ఇందిర‌మ్మా.. నీకు జోహార్లు..!!


కుమార్తెగా, భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తించే ఓ భారత స్త్రీ.. ఉక్కు మహిళగా, చరిత్ర సృష్టికర్తగా, దేశనేతగా ఎదిగిన పరిణామక్రమమిది. దేశ భవిష్యత్‌ కోసం అహర్నిశలూ పనిచేసిన ఆమే ఇందిరా గాంధీ. ఇవాళ ఆ మహా నాయకురాలి వర్థంతి సందర్బంగా ప్రత్యేక కథనం. మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఇండియన్‌ ఉమెన్‌ ఎవరంటే.. ఠక్కున చెప్పే పేరు ఇందిరాగాంధీ. సొంతబాడీగార్డుల చేతిలో 1984, అక్టోబర్‌, 31న హతమై ఇరవయ్యారేళ్లు గడిచాయి.
ఆమె జీవితం ఆద్యంతం ఓ సాహసోపేతమైన గాథ. ఉక్కుమహిళగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఇందిర జవహర్‌లాల్‌ నెహ్రూ కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగెపెట్టినా.. తదనంతర చరిత్రకు తానే సృష్టికర్త అయ్యారు. సస్య విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్‌ పరిరక్షణ, పోఖ్రాన్‌ అణు పరీక్ష, గరీబ్‌ హఠావో, ఎమర్జెన్సీ.. ఇలా ఇందిరా తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయం.. ఓ చరిత్రాత్మక ఘట్టమే! నేడు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న ఆర్థికమాంద్యాన్ని భారతదేశం తట్టుకొని నిలబడిందంటే..
నాడు బ్యాంకులను జాతీయకరణ చేసిన ఇందిరగాంధీ ముందుచూపే. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి ఇందిరాగాంధీ అందించిన నైతిక, సైనిక, ఆర్థిక, రాజకీయ మద్ధతు మనదేశాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో ఓ బలమైన శక్తిగా నిలిపిందంటే అతిశయోక్తికాదు. అగ్రరాజ్యాన్ని సైతం ఎదరించిన ఇందిర రాజకీయ శక్తికి బంగ్లాదేశ్‌ యుద్ధం ఓ సజీవ ఉదాహరణ! బ్యాంకుల జాతీయీకరణ, గరీబ్‌ హఠావో నినాదాలతో వామపక్షాలకు ఎదురులేని దెబ్బ కొట్టిన ఇందిర.. ఎమర్జెన్సీ, స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌తో అపప్రధను మూటగట్టుకొన్నారు.
తండ్రి జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రభావం, స్వాతంత్ర్యద్యోమ అగ్ని కీలల్లో రాటుదేలిన అనుభవం ఇందిరా వ్యక్తిత్వం.భర్త ఫిరోజ్‌ గాంధీ హఠాన్మరణంతో కుంగిపోకుండా, ధీశాలిగా ఇద్దరు కుమారులు రాజీవ్‌, సంజయ్‌లను పెంచిన ఇందిర.. బిజీ పొలిటికల్‌ షెడ్యూల్డ్‌లోనూ తన కుటుంబానికీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. రాజీవ్‌ విదేశీ వనితను పెళ్ళాడినా పెద్దమనసుతో స్వాగతించిన తల్లామె. చివర వరకు అండగా ఉంటాడని భావించిన సంజయ్‌ను విమాన ప్రమాదం కబళించినా.. కుంగిపోకుండా..
దేశం కోసం సర్వశక్తులు కూడదీసుకొని 1980లో ఆఖరిసారిగా ప్రధాని పీఠం అధిరోహించారు.ఇందిర మరణం తరువాత.. రాజకీయాలకు దూరంగా ఉన్న రాజీవ్‌ గాంధీని.. దేశసేవ కోసం పురిగొల్పింది తల్లి మరణమే! నిర్భీతితో, నిశ్చలతతో తీవ్రవాదానికి వ్యతిరేకంగా చిట్టచివరి క్షణం వరకు పోరాడిన ఇందిరా ప్రియదర్శిని మహిళాశక్తికి మారురూపు. అందుకే.. ఇందిర‌మ్మా.. నీకు జోహార్లు..!!
source:tv5news.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!