కెసిఆర్ కుమార్తె రాజ్యస‌భ‌కు..?


తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు కుమార్తె , తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత పేరు ఇప్పుడు రాజ్యసభ పదవికి పోటీచేసేవారి జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. టిఆర్ఎస్ లో ప్రచారం సంగతి ఎలా ఉన్న ఇతర రాజకీయ పార్టీలలో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతుండడం విశేషం. టిఆర్ఎస్ తన సంఖ్యాబలం పెంచుకోడానికి ప్రయత్నించడంలో ఒక లక్ష్యం కవితను రాజ్యసభ సభ్యురాలిగా చేయడం కూడా అని తెలుగుదేశం నేత ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్ మూడు సీట్లు, తెలుగుదేశం రెండు సీట్లు సులువుగానే గెలుచుకోవచ్చు. నాలుగో సీటు విషయంలో అత్యంత ఉత్కంఠ నెలకొంటుంది.అయితే కిందటిసారి శాసనమండలి ఎన్నికల మాదిరి కాంగ్రెస్ నేరుగా పోటీచేస్తుందా ? లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. కాంగ్రెస్ పోటీచేయని పక్షంలో టిఆర్ఎస్ పక్షాన ఎవరో ఒకరు పోటీచేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావనకు రావచ్చని అంటున్నారు.నిజానికి ఆమె నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయవచ్చని కూడా ఒక ప్రచారం ఉంది. దానికి కారణం ఆమె అత్తవారిల్లు ఆ నియోజకవర్గంలోని పోతంగల్ కావడమే అని అంటారు. అయితే ఆమె లోక్ సభ కు కాకుండా రాజ్యసభ కు వెళ్లడం ద్వారా కొన్ని సమీకరణాలకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. కవిత ఈ మధ్య కాలంలో ఆయా అంశాలపై డిల్లీకి పర్యటించడం, కేంద్ర మంత్రులను కలిసి ఆయా అంశాలపై విజ్ఞప్తులు అంద చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు రాజకీయ ఆసక్తికపై ఎవరికి సందేహం లేదు కాని, లోక్ సభకు పోటీచేస్తారా? లేదా రాజ్యసభ సీటును ఆశిస్తారా , టిఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నదానిపై కూడా ఈ విషయం ఆధారపడి ఉంటుంది.అయితే కిందటిసారి శాసనమండలి ఎన్నికలలో శాసనసభలో బలం లేకపోయినా టిఆర్ఎస్ పోటీచేసిందని, ఇప్పుడు పరిస్థితులలో రాజ్యసభకు పోటీచేస్తే కొంత రిస్కు ఉన్నప్పట్టికీ అటు జగన్ వర్గం ఎమ్మెల్యేలు , ఇటు కొందరు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక కొందరు ఓట్లు వేస్తే గెలిచే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!