కొడుకు శ్యాం ని వదలని మల్లెమాల..



ప్రముఖ నిర్మాత మల్లె మాల తన ఆత్మకధ లో  హీరోల గురించి రాయడం ఒక ఎత్తు అయితే ,సొంత కుమారుడు నిర్మాత అయిన శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి రాయడం  మరో ఎత్తు .కుమారుడని ఆయన ప్రేమ చూపలేదు.యే సందర్భం లో శ్యాం తన మనసుని గాయ పరిచాడో  పేర్కొన్నారు ,చురకలు అంటించారు.
మా అబ్బాయి శ్యామ్‌  “సౌందర్య, సురేష్, రమ్యకృష్ణ “మొదలైన తారాగణంతో ‘అమ్మోరు’ చిత్రం ప్రారంభించాడు. ఆ చిత్రానికి పేరూ ఊరూ లేని రామారావు అనే కుర్రవాడ్ని డైరక్టర్‌గా పెట్టాడు. నేనా విషయం తెలుసుకుని “కోడిరామకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్‌లో నువ్వు నిర్మించిన అన్ని చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఒకేసారి ఇద్దరినీ మార్చవలసిన అవసరం ఏమొచ్చింది “అని శ్యామ్‌నడిగాను.
“రాజశేఖర్ గురించి మీకు తెలియదు నాన్నా! వాడితో పిక్చర్ తీయడంకంటే అడుక్కు తినడం మేలు. ఇక కోడి రామకృష్ణను ఎందుకు మార్చానంటారా! ఇది చాలా లో బడ్జెట్ పిక్చర్. అందువలన కోడి రామకృష్ణ వంటి పెద్ద డైరక్టర్ అక్కరలేదనుకున్నాను ” అన్నాడు. పిక్చర్ పూర్తయ్యాక రష్ చూసి అనుకున్నట్టుగా రాలేదని భావించి శ్యామ్ తిరిగి కోడి రామకృష్ణనే ఆశ్రయించాడు…’’
‘‘..అమ్మోరు తమిళం, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా పెద్ద లాభం వచ్చింది. ఆ విజయ దర్పంతో మా అబ్బాయి నా చేయిదాటిపోయాడు. కొన్ని సందర్భాలలో నన్ను నిర్లక్ష్యంగా చూసి నా మనస్సు తీవ్రంగా గాయపరిచాడు. అయినా వాడిలో ప్రవహించేది నా రక్తమే కదా అని సరిపెట్టుకున్నాను..’’
‘‘…అమ్మోరు తర్వాత ఎవరితో పిక్చర్ తీయాలి? కథ ఎలా ఉండాలి? అన్న మీమాంసతో సుమారు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని హీరో వెంకటేష్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక కథ తయారుచేశాడు. హీరో పాత్ర గెటప్ ఎలా ఉండాలో నిర్ణయించడం కోసం వెంకటేష్‌కు మేకప్ వేయించి రకరకాల స్టిల్స్ తీయించాడు.
అందులో తనకు, వెంకటేష్‌కు బాగా నచ్చిన ఫోటో ఎన్‌లార్జ్ చేయించాడు శ్యామ్. వెంకటేష్ ఆ ఫోటో తీసుకుని నా వద్దకు వచ్చి “అంకుల్ ఇన్నాళ్లకు శ్యామ్, నేను కలిశాం. నా గెటప్ ఇలా ఉంటుంది. మా ఇద్దరి కలయికతో సాధించే విజయం మీరే చూద్దురుగాని “అని చెప్పి ఆనందంగా వెళ్లిపోయాడు.
శ్యామ్, వెంకటేష్ హీరోగా పిక్చర్ తీయబోతున్నాడన్న వార్త చిరంజీవికి తెలిసింది. అప్పట్లో వరస అపజయాలతో తల్లడిల్లిపోతున్న చిరంజీవి వెంటనే అల్లు అరవింద్‌ను శ్యామ్ దగ్గరకు పంపి ఇంటికి పిలిపించుకుని చెవిలో ఏం ఊదాడో తెలియదు కానీ వెంకటేష్‌కు బదులుగా చిరంజీవితో పిక్చర్ తీయడానికి సిద్ధపడ్డాడు. ఆ మార్పు తనకు జరిగిన అవమానంగా వెంకటేష్ భావించడంలో తప్పులేదు. మా అబ్బాయి అలా చేయడం మంచిది కాదని నేనూ బాధపడ్డాను…’’
‘‘..అంజి చిత్రం మా ఆస్తులన్నింటినీ హరించడంతోపాటు కొనుగోలుదారులను కూడా గూబ అదరగొట్టింది. ఈ విషయంలో నేను చిరంజీవిని తప్పుపట్టను. అతను ఆర్ధికంగానూ, హార్థికంగానూ మా అబ్బాయికి అనేక విధాలుగా సహాయపడ్డాడు. కానీ చిత్రం పరాజయం పాలైతే శ్యామ్‌ను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పిన మాట మాత్రం నిలుపుకోలేదు. ఐనా మా అబ్బాయికీ, చిరంజీవికీ ఉన్న  అనుబంధం అలా కొనసాగుతునే ఉంది. శ్యామ్ అప్పటి వరకు తీసిన అన్ని చిత్రాలలోనూ టైటిల్స్‌లో ‘ఎమ్‌ఎస్‌రెడ్డి సమర్పించు’ అని వేసేవాడు. ఆ ఆనవాయితీ ‘అంజి’లో పాటించకపోగా స్వర్గీయ విజయభాస్కర్‌రెడ్డి గారి ఫోటో వేసి చిత్రం ఆయనకు అంకితమిచ్చాడు. విజయభాస్కర్‌రెడ్డిగారు వాడికి పిల్లనిచ్చిన మామైతే నాకు వియ్యంకుడు గదా అని సరిపెట్టుకున్నాను..’’

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!