ఓరుగ‌ల్లులో టిఆర్ఎస్‌, టిడిపి జ‌గ‌డం..


తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జెఎసి వ్యూహరచన చేస్తున్నాయి.కరీంనగర్ తో సహా తెలంగాణలోని వివిధ జిల్లాలలో ఇప్పటికే పర్యటించిన చంద్రబాబు ఇప్పుడు వరంగల్ జిల్లాలో పర్యటించడాన్ని తెలంగాణ ఉద్యమ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతలు ఏమి చేసినా పెద్దగా పట్టించుకోని వీరు ఎందువల్లనో చంద్రబాబు పర్యటనను మాత్రం అడ్డుకొంటామని చెబుతుండడం కాస్త ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. దానికి తమ మీడియాలో కూడా విశేష ప్రాముఖ్యత ఇస్తున్నారు. చంద్రదండు పేరుతో కొందరు తెలంగాణవాదులను కొడుతున్నారని కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే తెలుగుదేశం సభలపై, ర్యాలీలపై రాళ్లతో దాడి చేస్తే అది నిరసన, తెలుగుదేశం వారు ఎదురుదాడి చేస్తే అది ఘాతుకంగా వీరు మాట్లాడుతుంటారు. ఎవరు ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉన్న మన దేశంలో ఇప్పటికీ ఇలాంటి మొండి వైఖరిలోని ఆంతర్యం ఏమిటో తెలియదు. కావాలంటే చంద్రబాబు పర్యటించిన చోటకల్లా, ఆయన వెళ్లిపోయిన తర్వాత వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు. అలాకాకుండా ఘర్షణకు దిగడం ఎంతవరకు మంచిదో తెలియదు. టిఆర్ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ సైతం తెలంగాణలో చంద్రబాబు పర్యటించే నైతిక హక్కులేదని అనడం, దానిపై కడియం శ్రీహరి తీవ్రంగా విమర్శించడం వంటివి జరిగాయి. కాగా టిఆర్ఎస్ ఎమ్.పి విజయశాంతి కూడా తెలుగుదేశం వారిని విమర్శిస్తూ ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టడం విశేషం.కెసిఆర్ ను చావమంటారా? తాళ్లు తెస్తారా అంటూ ఇప్పుడు ఆమె మండిపడడం ఆసక్తికరంగా ఉంది.వరంగల్ పర్యటనలో ఏమైనా జరిగితే టిడిపిదే బాద్యత అని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. కాగా తన పర్యటనను ఎవరైనా అడ్డుకుంటే ప్రజలే బుద్ది చెబుతారని చంద్రబాబు నాయుడు హెచ్చరించడం కొసమెరుపు. దీనితో ఈ నెల ఆరో తేదీన చంద్రబాబు వరంగల్ పర్యటన ఉద్రిక్తతల నడుమ సాగుతుందన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!