మళ్ళీ టెర్రర్ ఎటాక్ ! తట్టుకోగలమా?


మ‌ళ్ళీ టెర్రరిస్టులు ఎటాక్ చేస్తే మ‌నం త‌ట్టుకోగ‌ల‌మా..?  ముంబాయి త‌ర‌హా కాల్పుల‌కి ఎగ‌బ‌డితే మ‌నం భ‌రించ‌గ‌ల‌మా..? ఒకేసారి మూకుమ్మ‌డిగా దేశంలోని అన్ని ప్రధాన న‌గ‌రాల‌లో ఇలాంటి అఘాయిత్యాల‌కి టెర్ర‌రిస్టులు పాల్ప‌డితే అరిక‌ట్ట‌గ‌ల‌మా…?

పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై పంజావిసిరి నేటికి సరిగా మూడేళ్లు. దేశ అంతర్గత భద్రతకే సవాల్ గా మారిన ఈ తరహా దాడులు మరోసారి జరిగితే మనదేశం తట్టుకోగలదా? సమర్థవంతంగా తిప్పికొట్టగలదా? అసలు పౌరుల రక్షణకు పాలకులు తీసుకుంటున్న చర్యలేమిటి?

నిఘానేత్రాల కళ్లుగప్పి, చీకటివేళ సముద్రమార్గంగుండూ ముంబయితీరానికి చేరి ముష్కరమూకలు మహావిధ్వంసం సృష్టించడంతో దేశం ఉలిక్కిపడింది. అప్పటి నుంచీ ఇప్పటివరకు కేసు దర్యాప్తులో ఏమేరకు ప్రగతి సాధించగలిగాం?

ఉగ్రవాదుల దాడులకు ముంబయి వణికిపోయి నేటికి సరిగా మూడేళ్లు.  ముంబయి నగరవాసుల్లోనే కాదు, ఏకంగా దేశ ప్రజల్లోనే భద్రతపై నమ్మకంపోయిన రోజు. కన్నీట మసకబారిన కళ్లతో జాతి ఏకమైన రోజు అది. ఉగ్రవాదాన్ని అంతమొందించకపోతే దేశ ప్రజలకు రక్షణ లేదని అందుకు ఏకోన్ముఖంగా కదలాలంటూ ముక్తకంఠంతో ప్రతినబూనిన సందర్భం అది. ఇదంతా జరిగి మూడేళ్లయింది.
ముంబయి ఉగ్రవాదుల దాడిలో 164 మంది మరణించారు. 300మందికిపైగా గాయపడ్డారు. ఎటుచూసినా రక్తపు మరకలు. హాహాకారాలు. 2008 నంవబర్ 26 నిశరాత్రి ముష్కరమూకలు విచకణారహితంగా దాడులకు దిగితే, 29న కాని పరిస్థితి అదుపులోకిరాలేదు. NSG దళాలు రంగంలోకి దిగి `ఆపరేషన్ బ్లాక్ టొర్నాడొ’ నిర్వహించి ఉగ్రవాదుల పనిపట్టారు. పది మంది ఉగ్రవాదుల్లో కసబ్ మినహా మిగతావాళ్లు అక్కడిక్కడే హతులయ్యారు.

మరోసారి ఇలాంటి దాడులు జరిగితే మనం తట్టుకోగలమా?

ముంబయి ఉగ్రవాదుల దాడికి మూడేళ్లు అయినా ఇప్పటికీ ఈ ప్రశ్నకు పాజిటీవ్ సమాధానం రావడంలేదు. కేంద్రంలోని పాలకులు చెప్పే కల్లబొల్లి కబుర్లను ప్రజలు నమ్మేస్థితిలోలేరు. అలాంటి దాడి మళ్ళీ జరగకుండా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు మన పాలకులు. ఒకవేళ దాడి జరిగిన తర్వాత తిప్పికొట్టగలమేమోకానీ, అసలు దాడి జరగకుండా చేసేటంతటి కట్టుదిట్టమైన వ్యూహాలు మనవద్ద లేవు. దాడిని తిప్పుకొట్టడంలో కూడా మన సామర్థ్యం కంటే, ఉగ్రవాదుల పొరపాట్లు మనకు కలిసొస్తున్నాయి. ఉగ్రవాదుల మధ్య నడిచే రహస్య సమాచారం బయటపడినప్పుడు మాత్రమే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతున్నాం.

కేసు దర్యాప్తు ఏమేరకు ప్రగతి సాధించింది?

దేశ అంతర్గత భద్రత విషయంలో హోం మంత్రి చిదంబరం చూపిన చొరవతో దర్యాప్తులో కొంత ప్రగతి కనిపించిన మాట వాస్తవమే. NSG శాఖల ఏర్పాటు, నిఘా వ్యవస్థల బలోపేతానికి చర్యలు చేపట్టడం ఇలాంటివే. ఈ చర్యలను రెండు విభాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి – దాడులు జరిగిన తర్వాత ఉపయోగపడేవి. రెండోది – దాడి జరగకుండా చేసేవి. అయితే, ఈ చర్యలు సరిపోతాయా…?
ఎన్.ఎస్.జీ దళాలను బలోపేతం చేస్తున్నారు. మూడేళ్లలో అదనపు సిబ్బందిని నియమించారు. వారికి 18 నెలల నుంచి 24 నెలలపాటు కఠోర శిక్షణ ఇప్పిస్తున్నారు. ముంబయి దాడుల తర్వాత భద్రతదళాల సంఖ్య పెరిగినమాట వాస్తవమే. అయితే, నిఘావైఫల్యాలు మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అగ్రదేశాల్లోని నిఘా పోకడలకూ, మనకూ తేడా హస్తిమశకాంతరం.
పాకిస్తాన్ ఉగ్రవాదులే ముంబయి దాడికి పాల్పడినట్టు సాక్షాదారాలు చూపిస్తున్నా, పాక్ ప్రభుత్వం మాత్రం అసలు సూత్రధారాలను అప్పగించడంలో దోబూచులాడుతూనేఉంది.
ముంబయి మహానగరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ప్రాణాలతో  పట్టుబడిన ఏకైక పాక్ ఉగ్రవాది కసబ్ దర్యాప్తులో చెప్పిన వివరాలు వణుకుపుట్టించేవిలా ఉన్నాయి. పాకిస్తాన్ ISI ప్రేరితంగానే ఈ దాడులు జరిగాయని కసబ్ కుండబద్దలుకొట్టినట్టు చెప్పినా ఇప్పటికీ పాకిస్తాన్ మనస్పూర్తిగా ఒప్పుకోవడంలేదు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు భారత్ పై దాడులు జరపడాన్ని ప్రపంచదేశాలు ఖండిస్తున్నా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తనట్టే ఉంది.
2008లో దక్షిణ ముంబయి ఉగ్రవాదుల పైశాచిక కాల్పులతో దద్దరిల్లిపోయింది. ఉగ్రవాదులు 8 చోట్ల దాడులు జరిపారు.

పాకిస్తాన్ నుంచే మళ్ళీ ఉగ్రవాదులు దాడికి దిగితే..?

మూడేళ్ళకిందటి ముంబయి ఉగ్రవాదుల దాడితోనే ఇరుగుపొరుగుదేశాలైన భారత్ – పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మంటగలిసిపోయాయి. తమ దేశానికీ ఉగ్రవాదుల ముప్పు ఉన్నదంటూ కాకమ్మకబుర్లు చెబ్తూనే మరో పక్క ఉగ్రవాదశక్తులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ నుంచి మరోసారి టెర్రరిస్టులు దాడికి పాల్పడితే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఇక కలలో కూడా జరగవు. ఇప్పటికే మినుకుమినుకుమంటున్న ఆశలు పూర్తిగా అడుగంటిపోతాయి. పాకిస్తాన్ ఇక ఎప్పటికీ శత్రుదేశంగానే మిగిలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
పాకిస్తాన్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లుల చెప్తూ ప్రపంచదేశాల ఎదుట పత్తిత్తులా చెప్పుకోవాలని చూస్తోంది. ముంబయి టెర్రర్ ఎటాక్ పై భారత్ కేవలం సమాచారం మాత్రమే ఇస్తోందని అనడం అలాంటిదే.
ఈ దాడికి పాల్పడిన వారెవరో పాక్ ప్రభుత్వానికి కచ్చితంగా తెలుసు. తన సొంత ప్రజలే నేరస్థులు కావడంతో వారిపై చర్యలు తీసుకోవడానికి పాకిస్తాన్ జంకుతోంది. తాజ్ మహల్ హోటల్ నుంచీ, అలాగే, ఒబెరాయ్ హోటల్ నుంచీ ఉగ్రవాదులు తమ సెల్ ఫోన్ ద్వారా పాకిస్తాన్ లోని సూత్రధారులతో నేరుగా మాట్లాడినట్టు నిర్ధారణ అయింది. అయినా ఇంకా ఏవేవో ఆధారాలు కావాలనుకోవడం తప్పించుకునే ధోరణినే వ్యక్తంచేస్తోంది. ఎదురేని ఆధారాలు చూపిస్తున్నా, పాకిస్తాన్ ప్రబుత్వం దర్యాప్తుని వేగవంతం చేయలేదు. చిత్తశుద్ధిఉంటే ఈపాటికే నిందితులను గుర్తించి న్యాయస్థానం ముందు నిలబెట్టేది. వారికి శిక్షలు పడేలా చూసేది.
దేశం ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమే అని పాలకులు చిలకపలుకులు పల్కుతున్నారేతప్ప, సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగడంలేదు. పాలనావ్యవస్థ లొగుసుగుల పుట్టలా మారిపోయింది.
ముంబయి నవంబర్ దాడుల ఘటన మరచిపోకముందే, ఈఏడాది జులైలో ముంబయి మరోసారి ఉలిక్కిపడింది. నిత్యం రద్దీగా ఉండే జవేరీ బజార్, ఒపెరాయ్ హోస్ దగ్గర, దాదర్ లోనూ బాంబులు పేలాయి. ఈ వరుసపేలుళ్లలో 17 మంది మరణించారు. 131మంది గాయడ్డారు.
దేశం ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమే. ఇదే విషయాన్ని ఇటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అటు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే పలు సందర్భాల్లో ఉద్ఘాటించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించేదేలేదని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చెప్తూనే ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎంతగా ధైర్య వచనాలు కుమ్మరిస్తున్నా ప్రజల్లో అభద్రతాభావం తొలిగిపోవడంలేదు.
ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమైనదో మన పాలకులకు తెలుసు. దాన్ని ఎదుర్కోవడానికి ఎంతటి కట్టుదిట్టమైన వ్యవస్థ ఉండాలో కూడా తెలుసు.  అయినా సహజసిద్ధమైన నిర్లక్ష్యంతోనే  సాగుతుంటారు. ముంబయి ఉగ్రవాదదాడుల్లాంటివి జరిగినా నిమిషాల్లో తిప్పికొట్టగల భద్రతాయంత్రాంగాన్ని రూపకల్పనచేశారు.
దేశమంతటా వర్తించే విధంగా సమగ్ర వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న సంకల్పం గట్టిదేకానీ, అధికారగణంలో వదలని మొద్దునిద్ర, మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ఈ వ్యవస్థలు కార్యరూపం దాల్చలేదు. రాజకీయ పోకడలు లేకుండా ఉంటేనే ఇలాంటి కీలక వ్యవస్థలు ఆకారం దాల్చుతాయి. మరో పక్క మహారాష్ట్ర ప్రభుత్వానికి కసబ్ ఖర్చు తడిసిమోపెడవుతోంది. దాడి జరిపిన ఉగ్రవాదుల్లో సజీవంగా పట్టుబడిన వ్యక్తి కసబ్ పై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం 16కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం కేసు విచారించి కసబ్ కు ఉరిశిక్ష విధించింది. కసబ్ ని  ప్రస్తుతం  ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లోని స్పెషల్ సెల్ లో ఉంచారు.
20 ఏళ్ల ఉగ్రవాది కసబ్ అడిగిందల్లా ఇస్తున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను కేంద్ర హోం శాఖ ఖండించింది. కసబ్ కు తిండి ఖర్చు రోజుకు కేవలం 27 రూపాయలేనంటూ తేల్చింది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. మరో పక్క కసబ్ ఖర్చు పద్దులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో పక్క కాలం దొర్లిపోతోంది. చురుగ్గా చేపట్టాల్సిన పనుల్లో కూడా అలసత్వం చివరకు ఎటు దారితీస్తోందని దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచంలోకెల్లా రెండో అతిపెద్ద జనాభాగల  దేశం మనది. పట్టుమని పదిమంది ఉగ్రవాదులు విరుచుకుపడితే తట్టుకోలేని పరిస్థితి కూడా మనదే. కలిసికట్టుగా ఎదుర్కుంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగల సత్తా మనసొంతం. అయినా అంతటా నిలువెత్తు నిర్లక్ష్యం. అందుకు మూల్యమే వందలాది మంది ప్రాణాలు.  ప్రతినిత్యం భయం గుప్పెట్లో బతకాల్సి వస్తోంది.  మరోసారి టెర్రరిస్టులు విరుచుకుపడకముందే పాలకులు వెంటనే మేల్కొనాలి. అదే తక్షణ కర్తవ్యం.

- తుర్లపాటి నాగభూషణ రావు

98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!