తరువాతనే లోక్ సభను రద్దు చేశారు.
బడ్జెట్ - రాజకీయాలు
.......................
  • - రాజకీయ పార్టీల స్వార్ధం
  • - స్వరాష్ట్రాలపై ప్రేమ
  • - ప్రభుత్వాన్ని కూలదోసే యత్నాలు
  • - ప్రజల ప్రయోజనాలతో ఆటలు
  మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతున్నది?
అధికారంలో ఉన్న యుపీఏ బలంగానే ఉండటం వల్ల 1991నాటి సంఘటనలు చోటుచేసుకోకపోవచ్చు. పైగా, ప్రధాన ప్రతిపక్షం బిజేపీకి ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదు. అయితే, అంత మాత్రాన బడ్జెట్ ప్రసంగం సజావుగా సాగుతుందని అనుకోవడానికి వీల్లేదు. అనేక లుకలుకలు ఉండనే ఉన్నాయి. విపక్షాలు బడ్జెట్ కాగితాలు చింపేయవచ్చు. బడ్జెట్ నచ్చకపోతే, ఆగ్రహావేశాలు వ్యక్తం చేయనూవచ్చు. గౌరవ సభ్యులు వాకౌట్ చేయవచ్చు. బడ్జెట్ నీ, రాజకీయాలను వేరుగా చూడనంతవరకూ పార్లమెంట్ లో ఏమైనా జరగవచ్చు. మరి, ఈసారి ఎలాంటి దృశ్యాలను మనం చూడబోతున్నాం? బడ్జెట్ ప్రభావం రాజకీయాలపై ఎలా పడబోతున్నది. బడ్జెట్ లో ఊదారవాద వైఖరి కనబడితే దాన్ని   మధ్యంతర ఎన్నికలకు సంకేతాలుగా భావించుకోవాలా...? ఏమో...అనేక ప్రశ్నలు, సందిగ్ధాల మధ్య కేంద్ర బడ్జెట్ రాబోతున్నది. అది ఎలా ఉండబోతున్నదో చూద్దాం....
- తుర్లపాటి నాగభూషణరావు
98852 92208
nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!