బోర్డులు తిప్పేస్తూనే ఉన్నారు..
అమెరికాలో ఆర్థిక మాంద్య, ఐటి రంగంలో ఓ కుదుపు కుదిపిందనే చెప్పాలి. ఐటి రంగంలోని కొన్ని సంస్థలు అమెరికాని నమ్ముకునే ముందుకు సాగుతున్నాయి. ఈ సంస్థలు ఈ మధ్యకాలంలో దివాళా దిశగా పరుగులు తీస్తున్నాయి. గత కొద్ది కాంలంగా హైదరాబాద్‌లోని కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు నష్టాలతో కూరుకుపోతున్నాయి. ఉద్యోగులకి జీతాలివ్వలేని స్థాయికి దిగజారిపోతున్నాయి. దాంతో చెప్పాపెట్టకుండా తమ సంస్థలని మూసేస్తున్నాయి. దాంతో ఆ సంస్థలనే నమ్ముకున్న ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న టాస్క్ ఇన్ఫోటెక్ సాఫ్ట్‌వేర్ సంస్థ కూడా బోర్డు తిప్పేసింది. అందులో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. దాంతో ఆఫీసు సిబ్బంది ఆఫీస్ ఫర్నీచర్ ధ్వంసం చేసారు. సంస్థ సీఇఓపై దాడి చేశారు. సాఫ్ల్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాలంటే ఒకప్పుడు అదో అదృష్టంగా భావించేవారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోయినా సరే.. సాఫ్ట్‌వేర్ రంగంలో సెటిలయిపోతే చాలని యువత కలలు కనే వారు. ఆకర్షనీయమైన జీతం, విలాసవంతమైన జీవితం, ఏసీ రూముల్లో పని.. దీనికి తోడు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాలనగానే బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఉంటూ, వెహికల్ లోన్స్ అంటూ, క్రెడిట్ కార్డ్స్ అంటూ ఉద్యోగస్థలని ఆకర్షించి బ్యాంకుల్లో అధికారికంగా అప్పులు తీసుకునేలా ప్రేరేపించాయి. నెల నెలా ఈఎంఐ రూపంలో డబ్బులు వసూలు చేసుకుంటున్నాయి.. ఇలాంటి సదుపాయలని చూసే చాలా మంది యువత ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి కనబరిచారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సాఫ్ట్‌వేరం రంగం క్రమంగా దివాళా తీస్తూ వస్తోంది. అమెరికా తర్వాత ఇండియాలో బెంగుళూర్, హైదరాబాద్‌లోనే సాఫ్ల్‌వేర్ సంస్థలు చురుకుగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం కొన్నిసాఫ్ట్‌వేర్ సంస్థలు దివాళా తీస్తుండడంతో ఉద్యోగస్తుల్లో అభద్రతా భావం చోటుచేసుకుంటోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనగానే విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడిన వారు ఉన్నట్టుండి సంస్థలు మూతలు పడుతుండటంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతున్నారు. అప్పుల భారం భరించలేక, విలాసవతంమైన జీవితం కనుమరుగైపోవడంతో విరక్తిభావం చోటుచేసుకుంటోంది. దీంతో సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాలు పోయిన వారు ఆత్మహత్యలకి కూడా పాల్పడుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగం అన్నది నడమంత్రపు సిరిగా అభివర్ణిస్తున్నారు కొందరు. అనుకోకుండా వచ్చే సిరి అనుకోకుండానే పోతుంది. జీవితాంతం ఆ సిరి తోడుంటుందని, ఉన్నంతలో జీవితం గడపక, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసుకుంటున్న కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో సాఫ్ట్‌వేర్ సంస్థలు మూతలు పడ్డాయి.. రాబోవు రోజుల్లో మరింకెన్ని మూతపడే స్థితిలో ఉన్నాయో.. తాము పనిచేసే సంస్థ ఎప్పుడు మూత పడుతుందో తెలియక పాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. మరి.. తిరిగి సాఫ్ట్‌వేర్ రంగం తన పూర్వవైభవాన్ని తెచ్చుకుంటుందా..? లేక రానున్న రోజుల్లో క్రమక్రమంగా కనుమరుగవుతుందా..? అన్నది కాలమే చెప్పాలి..
సిఎస్‌కె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి