సత్యసాయి ట్రస్ట్ పై బిగుస్తున్న ఉచ్చు..!

ఇన్నాళ్లు యథేచ్ఛగా ప్రశాంతి నిలయంలో ఏం జరుగుతుందో తెలియకుండా అన్నీ గుట్టుగా చేసుకుంటూ వెళ్లి సత్యసాయి ట్రస్టు సభ్యులు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఓ వైపు అక్రమంగా తరలిస్తున్న డబ్బు దొరకడం, పోలీసుల విచారణ, బంధువుల ఆగ్రహావేశాలు, భక్తులకు సన్నగిల్లిన అవిశ్వాసం, ప్రజా సంఘాల నిరసన, ప్రభుత్వం నోటీసులతో వారు సతమతమవుతున్నారు. వీటికి తోడుగా తాజాగా ఆదాయపు పన్ను శాఖ కూడా సత్యసాయి ట్రస్టు ఆదాయంపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రూ.35 లక్షల నగదు తరలింపు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన శ్రీనివాసన్, రత్నాకర్‌లు దీని నుంచి బయటపడేందుకు సతమతమ వుతున్నారు. పోలీసులు ఇప్పటికే శ్రీనివాసన్ వ్యక్తిగత డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా శ్రీనివాసన్ వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్‌కు కూడా తాఖీదులు జారీ చేశారు.
వెంకటేశ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రశాంతి నిలయంపై ఐటీ అధికారుల దృష్టి పడడం మరో ఎత్తు. నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. యజుర్ మందిరం నుంచి తరలిన డబ్బు, ఇతర వ్యవహారాలపై విచారణలో వెల్లడైన అంశాలను తమకు తెలియజేయాలని వీరు పోలీసులను కోరినట్లు తెలిసింది. అలాగే ట్రస్టుకు ఇటీవలి కాలంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు పంపాల్సిందిగా కూడా ఐటి ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. కాగా ప్రశాంతి నిలయంలో డేగ కళ్లు ఉన్నాయి. అనునిత్యం 120 వరకు సిసి కెమెరాలు పని చేస్తుంటాయి. వాటి రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకుంటే కీలకమైన వివరాలు బయటపడతాయని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. సిసి కెమెరాల నిర్వహణలో ప్రశాంతి నిలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రధాన్‌దే కీలక పాత్ర. పోలీసులు ప్రధాన్‌ను ఈ కోణంలోనూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇక ప్రశాంతి నిలయంలోని వ్యవహాలపై పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. ట్రస్టు సభ్యుల వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబా జీవించి ఉన్నప్పుడు పుట్టపర్తిలో పవిత్రత, మనశ్సాంతి ఉండేదని ఇప్పుడు అది పోయిందని స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబా బంధువులు కూడా ట్రస్టు సభ్యులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాబా ఆశయ సాధన కోసం నడుం బిగించాలని, ట్రస్ట్‌లోని కొందరు స్వార్థపరుల ఆటకట్టించేవరకు ఆందోళన నిర్వహించాలని వారు భావిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి