చిల్లర `పెద్దన్న’ల దోపిడీ -1


పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతోన్న వేళ ఇది.  కీలకమైన ఆర్థిక బిల్లుల విషయం తేల్చుకోవాల్సిన సమయం ఇది. సరిగా ఇదే ముహూర్తానికి కేంద్ర ప్రభుత్వం రిటైల్ ఎఫ్.డిఐలకు తలుపులు బార్లా తెరిచింది. దీంతో విపక్షంలోనేకాదు, స్వపక్షంలోని నేతలు కూడా మండిపడే వింత పరిస్థితి ఏర్పడింది. ఇటు పార్లమెంట్ సభాకార్యక్రమాలను స్తంభింపజేస్తూ, అటు తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్న రిటైల్ ఎఫ్.డి.ఐల లోగుట్టు కథ ఇదే…

కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇకపై చిల్లరకొట్టు చిట్టెమ్మల స్థానంలో విదేశీ పెద్దన్నలు రాజ్యమేలొచ్చు. దీంతో బతుకుతెరువుకోసం రిటైల్ షాపులు నడుపుకునేవారికి గడ్డురోజులు రావచ్చు.  మన రిటైల్ వ్యాపారం విదేశీ కంపెనీల గుప్పెట్లో చిక్కుకుపోవచ్చు.  ఇవన్నీ కేవలం భయాలేనా, లేక వాస్తవరూపందాల్చే పరిస్థితులా ? కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశీ పెట్టుబడులతో మన రిటైల్ కు స్వర్ణయుగం రాబోతుందంటూ ఊరిస్తోంది. ఏది నిజం ? మరేది భ్రాంతి ??
దేశంలో రిటైల్ వ్యాపారం రంగు, రూపు, రుచి, వాసన మారిపోయే పరిస్థితి ఏర్పడింది.  రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను స్వాగతించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సెగలు, పొగలు కక్కుతోంది. రిటైల్ రంగంలో నూతన శకం ప్రారంభమైనట్టు కేంద్రం అభివర్ణిస్తున్నప్పటీ, భారత చిల్లర మార్కెట్ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను  అనుమతించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై వాల్ మార్ట్, క్యారీఫోర్, టెస్కో వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటికే అమితోత్సాహం చూపుతున్నాయి.
భార‌త చిల్లర‌కోట్లలోకి విదేశీ పెద్దన్నలు దూరిపోతే దేశ ఆర్థిక పరిస్థితి అమాంతం మారిపోతోందా?
నిజంగానే కోటి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా ?  వీటిద్వారా ఉపాధి ఎవరికి ? అరిష్టం మరెవరికి ? అన్న ప్రశ్నలు ప్రస్తుతం మ‌న‌ముందున్నాయి.
రిటైల్ మార్కెట్ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అంగీకరించడం దేశంలోనే ఓ పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న కీలక విధాన నిర్ణయంలో 30 శాతం సరుకులను చిన్న సంస్థల నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన పెట్టింది. అయితే, చైనాకు చెందిన చిన్న కంపెనీలు దేశంలోకి వెల్లువెత్తుతాయన్న భయాలు వ్యక్తంకావడంతో ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దేశీయ చిన్న సంస్థల నుంచే 30 శాతం సరుకులు కొనుగోలు చేయాలన్నదే తమ ధ్యేయమంటూ యూపీఏ ప్రభుత్వం అంటోంది.
పెద్దఎత్తున రిటైల్ వ్యాపారరంగంలో విదేశీ సంస్థలు పెట్టుబడులుపెట్టడం వల్ల ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం ఊరిస్తోంది. దీంతోపాటుగా వ్యవసాయ సంబంధ రంగాలు కూడా అభివృద్ధిబాట తొక్కుతాయని అంటోంది. కేవలం మూడేళ్లలోనే ఆర్థికపరంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని యూపీఏ ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెబుతోంది.
ఇప్పటివరకు, పంట చేతికొచ్చాక దాన్ని నిలవచేసే సామర్థ్యం సరిగాలేక ఏటా లక్షలాది టన్నుల ఆహారధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోతున్నాయి. ఈ నష్టాన్ని అంచనావేస్తే, అది  మొత్తం ఆహారోత్పత్తిలో 30 నుంచి 40 శాతంవరకు ఉంటుందనే చెప్పాలి.  దీన్ని నివారించాలంటే ప్రాసెసింగ్ రంగంలో మౌలిక సౌకర్యాలు పెరగాలి. విదేశీ పెట్టుబడులు కుప్పలుతెప్పలుగా వచ్చిపడితే ఈ సమస్య తొలిగిపోతుంది. శీతలీకరణ గిడ్డంగులకు కొదవేఉండదు. ఫలితంగా ఆహారాధాన్యాల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది. ఇదే ప్రభుత్వం ఆశ. అందుకే ఈ తాపత్రయం.
అయితే యూపీఏ ప్రభుత్వం భావిస్తున్నట్టు  ఈ రిటైల్ ఎఫ్.డి.ఐలతో మంచిరోజులొస్తాయా? నిజంగానే ఆహారద్రవ్యోల్బణం తగ్గిపోతుందా ?
రైతుల నుంచి కంపెనీలు నేరుగా కొనుగోళ్లు చేస్తాయా ? మధ్య దళారీ బెడద తగ్గిపోతుందా ?  లాంటి ప్రశ్నల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి..
ఇంకావుంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!