కిర‌ణ్ పాల‌న‌కి ఏడాది పూర్తి..


కిర‌ణ్ సిఎం అయ్యే స‌మ‌యానికి రాష్ట్రంలో గంద‌ర‌గోళం..

తెలంగాణ అంశం వేడెక్కి ఉంది..

సొంత పార్టీలోనే కిర‌ణ్‌పై వ్యతిరేక‌త‌..

జ‌గ‌న్ వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో త‌ల‌నొప్పులు

త‌న మాట విన‌ని మంత్రుల‌తో చికాకు..

స‌క‌ల‌జ‌నుల స‌మ్మెతో కిర‌ణ్ అయోమ‌యం…

ఆరునెల‌ల పాట‌యినా ఈ పాల‌న సాగుతుందా అన్న అనుమాం.. కానీ..

కిర‌ణ్ వీట‌న్నింటినీ అధిగ‌మించి ఏడాది పాల‌న పూర్తి చేసుకున్నారు.

పాల‌నా ద‌క్షత లేద‌న్న విమ‌ర్శల‌క చేత‌ల‌తోనే ధీటైన జ‌వాబు..

రూపాయికే కిలో బియ్యం ప‌థ‌కంపై వ్యతిరేక‌త వ‌చ్చినా..

రాజీవ్ యువ‌కిర‌ణాల‌తో ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌డం కిర‌ణ్‌కి ప్లస్ పాయింట్‌..

మెల్లిగా మొద‌ల‌యి దూకుడుగా సాగుతున్న కిర‌ణ్ పాల‌న‌పై ఓ విశ్లేష‌ణ‌..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనేక ఆటుపోట్ల మధ్య ఒక ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోవడం ఒక విశేషం అయితే వచ్చే రెండున్నర ఏళ్లు ఈయనే ఉంటారన్న నమ్మకాన్ని కలిగించడంలో ఇప్పుడు ఆయన సఫలం అవుతున్నారనే చెప్పాలి. కిరణ్ ముఖ్యమంత్రి అయిన సమయంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. నాటి ముఖ్యమంత్రి రోశయ్య వయోభారం రీత్యా కొన్ని సమస్యల మద్య లో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి వైపు అదిష్టానం మొగ్గు చూపింది. అప్పటివరకు స్పీకర్ గా, ఛీఫ్ విప్‌ గా మాత్రమే పనిచేసిన ఈయనకు పాలన అనుభవం లేదన్న భావన ఉండేది. అంతేకాదు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్.ఎల్.ఎ.లు తమ పదవులకు రాజీనామాచేశారు.తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మంత్రి పదవులను వదలిపెట్టకపోయినా సచివాలయానికి రాకపోవడం, క్యాబినెట్ మీటింగ్ లకు రాని పరిస్థితి ,అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలుగుతుండేది. కిరణ్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయనను కలవడానికి వచ్చే ఎమ్మెల్యేలు, నాయకులు జనసామాన్యం సంఖ్య బాగా తక్కువగా ఉండేది.మంత్రులతో సఖ్యత లేక, ఎమ్మెల్యేలు వెంటరాక, ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలైతే ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన తీరు ఆందోళనకరంగా ఉండేది. అంతేకాదు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కిరణ్ పై ఆరోపణలు, విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కించేవారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఏకంగా తెలంగాణ ఆందోళనలో పాల్గొని కేసులకు గురైన విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలంటూ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరవధిక దీక్ష చేస్తే , మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి దీక్ష చేస్తే దానిని కెసిఆర్ అడ్రస్ చేయడం వంటి ఘటనలు జరిగేవి. ఇక మరోవైపు పార్టీని వీడి వెళ్లిపోయిన జగన్ దూకుడు తీవ్రంగా ఉండేది. ఓదార్పు యాత్ర లో ఆయన కిరణ్ ప్రభుత్వంపై మండి పడుతుండేవారు.అనేక మంది ఎమ్మెల్యేలు జగన్ క్యాంపులో ఉండేవారు. జగన్ నిర్వహించిన దీక్ష శిబిరాలకు హాజరవుతుండేవారు.అసలు కిరణ్ ప్రభుత్వం ఆరు నెలలకంటే ఎక్కువ ఉంటుందా అన్న సంశయం కలిగేది. అంతేకాదు. రేపో,మాపో రాష్ట్రపతి పాలన తప్పదన్న పరిస్థితి కనిపించేది. అటు పాలన లేక, ఇటు రాజకీయంగా గందరగోళం పరిస్థితి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బయటపడుతున్నారు.నవంబరు పదిహేను తర్వాత కిరణ్
ముఖ్యమంత్రిగా ఉండరు అని ఒక జ్యోతిష్కుడు ఘంటాపధంగా చెబుతుండేవారు. ఆ జ్యోతిష్కాన్ని వమ్ముచేసి రాజకీయంగా తనదే పైచేయి అనిపించుకున్న విదంగా కిరణ్ ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఏడాదికాలంలో ఆయన రెండు విషయాలలో బాగా నిలదొక్కుకున్నట్లు కనిపిస్తుంది. పార్టీలో తనకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపునకు ఎవరో ముగ్గురు, నలుగురు మినహాయించి మిగిలినవారందరిని తనవైపు తిప్పుకోగలిగారు. తెలంగాణ ఎమ్.పిలలో ఇంకా కాస్త బెట్టు ఉన్నా, కొంతకాలం క్రితం వరకు
ఉన్న తీవ్రత తగ్గిందనే చెప్పాలి.ఇది ఒక కోణం అయితే అంతకంటే ముఖ్యమైనది జగన్ వర్గం ఎమ్మెల్యేలు పలువురిని తనదారిలోకి తెచ్చుకోవడం. వారు నిజంగానే వచ్చారా? లేక వ్యూహాత్మకంగా మద్దతు ఇస్తున్నారా అన్నది పక్కనబెడితే జయసుధ మొదలు, జగన్ కు వీర మద్దతుదారుడైన జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి వరకు సుమారు పది మంది లోపు ఎమ్మెల్యేలు ఇప్పుడు కిరణ్ సర్కార్ కు మద్దతు ఇస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుకాని, ఇటు జగన్ వర్గం ఎమ్మెల్యేలు కాని ఒక విషయం అర్దం చేసుకుని ఉండాలి. ఈ రెండున్నర ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. కిరణ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న విశ్వాసం కలిగి ఉండాలి. అందువల్లనే వారిలో మార్పు వచ్చి ఉండవచ్చు. అంతేకాక మెల్లగా వారందరిని నయానో,భయానో దారికి తెచ్చుకోవడం కూడా కావచ్చు. సాధారణంగా అధికారంలో ఉన్నవారికి అనేక వనరులు ఉంటాయి. వాటిని ఉపయోగించడం తెలిసి ఉండాలి. గతంలో తెలుగుదేశం చీలిక సమయంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించి మొత్తం ఎమ్మెల్యేలనందరిని
తనవైపు తిప్పుకోగలిగారు. ఇక వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ లో ఉండే వర్గాలన్నిటిని చిన్నాభిన్నం చేసి మొత్తం అంతా తన వర్గం కింద మార్చుకోగలిగారు. రెండో సారి ఎన్నికైన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలు , కొందరు నాయకులను కూడా ఆయన ఆకర్షించారు. అలాగే ముఖ్యమంత్రి రోశయ్య తన క్యాబినెట్ లో ఉండడానికే ఇష్టపడని మంత్రులను దారిలోకి తెచ్చుకుని వారితోనే ఈయనే తమ ముఖ్యమంత్రి అని చెప్పించుకున్నారు. వారితో పోల్చితే కిరణ్ ది మరీ ఇబ్బంది కరమైన పరిస్థితి. అటు తెలంగాణ, ఇటు జగన్ అంశాలు తీవ్రంగా
యాతన పెడుతున్న తరుణంలో కిరణ్ ఆ రెండు గండాల నుంచి బయటపడి నిలదొక్కుకున్నట్లు కనిపించడం ఒక ప్రధాన రాజకీయ పరిణామంగా భావించాలి. అయితే భవిష్యత్తులో తెలంగాణ ప్యాకేజీ ఏదైన వచ్చి, తెలంగాణ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చి దానికి అధిష్టానం సుముఖత వ్యక్తపరిస్తే చెప్పలేం కాని, ఇప్పుడున్నపరిస్థితులు యధాతధంగా కొనసాగితే కిరణ్ కు డోకాలేదన్న అభిప్రాయం కలుగుతుంది.అధిష్టానం అండదండలు కూడా ఇప్పటివరకు కిరణ్ కు పూర్తిగా లభించడం కూడా కలిసి వచ్చిందని అంగీకరించాలి. కిరణ్ లో కూడా మొదటిలో కన్నా మార్పు కనిపిస్తోందని ఎమ్మెల్యేలు అంటున్నారు. అందరిని కలుపుకొని వెళ్లడానికి ఇటీవలికాలంలో బాగానే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఏదైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో నాకు తెలుసు అని అనడం వల్ల ఆయనకు వచ్చే సమాచారం రాకుండా పోతోందనే వారు కూడా ఉన్నారు.కాంగ్రెస్ అంటేనే వర్గాల మయంగా ఉంటుంది. అలాంటి వర్గాలన్నిటిని కలుపుకుని వెళ్లగలగాలంటే అంత తేలిక కాదు. అయితే 1989-94 మద్యలో ఉన్నమాదిరి బలమైన నేతలు అంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలను తమవెంట తిప్పుకునే నేతలు పెద్దగా లేకపోవడం కిరణ్ కు కలిసివచ్చే పాయింట్ అని చెప్పాలి.అలాగే వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయంగా తనకు పార్టీలో ప్రత్యర్ధులు లేకుండా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించారు.అప్పట్లో వై.ఎస్.కు సన్నిహితంగా కిరణ్ ఉండేవారు. కనుక ఆ విషయాలు తెలియని వ్యక్తేమి కాదు.ఇక తెలంగాణ ఉద్యమం పట్ల కిరణ్ వ్యవహరించిన సరళి కూడా ఆసక్తికరమైనదేనని చెప్పాలి. ఎక్కడా కాల్పులు లేదా ప్రధానమైన హింసాయుత ఘట్టాలు లేకుండా తీసుకోవడం, అధిక సంయమనం పాటించడం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. అదే సమయంలో ఎపిపిఎస్సి పరీక్షలు పెట్టనివ్వరాదని టిఆర్ఎస్ తోపాటు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు పట్టుబట్టినా వినకుండా విజయవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవడంలో ఈయన సఫలం అయ్యారు. ఎస్.ఐ. పరీక్షలు ఎట్టి పరిస్థితిలోను జరగనివ్వరాదని తెలంగాణ ఆందోళనకారులు, ఉద్యమ నేతలు , ఏకంగా కాంగ్రెస్ నేతలు తీవ్ర యత్నం చేసినా 14 ఎఫ్ ను రద్దు చేయించడం ద్వారా, అలాగే పరీక్షలను నిర్వహించడం ద్వారా కిరణ్ తనదే పై చేయి అనిపించుకున్నారు. గతంలో రోశయ్య టిఆర్ఎస్ ముఖ్యనేతతో మాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న అభియోగం ఉండేది. కాని కిరణ్ అందుకు ఆస్కారం ఇవ్వకపోవడం కూడా ఆయనకు ఉపయోగపడిందని చెప్పాలి. ఇక సకల జనుల సమ్మెలో ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా నిబ్బరంగా నిలబడ్డారని చెప్పాలి. సుమారు నలభై రోజులపాటు సాగిన ఆ సమ్మెలో ప్రభుత్వపరంగా ఈయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఒప్పుకోవాలి. అదే సమయంలో ఉద్యమ నేతలు మానవీయ కోణాన్ని మరిచి ప్రజలను ఇబ్బందులపాలు చేయడం వంటి కారణాలతో దెబ్బతిన్నారు. దాంతో సమ్మె దానంతట అదే ముగిసేలా పరిస్థితులు కిరణ్ కు కలిసి వచ్చాయి. బాన్స్ వాడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి పోటీచేయరాదని ఎమ్.పిలు కొందరు డిమాండ్ చేసినా కిరణ్ అభ్యర్ధిని పెట్టడం, అతనికి ముప్పైమూడువేల ఓట్లు రావడం కూడా కాంగ్రెస్ కు నైతికంగా స్థైర్యాన్ని ఇచ్చింది.అది కిరణ్ కు ఉపయోగపడింది. విశేషం ఏమిటంటే తెలంగాణ లో ఉద్యమం కాస్త శాంతించడం, అలాగే జగన్ వర్గం ఎమ్మెల్యేలు మెత్తబడడం ఒకే సమయంలో జరగడం కూడా ఒకరకంగా ఆశ్చర్యకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా కొంత పట్టు తెచ్చుకుంటున్న కిరణ్ కు పూర్తిగా పాలనపరంగా పట్టు వచ్చిందనడానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే ప్రజలను ఆకట్టుకోవడానికి రూపాయికి కిలో బియ్యం పధకం ప్రవేశపెట్టడమే ఆయన బలహీనతగా తీసుకోవాలి. ఎందుకంటే స్వయంగా ఆయన
క్యాబినెట్ లోని మంత్రులే ఈ పధకాన్ని దుయ్యబట్టారు.ఎలాగైనా ప్రజలలోకి వెళ్లాలన్న తాపత్రయంలో కిరణ్ ఈ ప్రయత్నం చేసినట్లు కనబడుతుంది. అదే సమయంలో రాజీవ్ యువ కిరణాలు పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం మాత్రం మంచిదే. అది సఫలం అయితే కిరణ్ కు మంచి పేరే వస్తుంది. అలాగే ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆయన చర్యలు తీసుకోవడం హర్షణీయమే.అయితే ఇప్పటికీ ఆయన మంత్రులందరికి ఆయనపై పూర్తి విశ్వాసం ఏర్పడిందని చెప్పలేం. మంత్రి
శంకరరావు ఇప్పటికీ క్యాబినెట్ కే రావడం లేదు. ఆయన నేరుగా ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. మరో మంత్రి డి.ఎల్. రవీంద్ర రెడ్డితో అంతరం ఏర్పడింది. పిసిసి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కూడా సంబంధాలు అంత సజావుగా లేవన్న భావన ఉంది. రాజకీయాలలో అంతా తనకు అనుకూలంగా ఉంటారని అనుకోజాలం. అయితే పరిపాలనపై వాటి ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఇక వివిధ కారణాల వల్ల రాష్ట్రం బాగా వెనుకబడిందన్న అబిప్రాయం ఉంది.దానిని పోగొట్టగలగాలి. కాగా ప్రభుత్వం అంటేనే కుంభకోణాలమయం అనుకునే పరిస్థితి. కాని వ్యక్తిగతంగా ఇంకా కిరణ్ పై ఆ మచ్చ పడిందని చెప్పజాలం. కాని కర్నూలు జిల్లాలో ఒక సంస్థకు భూమి కేటాయించిన విషయం వివాదాస్పదం అయింది. అలాగే పోలవరం టెండర్లు కూడా వివాదం అయ్యాయి. మొత్తం మీద ప్రభుత్వంపై కిరణ్ క్రమేపి పట్టుపెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా వ్యక్తిగతంగా చూస్తే కిరణ్ రాత్రి పొద్దుపోయేవరకు మేల్కొనే ఉంటున్నారు. ఆయా వ్యక్తులతో ఫోన్ లో సంభాషిస్తుంటారు. దాని ప్రభావం కాని, ఇతర కారణాలు కాని ఉదయం దినచర్య కాస్త ఆలస్యం మొదలవుతోందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ ఎమ్.చెన్నారెడ్డి ది కూడా ఇదే తరహా అని చెప్పాలి. బహుశా హైదరాబాద్ లోనే పుట్టిపెరిగిన కిరణ్ కు కూడా ఆ అలవాటు వచ్చి ఉండాలి. ఫర్వాలేదు.ఎలా చేసినా నిర్ణయాలు చకచకా జరిగితే అంతా సజావుగానే ఉంటుంది. కాని ప్రభుత్వంలో సత్వరం ఫైళ్లు పరిష్కారం కావడం లేదన్న భావన ఉంది. దానిని పోగొట్టుకోవాలి. ఏది ఏమైనా సొంతవర్గం లేకుండా ఒంటరిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి , ఇప్పుడు తనమాట వినేవారిని తయారు చేసుకోగలుగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిస్థాయిలో ప్రభుత్వంపై, మంత్రులపై, పార్టీపై, ప్రజలపై పట్టు తెచ్చుకోవడానికి ఇంకా అధికంగానే శ్రమించాలని చెప్పకతప్పదు. ఎందుకంటే మొత్తం మీద పాస్ మార్కులు తెచ్చుకున్నట్లు కనిపిస్తున్నా, జనంలో పాస్ కావడానికి ఇప్పుడు వచ్చిన మార్కులు సరిపోవనే చెప్పక తప్పదు. ఏది ఏమైనా ఈ పరిస్థితులలో ఏడాది పూర్తి చేసుకోవడం కచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి ది విజయమే. అందుకు కిర‌న్ కుమార్‌రెడ్డికి అభినందనలు.
source:kommineni.info

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!