ప్రొ. జ‌య‌శంక‌ర్ క‌న్నుమూత‌..



తెలంగాణ సిద్దాంతకర్తగా పేరొందిన ఫ్రొఫెసర్ జయశంకర్ కన్నుమూశారని తెలియచేయడానికి చింతిస్తున్నాము. కాకతీయ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్ గా పనిచేసిన జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో అతి ముఖ్యమైన భూమిక పోషించారు.ఆయన వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన కాన్సర్ వ్యాధితో బాదపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో చికిత్స జరిపి ఇక ఫలితం లేదని భావించి ఆయనను హన్మకొండలోని స్వగృహానికి తరలించారు.చివరిసారిగా నమస్తే తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభలో జయశంకర్ పాల్గొన్నారు. తెలంగాణ సిద్దాంత కర్తగా గుర్తింపు పొందిన ఫ్రొఫెసర్ జయశంకర్ మరణించడంతో తెలంగాణకు చెందిన అనేక మంది ఉద్యమ నేతలు, రాజకీయ నేతలు అంతా ఆయనను కడసారి చూసి నివాళి అర్పించడానికి వరంగల్ బయల్దేరి వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుజయశంకర్ మృతి వార్త తెలియగానే హుటాహుటిన వరంగల్ బయల్దేరారు.జయశంకర్ మరణించడంపై కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ తోసహా పలువురు ప్రముఖులు వరంగల్ కు వెళ్లారు.తెలంగాణ ఉద్యమం లో మార్గదర్శకుడిగా, పెద్ద మనిషిగా, రెండు తరాలకు వారధిగా ఉన్న జయశంకర్ మరణం తీవ్రమైన విచారం కలిగిస్తున్నదని మాజీ మంత్రి , టిఆర్ఎస్ నేత నాయిని నరసింహరెడ్డి తెలిపారు. గొప్ప మేధావి, విద్యావేత్త, సమాజానికి మేలు చేసిన మహానుభావుడు , వారు లేకపోవడం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.నీతి,నిజాయితీతో పనిచేసిన వ్యక్తి అని ఆయన అన్నారు.జయశంకర్ ఆశీర్వాదం లేకుండా కెసిఆర్ ఉద్యమం చేయలేదని, ముందుగా జయశంకర్ కు మొక్కకుండా ఏ కార్యక్రమం చేపట్టలేదని ఆయన అన్నారు. తనకు , జయశంకర్ కు నాలుగు దశాబ్దాలుగా స్నేహం ఉందని, తెలంగాణ ఉద్యమంలో అగ్రపాత్ర జయశంకర్ దని, తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ ను తీసుకురావడంలో కూడా జయశంకర్ పాత్ర ఉందని మానవహక్కున సంఘం నేత ఫ్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు.తెలుగు, ఇంగ్లీష్,ఉర్దూ భాషలలో చక్కని ఉపన్యాసకుడని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ముప్పై నాలుగు రాజకీయ పార్టీలను ఒక మాటపైకి తీసుకురావడం కూడా ఆయన ఘనత అని అన్నారు. ఆయనకు ప్రైవేటు జీవితం లేదని, ఆయనదంతా ప్రజాజీవితమేనని హరగోపాల్ పేర్కొన్నారు. ఒక మంచి మనిషిని సమాజం కోల్పోయిందని హరగోపాల్ విచారం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ లేని లోటు తీర్చలేనిదని అన్నారు. జయశంకర్ మరణంపై పార్టీలకు అతీతంగా అందరు నేతలు దేవేందర్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య,తదితరులు సంతాపం ప్రకటించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!