ఆ రెండింటిని క‌లిపితే ప‌రిష్కారం దొరుకుతుందా..?


తెలంగాణ సమస్యకు ఎలాగొలా ఒక పరిష్కారం కనుగొనాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా భావిస్తున్నారు. అయితే వారు పూర్తిగా బయటపకుండా కొన్ని రాజీమార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఒకపక్క కేంద్రం ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతూనే మరో పక్క ఉద్యమం కొనసాగించే వ్యూహాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొందరు ముఖ్య నాయకులలో ఒక ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా తెలంగాణకు కలుపుకుంటే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందా అన్న ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును బాగా వ్యతిరేకిస్తున్నది ఆ రెండు జిల్లాల ప్రజలు, నాయకులన్నది ఒక అభిప్రాయం. ఎందుకంటే సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు సీమ జిల్లాలు బాగా దూరంగా ఉంటాయి. రాజధాని నగరం కోస్తాలో ఎక్కడ ఏర్పాటైనా ఈ రెండు జిల్లాలు ఒక మూలగా ఉంటాయి. అలాగని ఆంధ్ర కు రాజధానిగా ఉన్న కర్నూలు ను రాజధానిగా ఎంపిక చేస్తే మిగిలిన సీమాంధ్రకు పూర్తిగా దూరం గా ఉంటుంది. అందువల్ల మిగిలిన జిల్లాలవారు అంగీకరించకపోవచ్చు. అందువల్ల ఆ రెండు జిల్లాలను తెలంగాణలో కలుపుకుంటే ఎలా ఉంటుందన్నదానిపై ఆలోచనసాగుతోందని సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పారు. ఎక్కడో చోట రాజీపడాలి కదా అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. శ్రీశైలం రిజర్వాయిర్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉంది. ఇది పూ్ర్తిగా తెలంగాణలో భాగం అన్న భావన ఏర్పడితే మిగిలిన సీమాంధ్ర జిల్లాల నేతలు అందుకు అంగీకరిస్తారా? అలాగే రాయలసీమను రెండుగా విభజించడంపై అక్కడ ఎలాంటి స్పందన వస్తుందన్నదానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎమ్.ఐ.ఎమ్. నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.సి.ఆర్.ను కలవడానికి ప్రాధాన్యం ఏర్పడింది.అసదుద్దీన్ ఇప్పటికే రాయల తెలంగాణ ప్రతిపాదన చేశారు.దానిపై కూడా చర్చించామని కెసిఆర్ కూడా ప్రకటించారు. అయితే టిఆర్ఎస్ ఈ ప్రతిపాదనను చేయడం లేదా అంగీకరించడంలోని ఆంతర్యం ఏమిటా అని ఆలోచిస్తే ప్రధానంగా రాయలసీమ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించడం, లేదా రాయలసీమ వారిలో భేదాభిప్రాయాలు కలిగించడం,ఎమ్.ఐ.ఎమ్.ను మచ్చిక చేసుకోవడం,ముస్లిం ఒటర్ల శాతం ఆ రెండు జిల్లాలలో కూడా గణనీయంగాఉన్నందున ఒవైసీ కూడా అంగీకరించవచ్చనే భావన ఉండడం, వీటికి తోడు శ్రీశైలం ప్రాజెక్టును కూడా తెలంగాణ పరిధిలోకి తేవడం ద్వారా అదనపు ప్రయోజనాన్ని రాబట్టడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

Source : Kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!