మోడీ దీక్ష వెనుక అసలు కథ





గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సద్భావన దీక్షలో సద్భావన ఎంత ఉంది? శాంతి, ఐక్యత, సాంఘిక సామరస్యం, సోదరతత్వాల వాతావరణాన్ని అభివృద్ధి చేయడమే తన దీక్ష లక్ష్యమంటూ నరేంద్ర మోడీ ప్రకటించుకోవచ్చు. కానీ, అసలు ఉద్దేశం వేరే ఉంది. అద్వానీ మొన్నీమధ్యనే బీజెపీ పార్టీ ప్రధాన అభ్యర్థిగా మోడీ అంటూ ప్రకటించిన నేపథ్యంలో ఈ తాజా దీక్షను విశ్లేషించుకోవాల్సిందే. నరేంద్ర మోడి గుజరాత్ రాష్ట్రాన్ని అద్భుతంగా మలిస్తే మలిచిఉండవచ్చు. మోడి నిజాయితీ పరుడైన నాయకునిగా అమెరికా గుర్తించిందంటూ వికీలీక్స్ బయటపెట్టవచ్చు…అంతమాత్రాన మోడీ సమర్ధవంతమైన జాతీయ నేతగా గుర్తింపుపొందినట్టుకాదు. ఆయన గుర్తింపు అంతా గుజరాత్ కే పరిమితమైంది. జాతీయ నేతగా ఎదగని వ్యక్తిని అద్వానీ  తన పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం హాస్యాస్పదం. నిజం చెప్పాలంటే, ఈ విషయం అద్వానీకి కూడా తెలుసు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని జాతీయ స్థాయి నాయకునిగా మార్చేందుకు ఒక వ్యూహం పన్నారు. అందులో భాగంగానే నరేంద్ర మోడీ చేత సద్భావన దీక్ష చేయిస్తున్నారు.
పీఎం క్యాండిడేట్ గా మోడీని సిద్ధం చేస్తున్నారని అనుకుంటున్నా, ఇది మరీ ముందస్తు హడావుడిగానే అనిపిస్తోంది. ఎందుకంటే, 2014లోగానీ ఎన్నికలు రావు. అయితే, ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోవచ్చు. అదే జరిగితే, 84 ఏళ్ల వయసులో అద్వానీ పీఎం క్యాండిడేట్ గా తాను సిద్ధమే అనుకున్నా, ఆయన వయసు అందుకు సహకరించడంలేదు. అందుకే పీఎం కావడమన్నది తీరని కోరికగానే మిగిలిపోతుందని అద్వానీ కూడా ఓ గట్టి నిర్ణయానికి వచ్చేసినట్టే కనబడుతోంది. పైగా, అవతల కాంగ్రెస్ పార్టీ ఈ సారి సార్వత్రిక ఎన్నికలవేళకు యువశక్తి రాహుల్ ని పీఎం అభ్యర్ధిగా దింపబోతున్నది. ఇందుకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది. ఒకపక్క కాంగ్రెస్, కాబోయే పీఎం రాహులేనంటూ హడావుడి చేస్తుంటే, గతంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని చక్రంతిప్పిన బీజేపీ ఊరికే కూర్చోగలదా… అందుకే, మోడీని రంగంలోకి దింపింది.
దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడు, సమర్ధత కలిగిన నాయకునిగా అగ్రరాజ్యమే గుర్తింపు ఇవ్వడంతో మోడీ తనకుతానుగా జాతీయ నేతగా, అవినీతిపై ఉద్యమించేందుకు సర్వహక్కులు కలిగిన నాయకునిగా అభివర్ణించుకుంటున్నారు. ఈ కోణంలో ఆయన అన్నా హజారేను మించిపోవాలని కూడా భావిస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ మోడీపై ఉన్న మతత్వ హింసల మచ్చలమాటేమిటి? కులతత్వంతోనూ, మతతత్వంతోనూ గుజరాత్ అట్టుడికిపోతుంటే ఇదే మోడీ అప్పుడేం చేశారు? ఇలాంటి ప్రశ్నలు వైరి పక్షాల నుంచి వస్తాయన్న ఉద్దేశంతోనే ముందుగా ఆయన తనకుతానుగా ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పరిణామ క్రమంలో భాగంగానే మోడీ ఇప్పుడు సద్భావన దీక్ష చేపట్టారు. మరి ఆరుకోట్ల గుజరాతీలు, 120 కోట్ల భారతీయులు ఈ విషయం అర్థం చేసుకోగలరా… మోడీని కాబోయే ప్రధానిగా ఆశీర్వదించగలరా..?
- ఎన్.ఆర్. తుర్లపాటి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!