ఎన్టీఆర్ డ‌బ్బులు ఎగ్గొట్టాడా..?




విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు  నంద‌మూరి తార‌క రామారావు.. మూడు ద‌శాబ్దాలు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ని మ‌కుటం లేని మ‌హారాజుగా ఏలిన మ‌హాన‌టుడు, క్ర‌మ‌శిక్ష‌ణ‌కి మారు పేరుగా నంద‌మూరి తార‌క రామారావు గారికి ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది.. త‌న నిర్మాత‌లు బాగుండాల‌ని, ప‌రిశ్ర‌మ బాగుండాల‌ని కోరుకునే వ్య‌క్తి అని అంద‌రూ చెబుతుంటారు.. అలాంటి ఎన్‌.టి. రామారావు గారు కూడా ప‌ని చేయించుకుని డ‌బ్బులు ఎగ్గొట్ట‌టం లాంటివి చేసాడా..? అంటే అవును అంటున్నారు మ‌ల్లెమాల ఎమ్మెస్ రెడ్డి. ఇదీ నా క‌థ అనే త‌న ఆత్మ‌క‌థ‌ని ఆయ‌న ఈ మ‌ధ్యే పుస్త‌క రూపంలో విడుద‌ల చేసారు. అందులో సినిమా ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రి హీరోల గురించి వివాదాస్ప‌దంగా వివ‌రించారు.. త‌న‌కి ఎన్‌.టి. రామారావు గారు డ‌బ్బు ఎగ్గొట్టాడ‌ని ఆ పుస్త‌కంలో రాసుకున్నారు.. దాని వివ‌రాలు..
..అంజయ్యగారి జంబోజెట్ మంత్రివర్గంలో చంద్రబాబునాయుడు సభ్యుడుగా ఉన్నాడు. ఒకరోజు ఎన్.టి.రామారావుగారు నన్ను పిలిచి మా అమ్మాయి భువనేశ్వరిని చంద్రబాబునాయుడికి ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నాడు. రాజకీయంగా మరింత ఎదిగే అవకాశముంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి విషయంలో మీరు కొంత బాధ్యత తీసుకోవాలి అన్నారు. నేనేం చెయ్యాలో చెప్పండన్నాను.
బాబు తరఫున చిత్తూరు జిల్లానుండి వారి అనుచరులు అధిక సంఖ్యలో వస్తారు. వాళ్లందరికీ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతోపాటు బంధుమిత్రులకోసం దగ్గరగా ఉండే హోటల్లో పది గదులు రిజర్వు చేయించండి అన్నారు. చిత్తూరు జిల్లానుండి వచ్చే వాళ్ల బాధ్యతను మాగుంట సుబ్బరామిరెడ్డిగారికి అప్పగించాను. బంధుమిత్రుల బాధ్యత నేను భుజాన వేసుకున్నాను. టీనగర్‌లోని శ్యాం హోటల్లో పది గదులు రిజర్వు చేయించాను. మరుసటిరోజు రాత్రి రామారావుగారి స్థాయికి తగ్గట్టు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
తర్వాత శ్యాం హోటల్ మేనేజర్ రెండు రోజుల బిల్లు నా వద్దకు పంపించాడు. ఆ బిల్లు రామారావుగారి చేతికి ఇచ్చాను. నా బిడ్డ పెళ్లికి అది మీ వాటా అనుకోండి అని నా భుజం తట్టారు. ఇక తప్పదని నేనే చెల్లించాను. చిత్తూరు జిల్లానుండి తరలివచ్చిన వేలాదిమంది బిల్లంతా మాగుంట సుబ్బరామిరెడ్డిగారు భరించారు.
————————
రామారావుగారు ఒకరోజు నన్ను పిలిచి మేం హైదరాబాద్‌లో 20 ఎకరాల తోట భూమి కొన్నాం. అందులో నాటేందుకు రెండువేల నిమ్మ మొక్కలు కావాలి. మీ ఊరిలో మంచివి దొరుకుతాయని తెలిసింది అనగానే అది నిజమే. ప్రస్తుతం నిమ్మనారు మా వద్ద లేదు, ఎవరివద్దనైనా కొని పంపించాల్సిందే అన్నాను. ఆయన వెంటనే మీ వద్దలేనప్పుడు కొనక తప్పదు కదా అన్నారు. నేను మద్రాసునుండి మా చిన్నతమ్ముడు సుబ్బరామిరెడ్డికి ఫోన్ చేసి నిమ్మనారు మంచిది చూసి ఎవరివద్దనైనా రెండువేల మొక్కలు కొని జాగ్రత్తగా ప్యాక్ చేయించి లారీ ద్వారా హైదరాబాద్‌కు తీసుకుని వెళ్లి రామారావుగారి పెద్దకుమారుడికి అప్పచెప్పి రమ్మని చెప్పాను.
వాడు నా మాట కాదనలేక అదే ప్రకారం లారీలో నిమ్మనారు తీసుకుని హైదరాబాద్‌లోని రామారావుగారి కుమారుడు జయకృష్ణ వద్దకు వెళ్లాడు. అతను లారీ బాడుగ కానీ, నిమ్మనారు ఖరీదుకానీ పైసా ఇవ్వకపోగా మీరే స్వయంగా వెళ్లి తోటలో నాటించాలి అన్నాడట. ఆ సంగతి తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను మా డిస్ట్రిబ్యూటర్‌ను అడిగి డబ్బు తీసుకుని లారీ బాడుగ, నాటేందుకు అయ్యే ఖర్చులు చెల్లించి పని పూర్తి చేసుకుని రా! తర్వాత నారు కొనుగోలుతో సహా మొత్తం ఖర్చు ఎంతయింది నాకు చెప్పు. నేను రామారావుగారిని అడిగి తీసుకుని నీకు చేరుస్తాను అన్నాను.
వాడు అదే ప్రకారం నాటించి తిరిగి ఊరికి రాగానే అన్ని ఖర్చులు కలిసి నాలుగువేల రెండువందలు అయిందని నాకు జాబు రాశాడు. నేను ఆ జాబు రామారావుగారికిచ్చాను. వెంటనే ఆయన మీ తమ్ముడిగారికి ఏం తెలుసు మనిద్దరి అనుబంధం. పాపం పసివాడు కదా అంటూ షూటింగ్‌కు వెళ్లిపోయాడు. చేసేది లేక నాలో నేను నవ్వుకున్నాను…’’

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!