ఎడారిలో ఒయాసిస్సు మౌంట్ అబూ (సండే స్పెష‌ల్‌)




ఆరావళి పర్వతాల అందాల్ని చూడాలన్నా, అపురూప శిల్పసంపదను ఆనందించాలన్నా, బ్రహ్మకుమారీల శాంతిసరోవరంలో సేదతీరాలన్నా రాజస్థాన్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం మౌంట్ అబూ దర్శించాల్సిందే. వేసవిలో చల్లగా, మిగిలిన రోజుల్లో ఆహ్లాదంగా ఉండే అబూ సందర్శన ఒక మధురమైన అనుభూతి. మౌంట్ అబూలో ఓ సారి సంచారం చేసి వద్దాం రండి.
ఉత్తర భారతదేశ వాయవ్య ప్రాంతంలో రాజస్థాన్‌లో సముద్రమట్టానికి సుమారు 4 వేల అడుగల ఎత్తున విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణుల్లోని అబూ పర్వతం ప్రముఖ పర్యాటక, ఆ«ధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. వేసవిలో 21 నుంచి 33 డిగ్రీల సెల్సియస్, శీతకాలంలో 11 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వాతావరణం నిరంతరం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండల నుంచి జాలువారే జలపాతాలు, తోటలు, శిల్ప సంపదకు అబూ పెట్టిందిపేరు.
‘సుందర సూర్యాస్తమయ నగరం (సిటీ ఆఫ్ సన్‌సెట్)గా వ్యవహరించే ఇక్కడ హిందూ, జైన్ ఆలయాలు; నిక్కీ సరస్సు, గురుశిఖరం, వన్యమృగ సంరక్షణశాల,బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ ఆ«ధ్యాత్మిక విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ప్రధానంగా సందర్శించదగిన ప్రదేశాలు. అబూలో మహావీర్ జయంతి, వేసవి ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపు కుంటారు. పండుగల సమయంలో సంప్రదాయ జానపద నృత్యాలను, మధురమైన జానపద సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
దిల్వార్ జైన మందిరం
11-13 శతాబ్దాల మధ్య నిర్మితమైన దిల్వార్ జైన్ మందిరం ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాత,సుందరమైన మందిరాల్లో ఒకటి.ఇక్కడి చలవరాతి శిల్ప సంపద అబ్బురపరుస్తుంది. దీని నిర్మాణానికి అవసరమైన చలవరాయిని అరసూరి కొండల నుంచి ఏనుగులపై తెప్పించారని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. అయిదు ప్రధాన భాగాలుగా నిర్మించిన ఈ మందిరంలో అయిదుగురు తీర్థంకరులను ప్రతిష్ఠించారు. జైన్ మొదటి తీర్థంకర్ ఆదినాథ్‌కు అంకితం చేసిన ఈ ప్రాంగణంలోని విమల్ వసహి ఆలయ నిర్మాణానికి 14 ఏళ ్ల సమయం పట్టింది. మౌంట్ అబూలో అందమైన విహార కేంద్రం. చుట్టూ పచ్చని చెట్లతో నిండి ఉండే ఈ సరస్సును గయ, పుష్కర సరస్సులతో సమానంగా భావిస్తారు.
హిందూ దేవత గోళ్లతో ఈ సరస్సును తవ్వడం వల్ల నక్కీ (నెయిల్) సరస్సుగా పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి బోటు షికారు విశేషంగా ఆకర్షిస్తోంది. అబూకు ఈశాన్యంగా 15 కిలోమీటర్ల దూరంలోని గురుశిఖరం ఆరావళి పర్వత శ్రేణుల్లోనే అత్యంత ఎత్తయింది. ప్రముఖ హిందూ యాత్రాస్థలం. శాంతిశిఖరం, అచల్‌ఘడ్ శిఖరం చూడదగిన ప్రదేశాలు.
ఆరావళి శ్రేణుల్లో ఆధ్యాత్మిక ధామం
మౌంట్ అబూ అనగానే గుర్తుకు వచ్చేది ప్రజాహిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. అపురూప విజ్ఞానధామంగా, ఆధ్మాత్మిక-పర్యాటక క్షేత్రంగా అది అలరారుతోంది. ‘ఓం మండలి’ పేరిట ఆవిర్భవించిన ఆ సంస్థ నేడు అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. సేవాభావానికి, ఆధ్యాత్మిక విలువలకు వేదికగా నిలిచింది. నేటి పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో సంప్రదాయ కుటుంబంలో జన్మించి, వజ్రాల వ్యాపారంలో అగ్రగామిగా నిలిచిన దాదా లేఖ్‌రాజ్ తమ60 ఏట 1936లో సత్యస్వరూపాన్ని గ్రహించే దివ్యానుభూతులు పొందారు.
దాంతో లౌకిక జీవితంపై ఆసక్తి నశించి, వానప్రస్థంపై దృష్టి మళ్లింది. వజ్రాల వ్యాపారం రాళ్లవ్యాపారంగా తోచింది. ఆధ్యాత్మిక, సేవా రంగాలపై దృష్టి పెట్టి, అందుకోసం స్థిర చరాస్తులను ధారాదత్తం చేశారు. అలా బ్రహ్మకుమారీల సంస్కృతికి బీజావాపం జరిగింది.
మహిళల అధ్యాత్మిక కేంద్రం
ప్రపంచంలోనే మహిళా నేతృత్వంలో నడుస్తున్న ఏకైక ధార్మిక, విజ్ఞాన సంస్థ ఇది. మహిళలు గౌరవం పొందే చోట దేవతలు ఆనందంతో నాట్యం చేస్తారనే పెద్దల మాటకు తగినట్లు ఈ సంస్థల నిర్వహణలో వారికి అత్యున్నత గౌరవ స్థానం ఇచ్చారు. కేవలం మాతలు, సోదరీలుగా ఉన్న వారికే నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అలా ప్రప్రథమ అధ్యక్షురాలిగా బ్రహ్మకుమారీ జగదాంబ సరస్వతి, అనంతరం దాదీ ప్రకాశమణి పనిచేశారు.
ప్రస్తుతం దాదీ జానకీ ఆ బాధ్యతలు నిర్వహస్తున్నారు. మహిళా సాధికారిత, స్త్రీ చైతన్యం, విలువలతో కూడిన విద్య ఈ సంస్థ ఆశయాల్లో ప్రధానమైనవి. అబూరోడ్‌లోని ఆరావళి పర్వత పాదం అబూ వద్ద ‘ప్రజాపితబ్రహ్మా’ లేఖ్‌రాజ్ నెలకొల్పిన ‘శాంతివన్’, పర్వత శిఖరంపై ‘మధువన్’ దేశ విదేశాల్లోని ఆధ్యాత్మిక జిజ్ఞాసువులను ఆకర్షిస్తున్నాయి. ఓం శాంతి భవనం, వజ్రోత్సవ మందిరం (డైమండ్‌జూబ్లీ హాల్)లో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో పని చేస్తున్నాయి. శాంతివన్‌లో రెండు వేల మంది పైచిలుకు కూర్చునే సామర్థ్యం కల సమావేశ మందిరం, మరో ఆరు సభా వేదికలు ఉన్నాయి.
వీటిలో ఒక్కొక్కటి కనీసం సుమారు 350 మంది హాజరయ్యే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రాంగణ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరంణలో సకల సదుపాయాలతో బహుళ అంతస్తులుగా నిర్మించిన వసతిగృహాల్లో దాదాపు 15 వేల మంది బసకు అవకాశం ఉంది. 28 ఎకరాల విస్తీర్ణంలో గ్రామీణ, పట్టణ రూపురేఖలు ఉట్టిపడుతుంటాయి. యూనివర్శల్ హార్మనీ హాలు,రాజయోగ సభా మందిరం, శిక్షణ కేంద్రానికి అవసరమైన హంగులను 1993లో అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సమకూర్చారు.

-ఆర‌వ‌ల్లి జ‌గ‌న్నాథ‌స్వామి


(ఆంధ్ర‌జ్యోతి సౌజన్యంతో..)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!