ప్రత్యేక రాష్ట్రం ఎర్పడాలంటే..?


రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ సానుకూల వైఖరి వ్యక్తం చేయడంతో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సార్సీ కథ ఓసారి చూద్దాం. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుతో కొత్త రాష్ట్రాల ఏర్పాటు సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న ధోరణి కాంగ్రెస్ లో కనబడుతోంది. తేనెతుట్టెగా కొందరు అభివర్ణిస్తున్న రెండో ఎస్సార్సీనే కాంగ్రెస్ ఎంచుకోవడం వెనుక ఎన్నికల రాజకీయం కూడా దాగుందనే చెప్పుకోవాలి.
రెండో ఎస్సార్సీకి కాంగ్రెస్ సుముఖంగా ఉండ‌డంతో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఈ మార్గం ఎంచుకున్నదా..? యూపీలోనూ, ఎపీలోనూ ఇదే పరిష్కార ఫార్ములాగా కాంగ్రెస్ భావిస్తుందా అన్న ప్రశ్నలు లెత్తుతున్నాయి. అయితే ఈ రెండో ఎస్సార్సీకి ముందు వేసిన మొద‌టి ఎస్సార్సీ ద్వారా ప్రభుత్వం ఏం చేసింద‌న్న వివ‌రాలలోకి వెళితే…
ఎస్సార్సీ వేయడం ఇప్పుడు కొత్తేమీకాదు. నెహ్రూ ప్రధానిగా ఉన్న రోజులలోనే మొద‌టి ఎస్సార్సీ వేయ‌డం జ‌రిగింది. అప్పటి ప‌రిస్థితుల నేప‌థ్యం, పాల‌న ప‌ర‌మైన సౌక‌ర్యాల కోసం పెద్ద రాష్ట్రాల‌ను విడ‌దీసి చిన్న రాష్ట్రాలుగా చేయాల‌న్న నిర్ణయాన్ని 1953లో తొలి ఎస్సార్సీ లో నిర్ణయం తీసుకున్నారు.  సరిగ్గా 59 సంవత్సరాల కిందట మొదటి ఎస్సార్సీ తోనే దేశంలో 14 రాష్ట్రాలు అవతరించాయి. అప్పట్లో జస్టిస్ ఫాజల్ అలీ నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేసారు. ఆ క‌మీష‌న్ పూర్తి పార‌ద‌ర్శకంగా ప‌నిచేసి రెండేళ్లలో నివేదికని అందించింది.. ఆ నివేదిక ఆధారంగా మ‌రో సంవ‌త్సరం త‌ర్వాత కొత్త రాష్ట్రాల అవ‌త‌ర‌ణ జ‌రిగింది.. ఆ తరువాత 47 సంవత్సరాలకు వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో 3 చిన్న రాష్ట్రాలు అవతరించాయి. అందులో మధ్యప్రదేశ్ నుంచి విడివడిన ఛత్తీస్ ఘడ్, ఉత్తరప్రదేశ్ నుంచి  ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్ లు మూడు రాష్ట్రాలుగా అవ‌త‌రించాయి. నిజానికి కొత్త రాష్ట్రాల ఏర్పాటన్నది ఓ సుదీర్ఘ ప్రక్రియ. అసెంబ్లీలో తీర్మానం పెట్టడం తప్పనిసరి కాక‌పోయిన‌ప్పటికీ ప్రస్తుతం ఇలాంటి తీర్మానాల‌తోనే రాష్ట్రాల ఏర్పాటుకు నాయ‌కులు ప‌ట్టుబ‌డుతున్నారు. అందుకే పార్లమెంట్ సుమొటొగా ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రపతి నుంచి సూచన రావాల్సి ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం కేంద్రం వద్దకు రాగానే దాన్ని ముందుగా హోంశాఖకు పరిశీలన నిమిత్తం పంపిస్తారు. తరువాత న్యాయశాఖకు వెళ్తుంది. ఆ తరువాత కేంద్ర మంత్రిమండలికి చేరుతుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించే పక్షంలో ప్రత్యేక రాష్ట్ర అంశం పార్లమెంట్ గడపతొక్కుతుంది. రాజ్యసభ, లోక్ సభ ఆమోదించాలి. అది కూడా మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదించాలి. ఎందుకంటే, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడుకు సంబంధించిన అంశం కాబట్టి. పార్లమెంట్ ప్రత్యేక రాష్ట్రానికి ఆమోదం తెలిపిన తరువాత అసలు కథ మొదలవుతుంది. భౌగోళికంగా రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమయ్యేది ఇప్పటి నుంచే. ఈ ప్రక్రియలో భాగంగానే, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రం  అధికారుల బృందాన్ని పంపుతుంది. ఎన్నో కీలక అంశాలతో ముడిపడిన కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఎంత వేగవంతంగా పూర్తి చేయాలనుకున్నా మూడు, నాలుగు సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలంగాణ ఇచ్చే ప‌క్షంలో 2014 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయనే అనుకోవాలి.

- తుర్లపాటి నాగభూషణ రావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!