సకల వృత్తులవారికీ ఆరాధ్య దైవం శ్రీ విశ్వకర్మ భగవాన్!


ఈ నెల 17 వ తేదీన శ్రీ విశ్వకర్మ జయంతి దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. అన్ని వృత్తుల వారికీ, ఉద్యోగులకూ ఆయన ఆరాధ్య దైవం. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం…

– ఎడిటర్

ఈ చరాచర సృష్టికంతటికీ కర్త శ్రీ విశ్వ కర్మభగవాన్‌. ఆయన సంకల్పంచేతనే సకల సృష్టి నిర్మాణం జరిగిందని వేదో పనిషత్తులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే శ్రీ విశ్వకర్మభగవాన్‌ ఈ భూ గోళంపై నివసించే మానవులకు, సకల జీవకోటికీ ఆరాధ్య దైవం. అన్ని వృత్తుల వారికీ, ఉద్యోగులకు, పనిచేసే వారం దరికీ, అన్ని కులాల, మతాలవారికీ పూజనీయుడు. పని చేయాలనే స్పృహ కలిగించేది శ్రీ విశ్వకర్మ భగవాన్‌. ఆ పని ఏదైనా కావచ్చు. చేతివృత్తి కావచ్చు. ఉద్యోగం కావచ్చు, వంట ఇంటిలో మహిళలు చేసే పని కావచ్చు, మరేద యినా కావచ్చు. అన్ని పనులకూ ఆయనే స్పూర్తిదాత. అందుకనే వివిధ పనిముట్లను, ఆయుధాలను ధరించి ఉన్న శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సరస్వతి, లక్ష్మీ దేవి, పార్వతి, దేవేంద్రుడు, శచీదేవి, తదితర దేవతాగణం అంతా సేవిస్తూ ఉంటారు. దేవతలకు మహాశక్తిమంతమైన ఆయుధాలను తయారు చేసి ఇవ్వడమే గాక మహానగరాలను కూడా నిర్మించి ఇచ్చాడు శ్రీ విశ్వకర్మభగవాన్‌. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకను సర్వాంగ సుందరంగా, కమనీయంగా ,నేత్రపర్వంగా నిర్మించింది ఆయనే. ఇంద్రప్రస్థ, హస్తినాపురం అనే నగరా లను కూడా సృష్టించింది ఆయనే. సృష్టిలో అపురూపమైన, వెలుగులు విరజిమ్మే స్వర్ణలంక (శ్రీలంక)ను నిర్మించిందీ ఆయనే. మయ సభను విశ్వకర్మ శిష్యుడైన మయుడు నిర్మించాడు. అంతేకాదు గర్భస్థ ఆంజనేయునికి ఉత్తరజంధ్యాలు, బటువు, కవచం తయారు చేసిఇచ్చి హనుమ జననాన్ని సులభం చేసినట్లు పురాణాల్లో మనం చదువుకుంటాం. శ్రీమహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రాన్ని తయారు చేసింది ఆయనే. అలాగే శ్రీ విశ్వకర్మ సృష్టించిన ఆయుధాలలో ముఖ్యమైనది ఆగ్నేయాస్త్రం. పుష్పక విమానాన్ని తయారు చేసుకుని, దానిపై ప్రయా ణించే శ్రీ విశ్వకర్మభగవాన్‌ దేవత లందరికీ ఆరాధ్యుడుగా భాసిల్లుతు న్నాడు. ఇనుప వస్తువులను తయారు చేసే కమ్మర వృత్తివారు, దారు(చెక్క) వస్తువులు తయారు చేసే వడ్రంగి వృత్తి వారు, ఇత్తడి, కంచు పాత్రలు తయారు చేసే కంచరవృత్తివారు, దేవతా శిల్పాలు ఆదిగా వివిధ శిల్పాలను నిర్మించే శిల్పి వృత్తివారు, స్వర్ణాభరణాలు తయారు చేసే స్వర్ణవృత్తివారు శ్రీ విశ్వకర్మ భగ వాన్‌ను తమ కులదైవంగా భావించి ఆరాధించేవారు. అయితే ఆయన ఈ చరాచర సృష్టికి కారణ భూతుడు, సృష్టి కర్త, నిర్మాణ రంగంలో నిపుణుడు కావడంతో ఆయనను అన్ని వర్గాల వారూ, అన్ని వృత్తులవారూ అర్చించడం ప్రారంభించారు. కర్మ (పని) ప్రధానంగా కలిగిన వారందరికీ అంటే కార్మికులం దరికీ ఆయన ఆరాధ్యుడు. ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు సహా సకల వృత్తులవారికీ ఆయన పూజనీయుడు. అన్ని పనులకు రూపకల్పన చేసే బుద్ధి జీవులకు కూడా ఆయన ఆరాధ్యుడే. పురాణాలలో శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను థబాహువులు కలవాడుగా వర్ణిం చారు. ఆ పది చేతులలో రకరకాల తయారీ పరికరాలు ఉంటాయి. అందు కనే ఆయనను ‘స్థాపత్య వేద’ అని కూడా వర్ణించారు. ఆయన త్రిమూర్తులతో సమానమైన శక్తి సామర్థ్యాలుగల వాడుగా కూడా పేర్కొన్నారు.
మన భారతదేశంలో సెప్టెంబరు 17 వ తేదీన కార్మిక దినోత్సవంగా భావించి శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను ఆరాధిస్తారు. అదే రోజున భారీ స్థాయిలో ఆయన జయంతి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. జమ్‌షెడ్‌పూర్‌లోని ఉక్కు కర్మాగారంలో శ్రీ విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లోనూ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరు గుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!