వంటావార్పులో ఆంధ్రా వంటగాళ్లా..?


టీఆర్ఎస్ జేఏసీలు కలిసి.. నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. హైదరాబాద్ నగరంలో రోడ్లపై చేసిన ఈ వంటావార్పులో తెలంగాణ వంటగాళ్ల కంటే.. ఆంధ్ర వంటగాళ్లకే ఎక్కువ అవకాశం వచ్చిందనే కథనం వచ్చింది. దానికి కారణం ఏంటంటే.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయా చోట్ల షామియానాలు వేసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి అవసరమైనంత మంది తెలంగాణ ప్రాంత వంటగాళ్లు దొరకలేదట. దాంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వంటగాళ్లు వచ్చి వండి వడ్డించారట. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కొన్నిచోట్ల ఉద్యమకారులు వంటలు చేయడం కాకుండా.. కొంతమంది క్యాటరర్స్ కి ఆర్డర్ ఇచ్చి.. వారితోటి వంటలు చేయించారట. అంతేగాక.. పలుచోట్ల ఆశించిన రీతిలో జనం రాకపోతే.. దారిన పోయే వాళ్లకు కూడా వడ్డించిన సందర్భాలున్నాయని చెబుతున్నారు. కాగా ఈ విషయమై టీఆర్ఎస్ నాయకున్ని ప్రశ్నిస్తే.. ఇది తాము నిరసన రూపాల్లో ఒకటిగా భావించామే తప్ప.. మరొకటిగా తీసుకోరాదని.. ఒక్కోచోట ఎక్కువమంది ఉద్యమకారులు పాల్గొంటున్నప్పుడు.. వంటలు చేయడం కష్టం కాబట్టి.. క్యాటరింగ్ కి ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఇచ్చి ఉండొచ్చని మెజార్టీ చోట్ల ఉద్యమకారులే వంటలు చేశారని జవాబు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వార్తల కవరేజీపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని టీవీల్లో ఆశించిన రీతిలో కార్యక్రమం జరగలేదని ఇస్తే.. మరికొన్ని టీవీల్లో బాగా సక్సెస్ అయినట్లు వచ్చింది. అయితే దాదాపు తెలుగు పత్రికలన్నింటిలో మాత్రం.. బాగా సక్సెస్ అయినట్లుగా కథనాలు రాశారు. దీనికి కారణం.. టీఆర్ఎస్ ముఖ్యనాయకుడొకరు.. ఆయా పత్రికల ముఖ్యులకు ఫోన్ చేసి.. ఈ వార్తలు కాస్త నెగటీవ్ గా రాకుండా చూడాలని అభ్యర్థించారట. దాని ఫలితంగానే అన్ని పత్రికలు కూడా పాజిటీవ్ గా రాసారనే ప్రచారం జరుగుతోంది. కనీసం ఆ కార్యక్రమానికి సంబంధించిన విశ్లేషణలు కూడా ఇవ్వకుండా వార్త ఇచ్చారని కొందరు చెబుతున్నారు. ఉదాహరణకు ఈనాడు పత్రిక అయితే.. మొదటి పేజీలో సగభాగం, లోపల ఒక ఫుల్ పేజీ వంటావార్పుకు సంబంధించిన వార్తకు కేటాయించిందంటేనే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. సీమాంధ్ర మీడియా అంటూ తెలంగాణ నాయకులు.. పదే పదే విమర్శలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని కొంత బయడపి కూడా ఎలాంటి నెగటీవ్ వార్తలు లేకుండా.. ఆయా పత్రికలు ప్రచురించి ఉండొచ్చని చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!