`మృత్యు’ కంపం

`ఏ భూకంపమైనా దానికదే ప్రాణాంతకం కాదు. దాని ధాటికి నేలకూలే కట్టడాలే సామూహిక జన హనన ఆయుధాలు’ – శాస్త్రవేత్తలు ఏనాడో సూత్రీకరించిన సత్యం ఇది. అంటే,  ప్రకృతి వైపరీత్య ప్రభావం కంటే, మానవ తప్పిదాలవల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారన్నమాట.
మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 21న స్వల్పంగా భూమి కంపించడం, అంతకు ముందు, సెప్టంబర్ 18 ఆదివారంనాడు సిక్కిం సహా ఉత్తరాది రాష్ట్రాల్లో  భూమి కంపించింది. దీంతో యావత్ దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. దేశానికి భూకంపాల వల్ల కలిగే ముప్పుపై చర్చలు ఊపెక్కాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏమిటో ఓసారి పరికిద్దాం…
భూకంప తీవ్రతను బట్టి ఐదు జోన్లుగా వర్గీకరిం చారు. వీటిలో  3,4,5 జోన్లలో ఉన్న ప్రాంతాలను ఒక మోస్తరు నుంచి అత్యంత ప్రమాదకరమైన జోన్లుగా చెప్పుకోవచ్చు.  దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 239 జిలాల్లు భూకంప తీవ్రత అధికంగా ఉన్న 4,5 జోన్ల పరిధిలో ఉన్నాయి.
ఈ జోన్లలో కట్టడాలు ఎలా ఉండాలన్న విషయం శాస్త్రవేత్తలు ఏనాడో చెప్పారు.  భూకంపం వచ్చినా తట్టుకునే రీతిలోనే వీటిని నిర్మించాలి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే, మనదేశంలో 59 శాతం భూభాగం భూకంప ప్రమాద జోన్లలోనే ఉండటం. అంతేకాదు,  మనదేశ జనాభాలో 78 శాతం మంది భూకంప ప్రమాద జోన్లలోనే ఆవాసముంటున్నారు. మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మనదేశంలో ప్రజల భద్రత కంటే, పాలకులు తమ పదవులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఢిల్లీ, కోల్ కతా, ముంబయి, పూణె, కోచి, పాట్నా, చెన్నై వంటి మహానగరాలు భూకంప ముప్పును ఎదుర్కుంటున్న నగరాలే. అయినప్పటికీ సమగ్ర వ్యూహంతో ముందడుగు వేయకపోవడం ప్రాణాంతక నిర్లక్ష్యం కాదా..?
మొన్న సిక్కింలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. ఇక్కడ కొన్ని వాస్తవాలు గమనించాలి. సిక్కంలో జనాభా కేవలం ఐదు లక్షల లోపే ఉంటుంది. అంతేకాదు,  అక్కడ జనవాసాలు విసిరేసినట్టుగా ఉంటాయి. ఈ కారణంగా అక్కడ  ప్రాణనష్టం తక్కువగానే ఉంది. అదే మన హైదరాబాద్ లోగానీ, లేదా ముంబయి వంటి మహానగరంలోగానీ ఇంతే స్థాయిలో భూకంపం వస్తే అపార జననష్టంతోపాటు, భర్తీచేయలేనంతగా ఆస్తి నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రిక్టర్ స్కేల్ పై 6.5 స్థాయి భూకంపం వచ్చినా, ముంబయిలో 1,60,000 మంది మృత్యువాత పడతారని బెంగళూరులోని జాతీయ విజ్ఞాన సంస్థ 2011 ఏప్రిల్ లోనే హెచ్చరించింది. మన హైదరాబాద్ పరిస్థితి గురించి ప్రత్యక్షంగా హెచ్చరించకపోయినా, దాదాపుగా ఇంతేస్థాయిలో నష్టం జరగడం ఖాయం.
8.2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో బీహార్, నేపాల్ మధ్య కానీ, హిమాచల్ లోని కాంగ్రా దగ్గరగానీ, లఢిల్లీ ఉత్తర కాశీ సమీపంలోగానీ సంభవించవచ్చని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఐదో జోన్ లో ఉన్న ప్రాంతాలు: భుజ్ తోపాటు గుజరాత్ లోని నైరుతీ ప్రాంతం, ఈశాన్య ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ లోని కొన్ని పరగణాలు, జమ్మూ-కాశ్మీర్
మన రాష్ట్రంలో ఒంగోలు, భద్రాచలం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు,                 అనంతపురం, చిత్తూరు జిల్లాలు, హైదరాబాద్‌ నగరం మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా భూకంపాలకు గురికాగల ప్రాంతాలుగా లెక్కింపబడుతాయి.
ఇప్పుడు వచ్చిన భూకంపంకంటే పెద్ద భూకంపాలే ఈశాన్య రాష్ట్రాల్లో రావచ్చని షిల్లాంగ్ లోని కేంద్ర భూప్రకంపనల పరిశీలన సంస్థ హెచ్చరిస్తోంది.
చేతులు కాలాక ఆకులు పట్టుకునే ధోరణి పేరుకుపోవడంతో  ప్రాణనష్టాన్ని కనీసస్థాయికి తెచ్చే ప్రయత్నాలు చేయడంలేదు.  ముందస్తు ప్రణాళికాబద్ధ చొరవ కనబడటంలేదు.  ఈమధ్య జపాన్ లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 9గా నమోదైంది. భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కునే సామర్థ్యం ఉన్న దేశంగా జపాన్ గుర్తింపుపొందినప్పటికీ, మొన్నటి దెబ్బ నుంచి కోలుకోవడానికి కష్టపడాల్సి వస్తోంది. మరి అలాంటప్పుడు ఏమాత్రం ముందస్తు ప్రణాళికలు పాటించని మనలాంటి దేశంలో అదే తరహాలో విపత్తు సంభవిస్తే ఎంతటి నష్టం వస్తుందో అంచనా వేయలేం.
1993 సెప్టెంబర్ 30న మహారాష్ట్రలో 6.2 స్థాయిలో భూకంపం. 13వేల మంది మృతి చెందారు. కాగా,  2001 రిపబ్లిక్ డే నాడు గుజరాత్ లోని భుజ్ కేంద్రంగా భూకంపం విరుచుకుపడి 18వేల మంది మృతి చెందారు.  వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2005లో జాతీయ విపత్తుల నిభాయక సంస్థ – నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ – ఎన్డీఎంఏను ఏర్పాటు చేశారు. ప్రజలను జాగృతంచేసి విపత్తులు సంభవించినప్పుడు అతి తక్కువ జననష్టం, ఆస్తి నష్టం కలిగేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిద్రలో జోగుతోంది. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. అవి విరుచుకుపడ్డాక ఎంత హడావుడి చేసినా అది కేవలం ఉపశమనమే అవుతుందే తప్ప, ప్రమాద తీవ్రతను అరికట్టే చర్యలు ఎంతమాత్రం కావు.

– ఎన్.ఆర్. తుర్లపాటి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!