టాటా చుట్టమే సైరస్ మిస్త్రీ


నాలుగు లక్షలకోట్ల టాటాగ్రూప్ ని రతన్ టాటా తర్వాత ఎవరు నడిపిస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. రతన్ టాటా వ్యాపార వారసుడు ఎవరో తేలిపోయింది. నిర్మాణరంగంలో కోట్లకు పడగలెత్తిన షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి నుంచి 43ఏళ్ల సైరస్ మిస్త్రీ టాటావారసుడి స్థాయికి ఎదిగారు. సైరస్ పల్లోంజీ మిస్త్రీ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది.
టాటా గ్రూప్ భవిష్య సారధిగా సైరస్ మిస్త్రీని ఎంపికచేయడంతో అసలీ మిస్త్రీ ఎవరు? ఆయనకూ, టాటా కుటంబానికీ ఉన్న లింకేమిటని ఆరాతీస్తే బీరకాయపీచు చుట్టరకమే వెలుగుచూసింది. ఈ బాదరాయణబంధమేమిటో ఓసారి చూద్దాం.
నిర్మాణ రంగంలో షాపూర్ జీ గ్రూప్ కి  147ఏళ్ల అనుభవం ఉంది. ఈ గ్రూప్ ఆఫ్ కంపెన‌ని మిస్త్రీ తాత ఏర్పాటు చేసారు.  షాపూర్ జీ గ్రూప్ విలువ : రూ. 15వేల కోట్లు కాగా  టాటా గ్రూప్ విలువ : రూ. 4లక్షల కోట్లు.. షాపూర్‌జీ గ్రూపుకంటే దాదాపు న‌ల‌భైరెట్లు పెద్దద‌యిన టాటా గ్రూప్‌కి వార‌సుడిగా రావ‌డంటే సైరస్ మిస్త్రీ గారెలబుట్టలో పడ్డట్టే.
రతన్ టాటాకు కుటుంబవారసులెవరూ లేకపోవడంతో వ్యాపార వారసునికోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. ఈ కమిటీలో సైరస్ మిస్త్రీ కూడా ఒకరు కావడం విశేషం. అయితే ఇక్కడ టాటా కులస్థులకీ, పల్లోంజీ కుటుంబానికీ లింక్ ఉండటం గమనార్హం.

టాటా – పల్లోంజీ లింక్

రతన్ టాటాకు ముత్తాత జమ్ సెట్జీ టాటా, ఆయనకు ముగ్గురు సంతానం.. సర్ రతన్ టాటాకు పిల్లలులేరు. దత్తతు కుమారుడు నావల్ హెచ్. టాటా. ఆయనకు ఇద్దరు భార్యలు. నోయిల్ టాటా, రతన్ ఎన్.టాటాలు కజిన్స్ అవుతారు. అయితే నోయిల్ టాటాతో పల్లోంజీకి బంధుత్వం వుంది. ఈ ప‌ల్లోంజీ షాపూర్ జీ కుమారుడే. పల్లోంజీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తె భ‌ర్తనే నోయిల్ టాటా.. పల్లోంజీకి అల్లుడు..
ఈ బాదరాయణబంధం అంతా తిరగేస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, సైరస్ మిస్త్రీకి నోయిల్ టాటా బావే అవుతాడు. ఆ రకంగా రెండు కుటుంబాల మధ్య లింక్ ఉంది. రతన్ టాటా, నోయిల్ టాటా కజిన్స్ కావడంతో రతన్ టాటాకూ సైరస్ మిస్త్రీ బావే అవుతారు.
తాతా, తండ్రిలాగానే సైరస్ మిస్త్రీ మొదటినుంచీ నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్ మీదనే దృష్టిపెట్టారు.  టాటాసన్స్ లో పల్లోంజీ మిస్త్రీకి 18శాతం వాటా ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ లో 75ఏళ్లు పూర్తికాగానే రతన్ టాటా పదవీవిరమణ చేస్తారు. ఆ తర్వాత టాటా సామ్రాజ్యానికి సైరస్ రారాజవుతారు. బయటవారే టాటాగ్రూప్ కు వారసునిగా వస్తారని చెబ్తున్నా, చివరకు బీరకాయచుట్టరికంతోనే టాటా కొత్త వారసుడు పుట్టుకురావడం గమనార్హం.

-ఎన్నార్టీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!