`టెర్రర్’ లక్ష్యాలు


న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు

కోర్టులకు `టెర్రర్’ టార్గెట్

పాలనావ్యవస్థపైనా దాడులు

ఉగ్రవాదుల వ్యూహాల్లో మార్పులు

దేశ అంతర్గత భద్రతకు ముప్పు

వ్యూహాత్మకంగానే దాడులు

దేశంలో ఉగ్రవాదుల దాడుల వెనుక బలమైన వ్యూహరచన కనబడుతోంది. దేశ అంతర్గత భద్రతను సవాల్ చేసే దిశగా టెర్రరిస్టులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు లక్ష్యాలను మార్చుకుంటున్నారు.
దేశంలో ఉగ్రవాద పోకడల తీరును నిశితంగా గమనిస్తే, వారి వ్యూహాలేమిటో స్పష్టంగానే అర్థమవుతాయి. దాడులకు దిగిన ప్రతిసారీ, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలనే వారు  లక్ష్యాలుగా ఎంచుకోవడంలేదు. అలాగే, రైళ్లు, బస్సులు, పార్థనా మందిరాల్లోనూ బాంబులు పెట్టే పద్ధతినే ఎప్పుడూ పాటించడంలేదు. అంతకంటే ముక్కుసూటిగా, దేశ పాలనా వ్యవస్థనీ, న్యాయవ్యవస్థనీ నిర్వీర్యం చేసేదిశగా కూడా దాడులకు దిగుతున్నారన్నది సుస్పష్టం. ఈ మధ్యనే జరిగిన ఢిల్లీ పేలుళ్లు మరోసారి ఈ వాదనను బలోపేతం చేశాయి.
2000 సంవత్సరం డిసెంబర్ 22న ఉగ్రవాదులు ఎర్రకోటపైనే దాడికి దిగారు. 2001 అక్టోబర్ ఒకటోతేదీన జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీపై ముష్కర మూకలు దాడికి దిగాయి. అదే ఏడాది డిసెంబర్ 13న ఉగ్రవాదులు  పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలతో దేశ పాలనా వ్యవస్థనే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారన్న అనుమానాలు తలెత్తాయి.
ప్రజాస్వామ్య దేశంలో మరో కీలకమైన స్తంభంగా భావించే – న్యాయవ్యవస్థ పై కూడా ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారు. 2007 నవంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని లక్నో, వారణాశి, ఫైజాబాద్ కోర్టు ఆవరణల్లో ఏకకాలంలో బాంబులు పేల్చారు. నాలుగు నెలల కిందటే ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు పేలింది. మళ్ళీ ఇప్పుడు అక్కడే, హైకోర్టు – ఏడవ నెంబర్ గేటు వద్ద కారులో బాంబు పేలింది. ఇక అనేక రాష్ట్రాల్లో కోర్టు ఆవరణలోనో, లేదా న్యాయస్థానాలకు చేరువలోనూ బాంబు బెదరింపులు వందల సంఖ్యలో వచ్చాయి.  మన రాష్ట్ర హైకోర్టుకు కూడా అనేక మార్లు బాంబు బెదరింపులు వచ్చాయి.
ఈ మధ్యకాలంలో భారత న్యాయవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందన్న ప్రశంసలు అందుకుంటోంది. పార్లమెంట్ పై దాడి కేసులో అఫ్జల్ గురు, ముంబయి ఉగ్రవాద దాడి కేసులో కసబ్ లను న్యాయస్థానాలు ముప్పతిప్పలు పెట్టాయి. ఇలాంటి సంఘటనలు సహజంగానే ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు రుచించవు. దీంతో ఉగ్రవాద సంస్థలు దేశ న్యాయస్థానాలను కూడా టార్గెట్ చేస్తున్నాయన్న వాదనలు వినబడుతున్నాయి.
ఈ  మొత్తం సంఘటనలను పరిగణలోకి తీసుకుంటే , ఉగ్రవాదులు భారత న్యాయవ్యవస్థని కూడా టార్గెట్ చేసుకున్నట్టు అనుకోవాల్సివస్తోంది.
మొత్తానికి దేశ పాలనా వ్యవస్థనీ, న్యాయవ్యవస్థనీ దెబ్బతీయడం ఉగ్రవాదుల వ్యాహాల్లో ఉన్నదని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించడం కొసమెరుపు.

- ఎన్.ఆర్. తుర్లపాటి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!