పాపం.. ఆ న‌లుగురు..!



ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా దీపావ‌ళి పండుగ‌ని దేశం యావ‌త్తూ జ‌రుపుకున్నారు.. కానీ.. పాపం.. ఆ న‌లుగురు నాయ‌కులు మాత్రం.. ఆత్మీయుల‌కి, ఆప్తుల‌కి దూరంలో, ఖైదీల మ‌ధ్య దీపావ‌ళి పండుగ‌ని జ‌రుపుకున్నారు. ఇంత‌కీ వారు ఎవ‌ర‌నే క‌దా.. యడ్యూరప్ప, ఏ.రాజా, కనిమొళి, గాలి జనార్థన్‌రెడ్డి. వీళ్లంతా పేరు మోసిన రాజకీయ నేతలు. ఆయా రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇందులో ఒకరు సీఎంగా పనిచేసిన వ్యక్తైతే మరొకరు మాజీ సీఎం ముద్దుల కుమార్తె. ఇంకొకరు కేంద్రమంత్రిగా బాధ్యతలు వెలగబెట్టారు. మరొకరు రాష్ట్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది.
టూజీ స్పెక్ట్రమ్‌ కేసులో చిక్కుకొని కేంద్రమాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి విలవిలలాడుతున్నారు. లేటెస్ట్‌గా కనిమొళి బెయిల్‌ పిటీషన్‌పై విచారించిన సీబీఐ కోర్టు కరుణ గారాల పట్టికి బెయిల్‌ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని వచ్చేనెల 3న నిర్ణయించనుంది. దీంతో కనిమొళి కూడా కటకటాల వెనుకే కలర్‌ఫుల్‌ దివాళీ జరుపుకోనున్నారు.
టూజీ స్పెక్ట్రమ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఏ.రాజా కూడా తీహార్‌ జైలులో మగ్గుతున్నారు. పైగా ఇటీవలె ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో రాజా వారి స్థానం కూడా కేరాఫ్‌ తీహార్‌ జైలే. కర్ణాటక రాజకీయాల్ని శాసించి..ఓ వెలుగు వెలిగిన గాలి జనార్థన్‌రెడ్డి కూడా దీపావళిని జైలు గోడల మధ్యే జరుపుకోనున్నారు.
అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై సీబీఐ విచారణలో ఉక్కిరిబిక్కిరైన గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి సాదా సీదాగా దీపావళిని జరుపుకునేందుకు అన్ని విధాలా సిద్దమయ్యారు. భూముల కుంభకోణంలో చిక్కుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జైల్లోనే దీపావళి జరుపుకోనున్నారు. బెంగళూరు శివార్లలోని ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకే కుటుంబ సభ్యులకు అప్పగించిన కేసులో ఇరుకున్న యడ్డీ, ఆ ఆరోపణలతోనే పదవి పోగొట్టుకోవడంతోపాటు జైలు పక్షిగా మిగిలారు. లేటెస్ట్‌గా హైకోర్ట్‌లోనూ యడ్డీకి బెయిల్‌ విషయంలో చుక్కెదురైంది. అందుకే దీపావ‌ళి పండుగ‌ని జైల్లోనే జ‌రుపుకోవాల్సి వ‌చ్చింది.
త‌మ చేత‌ల‌తో దేశాన్ని శాసించ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగిన ఈ న‌లుగురు నాయ‌కులు అన్యాయంగా వ‌చ్చే అధికారాన్ని, ధ‌నాన్ని ఆశించి చివ‌రికి ఇలా జైలు ప‌క్షిలుగా మారి పోయారు.. పాపం.. ఆ న‌లుగురు..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!