పోటాపోటీ క‌థ‌నాలు


మన రాష్ట్రంలో రెండు పత్రికల మధ్య యుధ్దం ఇప్పుడు ఒక పరాకాష్టకు వచ్చినట్లే. జగన్ పై సిబిఐ దర్యాప్తునకు సంబంధించిన కధనాలను ఈనాడు ప్రముఖంగా ప్రచురిస్తుంటే, ఇక చంద్రబాబు, రామోజీ తదితరులపై సిబిఐ విచారణకు సంబందించిన విశేష వార్తలను ఇవ్వడానికి సాక్షి సిద్దమైంది.నిజానికి ఈ రెండు పత్రికలు ఇప్పటికే విపరీతమైన రీతిలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో కధనాలు రాసుకున్నాయి.అలాగే ఒక పత్రిక రాసినదానికి మరో పత్రిక ఖండన కధనం రాయడం, ఎదురు మరో వ్యతిరేక కధనం ఇవ్వడం జరుగుతూ వస్తోంది. తాజాగా డెలాయిట్ ఆడిటింగ్ సంస్థ ఆడిటర్ సుదర్శన్ ఇచ్చిన సాక్ష్యం వార్తను మరోసారి ఈనాడు ప్రముఖంగా ఇస్తే, చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎమ్ జి.భారత సంస్థకు 450 ఎకరాలు ఇవ్వడానికి జీవో జారీ చేసిన విషయంపై ప్రముఖంగా బానర్ ఇచ్చింది. నిజానికి ఈ రెంటిలో కొత్త విషయం పెద్దగా లేదనే చెప్పాలి. కాని రెండు పత్రికలు కూడా తమ పాఠకులను తమ వార్తల ప్రభావంలోకి తీసుకు వెళ్లడానికి విశేషంగా యత్నిస్తున్నాయని చెప్పాలి. తీవ్ర స్థాయిలో కక్షలు పెరిగినప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాకపోతే రెంటికి సంబంధించిన వాస్తవాలు ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్నాయని ,అంతవరకు మంచిదేనని పిసిసి అదికార ప్రతినిధి మృత్యుంజయం అన్నారు. ఇంతకాలం ఈనాడు జగన్ కు సంబంధించిన విచారణలో అంతర్గత విషయాలను సేకరించి ప్రముఖంగా ఇస్తోంది. ఇక ఇప్పుడు ఆ విచారణలో జరిగే లోపల విషయాలు సాక్షి ఇస్తుందని భావించాలి.అయితే ఈ రెండు పత్రికలు జర్నలిజం విలువలకు కట్టుబడి ఉన్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎందుకు అన్న పరిస్థితిలో ఉన్నాం.కనుక వాటి గురించి ఆలోచించడం అనవసరం. ఈ రెండు పత్రికలే కాదు.. ఇతర మీడియాది కూడా దాదాపు అదే పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పత్రికలు న్యూస్ బదులు వ్యూస్ నే ఎక్కువగా ఇస్తున్నాయని, ఏ పత్రికకు అంత విశ్వసనీయత లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.అదే సమయంలో రాజకీయ నాయకుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అనుకోజాలం అదే మన రాష్ట్రంలో ఉన్న విషాదం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!