సిఎం ఢిల్లీ ప‌ర్యట‌ణ వెనుక‌..?


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండురోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్తున్నారు. శుక్రవారం బెంగళూరు వెళుతున్న ఆయన, అటు నుంచి అటే ఢిల్లీకి పయనమవుతారు. సడలుతున్న సకల జనుల సమ్మె , రైల్‌రోకో అనంతర పరిస్థితులపై, రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంపై అధిష్ఠానం పెద్దలతో ఆయన సమాలోచనలు జరుపుతారు. శనివారం జాతీయాభివృద్ధి మండలి(ఎన్‌డీసీ) భేటీలో పాల్గొంటారు. కాగా, ఆయన ఢిల్లీకి వెళ్లడం ఈ నెలలో ఇది రెండోసారి.  సరిగ్గా పది రోజుల కిందట సకల జనుల సమ్మె సెగతో ‘ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు” అన్న ప్రశ్న అధిష్ఠానాన్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో పార్టీ కోర్ కమి టీ నేతలు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లను కలిసి కిరణ్ సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పూర్తిస్థాయి ఆత్మస్థైర్యంతో అధిష్ఠానం ఎదుటకు వెళుతున్నారు.  ఆర్టీసీ,సింగరేణి, ప్రైవేట్ పాఠశాలల జేఏసీలు ఒక్కొక్కటిగా సమ్మె నుంచి బయటకు వస్తుండటం, రైల్‌రోకో ఉద్యమం అనుకున్నంత ప్రభావం చూపలేకపోవడం వంటివి ఆయనకు ఊరటనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరకంగా రాష్ట్ర ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ను సమర్పించనున్నారు. తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య బాధ్యతలు చేపట్టడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం పార్టీలోనూ, ఇటీవల విలీనం అయిన చిరంజీవి వర్గంలోనూ పోటీ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే.  ఈ జటిల సమస్యకు ఈ పర్యటనలోనే సీఎం కిరణ్ పరిష్కారం కనుగొంటారనే కథనాల నేపథ్యంలో.. ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే..శాసన మండలి పునరుద్ధరణకు కృషి చేసి కౌన్సిల్ రాజుగా పేరొందిన సత్యనారాయణరాజు పేరును గవర్నర్లు రోశయ్య (తమిళనాడు), శివరాజ్‌పాటిల్ (పం జాబ్) అధిష్ఠానానికి సిఫారసు చేస్తున్నారు. కిరణ్ కూడా రాజు పట్ల సానుభూతితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అలాగే.. గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, పాలడుగు వెంకట్రావు, ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ తదితరులు కూడా అదే పేరును బలపరుస్తున్నారు. ఈ క్రమంలో సీఎం అభీష్టం మేరకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీకి పయనమవుతున్న సీఎం కిరణ్‌పైనే నిలుస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!